Wednesday, October 3, 2007

నా రహస్య ఎజెండా

ఈమధ్య ఏ టీవి ఛానెల్ పెట్టినా ఏదో ఒక రకమైన పాటల పోటీలు.పాడుతా తీయగా,పాడాలని ఉంది,నువ్వు వద్దన్నా నేను పాడుతా..ఇలాంటివన్నమాట.ఈ ప్రోగ్రామ్స్ లో పాటలు పాడేవాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది.అంతలోనే ఒక విషాదం నన్ను అల్లుకుంటుంది.ఈ సమాజం నాలో ఉన్న ఒక గాయనిని ఎదగనివ్వలేదు.అందుకే నాకు ఈ సమాజం అంటే ఏవగింపు కలిగింది.అసలు నేను కూడ నక్సలైట్లలో కలసిపోదామనుకున్నాను, కాని అది మన ఒంటికి సరిపోయే వ్యవహారం కాదని ఆ ఆలోచనని విరమించుకున్నాను.నేను ఎందుకు ఇంత భాదపడుతున్నానో తెలియాలంటే మాత్రం గుండ్రం గుండ్రంగా తిరిగి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాల్సిందే.

నాకు చిన్నప్పట్నుంచి మంచి సింగర్ అనిపించుకోవాలనే ఉబలాటం చాలా ఎక్కువ.ఒకసారి ఏదో పుస్తకంలో చదివాను,ఒక మనిషి మనసుని చేరుకోవాటనికి సులువైన రెండు మార్గాలు,ఒకటి మంచి భోజనం చేసి పెట్టడం.రెండు,వాళ్ళు అలసట మర్చిపోయేలా చక్కగా పాట పాడి వినిపించడం.మొదటిది ఎలాగు మనకి చేతకాదు కాబట్టి,బాగా పాటలు పాడి అందర్ని పడగొట్టేయాలన్నది నా ప్లాన్ అన్నమాట.అనుకున్నదే తడవుగా దూరదర్శన్లో ప్రతిరోజు వచ్చే లలిత సంగీత కార్యక్రమాలన్ని జాగ్రత్తగా ఒక్కటి కూడ మిస్సవ్వకుండ చూసేదాన్ని.అప్పట్లో నాకొక గొప్ప సందేహమొచ్చింది.కొన్ని పాటల్ని ఏమో లలిత గీతాలు అనేవారు.ఇంకొన్నింటిని యుగళగీతాలు అనేవాళ్ళు.మా అమ్మనడిగితే లలిత సంగీతం అంటే ఒక్కరే పాడుతారు,యుగళగీతాలంటే Duet అని చెప్పింది.కాని నాకిప్పటికి డౌటే! ఈ క్లాసిఫికేషన్ నాకు ఎప్పుడు అర్దమవుతుందో ఏమో? ఏది ఏమైనా,కొన్ని రోజుల ప్రాక్టిస్ తరవాత మా ఇంట్లో ఉన్న డొక్కు టేప్ రికార్డర్ లో మా అమ్మ నా పాట రికార్డ్ చేసింది.(నా గొడవ భరించలేక రికార్డ్ చేసారు అని చదువుకోగలరు) నేను చాలా ఉత్సాహంగా "మిలే సుర్ మేరే తుమ్హారా.." పాడి 'నా పాట హిట్టు' అని అనుకుంటు రీ-ప్లే బటన్ నొక్కాను."కె..వ్..వ్..వ్..వ్" ఇది నా గొంతు కాదు!! ఈ రికార్డింగ్ ఏమో కాని,ఇంట్లో మన ఇమేజికి ఘోరమైన డామేజి జరిగింది.ఆ తరవాత ఇప్పటివరకు నేను ఎప్పుడు నా వాయిస్ ని రికార్డు చెయ్యలేదు.

స్కూల్ లో మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం.క్లాస్ లో మొదటి మూడు ర్యాంకులు మా ముగ్గురివే. సుజాత,సునీత,నేను అన్నింట్లో ఒకరికొకరం గట్టి పోటి.కాకపోతే వాళ్ళిద్దరు పాటలు కూడ చాలా బాగా పాడతారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా,ఏపాటనైనా సరే రెండుసార్లు వింటే చాలు పాడేసేవాళ్ళు. మేము ఎప్పుడు కలిసే ఉండటం వల్ల స్కూల్ లో టీచర్లందరు నేను కూడ పాడతానని అనుకునేవాళ్ళు. మాకు స్కూల్ లో రోజు ఉదయం ప్రార్ధనలో పాటలు పాడటానికి నాలుగు టీమ్స్ చేసారు. ఆ రోజు పాటలు పాడాల్సిన తొమ్మిదో తరగతి అక్కయ్యలు రాకపోతే,మా P.E.T సార్ మైక్ లో సుజాత,సునీత,క్రాంతి రావాలి అని పిలిచారు. నాకు రెండు లైన్ల అవతల నిల్చున్న మా అక్క షాక్ కొట్టినట్టు,నన్ను చూసి "కొంపదీసి నువ్వు పాడతావా ఏంటి" అని అడిగింది.నా మనసు మళ్ళీ అతుక్కోవడానికి వీలు లేకుండా చిన్న చిన్న ముక్కలైపోయింది.

ఇన్ని అవమానాలు,అగచాట్ల మధ్య ఒక సుముహూర్తాన నేను ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాను. ఆ రోజే మొదటిరోజు.కాలేజిలోనే హాస్టల్ ఉంది.అందరి అమ్మానాన్నలు వచ్చి పిల్లలందర్ని దిగబెట్టి కొట్టుకోవద్దని జాగ్రత్తలు చెప్పి సాయంత్రం ఐదింటికల్లా వెళ్ళిపోయారు. ఒక గంట తరవాత అమ్మాయిలందరం హాస్టల్ మెట్ల మీద కూర్చున్నాం.అందరం ఒకర్ని ఒకరు పరిచయం చేసుకుంటున్నాం.ఇంతలో కార్తీక లక్ష్మి అనే అమ్మాయి నాపేరు అడిగింది.నేను పేరు చెప్పాను.వెంటనే "హే,నీ వాయిస్ చాలా టిపికల్ గా ఉంది" అని అంది. 'Not again!!' అని అనుకొని,టిపికల్ అంటే బాగుందనా,బాగాలేదనా అని అడిగాను.అర్ధంకాని నవ్వొకటి నవ్వింది.టిపికల్ అంటే టిపికల్, బాగుంది బాగాలేదు అని కాదు అంది."an electron is missing in your outer most orbit" అని చెప్పింది. 'వార్ని..దెబ్బకొట్టిందిరా' అని అనుకొని నోరు మూసుకున్నాను. తరవాత రోజు క్యాంపస్ లో సీనియర్స్ చాలా మందిని పాట పాడమని అడిగారంట.నన్ను ఒక్క వెధవ కూడ పాట పాడమని అడగలేదు.అసలు వీళ్ళేమి సీనియర్స్? ఇదేం ర్యాగింగ్ అని భాదపడ్డాను. ఇంటర్లో ఉన్నప్పుడు ర్యాగింగ్ గురించి కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళం.ఇక్కడికొచ్చి చూస్తే ర్యాగింగ్ లేదు నా మొహం లేదు.

ఇంజనీరింగ్ అయిపోయాక అదృష్టం నన్ను ఎడమకాలుతో తన్నింది.ఆ దెబ్బకి నేను వైజాగ్ నేవి సర్వీసెస్ సెంటర్ లో వచ్చి పడ్డాను.అక్కడ దగ్గర దగ్గర ఒక యేడాది పాటు ఉద్యోగం వెలగపెట్టాను.నేను అద్దెకుండే ఇంటి ఓనర్ ప్రతి గురువారం సాయిబాబ భజన అంటూ భీభత్సమైన గొంతేసుకొని మైకులో పాడి చావదొబ్బేవాడు. ఇంక మా టీమ్ లో సుభాష్ అని ఒక బీహారీ ఉండేవాడు.అమ్మో,వీడు చాలా డేంజర్ మనిషి.పాటలు చాలా బాగా పాడతానని సొంత డబ్బా కొట్టుకొనేవాడు. ఒకరోజు "కిశోర్ కుమార్ వాయిస్ నా వాయిస్ లాగ ఉంటుంది" అని చెప్పాడు.నేను డంగైపోయాను. "నీ వాయిస్ కిశోర్ కుమార్ వాయిస్ లాగా ఉంటుందా లేక కిశోర్ కుమార్ వాయిసే నీ వాయిస్ లాగా ఉంటుందా" అని అడిగాను. మళ్ళీ అదే కూత కూసాడు. ఇక వీడితో మాట్లాడటం అనవసరం అని అనుకున్నాను. ఒకరోజు ఆఫీస్ అయిపోయాక నేను చాలా హుషారుగా ఏదో పాట పాడుతూ మెట్లు దిగుతున్నాను.నా పక్కనుండి వెళ్తున్న మా టీమ్ లీడర్ శ్యామ్ తూలి పడిపోయినట్టు యాక్షన్ చేసి "అమ్మో,నువ్వు ఇంక ఎప్పుడు పాటలు పాడకు" అని చెప్పాడు.

కాని బాగా ఆలోచించినప్పుడు నాకనిపిస్తుంది,కడుపులో కెలికేసినట్టు పాడే రమణ గోగుల, చక్రి, R.P.పట్నాయక్ వీళ్ళందరికన్నా నేను బాగానే పాడతాను అని. ఈమధ్య Zoom TV లో చూపించారు,జూహి చావ్లా శాస్త్రీయ సంగీతం నేర్చుకొని తన మొదటి ప్రదర్శన ఇచ్చింది.ఇది చూడగానే నాకు బుర్రలో బల్బు వెలిగింది. మనం కూడ ఇంకో రెండు మూడేళ్ళు ఉద్యోగం చేసి డబ్బు పోగుచేసి ఫుల్ టైమ్ సంగీతం నేర్చుకొని ప్రదర్శన ఇవ్వాలని డిసైడ్ చేసేసుకున్నాను. అప్పుడప్పుడు నాకు ఒక కలొస్తుంది.నా మొదటి ప్రదర్శనకే Standing Ovation సంపాదించేసినట్టు.ఏదో ఒక రోజు నా కల నిజమవుతుంది.ఇన్ని రోజులు నా పాటని,నన్ను చూసి నవ్విన వాళ్ళంతా నా ఆటోగ్రాఫ్ కోసం ఎగబడతారు అప్పుడు.ఇది సత్యం,తథ్యం,నిత్యం.ఇదే నా రహస్య ఎజెండా.కొంచెం ఎక్కువయ్యిందా??

34 comments:

RG said...

Thotaramudi tarvaatha meere... comedy vishayam lo... :)

మేధ said...

క్రాంతి గారు, మీరంటే నా బ్లాగు ఇప్పటివరకూ చూడలేదు కానీ, నేను మీది చదువుతూనే ఉంటాను..!

హ్హహ్హ... నాకు కూడా మీ లాంటి ఆశే ఉంది.. కానీ నా వాయిస్ పర్లేదు.. :)

నేను ఇప్పటికీ పట్టు వదలని విక్రమార్కురాలి లాగా ప్రయత్నిస్తూనే ఉన్నాను సంగీతం నేర్చుకోవడానికి.. కానీ ఈ బెంగళూరు మహానగరంలో, ఆఫీస్ కి వచ్చేసరికే సరిపోతోంది.. అందుకే వీకెండ్స్ ని త్యాగం చేయలేకపోతున్నాను.. మా ఇంటి దగ్గర ఎవరో ఒకావిడ సంగీతం నేర్పుతుందంటే ఆనందం పట్టలేక చేరాను.. చేరకముందే, అమెరికా నుండి అనకాపల్లిదాక ఉన్న అందరికీ డప్పు కొట్టేశాను.. కానీ ఆవిడ అదృష్టమో, నా దురదృష్టమో కానీ, ఆవిడ రెండో రోజు నుండి రావడం మానేసింది..! అలా ఈ ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది.. అయినా, వెనుదిరిగేది లేదు.. ఎప్పటికైన బాలు గారి తోటి శెభాష్ అనిపించుకోవాలనే నా ఈ యత్నం.. అయినా మీరు కూడా ఉండేది బెంగళూరులోనే కదా, ఒక మంచి సంగీతం టీచర్ ని పట్టుకోండి, ఇద్దరమూ వెళ్ళీ అ(బె)దరగొట్టేద్దాం..

Satish Bolla said...

మీ పోస్ట్ అఫీస్ లో కూర్చుని చదివా. ఒక్కసారే పగలబడి నవ్వితే జనాలు జదుసుకున్నారు. అంత బాగుంది

Ramani Rao said...

క్రాంతి గారు మీ రహస్య ఎజెండా ని పబ్లిక్ రహస్య ఎజెండా గా మార్చేసారు.. అయినా పర్వాలేదు... ఇక ముందు నుండి... నేను ఏ పాటల ఛానెల్ మిస్స్ కాకుండా చూడాలి... అనేది...నా ఎజెండా లో ఫస్ట్ ఐటెం మీ పాట కొసం ఎదురుచూడడం.. ష్!ష్! ఎంతయినా..తెలిసిన వాళ్ళం (బ్లాగ్ ద్వారా) కదా మీ ప్రొగ్రాం ప్రత్యక్షంగా చూడలేకపొయినా... ఏదొ ఒక ఛానెల్ లో చూస్తాను కాబట్టి ఆటోగ్రఫ్ ఇవ్వాలని కమిట్ అవ్వాలి మరి.. అలాగే మెధ గారికి కూడా బెస్ట్ ఆఫ్ లక్...

జాబిల్లి said...

ఏం చేస్తాం మొత్తానికి నాపరువు లైబ్రరీలొ తీసేశారు..!
ఈరొజు మీ "నా రహస్య ఎజెండా"చదువుతుంటే నవ్వాగలేదు సరే అని నొట్లొ కర్చీఫ్ పెట్టుకుని చదువుతున్ననా ముక్కుల్నుంచి గాలిబుసా..బుసా మని వస్తుంది..నవ్వుతొపాటు !!అప్పటికి కంట్రొల్ చెసుకుందామని అనుకుటూనే ఉన్నాను కాని నవ్వకతప్పలేదు.!! పక్కవాడు నన్ను వింతగాచుస్తుంటే కళ్ళుతుడుచుకొవటానికి కిందపడిన జేబురుమాలు కొసం వంగాను...ఇది సంగతి.

బాగుంది.

కొత్త పాళీ said...

నవ్విన నాప చేను పండుతుంది. మీరు ప్రొసీడైపొండి.

kalpana said...

nuvvu comedy lo chala edigipoyav...niku intha pedda rahasya egenda(durasha, durbuddi) undani naku kuda cheppaledente??
sarele inta mandi singers ni, cinema herolani gunde rayi chesukoni accept cheyyaleda jannalu...atlane ninnu kuda chestarani ashiddam...keep going and keep blasting.

వికటకవి said...

పాడమని మిమ్మడగవలెనా
పరవశించి మీరు పాడరా....

:-)

http://sreenyvas.wordpress.com

lalithag said...

క్రాంతి,
నా compliment ని sincere గా తీసుకోండి. మీరు చాలా బాగా రాస్తున్నారు.

త్వరలోనే బాగా పాడి కూడా వినిపిస్తారని ఆశిస్తూ,

ఒక తెలుగు కార్టూను చదివాను చాలా ఏళ్ళ క్రితం. తల్లి తంబూరా పట్టుకుని పాట సాధన చేస్తుంటే, పిల్లాడు ఆమె బాధ పడ్తోందనుకుని ఓదార్చబోతాడు. నా పరిస్థితీ అలానే ఉంటుంది అనుకునే దాన్ని. నా అదృష్టం, మా పిల్లలు నేను పాడితే ఇష్టంగా వింటారు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఎవరు నచ్చినా, నచ్చక పోయినా, పసి పిల్లలు తల్లి గొంతును విపరీతంగా ఇష్ట పడతారు:-) నేను దాంతో సంతృప్తిపడిపోతున్నా, వాళ్ళకీ తెలిసే లోపు:-(

Unknown said...

good work anDi
baa raasaaru
మీ ఎజెండా కొనసాగించండి
సాదించలేనిది ఏదీ లేదు

Naveen Garla said...

క్రాంతిగారు ఎందుకో మీరు వ్రాసింది చదువుతున్నంత సేపూ..."రెండు రెళ్ళ ఆరు" సినిమాలో శ్రీలక్ష్మీ గుర్తొచ్చింది.
"Not Again" అనుకున్నారా !! ;)

బెంగళూరులో ఉన్న బ్లాగర్లు ఆసక్తి ఉంటే...ప్రతి నెలా కరిగే సమావేశానికి రావచ్చు. వివరాలకు ఈ లింకు చూడండి: http://groups.google.com/group/telugublog/browse_thread/thread/ce2f948e28b7cd4b#

Unknown said...

రాసిన విధానానికి కొద్దిసేపు బిగ్గరగా నవ్వుకున్నా..కానీ మీ రహస్య ఎజెండా తప్పకుండా కొనసాగించాలని మనసారా కోరుకుంటున్నా..there is magic in the process

చేతన_Chetana said...

"meeru kuda asha bhonsle anthati varu avutaru kranti, avutaru" (nuvvu naku nacchevu lo venkatesh tho sunil type lo)

manalo mana maata, naku kuda shame to shame mee lanti agenda ne undi. me gonthu ela untundo teliyadu kani, naa paata vini neney daduchukuni padatam apestuntanu. na gonthu vishayam lo kuda mee lagey chala kathalunnayi lendi. vocal/instrument nerchukundamani chala anukuntu untanu. baddakistuntanu.

విహారి(KBL) said...

really excellent.kaDupubba navvukunna.

Naga Pochiraju said...

hahahaha......
nEnu paaDalani caalaa prayatinchaanu
kaani kondari guruvula adRshTam moolaana nEnu ilaa paaDalEni kOyila laa migili pOyaanu

Unknown said...

హహహ...
మా మీద ప్రయోగించండి మీ గొంతు. ఎక్కడికీ పారిపోకుండా వింటాము.

Chari Dingari said...

క్రాంతి....కుమ్మేసేయ....ఎవ్వరికీ వినొద్దు.....

Sudhakar said...

మీరు ఎక్కడ ఎప్పుడు కచేరీ ఇచ్చినా నాకొక టపా కొట్టండి. అదే చేత్తో 108 కి ఒక కాల్ కూడా...నేను తప్పని సరిగా హాజరువుతా...

రానారె said...

రాసిన పద్ధతి చాలా నవ్వు తెప్పించింది. మీ ఇంటి ఓనరు భజన కార్యక్రమంపై మీ కామెంటు సూపర్. కానీ మీ రహస్య ఎజెండా మాత్రం తప్పకుండా అమలులోపెట్టి శాస్త్రీయం కాస్తైనా నేర్చుకోండి. 'పాడాలని ఉంది' కార్యక్రమాన్ని బాలుగారు నిర్వహిస్తున్న తీరు నభూతో ...

క్రాంతి said...

@rsg
థాంక్స్ అండి.

@Medha
Done.కాకపోతే మన దెబ్బకి తట్టుకొనేవాళ్ళని వెతకాలంటే టైమ్ పడుతుంది.

@Sateish
I envy u.మీకు ఆఫీస్ లో నవ్వే స్వాతంత్ర్యం కూడ ఉందా? నేను ఎప్పుడన్నా ఆఫీస్ లో నవ్వితే చాలు మా మేనేజర్ మొహం మాడ్చుకుంటాడు.మిమ్మల్ని నవ్వించగలిగినందుకు సంతోషంగా ఉంది.

@Rama
ఎజెండాని బయటపెట్టడంలో ఉన్న నా స్ట్రెటజీ అర్దం కాలేదా? అయితే చెప్తా వినండి.ఎవరన్నా మందు మానేసేవాళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళకి చెప్పి మానేస్తారు.ఎప్పుడన్నా తాగాలనిపించినా జనాలకి భయపడి తాగరన్నమాట.ఇది కుడా కొంచెం అలాంటిదే!
:-)

@Jaabilli
మీకు టపా నచ్చినందుకు సంతోషంగా ఉంది.థాంక్సండి.

@Kothapaali
నా టపాకి కొత్తపాళీగారి కామెంటు వచ్చిందంటే నా టపా హిట్టే!!

@kalpana
బ్లాగులో బ్లాగుదామని,బయట చెప్పలేదు ;-)

@Vikatakavi
మీరందరు ఇలా మోటివేషన్ ఇస్తే అవతలివాళ్ళకి కూడ పరవశం తెప్పిస్తా :-)

@Llalithag
లలితగారికి,నేను మీ కామెంటు పదిసార్లు చదువుకున్నాను.సంతోషంతో నా ఒళ్ళంతా పులకరించిపోయింది.అసలే నేను అల్పసంతోషిని.Thanks a lot for your comment.

@Aswin
Thankyou Aswin.

@NaveenGarla
Thanks Naveen.
నాకు కూడ బెబ్లాసకి రావలనే ఉంది కాని నాకు బెంగుళూరు జాగ్రఫీ నాలెడ్జి సున్నా.ఆఫీస్,హాస్టల్,శివాజినగర్ బస్టాపు కాకుండా నాకు ఇంకా ఏమి తెలియదు.

@TeluguVeera
పెద్ద విధానం ఏమి లేదండి.కడుపుమంట అలా వెళ్ళగక్కాను అంతే.మీకు నచ్చినందుకు థాంక్స్ అండి.

@Chetana
నేను కూడా ఆశాభోంస్లే అంత గొప్పదాన్ని అవుతాను..అవుతాను. :-)

మా ఆఫీస్ ముందు ఉన్న బిల్డింగ్ లో instrumental music నేర్పిస్తున్నారు.ఫీజ్ తోనే వాయించేస్తున్నారు.అయినా మీరు ఏదో పరదేశంలో ఉన్నారనుకుంటా?

@Vihaari(KBL)
Thankyou Sir.

@Lalitha Sravanthi
లాభం లేదండి,మనమంతా కలసి ఒక సంఘాన్ని స్థాపిద్దాం.ఏమంటారు మరి?

@Praveen Garlapaati
ప్రయోగించడానికి సమాయత్తమవుతున్నాను :-)

@Narahari
క్రాంతి..ఎవ్వరి మాటా వినదు.మరి మీరు నా కచేరికి వస్తున్నట్టే కదా?

@Sudhakar
మీరు రావటమే గొప్ప.108 ఏర్పాట్ల గురించి మీరేమి దిగులుపడొద్దు.నా కచేరికి వస్తే ఆ ప్యాకేజి ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ

@RaNaRe
Hmm..నన్ను కూడ మీరు ఏదో ఒకరోజు పాడాలనిఉందిలో చూస్తారు.

Niranjan Pulipati said...

కామెడీ ఇరగదీశారండీ :)) హమ్మో ఆఫీసులో లంచ్ టెం కాబట్టి చుట్టుప్పక్కల ఎవరూ లేరు.. లేకపోతే నా నవ్వు చూసి ఏమైందో అని కంగారు పడేవారే :)

Srini said...

మీ రచనా శైలి చాలా బావుంది. మీరు ఇలాగే మంచి మంచి కామెడీ టపాలు చాలా రాయాలని కోరుకుంటు...మీ రహస్య అజెండా నాకు కామెడీగా అనిపించింది అని తప్పుగా అనుకోకండి. ఇది మీ రచనా శైలికి కాంప్లిమెంట్. అలాగే తప్పకుండా శాస్త్రీయం నేర్చుకోని గొప్ప గాయని అవ్వాలని మనసారా కోరుకుంటూ...

Solarflare said...

...ఐనా మీరిలా మనదేశపు రహస్య రక్షణ విషయాలన్ని బయట పెట్టకూడదండి.

మా స్నేహితులమందరము ఒక "పాడు"వాళ్ళ గుంపుని తయారు చేసాము [internationalలెండి] - (అలా దూరదూరంగా ఉన్నాం కాబట్టే ఇంకా ఉన్నాం) - మీరూ అలాంటిదొకటి మొదలెట్టండి. (మేధగారు ఉత్సాహం చూపిస్తున్నారుగా, శ్రోతలుకుడా రెడి, 108 కుడా ఉందంటున్నారు)

Syam Manohar said...

మంచి కామెడీ రాస్తున్నావ్, కానీ ఇలా నన్ను కూడా నీ కథ లోకి లాగటం బాగుందా?
ఏదో ఇలాగా బ్రతికెస్తున్నా ఇక్కడ (నీ పాట వినపడనంత)దూరంగా...
any how go ahead, all the best.

Venky said...

మీ సీనియర్స్ ర్యాగింగ్ చేద్దాం అనుకున్నారు గానీ చేయించుకుందాం అనుకోలేదు అనుకుంటా. అందుకే మిమ్మల్ని పాడమని అడగలెదేమో అని నా డౌటు !!! :-). జస్ట్ కిడ్డింగ్ అండీ, నో అఫెన్స్ మెంట్, సీరియస్లీ !!! పైపైన చదివా, చాలా బాగా రాసారు, వీలు చేసుకుని, అక్షరం వదలకుండా చదివి మళ్లీ కామెంట్ రాస్తా!!! కానీ, దానికి ముందు - 'మీరు తప్పకుండా ఏదో ఒక రోజు పెద్ద సింగర్ అయి తీరుతారు అమ్మాయి గారూ, అయి తీరుతారు !!' (courtesy: NNN)

subbu said...

very nice after long time I have enjoied by seeing your memories. Keepit up

Unknown said...

Kranthi gaaaru,

Excellent.Keep going with funny stuff.

I am here in deep deserts for oil exploration in Middle east asia and enjoying ur blogs.Its for the first time to read such blogs.I have come to know abt these blogs by Andhra jyothi news paper.

Thanks to Andhrajyothi and to kranthi as well..........

Dr.Raju Guntuka.
Emergency Medical Services,
Schlumberger International.KSA.

rākeśvara said...

నాకు కూడా రహస్య నాదవాద్యం అజెండా వుంది. ఆ దిశగా నేను ఒక పిల్లనగ్రోవి కూడా కొన్నాను.
“పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” అన్నట్టు కాకుండా. నా పిల్లనగ్రోవిని నేను తాకగానే గేయాలు రావడమూ, నా రూమ్మేట్ల దగ్గర నుండి నాకు నిలువెల్ల గాయాలవ్వడంతో ఆపేశాను.

rajinikanth said...

krathigaru mee blog e roje chadivanu .chaala bagundhi.

jyothsna said...

kranthi garu, nijam ga me saily
adbhutam ga vundi.mallik saile
gurthostundi ( andhra bhoomi lo
cartonist) keep it up

arvindrishi said...

hamma ...hamma ...entee rayatam...eppudoo scilent ga naa pani cheskune nannu pakkana colleagues eedikemayyindi anna type lo choostunnaru..."ee blog ...highly additcive"...

talli jola paadutonte geddam pattukuni 'ammaa paadodde..!' ani batimilaade baapu cartoon gnapakam vachindi...

pattaniki inta manda...! kadupulo inta pettukuni emee telenattu untara...asalu em jarugutondi akkada naaku teliyaali...telsi teerali..!

Kathi Mahesh Kumar said...

బెస్ట్ ఆఫ్ లక్...ఇక సాధన మొదలట్టండిక!

MURALI said...

వెధవ సీనియర్లు మీ చేత్ ఓ పాట పాడించి ఉంటే ఇంకెప్పుడూ ర్యాగింగ్ ఊసే ఎత్తేవారు కాదు. ఈ సారి మీ పాట రికార్డ్ చేసి బ్లాగు లో పెట్టేయండి.

Anonymous said...

Nice post andi... BTW mee song okati add chesunte inka bavundedi ... aaa adrustavantulamu meme yenduku kakudadu :)