Tuesday, June 10, 2008

వర్షం...మొదలయ్యింది

నిన్న నేను ఆఫీస్ నుండి ఇంటికెళ్ళేసరికి మా వీధీలో పిల్లల్లందరు క్రికెట్ ఆడుతున్నారు.ఇప్పుడా ఇంకాసేపటికా అన్నట్టు వర్షం పడటానికి ఆకాశమంతా మేఘాలతో సిద్ధంగా ఉంది.జూన్ నెలతో వచ్చే కళే వేరు.అసలు జూన్ అంటేనే వర్షాలు,జూన్ అంటేనే స్కూల్,జూన్ అంటేనే కొత్త పుస్తకాలు,దాదాపు రెండు నెలల వేసవి సెలవుల తరువాత కలుసుకోబోయే స్నేహితులు,ఇంకా ఎన్నో!

చిన్నప్పుడు నాకు వర్షం ఎలా,ఎందుకు పడుతుందో అస్సలు అర్ధమయ్యేది కాదు.మా అమ్మని అడిగితే,"ఎండ తగ్గడానికి వినాయకుడు తొండంతో నీళ్ళు చల్లుతున్నాడు" అని చెప్పేది.తరువాత ఎప్పుడో ఏదో తరగతి సామాన్య శాస్త్రంలో వర్షం ఎలా పడుతుందో తెలుసుకొని బోలెడంత హాశ్చర్యపోయాననుకోండి.అది వేరే విషయం.అదిరిపొయే మా రామగుండం ఎండల్లో తొలిసారి వర్షం పడగానే ఒక్కసారిగా మా కాలని రూపురేఖలు మారిపోయేవి.వర్షంలో తడుస్తూ నేల బండ ఆడుకునేవాళ్ళం.దొరికిన కాగితానల్లా పడవలు చేసి వాటి పైన పేర్లు రాసుకొని వర్షపు నీళ్ళల్లో వదిలేవాళ్ళం.ఇంకా అప్పటిదాక లేని హాబి "గార్డెనింగ్" వర్షం పడగానే పుట్టుకొచ్చేది.ఫ్రెండ్స్ ఇంటికెళ్ళి గులాబి,మందారం కొమ్మలు తెచ్చి మా పెరట్లో నాటి రోజు పొద్దున్నే నిద్రకళ్ళతో వెళ్ళి వాటిని చూసుకోవడం,దాదాపు మా కాలనీలో అందరి ఇళ్ళలో ఇదే జరిగేది.

కాని వర్షాకాలంలో నాకు ఒకటే నచ్చేది కాదు.అదేంటంటే,నాకు మా అక్కకి కలిపి ఒకటే గొడుగు ఉండేది.వర్షంలో స్కూల్ కి వెళ్ళేటప్పుడు గొడుగులో వెళ్ళినంతసేపు దానిదే పెత్తనం.ఒక్కసారి కూడ నన్ను గొడుగు పట్టుకోనిచ్చెది కాదు.పోని స్కూల్ కి వెళ్ళాకయినా గొడుగు నాతో క్లాస్ కి తీసుకెళ్తానంటే ఇచ్చేది కాదు."నువ్వు పడేస్తావు,నేను జాగ్రత్తగా దాచిపెడతా" అని ఎప్పుడు తనతోనే తీసుకెళ్ళేది.ఇంతవరకు దాదాపు ఎప్పుడు నేను గొడుగులో ఒక్కదాన్ని వెళ్ళలేదు.ఎప్పుడు నా గొడుగులో వేరే వాళ్ళని తీసుకెళ్ళడమో,లేకపొతే నేనే వేరే వాళ్ళ గొడుగులో వెళ్ళడమో జరుగుతుంటుంది.

ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు మాత్రం వర్షం పడితే,అది కూడ మంగళవారం వర్షం పడితే నేను literally ఎగిరి గంతేసేదాన్ని(ప్రతి మంగళవారం మాకు లాబ్ వర్క్ ఉండేది).ఎందుకంటే వర్షం పడితే మా ఎలక్ట్రికల్ మెషిన్స్ లాబ్ లోకి నీళ్ళు వచ్చేసేవి.అప్పుడు మెషిన్స్ అన్ని shutdown చేసేవాళ్ళు.సో ఆరోజు లాబ్ కి వెళ్ళనవసరం లేదు.ఒక మూడు గంటలు క్యాంటీన్లో పడి దొరికింది దొరికినట్టు తినేసేవాళ్ళం. ఒకరి మీద ఒకరు జోకులేసుకుంటూ సరదగా గడిచిపోయేది.

రెండు సంవత్సరాల క్రితం నేను వైజాగ్ లో ఉన్నప్పుడయితే దాదాపు నెల రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది.ఇల్లు,బట్టలు అన్ని తడిచిపోయేవి.transportation చాల ఇబ్బంది అయ్యింది.వర్షాలకి కూరగాయలన్ని పాడయిపోయి ధరలు ఎంత పెరిగిపోయాయంటే,ఒక చిన్న సొరకాయ అరవయి రూపాయలు పెట్టి కొన్న రోజులు కూడ ఉన్నాయి.ఇంకా ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే,వైజాగ్ లో వర్షం పడితే అదొక రకమయిన వాసనొస్తుంది.భరించలేము.కాని వర్షం పడుతున్నప్పుడు R.K బీచ్ లో ఆడుకోవడం మాత్రం బాగుంటుంది.బెంగళూరుకి వచ్చాక నాకు వర్షానికి కొత్త అర్ధం తెలిసింది.సాయంత్రం సరిగ్గా ఆఫీస్ నుండి బయటకి రాగానే,అప్పటిదాక మనకోసమే ఎదురుచూస్తున్న వర్షం మెల్లగా మొదలవుతుంది.దడ దడ ఒక పది నిమిషాలు పడి తగ్గిపోతుందా అంటే,అలా తగ్గదు.డ్రెస్స్ మీద బురద పడి వేసుకున్న డ్రెస్స్ అత్యంత వికారంగా తయారయ్యాక,ఇంక మనం ఇంటికి చేరుకున్నామని వర్షానికి confirm అయ్యాక అప్పుడు తగ్గుతుంది.మళ్ళీ రోజు పది పదిహేను నిమిషాల తేడాతో ఆఫీస్ అయిపోయే టైమ్ కే వర్షం పడుతుంది.అబ్బ! ఒకటే నస ఈ బెంగళూరు వర్షాలతో.

14 comments:

Ramani Rao said...

కరెక్ట్ గా ఉదయం ఆఫీస్ కి వెళ్ళేముందు, దేవుడికి దండం పెట్టుకొనేప్పుడు, పనిలో పనిగా ఆ వానదేవుడికి కూడా ఓ నమస్కారం పెట్టేసి, "ఏయ్! వర్షం, నువ్వు ఇక్కడ కురవకుండా ఇంకెక్కడో కురుస్తావెందుకు?" అని నిలదీసి అడగండి. ఎందుకంటే నేను ఇక్కడ ఆఫీసులో ఉన్నప్పుడే వర్షం పడ్తుంది, తడుద్దామని బయటికి వెళ్తే ఆగిపోతుంది. హు! ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వానా.. ఎన్నాళ్ళని దాక్కుంటావు పైన అని అడిగేలోపులో ఆగిపోతుంది, ఇంకా చుట్టాలే నయం, కాస్త మనం అలసి(తడిసి)పోయేదాక ఉంటారు. ఎంతో ప్రేమగా.

Kathi Mahesh Kumar said...

బాగుంది మీ వాన కత. తొలకరి వర్షాలహాయి చిన్నప్పుడనుభవించినట్టుగా ఇప్పుడు చెయ్యగలమా!
బెంగుళూరు వానలూ, మా మైసూరు(నేను కాలేజి అక్కడే చేసాను లెండి) వానల్లాగే అన్నమాట. రోజంతా బాగుండి, సాయంత్రానికి మేమునాయ్ అంటాయి. అందులోనూ ఒక ఆనందముంది.

రాధిక said...

ఈ అక్కలెప్పుడూ ఇంతే.ముందు పుట్టి మనచేతికి ఏదీ రానీయరు గొడుగుతో సహా :)
జూన్ నెలతో పాటూ మీరు చెప్పినవాటితో పాటూ నా పుట్టిన రోజు కూడా వస్తుంది.కానీ వర్షం కారణం గా ఆ రోజు స్కూలుకి మాత్రం ఎవరూ వచ్చేవారు కాదు.కాలేజీలు జూన్ లో తెరిచినా అందరూ వచ్చేది జూలైలోనే.అందుకు ఎప్పుడూ అనుకుంటూ వుండేదానిని ఇంకెప్పుడూ వానాకాలం లో పుట్టకూడదని.

చైతన్య.ఎస్ said...

నేను బెంగళూరు వర్షం బాదితుడనే! ఏం చేస్తాం! మనం అక్కడ(ఆం.ప్ర) లో వర్షాలు ఎప్పుడు పడుతాయ అని చుస్తాం, ఇక్కడ వర్షాలు ఎప్పుడు పడకుండా వుంటయ అని ఎదురుచుస్తాం ! కాని రెండు చోట్లా విజయం మాత్రం వర్షానిదే ! అక్కడ పడక సాదిస్తుంది! ఇక్కడ పడి సాదిస్తుంది!

oremuna said...

రాధిక,
మీరూ జెమినీయేనా! జెమినీ వాళ్లు కవితలు భాగా వ్రాస్తారంటే ఏమిటో అనుకున్నాను :)

క్రాంతి,

చక్కగా హై ధరా బాదు కి రావచ్చు కదా! ఎట్లీస్ట్ బజ్జీలో, మైసూర్ బోండాలో తిని ఇంటికి వెళ్ల వచ్చు (ఇంట్లో తెలీకుండా మూతి గాట్టిగా తుడుచుకొని :) )

ఈ ఎండలకి కళ్లు కాయలు కాచేలా వర్షాల కోసం ఎదురు చూశాం! కానీ తొలి జల్లుకే మా దేవి ఎండా కాలమే నయం అని గాలి తీసేసింది :) :)

Shankar Reddy said...

మీరు ఇ౦క ఒకటి మర్చిపోయారు...

బెంగుళూరు లొ శనివారము ...ఆదివారము ఆఇతె రోజ౦తా వాన పడుతు౦ది....

http://ssreddyr.wordpress.com/

గీతాచార్య said...

వర్షం గురించి చాలా సంగతులు చెప్పొచ్చు. కానీ మనకి రాయాలంటే బద్ధకం. చక్కగా జూన్ జులై నెలలో ఒక స్పెషల్ ఉంది. బయట వాన పడుతుంటే టీవీలో వింబుల్డన్లో సంప్రాస్ మ్యాచ్ చూస్తూ , కాఫీ తాగుతుంటే ఆ మజానే వేరు. ఇప్పుడు రిటైర్ అయ్యాడు కానీ నా చిన్నప్పుడు అదో ఆనందం నాకు. పడవలు, స్కూల్ లో ఎవడిమీదయినా కోపం వస్తె వాడిని బురదలోకి తోయ్యటం ఆహా హా................. వాన వస్తె చక్కగా పంటలు పండుతాయి. పెద్ద వానయితే బడి కి సెలవ వస్తుంది. So, rain rain come with me.

తెలుగు బ్లాగర్లకి: నా బ్లాగుని జల్లెడ లో పెట్టటానికి ఏమి చెయ్యాలో దయచేసి చెప్పండి.

rksistu said...

Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.

Aditya said...

థాంక్స్ :) ఇంకో ఒకటి రెండు ఇళయరాజా వీడియోలు ఉన్నాయి. అవి కూడా పెడతాను!

వేణూశ్రీకాంత్ said...

క్రాంతి గారు మీ టపాలన్నీ ఒక్కోటి ఇప్పుడే చదివా, చాల బావున్నాయి.

సుజ్జి said...

hi kranthi
im very glad to find this blog.
neenu chala rojula tarawatha, baaga nuvvukunna.
mee kathalu , kaburlu baagunni

sujji

babu said...

kranti garu
do you mind if we print some of your articles in our telugu magazine? please visit http://beyondindia-telugu.blogspot.com
my email address is beyondindia.telugu@gmail.com
thanks
babu

Sankeerthana said...

Hi Kranthi Garu,
Iam very new to this telugu blogs.
Anyway mi posts anni chadavatam jarigindi.Chala bagunnayi.
Manasu ki entho pleasant ga anipinchindi

Unknown said...

kraanti gaaru.. from past threedays i'm trying to connect the way of your spoken telugu.. okasari Godavari ani pistundi, inkosari krishna, blogs yemo ramagundam.. ade mana telanganaa:(

through some light on which is ur native telugu language... I'm surprised to see the words & phrases, which are very most common in odavari & rishna and very unusual in Telangana / Godavari khani..

I'm expert in critics :) thast why i'm asking never mind anything elsee....