Tuesday, December 4, 2007

నేను ఎందుకు చదావాల్సివచ్చిందంటే..

ఏంటో ఈ పెద్దోల్ల మైండ్ సెట్ మారాలి.క్లాస్ లో ఫస్ట్ వస్తేనో,ఎమ్ సెట్ లో వెయ్యి లోపు ర్యాంకు వస్తేనే వాడు తెలివైనావాడు లేకపోతే ఎందుకు పనికి రాడు అన్నట్టు పిల్లల్ని మొదట్నుంచి చిత్రవధ చేస్తుంటారు.మొన్న శనివారం సాయంత్రం నేను మా కాలనీ పార్క్ లో కూర్చున్నాను.పిల్లలందరు ఆడుకుంటున్నారు.భలే సందడిగా ఉంది.కాసేపయ్యాక ఒక పాప వాళ్ళ అమ్మ వచ్చింది.నేను ఇంకాసేపు ఆడుకుంటాను అని మొత్తుకుంటున్నా కాని బరబరా లాక్కేళ్ళింది.ఇప్పుడు ఆ అమ్మాయి ఏమన్నా IAS పరీక్షలకి ప్రిపేర్ అవ్వాలా? ఆడుకోనివ్వచ్చుకదా.అర్ధం చేసుకోరు.

అసలు అమ్మలందరు ఇంతే.మా అమ్మ కూడ ఇంతే.ఎంత నేను బాగా చదవకపోతే మాత్రం అదేదో పెద్ద సమస్య అయినట్టు ఓ తెగ బాధ పడిపోయేది."మా చిన్నదానికి ఎక్కాలు రావటం లేదు,లెక్కలు సరిగ్గా చెయ్యటం లేదు,ఇంగ్లీషు సరిగ్గా రాయట్లేదు.." ఇలాంటివన్న మాట మా అమ్మ కష్టాలు.ఆ కష్టాలు విన్నవాళ్ళంతా మా అమ్మని సానుభూతితో,నన్ను విరక్తిగా చూసేవాళ్ళు.మా అమ్మ కూడ అందరిలాగ చీరల గురించి,నగల గురించి,పక్కింటి అమ్మలక్కల గురించి మాట్లాడుకోవచ్చు కదా.వీటన్నింటికన్నా ముఖ్యమైనదా నా చదువు? ఒకసారి మా అమ్మ మా బుజ్జి మామయ్యకి నా చదువు సంగతి చెప్పి బాధపడింది.(ఎప్పట్లాగనే,మళ్ళీ అవే డైలాగులు) ఇంకా నేను తరవాత సీన్ కి ప్రిపేర్ అయిపోయాను.కాని విచిత్రం,బుజ్జి మామయ్య అందర్లా నాకు క్లాస్ ఇవ్వలేదు.అసలు నన్నేమి అనలేదు.పైగా అమ్మతో "నువ్వు చూస్తు ఉండు అక్క,మన పిల్లందరిలోకి అదే బాగా చదువుతుంది" అని అన్నారు.మొదటిసారి నా చదువు గురించి అంత పాజిటివ్ గా మాట్లాడింది బుజ్జి మామయ్యే! అసలు నేను గట్టిగా పూనుకొని చదవట్లేదు కాని లేకపోతే మామయ్య అన్నట్టు చదవలేక కాదు.మరీ మామయ్య మాటలు సీరియస్ గా తీసుకోని చదివేస్తే ఫస్ట్ ర్యాంకు వచ్చేసే ప్రమాదముందని మర్చిపోయినట్టు యాక్షన్ చేసా.అమ్మో,ఈ పెద్దోల్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి.పోనిలే పాపం బాధపడుతున్నారు కదా అని ఒకసారి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఇంక అంతే.ఎప్పుడు ఫస్ట్ ర్యాంకు రావాలంటారు.కష్టం బాబు వీళ్ళతో.

అలా చదువుతూ చదువుతూ నేను నాలుగో తరగతికి వచ్చేసా.ఎండకాలం సెలవుల తరవాత మళ్ళీ బడులు తెరిచారు.అబ్బో ఎండాకాలం సెలవులంటే ఇంకో నరకం."టచ్"లో ఉండాలని మా అమ్మ నాతో రోజంతా ఎక్కాలు చదివించేది.నాలుగో తరగతిలో మాకు లెక్కలు చెప్పటానికి మంజుల టీచర్ వచ్చారు.ఆవిడ మా స్కూల్ కి కొత్త టీచర్.మాములుగా కొత్త టీచర్ అంటే పిల్లలందరికి భలే క్యూరియాసిటి ఉంటుంది.మాకు క్లాస్ టీచర్ కూడ ఆవిడే.మొదటిరోజు క్లాస్ కి రాగానే అందరి పేర్లు అడిగారు.ఎందుకోగాని నాకు ఆవిడ భలే నచ్చేసారు.రెండురోజుల తరవాత,ఒకరోజు క్లాస్ లో నన్ను నిల్చోబెట్టి "నువ్వు ఇప్పట్నుంచి రోజు ఫస్ట్ బెంచిలో కూర్చో" అని చెప్పారు.మాములుగా అయితే మా క్లాస్ లో బాగా చదివేవాళ్ళు,ఫస్ట్ ర్యాంకులోల్లు కూర్చుంటారు ముందు బెంచీల్లో.నాలాగ అతివీర భయంకరమైన ర్యాంకుల్లోల్లంతా వెనకెక్కడో కూర్చునేవాళ్ళు.ఏంటి ఈవిడకి మన టాలెంటు తెలియదా? ఫస్ట్ బెంచీలో కూర్చోమంటుంది అని అనుకుంటు వెళ్ళి కూర్చున్నాను.అబ్బో టీచర్ నాకు రోజు రోజుకి తెగ నచ్చేస్తున్నారు.ఏంటో నాకు లెక్కలు కూడ తెగ అర్దమవుతున్నాయి.అప్పుడప్పుడు నాతో లెక్కలు బోర్డు మీద కూడ చేయించేవాళ్ళు.లెక్కలు బాగ చెయ్యకపోతే మా టీచర్ బాధపడతారని ఇంట్లో అన్ని ఒకటికి రెండుసారు చేసుకునేదాన్ని.ఎక్కాలు మాత్రం మనవల్ల కాని పని.ఇప్పటికి కూడ మూడు ఐదులెంత అంటే ఒక్క క్షణం ఆలోచించుకుంటాను పదిహేనా,పదహారా అని.

కొన్నాళ్ళకి ఫస్ట్ యూనిట్ టెస్ట్ జరిగింది.తరవాత కొన్నాళ్ళకి అసలయిన ఘట్టం,ప్రోగ్రెస్ కార్డులిచ్చారు.ప్రోగ్రెస్ కార్డులిచ్చేటప్పుడు టీచర్ ర్యాంకులు చదువుతూ ఇస్తారు.నా ర్యాంకు చదివినప్పుడు క్లాస్ లో అందరు నన్ను ఎగాదిగా చూసారు.నాకేదో దయ్యం పట్టింది అనుకున్నారు అందరు.స్కూల్ అయిపోగానే నేను గబాగబా ఇంటికెళ్ళాను.నేను వెళ్ళేసరికి నాన్న నిద్రపోతున్నారు.నాన్న మీద పడి కుదిపి నిద్రలేపి ప్రోగ్రెస్ కార్డు చేతిలో పెట్టాను.ఆ,ఇందులో చూడటానికి ఏముందిలే అన్నట్టు ఒకసారి ప్రోగ్రెస్ కార్డు చూసిన నాన్న డంగైపోయారు.ఎప్పుడు ముప్పయ్యో ర్యాంకు,నలభైయో ర్యాంకు చూడటానికి అలవాటు పడిన నాన్నకి ఈసారి నా ప్రోగ్రెస్ కార్డు చూసేసరికి నిద్ర ఎగిరిపోయింది.పొరపాటున వేరే వాళ్ళ కార్డు తెచ్చానేమోనని వెనక్కి తిప్పి "విద్యార్థి పేరు","తండ్రి పేరు" అని ఉన్నచోట ఒకసారి చెక్ చేసారు.అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి.అప్పుడు నమ్మకం కుదిరింది నాన్నకి.అప్పుడు నాన్న మొహంలో ఎంత ఆనందం కనిపించిందంటే అబ్బో మాటల్లో వర్ణించలేను.మా అమ్మని పిలిచి "నా చిన్నకూతురికి ఎనిమిదో ర్యాంకు వచ్చింది తెలుసా" అని చెప్పారు.ఇంట్లో అందరు చాలా సంతోషపడ్డారు.మా అక్కకి ఫస్ట్ ర్యాంకు వచ్చినప్పుడు కూడ ఇంత రియాక్షన్ ఇవ్వలేదు.ఆ రోజంతా ఇంట్లో మనకి స్పెషల్ ట్రీట్ మెంటు.అబ్బ వీళ్ళతో చదివినా బాధే,చదవకపోయినా బాధే.

తరవాత రోజు ఉదయం నాన్న నాకొక ఫోటో ఆల్బమ్ ఇచ్చారు.నేనందుకున్న మొదటి బహుమతి అది.అంతే ఇంక అప్పట్నుంచి మంజుల టీచర్ కోసం,నాన్న కోసం చదువుతానే ఉండాల్సొచ్చింది.ఇంతా చేసి చదివింది నేనయితే,అమ్మ మాత్రం బుజ్జిమామయ్య అన్న మాట నిజమయ్యింది.మామయ్య అన్నాడు కాబట్టే నువ్వు చదవగలిగావు అని అంటుంది.ఇలా ఇంతమందిని ఇంప్రెస్ చెయ్యాలంటే మాటలా.అసలు నాలుగో తరగతి లెక్కలు ఎంత కష్టమో వీళ్ళకేమి తెలుసు?

15 comments:

Anonymous said...

భలే కిత కితలు పెట్టించారండి. ఎంతో ఆహ్లాద కరంగా వెకిలి మాటలు లేకుండా చక్కగా రాశారు.


-- విహారి

Ramani Rao said...

Funny ga vundanDi kaaseapu enjoy cheasaanu mee Tapaa chadivi..

ramya said...

బావుంది క్రాతి తాజా గా వున్నాయి మీ జ్ణాపకాలు నిజంగా చిన్న పాప చెబుతున్నాట్టే వుంది .ఇల్లేరమ్మ కథల్లాగే మీవి కూడా చాలా బాగున్నాయ్.

అనిర్విన్ said...

బాగున్నాయి. మీ రచనాశైలి, మీ బాధలు, కష్టాలు.

Sudhakar said...

రచనాశైలి బావుంది. Excellent

cbrao said...

మంచిగుంది. గిట్లాగే రాయి మరిన్ని.

విహారి(KBL) said...

Happy New Year to you

Satish Bolla said...

bhale navvinchaav kranthi. nijjanga superb. appudeppudo nee blog loki vacha. malle idhe raavadam(mayb after 3 months). but bhale aahvaaninchaav

చేతన_Chetana said...

nijjam ga illeramma kathalu, kaburlu lagey untay meevi. aa kathalu rasina aavida maaru peru tho vacchi rayatam ledu kada.!!?!

రానారె said...

"అలా చదువుతూ చదువుతూ నేను నాలుగో తరగతికి వచ్చేసా.", "అసలు నాలుగో తరగతి లెక్కలు ఎంత కష్టమో వీళ్లకేమి తెలుసు?" ... ఇలాంటి మాటలు అందరూ రాయలేరు. మీరు గ్రేట్.

Dr. Ram$ said...

జ్యోతి గారి పుణ్యమా అంటూ..మీ బ్లాగ్దర్శనము కలిగినందుకు, నేను జ్యోతి గారికి ఎంతో రుణపడి వుంటాను..అంటే, ఇక మనసారా నవ్వించినందుకు మీకు ఎంత రుణపడి వుంటానో మీరూహించగలరనుకుంటాను..మీ బ్లాగు చదువుతుంటే ఎలా వుందంటే, నవ్వు రావడము కాదు, మనసు కి అహ్లాదకరము గా, తృప్తి గా వుంది..కొన్ని జోకులు కి పడి పడి నవ్వుతాము, కాని అది ఆ కొంత సేపే..కాని ఇలా మనసు కి అహ్లదకరము గా రాయడము అంటే.. కెవ్వు కేక.. అసల అలా నల్లేరు మీద నడక లా, అలా అలా ఎలా ఎలా రాసేస్తున్నారండి..ప్రతి లైన్ ఒక పదనిస లా, ప్రతి పదము ఒక సరిగమ లా..ఎంతో సరళమైన భావాన్ని, ఇంకెంతో సరళమైన బాష లో , మనసుకు హత్తుకునేలా రాయడము లో..ముచ్హట గా వుందండి మీ బ్లాగు..మీ రచన శైలి ఒక ఉదాహరణ చెపుతాను.."రాముడు అడవికి వెళ్ళెను" అన్న ఈ మూడు పదాలు వుపయొగించి కూడా, మనసుకి హత్తుకునేలా ఎంతో జనరంజకము గా ఒక కథ రాయగలరు అనిపిస్తుంది..హట్సాఫ్ క్రాంతి గారు..

చివరి గా మీకు అప్పుడెప్పుడొ కలిగిన ధర్మ(గణిత) సందేహానికి నా నివృత్తి.. మూడు ఐదులు పదహారే..మా చిన్నబ్బాయి పంతులు గారు నా చెవి మెలిపెట్టి మరీ చెప్పినట్లు గుర్తు..

గీతాచార్య said...

It's a wonderful experience to read your blog. I have seen it in Andhrajyothi sunday book, and opened it. I'm reading each and every one of your blogs.

Thank you to take us into your childhood.

Your style reminds me of O. Henry, who romanticizes the common experiences in life in a funny way. But his are stories, yours are Ha Ha Ha.

Good work Keep it up.

Unknown said...

మీ పదాల ఫ్లో అధ్బుతం, కెవ్వు కేక అని అనలేకపోతున్నాను, హాయిగా ఆహ్లాదంగా ఉందండీ, అంటే నా భావం ఓ క్లాస్ కామిడీ, ప్రశాంతంగా ఉన్నాయి మీటపాలు

akka said...

entha haayiga vundo nee blog chaduvuthunte. amma chuttu koorchoni mugguram oke plate lo gongura pachadi neyyi vesukoni thinnatha ruchiga vunnayi

Unknown said...

chala chala bavundhandi..ofc lo pani chesthunnatu natinchi natinchi alisipothunna time lo ..me blog,time ki kanipinchindhi andi