Wednesday, March 7, 2012

మీకు పింక్ఆ,బ్లూఆ?

మొన్న శనివారం రోజు ఇంట్లో ఖాళీగా ఉన్నాను.ఖాళీగా ఉండి బోరుకొట్టడం కూడ బోరు కొట్టేసాక,అమ్ముకుట్టిని తీసుకొని షాపింగ్ మాల్ కి వెళ్ళాను.అక్కడ నాలాగే చాలామంది క్రెడిట్ కార్డులు పట్టుకుని ఎక్కడ ఏ స్వైపింగ్ మెషిన్ కనిపిస్తుందా,గీకేద్దాం అని కసిగా పరుగులు పెడుతుంటే ఆహా,సరైన చోటకే వచ్చాను అని అనుకున్నాను.ఈరోజు నా డబ్బులు ఎవరికివ్వాలా అని నా గుండుని గుండ్రంగా తిప్పిన పిదప Toysrus కనిపించింది.టాయ్స్ ఆర్ అజ్జో అజ్జో అంటున్నాడు ఏమాత్రం బొమ్మలున్నాయో అనుకుంటు లోపలికి వెళ్ళాను.బోలెడన్ని అరల్లో వరసగా బొమ్మలు.కనపడ్డాయి కదా అని ఓ కొనెయ్యడం కాదు.దానికి ఓ లెఖ్ఖ ఉంది.

ముందుగా మీ బుడత అమ్మాయా,అబ్బాయా!...ఓకె,అమ్మాయి.

వయస్సు 0-3నెలలు,3-6నెలలు,6-12నెలలు,12-24నెలలు,3-4సంవత్సరాలు...సరె,12-24నెలల సెక్షన్ కి వెళ్ళాను.

అవును,ఇంతకీ 0-3నెలల పిల్లలకి బొమ్మలతో ఆడుకునే టైం ఉంటుందా?uploading,downloading,బజ్జోడం వీటికే టైం సరిపోదు వాళ్ళకి.అంత పసిబిడ్డ ఏం బొమ్మలతో ఆడుకుంటుంది చెప్మా!

ఇన్ని సెక్షన్ల మధ్య మా కేటగిరి బొమ్మలు ఉన్నచోటికి రాగానే ఓవైపంతా గులాబి రంగు బొమ్మలు,గులాబి రంగు ప్యాకేజింగ్ కనపడగానే,ఓలమ్మో,మా KCR అన్నగాని ఈడ మీటింగ్ గాని పెట్టిండా ఏంది అని అన్ని దిక్కులు ఓపాలి సూసినాక ఎవ్వరు అవుపడలే!అసలు విషయం అప్పుడర్ధమయ్యింది.అమెరికాలో చిన్నప్పట్నుంచే పిల్లల బ్రెయిన్ ఎలా ట్యూనింగ్ చేస్తారో,అమ్మాయిలు అనగానే పింక్ కలర్,అబ్బాయిలు అనగానే బ్లూ కలర్.అసలు ఈ వెర్రి పిల్లలు పుట్టగానే హాస్పిటల్ నుండే మెదలవుతుంది.పుట్టినబిడ్డ ఆడపిల్ల అయితే పింక్ కలర్ బ్లాంకెట్,మగబిడ్డ అయితే బ్లూ కలర్ బ్లాంకెట్ లో చుట్టి తల్లి చేతుల్లో పెడతారు.ఫ్రీ కంట్రీ,ఫ్రీ కంట్రీ అంటారు కాని,నా మొహం అమ్మాయంటే ఇలానే ఉండాలి,ఇవే రంగులు వేసుకోవాలి అని వాడెవడో డిసైడ్ చెయ్యడమేంటో!అమ్ముకుట్టికి బట్టలు కొనడానికి వెళ్తే ఆ పింక్ కలర్ కి కళ్ళు బైర్లు కమ్మి,నీరసం వస్తుంది.చిన్నప్పుడు నేను ఎన్ని రంగురంగుల బట్టలు వేసుకునేదాన్ని!ఎరుపు,నలుపు,పసుపు,నీల,ఆకుపచ్చ...ఎన్ని రంగులో అవన్ని గుర్తొచ్చి అమ్ముకుట్టి మొహం చూడగానే జాలేస్తుంది.షాపింగ్ కి వెళ్ళేముందే పింక్ కాకుండా వేరే రంగు బట్టలు కొనాలి అని కంకణం కట్టుకొని,షాపంతా గాలిస్తే ఎక్కడో ఒక ఆకుపచ్చ షర్ట్, బ్రౌన్ ప్యాంట్,వాటిమీద కూడ ఎంతో కొంత పింక్ కలర్ పువ్వులో,ప్యాచ్ వర్క్ ఏదోటి ఉంటుంది.సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుంటు కొనుక్కోవడం తప్ప వేరే గత్యంతరం లేదు.ఇక బొమ్మల విషయానికొస్తే మరీ ఘోరంగా ఉంది పరిస్థితి.అమ్మాయిలకైతే డిస్ని ప్రిన్సెస్,జస్టిన్ బీబర్,హలోకిట్టి.అబ్బాయిలకైతే డిస్ని పిక్సార్ కార్స్,స్టార్ వార్స్,ట్రాన్స్ ఫార్మర్లు.ఇంక ఇంతే!

ఇవన్ని చూసినప్పుడు నా చిన్నప్పుడు నేను ఎలాంటి బొమ్మలతో ఆడుకున్నాను అని ఆలోచిస్తే,అసలు నేను ఎప్పుడు ప్రత్యేకంగా బొమ్మలతో,కేవలం బొమ్మలతోనే ఆడుకోలేదు.ఇంట్లో ఉండే మాములు వస్తువులతోనే ఎన్ని ఆటలు ఆడేవాళ్ళం! అట్టపెట్టెలతో గోడలు కట్టేసి,వాటిమీద దుప్పట్టి పరిచి చిన్న గుడారం కట్టి అందులో కూర్చొని చందమామ చదువుతూ,పులిహోర తినేవాళ్ళం.ఇప్పుడు పిల్లలు అలాంటి makeshift గుడారాలు కట్టకుండా camping tents రెడిమేడ్ దొరికేస్తున్నాయి.ఒక్కసారి assemble చేస్తే ఆ టెంట్ అలానే ఉంటుంది.అదే నేను కట్టిన గుడారానికి ఓసారి గోడలు నిలబెట్టాలి,ఓసారి పైనుండి వేసిన దుప్పటి సర్దాలి.ఎంత హడావిడి,ఎంత టాలెంట్ కావాలి.అయినా బొమ్మలు కొనడానికి వచ్చి ఇవన్ని ఆలోచిస్తున్నానేంటబ్బా అని,మళ్ళీ ఈలోకంలోకి వచ్చేస్తే, ఓవైపు educational బొమ్మలు అని కనిపించాయి.ప్రిన్సెస్ లు,బీబర్ ల కన్నా ఇవి కాస్త బెటర్ కదా అనుకుంటు ఆవైపు వెళ్ళాక దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయినంత పని అయ్యింది.ఓబొమ్మ మీద ఇలా రాసుంది"...improves child's hand-mind coordination,enables grip in readiness for writing in school ..." ఇంకా ఏదో హైటెక్ డిస్క్రిప్షన్ చాలా ఉంది కాని నేను ఇప్పుడు మర్చిపోయాను."అమ్ముకుట్టి,ఈబొమ్మ నీhand-mind coordination పెంచేస్తుందంట,కొనేద్దామా!" అని అడిగితే అమామా..అని తెగ చేతులు తిప్పేస్తు ఏదో చెప్పేసి బోసి నవ్వులు నవ్వింది.ఇంకా కొన్ని బొమ్మల మీద derived benefits అని బోలెడంత కథ రాసుంది.అసలు ఇవన్ని కాదు..బెనిఫిట్స్,ఫిక్సిడ్ డిపాజిట్లు ఈ సోదంతా కాకుండా కేవలం ఆడుకోడానికి మాత్రమే ఏమన్నా బొమ్మలున్నాయేమోనని వెతికాను.అబ్బే వాళ్ళేమయినా నాలా పిచ్చోళ్ళా,అలాంటి బొమ్మలు తయారు చెయ్యడానికి!చివరికి పాటలు పాడే చిన్న కుక్కపిల్ల బొమ్మకొని ఇంటికొచ్చి బ్యాటరీలు వేస్తుంటే,అమ్ముకుట్టి ఆబొమ్మని వదిలేసి ఆబొమ్మతో వచ్చిన ప్యాకేజింగ్ కవర్ తో ఆడుకుంది.అదన్నమాట derived benefits కథ! నాకు షాపులో ఉన్నప్పుడు అర్థమవ్వలేదు సుమీ!



9 comments:

Anonymous said...

finishing touch beautiful. :)

గిరీష్ said...

>>ఎంత హడావిడి,ఎంత టాలెంట్ కావాలి>>
:) నిజమే..
సూపరండీ..ఈ టైప్ పిల్లల పెంపకం ఇండియాలో సిటీస్‌లో కూడ స్టార్ట్ అయిందనే చెప్పాలి. అయినా మీ, మా చిన్నప్పటి రోజులే వేరులెండీ, ఇక నేటి తరాల వారికి అవి రావు.. :(

Unknown said...

simplyy superbbbbbbb!!!!

Thanks for your story :) telangana oo !!! Vijayanagarani choopinchaaru.. mee narration raaalaal laa gaa vundi :) (ade rocks !!! ani)

Mee blogs chadivakaa, naku kuncham Tenglish lo bloggadam vachindandiii

రాజ్ కుమార్ said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్... క్రాంతిగారూ మీరు మళ్ళీ రాయటం మొదలుపెట్టారా? బాగున్నారాండీ?
ఏదో అలోచిస్తూ మీ బ్లాగ్ ఓపెన్ చేశా.. కొత్తపోస్ట్స్ కనిపించాయ్.. మీ హమారా బజాజ్ పోస్ట్ తర్వాత చూసి చూసి ఇక మీరు రాయట్ం మానేశారని ఇటువైపు రావటం మానేసాను.వచ్చి సంవత్సరం పైనే అయ్యిందని ఇప్పుడే తెలిసిందండి.

పోస్ట్ బాగుందండీ ఎప్పటిలానే..

>>అమ్ముకుట్టి ఆబొమ్మని వదిలేసి ఆబొమ్మతో వచ్చిన ప్యాకేజింగ్ కవర్ తో ఆడుకుంది>> హహహ ;)

అన్నట్టు చెప్పడం మరిచా.. మీ బ్లాగ్ కి కొన్నేళ్ళూగా నేను అజ్నాత పంకాని. ;)

వేణూశ్రీకాంత్ said...

హహహ టపాబాగుందండీ..
మీపాప ముద్దుపేరు చాలా బాగుంది :) అమ్ముకుట్టికి ఆశీస్సులు :)
చిన్నపిల్లలు ఇలా అవీఇవీ అని తేడా లేకుండా భలే ఆడుకుంటారుకదండీ.. నాకు తెలిసిన చిన్నారి ఒకసారి షర్ట్ ప్యాకేంజింగ్ లో కాలర్ లో పెట్టే అట్టముక్కతో అరగంట సేపు ఆడడం చూస్తే ఎంతముచ్చటేసిందో :)

Haritha said...

మీరు బ్లాగింగ్ మళ్ళీ మొదలు పెట్టినందుకు చాలా సంతోషం. కేసీఆర్ జోకు అదుర్స్.

పల్లా కొండల రావు said...

సహజత్వం లో ఉండే సత్తా పిల్లలకు తెలిసినంతగా పెద్దలకు తెలియడం లేదని అమ్మకుట్టి భలే తెలిపిందండీ మనకు.

kalpana said...

ఛాలా భావుంధి ఎప్పటిలాగే.మీకు బాగా రాయటం అలవాటు అయిపోయింది క్రాంతి గారూ !! :-)

జ్యోతిర్మయి said...

మీరు షాప్ దాకే వదిలేశారు. మా చిట్టితల్లి పుట్టినరోజుకి వచ్చిన బహుమతులన్నీ పింకే...బర్బీలు, డ్రెస్సులు, మేకప్పులు..అమ్మడేమో వాటివైపన్నా చూడదు. అప్పట్నుంచీ పిల్లలకు జంతువుల బొమ్మలు, బ్లాక్స్ బహుమతులివ్వడం అలవాటు చేసుకున్నా..
మీ టపాకు పెద్దగా చప్పట్లు...