Tuesday, November 6, 2007

నేను భయపడ్డాను

అసలు నేనేంటి,భయపడటేమేమిటని నాకు ఇప్పటికి అనిపిస్తుంది.కాని నిజంగా నిజం చెప్పాలంటే నేను అప్పుడప్పుడు చాలా భయపడతాను.ఈ మాయరోగం నాకు ఎనిమిదో తరగతిలో అంటుకుంది.నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు లెక్కల ట్యూషన్ కి వెళ్ళేదాన్ని.సాయంత్రం 6గంటల నుండి 9గంటల వరకు.అసలు నాకు ట్యూషన్ కి వెళ్ళటమే ఇష్టం లేదు.దానికి తోడు ఆ లెక్కలు చెప్పే మాష్టారంటే నాకు అసలే ఇష్టం లేదు.అక్కడ నేను ఇరగదీసేదేమి లేకపోయినా చచ్చినట్టు 6నుండి 9గంటల వరకు కూర్చోవాలి.6గంటలకి ట్యూషన్ కి వెళ్ళేటప్పుడు సైకిల్ మీద వెళ్ళేదాన్ని.రాత్రి తొమ్మిది గంటలకి మా నాన్న స్కూటర్ వేసుకొని ట్యూషన్ కి వచ్చేవారు.నేను సైకిల్ మీద వస్తుంటే నాన్న మెల్లగా నన్ను స్కూటర్ మీద ఫాలో చేసేవారు.కాని ఒక రోజు ఏదో పని ఉంటే నాన్న వేరే ఊరికెళ్ళారు.ఆరోజు రాత్రి నన్ను తీసుకెళ్ళటానికి ఎవ్వరూ రాలేదు.రాత్రి ట్యూషన్ వదిలే టైమ్ కి చిన్నగా వర్షం పడుతుంది.ఏంటో నా మనసంతా అదో లాగ అయిపోయింది.పుస్తకాలు తడుస్తాయని ట్యూషన్ లోనే పెట్టేసాను.సైకిల్ తాళం తీసి రోడ్డు మీదకొచ్చి గబగబా తొక్కుకుంటూ ఇంటిదారి పట్టాను.

వర్షం కదా,రోడ్డుమీద ఎవ్వరు లేరు.నేను సైకిల్ చాలా స్పీడుగా తొక్కుతున్నాను.వెంకటేశ్వరస్వామి గుడి వచ్చేసింది.హమ్మయ్యా! ఇంకొక రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటాను అని అనుకున్నాను.అంతే సడన్ గా ఎక్కడ్నుంచి వచ్చాడో కాని నా పక్కన సైకిల్ మీద ఒకడు ప్రత్యక్షమయ్యాడు."ఏంటి,ఈ రోజు మీ డాడీ రాలేదా?" అంటూ నా సైకిల్ దగ్గరదగ్గరికి వచ్చాడు.నాకు కాళ్ళు చేతులు ఆడలేదు.సైకిల్ ఎలా తొక్కానో కాని ముందు చక్రానికి చిన్నపాటి బండ తగిలి పక్కనే ఉన్న బురదగుంటలో పడ్డాను.అంతే నేను హిస్టీరియా వచ్చిన దానిలాగ పెద్దపెద్దగా అరిచాను.అసలు నాకు అంత పెద్ద గొంతు ఉందని నాకు ఆ రోజే తెలిసింది.నా అరుపులు విని గుడిలో ఉండే వాచ్ మెన్,ఇంకొకతను ఎవరో పరిగెత్తుకొస్తుంటే సైకిల్ వాడు వెళ్ళిపోయాడు.ఆ సైకిల్ వెధవ వాడు దొంగసచ్చినోడు,వాడికి కుష్టురోగమొచ్చి దిక్కుమాలిన చావు చావాలి.ఆ తరవాత నేను ఇంటికి ఎలా చేరానో నాకే తెలియదు.ఆ దెబ్బకి నాకు వారం రోజులు విపరీతంగా జ్వరం వచ్చింది.లైఫ్ లో నేను మొదటిసారి భయపడ్డాను.అప్పట్నుంచి నాకు చీకటన్నా,గడ్డం ఉన్న మగవాళ్ళన్నాచాలా భయం.(ఆ సైకిల్ వెధవకి గడ్డముంది.) ఇంత జరిగినా మా నాన్న ట్యూషన్ మాత్రం మాన్పించలేదు.ఎప్పుడన్నా మా నాన్నకి నన్ను తీసుకెళ్ళడానికి రావటం కుదరకపోతే మా సుబ్బులు,శశిగాడు,రాము,రామక్రిష్ణ,పక్క సెక్షన్ శ్రీనివాస్ వచ్చి నన్ను ఇంటిదగ్గర దింపి వెళ్ళేవాళ్ళు.నేను అద్రుష్టవంతురాల్ని,నాకు మంచి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు.

తరవాత అలా అలా చూస్తుండగానే నేను ఇంజనీరింగ్ కి వచ్చేసాను.నేను సెకండియర్ లో ఉన్నప్పుడు నాన్నకి ట్రాన్స్ ఫర్ అయ్యింది.కొత్త కాలనీకి మారినాక కూడ నేను రెండు,మూడుసార్లు ఇంటికి వచ్చివెళ్ళాను,కాని ఒకరోజు ఎందుకో సాయంత్రం బయలుదేరాల్సి వచ్చింది ఇంటికి.అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు కదా,ఇంటికి ఫోన్ చేసి ఏడు గంటలకల్లా వచ్చేస్తానని చెప్పాను.నాన్న బస్టాప్ లో వెయిట్ చేస్తానని చెప్పారు.నా ఖర్మకాలి నేను ఎక్కిన బస్సు మధ్యలోనే ఏదో ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది.దాదాపు రెండు గంటల తరవాత ఆ రూట్ లో నేను వెళ్ళాల్సిన కాలనీ బస్సు వస్తే ఎక్కాను.అసలే కొత్త రూట్,చీకటయ్యింది.నాకు మళ్ళీ టెన్షన్ మొదలయ్యింది.కండక్టర్ కి,డ్రయివర్ కి పదిసార్లు చెప్పాను స్టాప్ వచ్చినప్పుడు చెప్పండని.కండక్టర్ కి గడ్డముంది.వాడ్ని చూస్తేనే ఎందుకో నాకు చిర్రెత్తింది.ఒక అరగంట గడిచాక "నువ్వు ఎక్కడ దిగాలి?" అని అడిగాడు.నేను చెప్పాను.ఆ కాలనీ ఎప్పుడో వెళ్ళిపోయిందని చెప్పాడు.అంతే నాకు గుండె ఆగినంత పనయ్యింది.కోపం,ఏడుపు అన్ని ఒకేసారి తన్నుకొచ్చాయి."అదేంటి,స్టాప్ వచ్చినప్పుడు చెప్పమన్నాను కదా" అని అడిగితే,కండక్టర్ ఆ మధ్య దారిలో బస్సు ఆపించి దిగమన్నాడు.కనీసం తరవాత స్టాప్ లో దిగుతానంటే కూడ ఒప్పుకోలేదు.చేసేది లేక నా బ్యాగు తీసుకొని దిగాను.బస్సు దిగి రోడ్డు పక్కన నిల్చున్నాను.అడపాదడపా బైక్ ల మీద వెళ్ళేవాళ్ళు నన్ను అదోరకంగా చూస్తున్నారు.అసలు ఎటువైపు వెళ్తే మా ఇల్లు వస్తుందో కూడ తెలియదు నాకు.ఇంక లాభం లేదనుకొని ఒక స్కూటర్ వస్తుంటే ధైర్యం చేసి ఆపాను.మానాన్న పేరు,కాలనీ పేరు,మానాన్న ఎక్కడ పని చేస్తారో చెప్పి నన్ను ఇంటి దగ్గర దింపమని రిక్వెస్ట్ చేసాను.ఆ స్కూటర్ మీద వచ్చినాయన నేను చెప్పింది విని బోలెడంత ఆశ్చర్యపోయి నేను కూడ మీ నాన్న పనిచేస్తున్న చోటే పనిచేస్తున్నాను అని చెప్పి స్కూటర్ ఎక్కమన్నారు.కాని ఎక్కిన తరవాత నాకు టెన్షన్ మొదలయ్యింది.ఈయన నిజంగా నన్ను ఇంటికే తీసుకెళ్తున్నాడా లేక ఇంక ఎక్కడికయినా తీసుకెళ్తున్నాడా అని భయమేసింది.కాని పాపం చాలా మంచాయన.మా కాలనీకే తీసుకెళ్ళారు.నాన్న ఇంకా బస్టాపులోనే వెయిట్ చేస్తున్నారు.నన్ను మా నాన్నకి అప్పచెప్పి వాళ్ళమ్మయి కూడ హాస్టల్ నుండి వస్తుందంట,రీసీవ్ చేసుకోవటానికి వెళ్ళాలని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయారు.తరవాత రోజు నేను,మా నాన్న వాళ్ళింటికెళ్ళి పర్సనల్ గా థాంక్స్ చెప్పాము.ఆయన చాల సంతోషపడ్డారు.కాని నేను ఆ బస్సు డ్రైయివర్ ని,కండక్టర్ని జన్మలో క్షమించను.గడ్డం పెంచుకున్న వాళ్ళు మంచివాళ్ళు కాదని మళ్ళీ ఒకసారి నిరూపించారు.

మొన్నటికి మొన్న నేను ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుండి గుడికెళ్ళి కాసేపు కూర్చొని హాస్టల్ కి బయలుదేరాను.తిప్పితిప్పి కొడితే టైమ్ ఏడు కూడ కాలేదు.నేను ఏదో సీరియస్ గా ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే,ఒకడు బైక్ మీద వచ్చి నా పక్కన బండి ఆపి,"మేడమ్,నాకు మీ హాస్టల్ తెలుసు,నన్ను డ్రాప్ చెయ్యమంటారా?" అని అడిగాడు(ఇంగ్లీషులో).ఈసారి నేను భయపడలేదు."పనిచూస్కో,ఎక్కువతక్కువ చేసావంటే పోలిసుల్ని పిలుస్తానని చెప్పాను".వాడు helmet పెట్టుకొని ఉన్నాడు కాబట్టి నేను సరిగ్గా చూడలేదు కాని,ఈ వెధవకి కూడ గడ్డం ఉండే ఉంటుంది.

ఇలాంటివన్ని జరిగినప్పుడు నాకు చాలా భాదేస్తుంది.నేను ఎప్పుడు దేవుడికి దణ్ణం పెట్టుకున్నప్పుడు ఒకటే కోరుకుంటాను."దేవుడా,నన్ను మళ్ళీ ఆడపిల్లగా పుట్టించకు,రేపు నాకు పెళ్ళయ్యాక కూడ నాకు ఆడపిల్లనివ్వకు" అని.జీవితాంతం నన్ను,నా కూతుర్ని కాపాడుకుంటు బ్రతికే బ్రతుకు నాకొద్దు.

24 comments:

Sudhakar said...

మీరు పొత్తూరి విజయలక్శ్మి గారికి ఏ మాత్రం తీసి పోకుండా రాస్తున్నారండి. చాలా బాగున్నాయ్ హాయిగా నవ్వుకోవటానికి :-) సినిమాలలో కూడా విలన్ గాళ్లకు గెడ్డం వుంటుంది అదేంటో

కొత్త పాళీ said...

పైకి నవ్వుతూ నవ్వించేట్టుగా ఉన్నా, మీ ఈ టపాలో అంతర్లీనంగా ఉన్న వ్యధ ఒక కటువు నిజాన్ని, మన సమాజం సిగ్గుతో తలదించుకోవలసిన సందర్భాన్ని కళ్ళ ముందు నిలబెడుతోంది. ధైర్యంగా రాసినందుకు అభినందనలు.
@ సుధాకర్ - ఎవరా పొత్తూరి విజయలక్ష్మి? ఎక్కడ రాస్తారావిడ?

రాధిక said...

మీ నాన్నగారి ప్లేసులో మా నాన్నగారు.మీ ఫ్రెండ్స్ ప్లేసు లో నా కజిన్స్,ఫ్రెండ్స్.అవే భరించలేని వెకిలి చేష్టలు,మాకయితే మా స్కూలు నుండి మా ఊరు మధ్యలో 3 కిలోమీటర్ల నిర్మానుష్య ప్రదేశం.అడపా దడపా తప్పించి సైకిలోళ్ళు కూడా కనపడరు.ప్రతీ ఆడపిల్ల జీవితం లో ఇంచు మించు ఇలాంటి సంఘటనలే జరుగుతూవుంటాయేమో? కొన్ని పెద్దవాళ్ళదాకా తీసుకెళ్ళగలం గానీ కొంత మంది వెధవలు చేసే వెధవ చేష్టలు,కారు కూతలు ఎవరికీ చెప్పుకోలేము కూడా.

గిరి Giri said...

ఏది ఏమైనా ఇది నవ్వుతెప్పించే టపా మత్రం కాదు. చదువుతున్నంత సేపు అయ్యో పాపం అనిపించింది..దీనిలో చెప్పిన భావలకు ప్రత్యామ్నాయం గా, వ్యతిరేక అనుభవాలు ఉంటే, అంటే మీకు సహాయం చేసిన అబ్బాయిలు (గడ్డం ఉన్నవాళ్ళైనా సరే) ఉంటే వారి గురించీ రాయండి..

చదువరి said...

"వాడు హెల్మెత్ పెట్టుకొని ఉన్నాడు కాబట్టి నేను సరిగ్గా చూడలేదు కాని,ఈ వెధవకి కూడ గడ్డం ఉండే ఉంటుంది." -బాగా రాసారు. ఒక చిన్నపిల్ల తనకు భయం కలిగించిన సంఘటనల గురించి చెబుతున్నట్టుంది మీ జాబు, బాగుంది.
పొత్తూరి విజయలక్ష్మి: శ్రీవారికి ప్రేమలేఖ సినిమా కథకురాలే కదా సుధాకర్?

RG said...

ఇది అన్యాయం... గెడ్డం ఉన్నవాళ్ళందరినీ ఇలా విలన్లని చెసేస్తే ఎలా??

I can't live without that layer on my face :)

BHARAT said...

మీరు రాసిన విథానం చుస్తే ,మీ పక్కనే ఉంటూ చుస్తూ ఉన్నటు ఉంది .....

కాని నాకు మాత్రం గడ్దం లేదండి :)

Unknown said...

ఇలాంటి అనుభవాలు ఎదురుకావడం దురదృష్టమే...

దేవుడా,నన్ను మళ్ళీ ఆడపిల్లగా పుట్టించకు,రేపు నాకు పెళ్ళయ్యాక కూడ నాకు ఆడపిల్లనివ్వకు
మీ అభిప్రాయం మారే అనుభవాలు మీకు ఎదురవ్వాలని ఆశిస్తున్నా...

అయినా మా లాంటి మంచి వాళ్ళు ఇంకా మిగిలున్నారు లెండి :)

Srini said...

మీ టపా చదివాక చాలా బాధ కలిగింది. ఇంకా ఈ సమాజంలో ఈవ్-టీజింగ్, మహిళలపై అన్యాయాలు, దాడులు ఎప్పుడు పోతాయో అని అనిపిస్తుంది. మనసులో ఏదో ఒక మూల ఒక చిన్న భయం కూడా ఉంది, ఎందుకంటే నాక్కూడా ఒక ఆడపిల్ల ఉంది. :-(

వికటకవి said...

మీ టపా చదువుతూ ఉండగానే, ఈటీవీ "ఆడపిల్ల" సీరియల్ గుర్తొచ్చింది. అందులో కాన్సెప్ట్ మీ అనుభవం లాంటిదే. కొన్ని సంఘఠనలు నిజంగానే ప్రభావాన్ని జీవితాంతం చూపెడతాయి.

http://sreenyvas.wordpress.com

Naveen Garla said...

మంచి వాళ్ళు మిగిలి ఏమి ప్రయోజనం ప్రవీణ్ ? ఈ మంచివాళ్ళు అకతాయిల్ని ఏమన్నా ఆపగలుగుతున్నారా? అలా ఆపలేనప్పుడు మంచివాళ్ళు ఉండి...ఆడపిల్లలకు ఏమి ప్రయోజనం?
వామ్మో..ఆ టార్చర్ స్వయంగా అనుభవిస్తే కానీ మగవాళ్ళకు ఆ బాధ తెలీదు. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం లాగా ఉంటుందీ వ్యవహారం.
దీనికొకే ఒక మందు ఉంది....అదే 'జంబ లకిడి పంబ' ;) ..... కాకుంటే 'జంబ పంబ లంబ లకిడి' లేకుండా చూసుకుంటే సరి.

జ్యోతి said...

jyothi ఆ రోజుల్లో ఐనా , ఈ రోజుల్లో ఐనా ఆడపిల్లలకు ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి. కాని ఈ రోజుల్లో ఆడపిల్లలు చాలా ధైర్యంగా ఉండాలి.వేరే దారిలేదు. ఆడపిల్లగా పుట్టినందుకు గర్వపడాలి కాని ఎందుకు పుట్టామా అనుకోకూడదు క్రాంతి.

నేను ఎనిమిదవ తరగతిలో అనుకుంటా స్కూలు అయ్యాక వీపుకు బ్యాగును మోసుకుంటూ ఒక కాలనీ గుండా బస్ స్టాపుకు ఒక్కదాన్నే నడుచుకుంటూ వెళుతున్నాను.సాయంత్రం సమయంలో మన అవస్థ ఎలా ఉంటుందో తెలుసుగా గాలిలో తేలిపోయి ఇంట్లో పడితే బావుండు అనిపిస్తుంది. ఇంతలో ఒక వెదవ సైకిల్‌మీద వెళ్తూ నా వీపున ఉన్న బ్యాగును గట్టిగా తొసాడు. క్రిందపడి ఎవరా అని చూస్తే వాడు చాలా దూరం వెళ్ళిపోయాడు. చుట్టూ ఎవరూ లేరు. అప్పటినుండి ఎప్పుడు ఒక్కదాన్ని వెళుతున్నా నాలుగు వైపులా ఓ కన్నేసి ఉంచుతా. ఏ వయసులో ఐనా ఆడదానికి రక్షణ లేని రోజులు...

రాఘవ said...

నాకు మా చెల్లి గుర్తొచ్చిందండి మీ కథ చదువుతుంటే... గుర్తుకొచ్చిందంటే యిలాంటి సంఘటనలేఁవీ జరగలేదుగానీ, పాపం అది చిన్నప్పుడు 7లో వున్నప్పుడూ ఆ తర్వాతా రోజూ యిదిగో అచ్చం మీలాగే ట్యూషన్కి వెళ్తూ వుండేది. ఇప్పుడా నేనెక్కడో వున్నాను, మా చెల్లెక్కడో వుండి చదువుకుంటోంది. మొత్తానికి చెల్లిని గుర్తుచేసి యేడిపించారు.

చివరిగా వొక్కమాట. మీ కథనశైలి చక్కగా అచ్చంగా మా చెల్లి చెప్పే కబుర్లలాగా వుంది!

Deepthi Mamiduru(దీప్తి మమిడూరు) said...

."దేవుడా,నన్ను మళ్ళీ ఆడపిల్లగా పుట్టించకు,రేపు నాకు పెళ్ళయ్యాక కూడ నాకు ఆడపిల్లనివ్వకు" ....i maata chala nijam andi naaku chala sarlu ilane anipistundi.....chala nijanga chepparu anni

Raj said...

చాలా బాగ్ందండి. మీ నుండి మరిన్ని మంచి టపాలు రావాలని ఆశిస్తున్నాను.

సుజాత వేల్పూరి said...

కొత్త పాళీ గారు,
మీరు సుధాకర్ గార్ని అడిగిన ప్రశ్నకు సమాధానం నేను రాస్తున్నానేమీ అనుకోకండేం! పొత్తూరి విజయలక్ష్మి గారు తెలుగులో చాలా చక్కని హాస్య సాహిత్యాన్ని అందించారు. బహుశా తెలుగులో అంత స్పాంటేనియస్ హాస్యం రాయగలిగిన రచయిత్రి ఆవిడేనేమో! విజయ లక్ష్మి గారు రాసిన కథలు 'రచన ' లొ చాలా ప్రచురితం అయ్యాయి. ఇన్ని మాటలెందుకు మీకు ఈజీగా ఉండే పరిచయం ఏమిటంటే, ఉషా కిరణ్ మూవీస్ వారి సూపర్ హిట్ సినిమా 'శ్రీవారికి ప్రేమ లేఖ ' కథ రాసింది ఆవిడే!

Ranjith said...

బాగా రాస్తున్నారు క్రాంతి గారు. గడ్డం ఉన్న అందరు అలాంటి వాళ్ళు కాదు లెండి. కాని, కొంత మంది ఇంట్లో వాళ్ళని పీడించి బికె కొనుక్కొని ఇల పొజులు కొడ్తు వుంటారు. ఈ సారికి క్షమించెయండి. నెక్స్ట్ టయం చూద్దాము వాళ్ళ పని.

సుజాత వేల్పూరి said...

క్రాంతి,
అపురూపమైనదమ్మ ఆడజన్మా' అని పాడి మరీ చెప్పను గాని, మీరు అమ్మాయిని వద్దనుకోవడం బాలేదండి!ఎవడో ఏదో కొంటె కూత కూస్తే? వాడిని చెప్పు తీసుకుని ఎలా కొట్టాలో మీ అమ్మాయికి చెప్పాలి గాని, ఇలా అందరూ అమ్మాయిల్ని వద్దనుకుంటూ పోతే, అసలే వెయ్యి మంది మగాళ్లకి 924 మంది ఆడవాళ్ళున్న దేశంలో, ఎంత మంది మిగులుతారు? అలా జరిగినా మనకే ప్రాబ్లెం ! మీ అమ్మయి టైము వచ్చే సరికి, మీ కంటే ధైర్యంగా పరిస్థితిని టాకిల్ చేయగలిగే రోజులొస్తాయి.

అసలు ఆడపిల్ల లేని ఇల్లు ఇల్లు కాదు. అమ్మాయిలు లేని ఇల్లు dry గా ఉంటుంది. బ్రహ్మ చారి గదిలా ఉంటుంది. ఫూలు పూయని తోటలా ఉంటుంది. నాన్న చేసిన వంటలా ఉంటుంది. తోరణం లేని గుమ్మంలా ఉంటుంది. ముగ్గు లేని వాకిల్లా(కనీసం స్టిక్కర్ ముగ్గు) ఉంటుంది.

(సో, గడ్డం ఉన్న వాళ్ళంటే, ఆడపిల్లలందరిదీ ఒకే అభిప్రాయమన్నమాట!)

వికటకవి said...

ఈ చైనా వాడికీ, మీకూ మధ్య జరుగుతున్న మాటల సారాంశాన్ని మా అందరితో పంచుకోవటం మరవకమ్మా క్రాంతి :-)

సుజాత వేల్పూరి said...

వికటకవి గారు,
నేను మనసులో అనుకున్నాను ఇందాక, ఇదేమిగోల అని? మీరూ అదే అడిగారా? అవునూ, ఇంతకీ, ఎందుకిలా? ఏమిటిలా?

Rajendra Devarapalli said...

అవును వికటకవి గారు చెప్పినట్లు మాకా సంభాషణాసారాంశాన్ని చైనీయభాషలొ కాక తెలుగులో చెప్పాల్సిందే!! :)

వికటకవి said...
This comment has been removed by the author.
వికటకవి said...

సుజాత గారు,

నా అనుమానం ఈ చైనా అల్పప్రాణికి అల్పాహారంగా ఉప్మా బాగా నచ్చినదై ఉంటుంది. ఉప్మాని తిట్టడమే కాకుండా అన్ పాపులర్ చేస్తుంన్నందుకు వాడికి తెగ మండి ఇలా విరుచుకుపడుతున్నాడనుకుంటా. :-)

ఎందుకైనా మంచిది నాకూ ఇందులో ఓ కామెంట్ కొట్టటం ద్వారా భాగముందని నా ఇంటి తలుపు తక్షణం మూశాను. వర్డ్ ప్రెస్ వాడి ముందు వీడి ఆటలు కట్టే, అందుకే ఇలా తలుపులేసుకోని బ్లాగుస్పాటు బ్లాగర్ల మీద పడేడుస్తూ ఉంటాడు.

క్రాంతి said...

Dear All,
I deleted all spam messages and sorry for the inconvenience.