Wednesday, June 6, 2007

పదిరూపాయల నోటు

ఈ మధ్య నా ఫోటో ఆల్బమ్ చుస్తుంటే నా ఒకటవ తరగతి స్కూల్ ఫోటో కనిపించింది.అది చూడగానే ఆ ఫోటోతో ముడిపడి ఉన్న ఒక గమ్మతైన సంఘటన గుర్తొచ్చింది.అదే ఇక్కడ బ్లాగుతున్నాను,చదవండి మరి...

మా నాన్నగారు సింగరేణి బొగ్గు గనుల్లో ఇంజనీరుగా పనిచేస్తారు.నా చిన్నతనంలో మేము కరీంనగర్ జిల్లా,గోదావరిఖని ఇండస్ట్రియల్ ఏరియా,8వ ఇంక్లైన్ కాలనిలో ఉండేవాళ్ళం.ఇంట్లో చిన్నదాన్ని అవ్వటం వల్ల మా నాన్న నన్ను అతి గారాబం చేసేవారు.అప్పట్లో నేను "శాంతినికేతన్" బళ్ళో ఒకటవ తరగతి వెలగపెడుతున్నాను.అదే బళ్ళో మా అక్క ముడవ తరగతి చదువుతుండేది.మా ఏరియాలో వున్న పిల్లలందరికి కలిపి ఒక ఆటో ఏర్పాటు చేసారు స్కూల్ వాళ్ళు.నాకు ఆటోలో సీట్ పైన కూర్చోవాలని చాలా ఆశగా ఉండేది కాని,రాజేంద్ర ఉరఫ్ రాజుగాడు (వీడు నా క్లాసే కాని ఆటోలో వీడి వెధవ పెత్తనం ఏంటో నాకిప్పటికి అర్ధం కాదు.) ఏనాడు నన్ను ఆటోలో సీట్ పైన కూర్చోనిచ్చేవాడు కాదు.ఎప్పుడు సీట్ కి వెనకవైపు ఉన్న చెక్క మీద అవతలి వైపుకి తిరిగి కూర్చొని వెళ్ళేదాన్ని.ఇక బళ్ళో మనం చూపించే ప్రతిభ అంతా ఇంతా కాదు.ఒక్కరోజు కుడా నా స్కూల్ బ్యాగు,వాటర్ బాటిల్ నేను పట్టుకోలేదు.నా బ్యాగు,వాటర్ బాటిల్ కూడా మా అక్కే మోసుకొచ్చేది.నన్ను క్లాస్ లో కూర్చోబెట్టి,అంతకుముందు రోజు క్లాస్ లో నేను చేసిన వెధవ పనులు పరిష్కరించి తన క్లాస్ కి వెళ్ళిపోయేది.మా క్లాస్ లో నాది స్టాండర్డ్ ర్యాంక్.ఏ పరిక్ష పెట్టినాకాని నా ర్యాంకు నాకే ఉండేది.30వ ర్యాంకు.(మరి మా క్లాస్ లో ముప్పైయ్ మందే ఉండేవాళ్ళం) మా అక్కకేమో క్లాస్ లో ఎప్పుడూ మొదటి ర్యాంకు వచ్చేది.మా నాన్నతో ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టించుకునేటప్పుడు "నాన్నా! ఒకటి పెద్దదా,ముప్పైయి పెద్దదా? అంటే అక్క కన్నా నాకే మంచి ర్యాంకు వచ్చినట్టు కదా" అని అడిగేదాన్ని.నా తెలివికి మురిసిపోయి మా నాన్న సంతకం పెట్టేవాళ్ళు.మా అమ్మ ఏమో "మీరు అలాగే గారాబం చెయ్యండి, అది ఎందుకూ పనికి రాకుండా పోతుంది" అని మా నాన్న మీదా,నా మీదా కేకలేసేవారు.అప్పుడు నా ప్రతిభని గుర్తించని అమ్మ నాకు సూర్యకాంతం లాగా నాన్న శోభన్ బాబు లాగా కనిపించేవాళ్ళు.మా నాన్న మాత్రం నన్ను బాగా వెనకేసుకొచ్చేవారు.

ఒకరోజు మా టీచర్ గారు "రేపు మీ అందరిని ఫోటో దించుతారు,అందరు చక్కగా రెడీ అయ్యి రావాలి" అని చెప్పారు.అంతే తరవాత రోజు మా అమ్మని, ఆటోవాలా ని,రాజుగాడ్ని,మా అక్కని నేను పెట్టిన కంగారు అంతా ఇంతా కాదు.మా అమ్మతో స్కూల్ యూనిఫామ్ ఇస్త్రీ చేయించుకున్నాను.వేసిన జడలు నచ్చలేదని మళ్ళీ వేయించుకున్నాను.ఆ రోజు ఆటోవాలాతో,రాజుగాడితో పోట్లాడి మరీ ఆటోలో సీట్ మీద కూర్చున్నాను.స్కూల్ కి వెళ్ళాను,ప్రార్ధన అయిపోయింది.క్లాసులకి టీచర్లు వచ్చేసారు.ఎక్కడా ఫోటోల సందడే కనిపించలేదు.ఏంటో మనసంతా దిగాలుగా అయిపోయింది.ఈలోపు ఇంటర్వెల్ బెల్ కొట్టారు.క్లాస్ లో నుండి పరిగెత్తుకొచ్చి బయట చూస్తే ఫోటోగ్రాఫర్ కెమారాతో కనిపించాడు.మా బళ్ళో ఉన్న స్టేజికి ఉన్న మెట్ల దగ్గర బెంచీలు వేసి ఫోటోల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.మళ్ళీ నాలో ఉత్సాహం మొదలయ్యింది.మొదట L.K.G, U.K.G పిల్లల్ని ఫోటోలు తీసారు.తరువాత మా వంతు వచ్చింది.నేను గబగబా మా అక్క క్లాస్ దగ్గరికి వెళ్ళాను.తనని క్లాస్ లోనుండి బయటకి పిలిపించి "ఇప్పుడు మమ్మల్ని ఫోటో దించుతున్నారు,నేనెలా ఉన్నాను? ఫోటోలో బాగా వస్తానా అని అడిగాను?" నా యూనిఫాం,బెల్టు కాసేపు సర్ది పంపించింది.మా క్లాస్ పిల్లల్ని వరసగా బెంచీల మీద నిలబెట్టారు.మా మధ్యలో మా క్లాస్ టీచర్ అశ్వని టీచర్ కూర్చున్నారు.స్కూల్ అటెండర్ మా క్లాస్ ముందు ఉండే "1వ తరగతి" అనే చిన్న బోర్డు పట్టుకోని వచ్చి,"క్లాస్ లీడర్ ఎవరు?"అని అడిగాడు.గీతావాణి "నేనే లీడర్ ని"అని చెప్పింది.అతను ఆ బోర్డు గీతకి ఇచ్చి పట్టుకొమ్మన్నాడు.నాకెందుకో ఆ బోర్డు పట్టుకోని ఫోటో దిగాలనే దుర్బుద్ధి పుట్టింది.కాని గీత క్లాస్ లో ఫస్టు,పైపెచ్చు క్లాస్ లీడర్ కాబట్టి మనకి అంత సీన్ లేదనుకోని నోరుమూసుకున్నాను.తరువాత ఫోటో దించేసారు."ఫోటో ఎప్పుడు ఇస్తారు?" అని టీచర్ ని అడుగుదామని అనుకున్నాను.కాని ధైర్యం సరిపోక క్లాస్ కి వచ్చేసా.అది మొదలు ఫోటో ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఆలోచనలో తిండి కూడ సరిగ్గా తినలేదు.నిద్రలో కూడా ఫోటోని గురించిన కలవరింతలే.నా వాలకం చూసి అమ్మ చాలా కంగారు పడిపోయింది.తరువాత ఒక నాలుగైదు రోజులకి క్లాస్ లో మా టీచర్ "రేపు అందరు అయిదు రూపాయలు తీసుకోని రండి,ఫోటోలు ఇస్తారు" అని చెప్పారు.ఆ రోజు ఇంటికి వెళ్ళగానే అమ్మకి విషయం చెప్పాను.మా అక్క వాళ్ళ టీచర్ కూడ అయిదు రూపాయలు తీసుకొని రమ్మన్నారంట!(మరి వాళ్ళు కుడా ఫోటో దిగారు కదా!!) అమ్మ సరే రేపు ఉదయం బడికి వెళ్ళేటప్పుడు ఇస్తాను అని చెప్పింది.మరుసటి రోజు బడికి వెళ్ళేటప్పుడు అమ్మ మా అక్కకి పది రూపాయల నోటు ఇచ్చి"నీకు,చెల్లికి అని చెప్పి టీచర్ కి ఇచ్చి రెండు ఫోటోలు జాగ్రత్తగా పట్టుకొనిరా" అని చెప్పింది.నాకు విపరీతమయిన కోపం వచ్చింది అమ్మ మీద."నా ఫోటో నేనే తెస్తా,నా అయిదు రూపాయలు నాకే ఇవ్వు" అని ఏడవడం మొదలు పెట్టా."నా దగ్గర చిల్లర లేవురా,నీ ఫోటో కూడ అక్క తెస్తుందిలే"అని అమ్మ నన్ను సముదాయించాలని చూసింది."చిల్లర లేకపొతే ఆ పది రూపాయల్ని రెండు ముక్కలు చేసి నా అయిదు రూపాయలు నాకు ఇవ్వు" అని ఏడుపు అందుకున్నాను నేను.నా తెలివికి అమ్మ అవాక్కయ్యింది.నేను ఇచ్చిన షాక్ నుండి తేరుకోవడానికి అమ్మకి ఒక అయిదు నిమిషాలు పట్టింది.నా గోల భరించలేక అమ్మ పక్కింటి వాళ్ళదగ్గర చిల్లర తీసుకోని మా ఇద్దరికి చెరో అయిదు రూపాయలు ఇచ్చి పంపించింది.ఇప్పటికి నా ఒకటవ తరగతి ఫోటో చూస్తే ఆ రోజు నేను చేసిన హంగామా గుర్తొచ్చి నవ్వొస్తుంది.

20 comments:

spandana said...

ఈ బ్లాగు preschool కు వెళుతున్న మా చిట్టి ప్రణతిగానీ రాయలేదు కదా!

--ప్రసాద్
http://blog.charasala.com

రానారె said...

హహ్హ! మావాడొకడు చిన్నప్పుడు పావలా ఇస్తే తీసుకొనేవాడుకాదు. చిన్నపైసా వద్దనేవాడు. అక్కకు ఇచ్చినట్లు పెద్దపైసా కావాలనేవాడు. అక్కకు ఇచ్చిన పెద్దపైసా ఏమిటంటే పదిపైసల బిళ్ల!

కొత్త పాళీ said...

"అమ్మ నాకు సూర్యకాంతం లాగా నాన్న శోభన్ బాబు లాగా కనిపించేవాళ్ళు"

ఫెంటాష్టిక్కు!!

Naveen Garla said...

>>"చిల్లర లేకపొతే ఆ పది రూపాయల్ని రెండు ముక్కలు చేసి నా అయిదు రూపాయలు నాకు ఇవ్వు"

ఇది చదివి చాలా సేపు నవ్వుకున్నాను...:)

మురళీ కృష్ణ said...

"నాన్నా! ఒకటి పెద్దదా,ముప్పైయి పెద్దదా? అంటే అక్క కన్నా నాకే మంచి ర్యాంకు వచ్చినట్టు కదా"
"చిల్లర లేకపొతే ఆ పది రూపాయల్ని రెండు ముక్కలు చేసి నా అయిదు రూపాయలు నాకు ఇవ్వు"

చిన్నప్పుడు ఇలాంటివెన్నో సంఘటనలు. గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. మంచి నెరేషన్. కంటిన్యూ చెయ్యండి.

kalpana said...

Hey sis..fantastic narration.Good you've improved alot.

Chinnappudu em pikostavo anukunedanni.Ippudu Software Engineer avvadame kakunda kottaga Blogger avataram etti baga navvistunnaduku ninnu chusi garva padutunnanu.

God bless u.
itlu
ni inko sagam 5 rupayala notu (akka)

Unknown said...

మీ బ్లాగు బాగుంది. నేరేషన్ కూడా...
చిన్నప్పటి సంగతులు అందరికీ మధురాలే. గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.

రాధిక said...

"వీడు నా క్లాసే కాని ఆటోలో వీడి వెధవ పెత్తనం ఏంటో నాకిప్పటికి అర్ధం కాదు"
"అమ్మ నాకు సూర్యకాంతం లాగా నాన్న శోభన్ బాబు లాగా కనిపించేవాళ్ళు"
చాలా నవ్వుకున్నాను.చక్కని శైలి,గిలి గింతలు పెట్టే హాస్యం...బాగుంది.

lalithag said...

sannivESaalu baagunnaayi. cheppina tIru chaalaa baavumdi. chaalaa chakkagaa raasaaru.

Anonymous said...

బావుందండోయ్. చక్కగా చెప్పారు. చిన్నప్పటి సంగతులు సరదాగా రాశారు. మరిన్ని మీ కీబోర్డు నుండి జాలువారాలి.

-- విహారి
http://vihaari.blogspot.com

సిరిసిరిమువ్వ said...

మీ బ్లాగు చాలా బాగుంది. keep it up. ముఖ్యంగా "చిల్లర లేకపోతే ఆ పది రూపాయల్ని రెండు ముక్కలు చేసి నా అయిదు రూపాయలు నాకు ఇవ్వు", ఈ వ్యాక్యం ఎంత సేపు నవ్వించిందో. అక్కడక్కడ చిన్నప్పటి మా పాపని గుర్తు చేసారు.

సిరిసిరిమువ్వ said...

అన్నట్లు మీ నాన్న గారి పేరు చెప్పగలరా? ప్రస్తుతం ఎక్కడ వుంటున్నారు? మేము కూడా 12 సంవత్సరాలు సింగరేణిలో ఉన్నాము.

daya said...

reaaly nice andi after three months it made me to laugh from inside

Think about it said...

good narration. Bhnim, vamsi, mullapudi venkata ramana Kathalu gurtukostunnayi.... bagundi....

narration konchem editing chesi vunte... chala chala bagundedi....

క్రాంతి said...

బ్లాగు ప్రపంచంలోని పెద్ద తలకాయలందరు(Big shots అనేదానికి true translation అన్నమాట) నా బ్లాగులో కామెంట్లు రాయడం నాకెంతో సంతోషానిచ్చింది.మీ అందరి ప్రోత్సాహంతో ఇంకా చక్కని బ్లాగులు రాస్తానని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.

oremuna said...

బాగుందండీ

Naga said...

మీ జ్ఞాపకశక్తికి జోహార్లు. అలాగే నా ర్యాంకు వాళ్ళు ఇలా ఎదిగిపోతుంటే చూడటానికి సంతోషంగా ఉంది! చాలా బాగుంది.

Moyin said...

హహ్ .హహ్.. పది రూపాయల్ని చించితే రెండు ఐయిదులు అవుతాయని మీకు 1 క్లాసు లోనే తెలిసిందంటే. బహుసా మీరు ప్రస్తుతం శ్యెంటిస్తా.

e-MAN said...

Enta sweet memory aina sweet ga narrate chestene manasuki hattukuntundi....

GUNDELU PINDESAVU KRANTHI....

NAAKEEMADHYA TELUGU LO RAASE VAALLANU CHOOSTUNTE CHALA HAACHCHARYANGA NU AANANDANGA NU UNTONDI....

DONT STOP THIS REVOLUTION...

TELUGU BLOGGERLA VIPLAVAM VARDHILLALI...

Haritha said...

అబ్బ! మీకన్నీ భలే గుర్తున్నాయండీ. CSE తీసుకున్నాక నాకు నా పదో తరగతే సరింగా గుర్తులేదు.