Thursday, February 2, 2012

లిండా-మొదటిభాగం

లిండాతో నా పరిచయం కాస్త విచిత్రంగా జరిగింది.మావి ఎదురెదురు అపార్ట్మెంట్ లే అయినా,నేను ఆమెని గమనించడానికి నాలుగైదు నెలల సమయం పట్టింది.ఎప్పుడు తలుపులు బిగించుకొని మనదైన చిన్న ప్రపంచంలో బ్రతికే ఈరోజుల్లో ఎదురింట్లో ఎవరున్నారో తెలుసుకోవటానికి ఆమాత్రం టైం పట్టడంలో ఆశ్చర్యం ఏమిలేదులే.ఒకరోజు గ్రాసరి షాపింగ్ తరువాత కార్ లో నుండి షాపింగ్ బ్యాగ్లు తీసుకొని ఇంట్లోకి వస్తుంటే మొదటిసారి గమనించాను,ఎవరో విండో బ్లైండ్స్ లోనుండి నన్ను చూస్తున్నారు.నేను తల ఎత్తి చూసేటప్పటికి కిటికి దగ్గర్నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది.ఎందుకో కాస్త చిరాకనిపించింది.అంతగా చూడాలనిపిస్తే బయటికి వచ్చి చూడాలి,లేదా విండో సాంతం తెరచి చూడాలి కాని ఈ దాగుడుమూతలు ఏంటంట అని విసుక్కొని మా ఆయనతో కూడా అదే మాట అన్నాను.ఆ తరవాత కూడ చాలాసార్లు కిటికి వెనక కదిలే ఆకారాన్ని చూసాను.అసలు ఆడవాళ్ళో,మగవాళ్ళో కూడా తెలిసేది కాదు.కొన్నాళ్ళకి నేను కూడా పట్టించుకోవడం మానేసాను.

ఒకరోజు సాయంత్రం అయిదుగంటల సమయంలో నా ఆరునెలల అమ్ముకుట్టిని ఎత్తుకొని పార్కింగ్ లాట్ లో నడుస్తుంటే,విచిత్రంగా మా ఎదురింటి అపార్ట్మెంట్ తలుపులు తెరుచుకున్నాయి.లోపలి నుండి ఎవరొస్తారో అనే సస్‌పెన్స్ కి తెరదించుతూ తెల్లటి వెంట్రుకలతో,మెహమంతా గమ్మత్తయిన ముడతలతో సన్నగా ఉన్న ఒక ముసలావిడ చాలా జాగ్రత్తగా అడుగులో అడుగేసుకొంటూ నా దగ్గరికొచ్చింది. హాయ్,హెల్లోలు అయిన తరవాత "రోజు నీ బేబిని,నిన్ను చూస్తుంటాను,ఈరోజు నీబేబిని దగ్గర్నుండి చూద్దామని వచ్చాను.నువ్వు ఏమి అనుకోవు కదా" అని అడిగింది.అయ్యో! ఇందులో అనుకోవడానికి ఏమి ఉంది, భేషుగ్గా చూడు అని చెప్పాను.కాని ఒక పదిసెకండ్ల తరవాత"నేను బయట ఎక్కువసేపు ఉండకూడధు.Sorry to bother you!" అంటూ వెళ్ళిపోయింది.ఏమయినా ఆరోగ్య సమస్యలున్నాయేమో పాపం అని అనుకున్నాను.ఆమె వెళ్ళిపోయాక గాని గుర్తురాలేదు నాకు కనీసం ఆవిడ పేరు కూడ కనుక్కోలేదు అని.ఆ తరువాత నుండి నేను బయట కనిపిస్తే,తను కూడ వచ్చి అమ్ముకుట్టిని పలకరించేది.అప్పుడు చెప్పింది తన పేరు లిండా అని.నా పేరు ఎన్నిసార్లు చెప్పినా కాని తనకి పలకడం రాలేదు,జ్ఞాపకం కూడ ఉండేది కాదు.నన్ను nice lady from India అని పిలిచేది.అలా అలా మావారితో కూడ పరిచయం అయ్యింది లిండాకి.కేవలం అమ్ముకుట్టిని చూడటానికి మాత్రమే బయటకి వచ్చేది.వచ్చినా ఒక నిమిషం కన్నా ఎక్కువసేపు ఉండేది కాదు.లిండా చాలా మితభాషి.చాలా చాలా ప్రైవేట్ పర్సన్.మా గురించి ఏమి అడిగేది కాదు,అలాగే తన గురించి ఏమి చెప్పేది కాదు.మాములుగా కొత్తవాళ్ళతో లొడలొడా మాట్లాడే నేను లిండాతో ఏమి మాట్లాడాలో అర్ధం కాక గమ్మునుండిపోయేదాన్ని.ఒకరోజు రాత్రి ఎనిమిది గంటలప్పుడు మా తలుపు తట్టింది లిండా.మావారు తలుపు తెరిచారు.తన ముఖం కాస్త ఆందోళనగా ఉంది."ఏంటి,ఏమన్నా హెల్ప్ కావాలా"అని అడిగితే,పార్కింగ్ లాట్ లో ఉన్న ఒక తెల్ల పికప్ ట్రక్ ని చూపించి,"ఆ ట్రక్ ఈ బిల్డింగ్ లోని వాళ్ళది కాదు.నిన్న సాయంత్రం నుండి ఇక్కడే ఉంది.నాకెందుకో భయంగా ఉంది.లైసెన్స్ ప్లేట్స్ కూడ అవుట్ ఆఫ్ స్టేట్ ప్లేట్స్ ఉన్నాయి" అంది.ఒక్క క్షణం నేను,మా ఆయన ముఖముఖాలు చూసుకొని,ఎవరైనా విజిటర్స్ వెహికిల్ కావచ్చు.భయపడాల్సిందేమి లేదులే అని చెప్పాము.ఎందుకయినా మంచిది నేను ఆ లైసెన్స్ ప్లేట్స్ నంబర్ నోట్ చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది.అప్పుడనిపించింది, మమ్మల్ని కూడా చాలారోజులు కిటికి చాటు నుండి స్టడి చేసాక కాని మాతో పరిచయం చేసుకోలేదు అని.మొదట్లో తనతో పాటు ఇంకా ఎవరన్నా ఉంటారేమో అనుకున్నాను కాని తరవాత తెలిసింది ఒక్కతే ఒంటరిగా ఉంటుంది అని.ఎప్పుడన్నా రెండు,మూడు రోజులు వరుసగా నేను బయట కనిపించకపోతే మా ఇంటి తలుపు తట్టేది.ఇంట్లోకి రమ్మంటే వచ్చేది కాదు.గుమ్మం బయటే నిలబడి ఒక్కసారి అమ్ముకుట్టిని చూపించమని అడిగేది.ఎప్పుడు ఒక కాటన్ నైట్ పాంట్స్,తెల్లటి చొక్కా వేసుకొని, పైనుండి ఒక నీలపు రంగు స్వెట్టర్ వేసుకొనేది.నాకు గుర్తున్నంత వరకు తనని వేరే రకం బట్టల్లో చూడలేదు.

ఒకరోజు శనివారం ఉదయం మేము బయటకి వెళ్తుంటే, లిండా ఇంట్లోనుంచి ఒకాయన ఏవో సామాన్లు తీసుకొని వెళ్ళి కార్లో పెడుతున్నాడు.సహజంగా నాకున్న క్యూరియాసిటి ఆపుకోలేక వెళ్ళి ఆయనతో మాట్లాడాను."ఏంటి,లిండా ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతుందా,నాకు చెప్పనే లేదే!" అని అడిగాను.ఆయన ముందు నన్ను చూసి కాస్త ఆశ్చర్యపోయి,తరవాత పరిచయం చేసుకొన్నాడు.తన పేరు స్టీవ్ అని,లిండా కొడుకునని చెప్పాడు.లిండాకి అక్కర్లేని సామాన్లు ఛారిటీకి ఇవ్వడానికి తీసుకెళ్తున్నానని,లిండా ఎక్కడికి వెళ్ళడం లేదని, అంతకు ముందు వారమే తన రెంటల్ లీజ్ పొడిగించానని,ఇంకో ఏడాది వరకు ఇక్కడే ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు.ఆరోజు సాయంత్రం లిండా కనిపిస్తే చెప్పాను మీ అబ్బాయితో మాట్లాడాను అని.అప్పుడు చెప్పింది,తన అసలు ఊరు మిషిగన్ స్టేట్,ఫ్లింట్ అని.లిండాకి ఒక అమ్మాయి,ఇద్దరు అబ్బాయిలు.మిగతా ఇద్దరు పిల్లలు మిషిగన్ లోనే ఉంటారని,స్టీవ్ ఇక్కడ ఉంటున్నాడని,తను కూడ రిటైర్ అయ్యాక ఈఊరొచ్చిందంట.స్టీవ్ మా అపార్ట్మెంట్స్ కి రెండు మైళ్ళ దూరంలో ఇళ్ళు కొనుక్కున్నాడని చెప్పింది."ఫ్లింట్ లో ఉన్నప్పుడు ఏమి జాబ్ చేసేదానివి నువ్వు?" అని అడిగాను.తను కచ్చితంగా స్కూల్ టీచర్ కాని,నర్స్ కాని అయ్యి ఉంటుందని,అదే సమాధానం వినడానికి రెఢీ ఉన్న నేను డంగైపోయే సమాధానం చెప్పింది.


3 comments:

వేణూశ్రీకాంత్ said...

Hmm Interesting ! Waiting for the next part..

Anonymous said...

eagerly waiting for second part andi .....
ravi prakash

Anonymous said...

Kranti gaaru.. urs blogs is really good

Idly story chaduvutu vune nijamgaa brhamanandam movie hoosinate vndi
You got a good sense of humour.
hats off
Plz continue with ur blogs

In Israel ur blog is the only way of my key entertainmnet for next 2 months :) !!!!!!!