Monday, July 2, 2007

కథ కంచికి,మనం ఇంటికి

గతవారం నేను నా friends కలసి కంచికి వెళ్ళాము.కంచి బెంగుళూరు నుండి 240 కి.మీ, చెన్నై నుండి 75 కి.మీ దూరంలో ఉంటుంది.కంచి ప్రయాణం అనుకున్నప్పట్నుంచి ఏదో ఒక అవాంతరం వచ్చి పడుతూనే ఉంది.ఎలాగైనా కంచికి వెళ్ళాల్సిందేనని బయలుదేరి వెళ్ళాము.బెంగుళూరు మెజెస్టిక్ బస్టాండులో మేము టిక్కెట్టు రిజర్వ్ చేయించిన బస్సు కనుక్కొని ఎక్కి కూర్చొనేసరికి పెద్దలు కనిపించారు.టిక్కెట్ లో రాసిఉన్న ప్లాట్ ఫామ్ పైన కాకుండా బస్ ఎక్కడో ఆపాడని డ్రైవర్ తో పెద్ద గొడవ పెట్టుకొని మరీ బస్ ఎక్కాము.డ్రైవర్ మమ్మల్ని గుర్రు గుర్రుమని చూసాడు.ఎంక్వైరి కౌంటర్ లో కనుక్కుంటే,రాత్రి 10 గంటలకి బెంగుళూరు నుండి బయలుదేరితే ఉదయం 5 గంటలకళ్ళా కంచికి చేరుతామని చెప్పారు.ఒక గంట కంచి బస్టాప్ లో timepass చేసి హొటల్ లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి అమ్మవారి దర్శనానికి వెళ్ళవచ్చనేది మా ప్లాన్.

బస్ బయలుదేరింది. బస్ లో "ఉన్నలే..ఉన్నలే"(తెలుగులోకి కూడ డబ్బింగ్ చేసారు కాని నాకు సినిమా పేరు గుర్తులేదు.) కష్టపడి తమిళ్ అర్ధం చేసుకొని సినిమా మొత్తం చూసి,మనకి తమిళ్ అర్ధం అవుతుందని జబ్బలు చరుసుకొని అలసిపోయి చిన్న కునుకు తీస్తున్నాము.అప్పుడే డ్రైవర్ "కాంజీపురం" అని అరిచాడు.టైమ్ చూస్తే రాత్రి 2.50. "ఏంటి అప్పుడే కాంజీపురం వచ్చేసిందా? ఉదయం 5 గంటలవుతుందని చెప్పారు మాకు" అని డ్రైవర్ని అడిగాను.వాడు నన్ను కోపంగా చూసి తమిళ్ ఏదో అన్నాడు.(ఇప్పుడు తమిళ్ అర్ధం కావటం లేదేంటి చెప్మా!!) బస్టాండులో దిగుతాము అంటే,బస్టాండుకి బస్ వెళ్ళదని చెప్పాడు.ఇక ఆ అర్ధరాత్రి వాడితో గొడవ పెట్టుకొనే ఓపిక లేక బస్సు దిగాము.అప్పటికే సన్నగా చినుకులు పడుతున్నయి."ఏం చేద్దాం?" అని అనుకుంటుండగానే చినుకులు కాస్తా పెద్ద వర్షం అయ్యింది.ఎదురుగా ఉన్న ICICI ATM దగ్గరికి పరిగెత్తాము.

ATM కి కన్నం వెయ్యటానికి వచ్చాము అనుకున్నాడో ఏంటోగాని అక్కడున్న సెక్యురీటి గార్డు ఎంత మాట్లాడించినా మాట్లాడలేదు మాతో.ఆ ATM ని ఆనుకొని ఏదో ఆఫీసు ఉంది.తీరా చూస్తే "కంచి కామకోఠిమఠం" అని రాసి ఉంది.ఒక రెండు గంటలు అక్కడే మఠం మెట్లమీద కూర్చున్నాము.అప్పటికి వర్షం కాస్త తగ్గింది,టైమ్ కూడ ఉదయం 5గంటలు కావొస్తుంది.లేచి హొటల్ వెతుకుదామని బయలుదేరాము.దారినపోయే ఒక దానయ్యని అడిగాము మంచి హొటల్ ఎక్కడుదంని,ఒక సందు చూపించి వెళ్ళిపోయాడు.ఆ సందులోకి వెళ్ళగానే అప్పటిదాక నిద్రపోతున్న కుక్కలన్ని(లెక్క పెట్టలేదు కాని చాలా ఉన్నాయి,ఒక 15-16 ఉండొచ్చు) అరవటం మెదలుపెట్టాయి.గతంలో ఒకసారి నా టీమ్ మేట్ అర్షద్ "కుక్కలు-వాటి మనస్తత్వం" అనే అంశం మీద నన్ను educate చేసాడు.చప్పున అర్షద్ చెప్పిన చిట్కా ఒకటి గుర్తొచ్చింది. ఎప్పుడయినా కుక్క మనల్ని చూసి మొరిగితే మనం కదలకుండా నిల్చోవాలంట.అప్పుడు వాటి ego సాట్సిఫై అవుతుందంట,అప్పుడు మనల్ని కరవకుండా,మనల్ని చూసి మొరగకుండా గమ్మున దాని దారిన అది వెళ్ళిపోతుందంట!! నేను నా ఫ్రెండ్స్ వెంటనే కదలకుండా నిల్చున్నాము.మా సమయస్పూర్తిని చూసి కుక్కలు ఆశ్చర్యపోయినట్టున్నాయి.ఒక్క క్షణం గ్యాప్ తీసుకోని మళ్ళీ భయంకరంగా మొరగటం మొదలుపెట్టాయి.అర్షద్ రీసెర్చి చేసి కనుక్కున్నదంతా తప్పని తేలిపోయింది.సరే అని మన పాత చిట్కా..చేతికి దొరికిన చిన్న చిన్న రాళ్ళు విసిరి బ్రతుకుజీవుడా అంటూ మళ్ళీ వచ్చి రోడ్ మీద నిల్చున్నాము .

రెండు గంటల్లో పది హొటల్స్ చూసాము,ఏ ఒక్కటీ నచ్చలేదు.చాలాసేపు తిరిగాక బస్టాండుకి దగ్గర్లో ఒక హొటల్ బాగున్నట్టనిపించి దాంట్లో దిగాము.గబగబా ఫ్రెష్ అయ్యి హైదరాబాద్ నుండి వచ్చిన మా ఫ్రెండ్ తల్లిదండ్రుల్ని రిసీవ్ చేసుకొని అందరం కలసి "కామాక్షి అంబాల్" దర్శనానికి వెళ్ళాము.దర్శనం చాలా బాగాజరిగింది.చేతిలో చిలుక,తలపై నెలవంకతో అమ్మవారు చాలా అందంగా ఉన్నారు.మార్కండేయ పురాణంలో కంచిని విశ్వానికి కేంద్రబిందువుగా పేర్కొన్నారంట!!(అమ్మవారి ఆలయంలో ఉన్న పెద్ద పూజారి చెప్పారు).కంచిలో ఎన్ని గుడులున్నాయంటే,అన్ని చూడాలంటే రెండు రోజులు పడుతుంది.ముఖ్యమయినవి మాత్రం బలి చక్రవర్తి ఆలయం,వినాయకుని ఆలయం(ఇవి రెండు అమ్మవారి ఆలయానికి సమీపంలోనే ఉన్నాయి),వరదరాజస్వామి పెరుమాల్ ఆలయం,ఇక్కడే సూర్యచంద్రులు,బంగారు బల్లి,వెండి బల్లి ఉంటాయి.ఈ ఆలయం మాత్రం కామాక్షి అమ్మవారి ఆలయం నుండి 5 కి.మీ దూరంలో ఉంటుంది.ఈ ఆలయలన్నింటిని మఠం ట్రస్టు వారే నిర్వహిస్తున్నారు.ఇక అతి ముఖ్యమయినది "కంచి కామకోఠి మఠం". మేము మఠానికి వెళ్ళేసరికి శ్రీ శ్రీ శ్రీ శంకర విజేయేంద్ర సరస్వతి స్వామీజి పూజ చేస్తున్నారు.మఠానికి సంబంధించినవి,ఆది శంకరాచార్యులవి వర్ణచిత్రాలు చూస్తుంటే అసలు టైమే తెలియదు.

ఇక ఆడవాళ్ళందరికి అత్యంత ఇష్టమయిన"షాపింగ్",అందునా పట్టుచీరలు.మేము రెండవ రోజంతా షాపింగ్ కే కేటాయించాము.ఎన్ని పట్టుచీరలో..రకరకాల రంగులు,అంచులు,కాంబినేషన్స్.అన్ని పట్టుచీరలు ఒకేసారి చూసేసరికి ఏది కొనుక్కొవాలో అర్ధం కాదు నాలాంటి వాళ్ళకి.అందుకే నేనేమి కొనుక్కోలేదు.తరవాత కాసేపు కంచి వీధులన్ని తిరిగి భోజనం చేసి బస్సెక్కి బెంగుళూరుకి బయలుదేరాము.అలా కంచి ప్రయాణం నాకు ఎప్పటికి గుర్తుండిపోయే ఎన్నో అనుభూతుల్ని మిగిలించింది.

12 comments:

lalithag said...

చాలా బాగా రాశారు.
"ఇప్పుడు తమిళ్ అర్ధం కావటం లేదేంటి చెప్మా!!" బావుంది:-)

Unknown said...

బాగుందండీ మీ కంచి ప్రయాణం. ఓ నాలుగైదు సంవత్సరాల క్రితం నేను కూడా ఓ సారి కంచి వెళ్ళాను మా నాన్నగారితో కలిసి.
నిజమే అక్కడ చుట్టుపక్కల ఎన్ని గుడులుంటాయో.

రవి వైజాసత్య said...

పదేళ్ళ క్రితం నేను చేసిన కంచియాత్ర మళ్లీ బుర్రలో రిఫ్రెష్ కొట్టింది...బాగుంది. బస్సులో కండెక్టరు "ఒంబత్తు కాసు కుడు" అంటే సడన్‌గా అదేంటో అర్ధం కాక నేను బిక్కమెగమేసి "యణక్కు తమిళ్ తెరియాదు" అని నేను పర్ఫెక్ట్ తమిళ ఉఛ్ఛారణలో చెప్పేసరికి ఆ కండక్టరు నన్ను చూసిన చూపు ఇంకా జ్ఞాపకం.

అదేంటి మీరు ఏకాంబరేశ్వర నాథర్ ఆలయం చూడలేదా? అక్కడే 4000 యేళ్ల నాటి మామిడిచెట్టుంది. దానికి నాలుగు కొమ్మలు నాలుగు వేదాలకు ప్రతీకలంటి. ఒక్కొక్క కొమ్మకు ఒక్కో రకం మామిడి కాయలవుతాయని పూజారి చెప్పినట్టు..అబ్బా మనవాళ్లకు అప్పుడే అంటు కట్టడం తెలిసిందా అని అనుకున్నట్టు గుర్తు

రాధిక said...

బంగారు బల్లి,వెండి బల్లి తాకారా?[చూసారా?]

kalpana said...

Chelli...kukkala kosam anta kashta padi reseach cheyyanavasaram ledu. situation ni batti teliviga behave cheyyali.

badhakaramina vishayam entante nuvvu okka pattu sari kuda konaleka povatam. eesari ninnu tisukoni kanchiki vellinappudu niku band vestale :-)

క్రాంతి said...

లలిత గారు:

నిజంగా నిజమండి,సినిమాలో తమిళ్,తమిళ్ వాళ్ళు మాట్లాడే తమిళ్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది.

ప్రవీణ్ గారు:

మీకు మీ కంచి ప్రయాణం గుర్తు చేయగలిగినందుకు సంతోషంగా ఉంది.

రవి గారు:

అయ్యో..మాకు ఏకాంబరేశ్వర స్వామి ఆలయం గురించి ఎవ్వరు చెప్పలేదు.అంత చరిత్ర ఉన్న మామిడి చెట్టుని చూడనందుకు నాకు చాలా భాదగా ఉంది.

రాధిక గారు:

నేను బంగారు బల్లి,వెండి బల్లిని చూసాను,తాకాను ;-)

కల్పన గారు:

నేను మీతో షాపింగ్ కి రాను.ఒక్కసారి షాపింగ్ కి వస్తే నా ఆరు నెలల జీతం హామ్ ఫట్ అనిపిస్తారు.

Anonymous said...

చాలా బాగా వ్రాసారు. మరిన్ని మంచి టపాలు వ్రాయండి.

విహారి(KBL) said...

బాగుందండి మీ కంచి కధ.
ఎకాంబరేశ్వరస్వామి టెంపుల్ కామాక్షి గుడి దగ్గరే.
ఆ శివలింగం పంచబూత లింగాలలొ ఒకటి.

Niranjan Pulipati said...

bAgA rASAru anDi guD van :)

Unknown said...

బాగా రాసారు. కంచి చూడాలని నాకు చాలా కోరిక ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు కధలు చెప్పాక కధ పూర్తవ్వగానే కధ కంచికి మనమింటికీ అనే వారు. అప్పుడు నేననుకునేదాన్ని కంచిలో బోల్డు కధలుంటాయని. అందుకే కంచికెళ్ళాలని చిన్నప్పుడనిపించేది. ఇప్పుడేమో మంచి పట్టు చీర కంచిలో కొనుక్కోవచ్చని వెళ్ళాలనిపిస్తోంది

రానారె said...

"కాంజీపురం"
"... తమిళ్ అర్థం కాదేంటి చెప్మా!?"
"...అందుకే నేనేమీ కొనుక్కోలేదు."

ఫస్ట్‌క్లాస్ కామెడీ. శహబాసులు.

rajachandra said...

బాగుందండీ మీ కంచి ప్రయాణం..
ఒక సారి నా బ్లాగు చూసి మరల మీ కంచి యాత్రను గుర్తుచేస్కొండి.
http://rajachandraphotos.blogspot.in/