Sunday, September 14, 2008

సినిమా కష్టాలు

చల్లగా సాగిపోతున్న నాజీవితంలోకి ఒకసారి ఎండాకాలం వచ్చింది.ఎండాకాలం అంటే రోజంతా ఇంట్లోనే ఉండాలి.కనీసం రెండు గంటలయినా లెక్కలు చేసుకోవాలి లేదా ఎక్కాలు చదవాలి.ఇంతకన్నా పెద్ద శిక్ష ఉంటుందని నేను అనుకోను.నేనయితే నాపిల్లల్ని ఎండాకాలంలో చదివించను.ఊరిమీద పడి ఊరేగండ్రా! అని బయటకి పంపిస్తా.అయినా క్యాలిక్యులేటర్లు,కంప్యూటర్లు కనుక్కున్నాక కూడ ఎక్కాలు చదవడం ఏంటో చాదస్తం కాకపోతే!

అందుకే ఒకరోజు ధైర్యం చేసి నాన్నని అడిగా సినిమాకి తీసుకెళ్ళమని.ఒక చూపు చూసారు నన్ను."సినిమాలో ఏముంది?మూడుగంటలు టైమ్ వేస్టు.అదే ఒక మంచి పుస్తకం చదివితే తెలియని విషయాలు తెలుస్తాయి,నిద్రపోతే రెస్టుగా ఉంటుంది,లేకపోతే ఇంటిపనిలో అమ్మకి హెల్ప్ చెయ్యొచ్చు కదా!" అని నాకే క్లాస్ పడింది.అదేంటి నాన్న అలా అంటారు? "అమ్మాయి-అబ్బాయి-ప్రేమ" అనే ఒకేఒక్క కాన్సెప్ట్ మీద ఎన్ని వందల సినిమాలు తీయ్యొచ్చో తెలుగు సినిమాలు చూసి తెలుసుకోవచ్చుకదా అని అందామనుకొని ఎందుకో నాకుడి కన్ను అదురుతుంటే ఎందుకొచ్చిన గోలలే అని నోరుమూసుకున్నాను.సినిమాల విషయంలో మాఅమ్మ కూడ మాకే సపోర్టు.ఎప్పుడు సినిమాకి తీసుకెళ్ళరని నాన్నతో నిష్ఠూరమాడుతుంది.

కాని మానాన్న సినిమాకి తీసుకెళ్ళక పోవటానికి ఒక కారణముంది.మాకాలనీలో థియేటర్లు లేవు కాబట్టి సినిమా అంటే గోదావరిఖనికి వెళ్ళాలి.అంటే రాను నలభై నిమిషాలు,పోను నలభై నిమిషాలు ప్రయాణం.ఆ! నలభై నిమిషాలే కదా అని అనుకోవచ్చు మీరు కాని మధ్యలో అంతా చిట్టడవిలాగా ఉంటుంది.ఏచెట్టు చాటు నుండి ఏఅన్నో,అక్కో ప్రత్యక్షమవుతారో తెలియదు.సినిమాకెళ్ళి వస్తున్న ఒకరిద్దరిని పోలిసులనుకుని లేపేసిన దాఖలాలు కూడ ఉన్నాయి.కాబట్టి మానాన్న థియరీ ప్రకారం ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ 'అమ్మాయి-అబ్బాయి-ప్రేమ' టైపు సినిమాలు చూడటం అస్సలు అవసరం లేదు.అలా మా ఎండాకాలం సెలవులన్ని దాదాపు ఒకేలాగా జరిగిపోతుండేవి.ఉదయాన్నే మానాన్న ఆఫీసుకెళ్ళడం,పదింటికళ్ళా మాఅమ్మ మాకు తలకి నూనె పెట్టి అటొక పిలక,ఇటొక పిలక జడలు కట్టి పుస్తకాల ముందు కూర్చోబెట్టడం(ఎంత బతిమాలినాకాని మాఅమ్మ ఒక్క జడ మాత్రం అస్సలు వేసేది కాదు),సాయంత్రం నాలుగింటికి కొబ్బరిబొండాలు తాగడం,మానాన్న రాత్రి పదకొండింటి వరకు దలాల్ స్ట్రీట్ పుస్తకం చదవడం...ఇలా అన్నమాట.

అలాంటిది ఎప్పుడు లేని విధంగా ఒకరోజు మానాన్న సాయంత్రం నాలుగింటికే ప్రత్యక్షమయ్యారు.ఇంటిముందు లావణ్యవాళ్ళతో ఆడుకుంటున్న నన్ను పిలిచి "తొందరగా తయారవ్వండి,సినిమాకెళ్దాం" అని చెప్పారు."నాన్న, నిజంగా నిజమేనా?" అని అడిగాను.మానాన్న ఒక చిరునవ్వు నవ్వి నిజంగానే వెళ్దాము,తొందరగా వెళ్ళకపోతే టిక్కెట్లు దొరకవు మరి అని చెప్పారు.వీరస్పీడులో నేను ఇంటివెనక కూరగాయలు కోస్తున్న మాఅమ్మ దగ్గరికెళ్ళి,"అమ్మోయ్,నాన్న సినిమాకి తీసుకెళ్తానన్నారు,నన్ను తొందరగా తయారు చేయించు" అని చెప్పాను."ఎండకి నీకు మతిగాని తప్పిందటే!సినిమా,గినిమా అన్నావంటే వీపు చింతపండవుతుంది.ఇంకా నువ్వు పదమూడో ఎక్కం అప్పజెప్పనేలేదు" అని కోస్తున్న దొండకాయని నామీదకి విసిరింది."ఎప్పుడు పదమూడో ఎక్కమేకాదమ్మా ప్రపంచం అంటే,ఒకసారి బయటకొచ్చి చూడు ఎన్ని తెలుగుసినిమాలున్నాయో.అయినా సినిమా విషయం నువ్వు నాన్ననే అడుగు" అని చెప్పాను.ఈలోపే మానాన్న టైమ్ వేస్ట్ చెయ్యకుండా,ముందురోజు చదివేసిన దలాల్ స్టీట్ పుస్తకాన్ని మళ్ళీ చదువుతున్నారు.

అమ్మ: ఏంటండీ,తొందరగా వచ్చారీరోజు?
(నేను:అబ్బ!! ఈఆడవాళ్ళు ఏవిషయమైనా తిన్నగా అడగరు కదా!)
నాన్న: అవునోయ్! తొందరగా తయారవ్వండి,సినిమాకెళ్దాం.
అమ్మ: ఏవండీ..! ! ! ! ! (హాశ్చర్యానందాలు కలగలిపిన కేక)

అంతే దెబ్బకి మానాన్న చదువుతున్న పుస్తకాన్ని విసిరిగొట్టారు ఆకేకకి.ఆతరవాత గంటలో మేము గోదావరిఖని,కవిత థియేటర్లో ప్రత్యక్షం.ఆవిధంగా మేము కుటుంబ సమేతంగా చూసిన తొలి తెలుగు సినిమా 'సీతారామయ్య గారి మనవరాలు'.ఆసినిమా మా అమ్మకి,నాన్నకి విపరీతంగా నచ్చేసింది.ఇప్పటికి కూడ "సినిమా బాగుంది కదరా!" అని అంటారు మానాన్న."ఏ సినిమా నాన్న?" అంటే,"అదే అప్పుడే మర్చిపోయావా,మనందరం కలిసి చూసాము కదా,సీతారామయ్యగారి మనవరాలు" అంటారు.అలా మానాన్న దృష్టిలో సినిమా అంటే సీతారామయ్యగారి మనవరాలే!వేరేవన్ని పిచ్చి గంతులే.

9 comments:

ప్రపుల్ల చంద్ర said...

మాకు కూడా ఎండాకాలం లో గృహనిర్భందమే :(, కాకపోతే సాయంత్రాలు విడుదల అయ్యేవారం.
ఏ విషయంలోనైనా మొదటిసారి అనేది చాలా ప్రత్యేకమైనది. ఆ సినిమా కూడా చాలా బాగుంటుందనుకోండి అది వేరే విషయం.

చైతన్య.ఎస్ said...

baagundi mii సిని కష్టాలు.

MURALI said...

"అమ్మా నన్ను తయారు చేయించు" అంటే అసలు బాల్యం గుర్తు వచ్చింది. నాన్న ఎక్కడికన్నా వెళ్ళాలన్నా లేదా భందువులు వస్తున్నారన్నా అమ్మ చక చకా మనల్ని తయారు చెయ్యటం, మనమేమో తెగ సంబరపడిపోవటం. ఇప్పుడయితే బయటకి వెళ్ళేప్పుడు కనీసం మొహం కూడా కడగటం మానేసా. ఊరెళ్ళేప్పుడు మాత్రం అమ్మ చెబుతుంది ఏంట్రా అలానే బయటకి వెళ్తావా? కాస్త మొహం కడుక్కొని వెళ్ళొచ్చుగా అని.

భలే ఉంది మీ టపా పాత విషయాలు గుర్తువచ్చేలా.

Kamaraju Kusumanchi said...

Nice post!

Srinivas Sirigina said...

"అయినా క్యాలిక్యులేటర్లు,కంప్యూటర్లు కనుక్కున్నాక కూడ ఎక్కాలు చదవడం ఏంటో చాదస్తం కాకపోతే!"
బావుంది. చివర్లో పంచ్ కోసం ఎదురుచూస్తూ, ప్రేమ దోమ లాంటి సినిమా అని మీరు ఊహించుకొంటే, మీ నాన్నారు గాంధీ లాంటి సినిమా కి తీసుకు వెళ్ళుంటారేమో అని అనుకున్నా.

రాధిక said...

నిజమే సుమా...గూగుల్ సెర్చ్ వుండగా పెద్ద చదువులు ఎందుకో.సెర్చ్ కి సరిపడా అక్షరాలు,పదాలు నేర్చుకుంటే సరిపోదూ.
ఏసంకాలంలో మాకు సాయంత్రం విడుదల వుండేది.పుచ్చకాయో,మామిడికాయో తిని బయలుదెరెవాళ్ళం.
ఊరుమీద పడి తిరగండ్రా అని వదిలేస్తారా?నేను అలాగే చేస్తున్నాను.నా చిన్నప్పుడు వర్షం లో తడవనిచ్చేవారు కాదు.అప్పుడు అనుకున్నాను నా పిల్లలకి ఇలాంటి ఆంక్షలు పెట్టకూడదని. ఇప్పుడు మావాడు వర్షం లో తడుస్తూ వుంటే నేను చూసి మురిసిపోతుంటాను.
మీ టపా కత్తి.మనలో మన మాట నాకూ సీతారామయ్యగారి మనవరాలు సినిమా అంటే చాలా ఇష్టం.మా నాన్నగారికి ఈమధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో తరుణ్,స్నేహాల ప్రియమైన నీకు సినిమా అంటే చాలా ఇష్టం.

kalpana said...

kranthi garu..meeru mee pelli ayyaka tapa la frequency tagginchesarentandee?
inka tapa la length kuda taggipoyindi..sare kani tapa bavundi kranthi gaaruuuuu :-)

Unknown said...

అదిరింది.మాల్గుడి కధల్లాగా మీ కాలనీ పేరొక్కసారన్న ఉంటుందండీ మీ టపాల్లో.

రాధిక గారు ఇది మరీ బావుంది. సెర్చ్ కు సరిపడా అక్షరాలు, నేర్చుకుంటే సరిపోదా. అదిరింది.

టి. శ్రీవల్లీ రాధిక said...

క్రాంతి,

బ్లాగు ప్రయాణంలో నేను తో మొదలుపెట్టి మొత్తం అన్నీ వరసగా చదివేశాను.
బాగా వ్రాశావు.