Thursday, June 23, 2011

Espresso 2.0

ఏంటి ఈ మధ్య మరీ నల్లపూసవయిపోయావు అని అడుగుతున్నారు అందరు నన్ను! అబ్బే,పెద్దగా ఏమి నల్లపడలేదండి,మాములుగానే ఉన్నాను.నల్లపూస అంటే నల్లపడటం,తెల్లపడటం కాదని,సోదిలోకి లేకుండా మాయం అవ్వడం అని అర్ధమవ్వటానికి కాస్త టైం పట్టింది.ఏమి చేస్తున్నారు ప్రస్తుతం అని అడగగానే, అదేదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్టుగా 'కలంస్నేహం' అని చెప్పాలనిపిస్తుంది కాని,మరీ వెకిలిగా ఉంటుందేమో అని ఊరుకుంటాను.ఎలాగు వెకిలి సమాధానాల గురించి సందర్భం వచ్చింది కాబట్టి నేను విన్న అత్యంత వెకిలి సమాధానం ఒకటి చెప్తా వినండి.ఆ మధ్య మా టీం లో స్మిత అని కొత్తగా ఒకావిడ జాయిన్ అయ్యింది.ఇంకేం,మధ్యాహ్నం భోజనాల దగ్గర అమ్మలక్కల కబుర్ల మధ్యలో మీవారు ఏమి చేస్తుంటారు అని అడిగా..'నన్ను ప్రేమిస్తుంటారు ' అని చెప్పింది.ఓ!! అయితే మీది ఆదర్శవివాహమన్నమాట! అని అన్నాను.అబ్బే అదేమి కాదు,మావారు బెంగాలీ అందుకే!! అని సిగ్గుపడింది. నిజం చెప్పొద్దూ, ఆ తరవాత ఆమెతో ఏమి మాట్లాడాలో అర్ధం కాక నా వంట నేనే కళ్ళనీళ్ళు పెట్టుకుంటు తిన్నాను.అదేంటో పెద్దయ్యాక వయసుతో పాటు వెటకారం,వెకిలితనం పెరుగుతాయేమో! అదే చిన్నప్పుడయితే 'పెద్దయ్యాక ఏమి చేస్తావు?' అని ఎవరన్నా అడిగితే ఎన్ని సమాధానాలు చెప్పేవాళ్ళం! చిన్నప్పుడొకసారి నేను కవయిత్రినయిపోవాలనుకున్నాను.అనుకోవడమేంటి,అయిపోయాను కూడా!మా నాన్న దగ్గరికెళ్ళి,"నాన్నోయ్,నేనో కవిత రాసాను" అని చెప్పా.వెంటనే మానాన్న మా కాలని వాళ్ళందరిని పిలిపించి సత్యనారాయణస్వామి వ్రతం చేయించి భోజనాలు పెట్టించి నాకు సన్మానం ఏర్పాటు చేసారు.సన్మానం అయ్యాక,ఓ పెద్దాయన,"చిట్టితల్లి! నీ కవిత ఒకటి వినాలని ఉంది" అని అన్నాడు.అందరు మొహాలన్ని ఒకింత ఆందోళనగా పెట్టినా కాని లెఖ్ఖ చెయ్యకుండా నా కవిత వినిపించాను.

ఓ దానవుడైన మానవుడా!
హృదయం లేని కిరాతకుడా!
నువు చేసిన పాపం పండాలంటే
ఆయువు చాలదురా! నీ ఆయువు చాలదురా
!

ఇంకా వినిపించబోతుంటే మానాన్న అడ్డుతగిలి "తల్లి! మిగతాది నాకు వినిపిద్దువులే,ఇప్పటికి ఇది చాల్లే!" అని మధ్యలో ఆపేసారు.ఆదేంటి,వాళ్ళందరికి రసస్పందన కలిగి పులి డాన్స్ లు చేస్తుంటే నాలోని కవితాసముద్రానికి ఆనకట్ట వేయాలనుకోవడం ఏమిటో!మరే! కొన్నాళ్ళకి ఆ కవితని సినిమావాళ్ళెవరో వాడుకున్నారు.ఆ తరవాత నాకవిత్వం పట్ల జనాల పెల్లుబికిన ఉత్సాహం భరించలేక సుప్తావస్థలోకి వెళ్ళిపోయాను.ఈలోపు పెద్దపరిక్షలు రానే వచ్చాయి. జీవితంలో కష్టాలెలాగో,పెద్ద పరిక్షలలాగన్నమాట.వద్దన్నా వస్తాయి.వాటికి భయపడి పారిపోయామా ఇక అంతే.పోరాటంలో ఉంది జయం అని రజినికాంత్ చెప్పినట్టు మనం పోరాడాలి,మన పేపర్లు దిద్దడానికి టీచర్లు పోరాడాలి.లేదా ఇంకో ప్లాన్ ఉంది.పరిక్ష పేపర్ లో కింది విధంగా ఉదాహరించినట్టు ఏదేను ఒకటి గుండెలు పిండేసే కారణం రాయాలి.

* పరిక్ష తప్పితే నాన్నగారు అమ్మమ్మ వాళ్ళింటికి పంపించనన్నారు,కావున నాయందు దయుంచి పరిక్ష పాస్ చేయించగలరని ప్రార్ఢన.

* నేను కూడ మీలాగే బాలకృష్ణ అభిమానిని.ఇక నన్ను పరిక్ష పాస్ చెయ్యకపోతే బాలయ్య మీదొట్టు!!

* నన్ను పరిక్ష పాస్ చేయించినచో మాదొడ్లో పూసిన మల్లెపూలు,కాచిన మామిడికాయలు మీ ఇంట్లో కనుగొనవచ్చు.

* పరిక్ష పాస్ చేయించినచో నా దగ్గరున్న 37 రూపాయలు మీకు ఇవ్వబడును.అన్నట్టు మీ పెద్దబ్బాయి మొన్న సిగరెట్ తాగుతుంటే చూసాను.

* పరిక్ష తప్పినచో నాన్నగారు నన్ను 'చోటా హనుమాన్ ' చూడనివ్వరు.కావున నన్ను పరిక్ష పాస్ చేయించినచో ఆ పవనపుత్రుడి ఆశీస్సులు ఎల్లప్పుడు మీ కుటుంబం యందుండును.

ఇంత చెప్పాక కూడ మీ పరిక్ష రిజల్ట్ లో తేడా వచ్చిందంటే పైన రాసిన నా కవితని మీరు వాడుకోవచ్చు.

సరే పెద్ద పరిక్షలయిపోయిన తెల్లారే మేము అమ్మమ్మ వాళ్ళింట్లో ప్రత్యక్షమయ్యాము.ఇక సందడే సందడి.మా అమ్మ,పిన్నివాళ్ళు అందరు చుక్కల ముగ్గులు,మెలికల ముగ్గులు నేర్చుకోవడంలో బిజీ.పిల్లలందరు రాత్రవ్వగానే మిద్దెమీదెక్కి దెయ్యాల కథలు చెప్పుకోవడంలో బిజీ.పిల్లలందరిలో నేను,మా పిన్ని కొడుకు సూరిగాడే చిన్న(సూరిగాడు నేను పుట్టిన గంటకి పుట్టాడు).మా ఇద్దరి చిన్నపిల్లల గ్యాంగ్ కి నేను గ్యాంగ్ లీడర్ ని.ఇక మాఇద్దరిని ఎందులోనూ వేలు పెట్టనిచ్చేవాళ్ళు కాదు.ఓరోజు ఆవకాయ పెడుతున్నారు.మామిడికాయలు బస్తాలో తెచ్చారు.బస్తా దగ్గరికి వెళ్ళగానే మా బుజ్జిపిన్ని గుండు మీద ఒక్కట్టిచ్చింది.అవి పచ్చడికాయలు ముట్టుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చింది.పచ్చడి పెట్టినంతసేపు మమ్మల్ని దగ్గరికే రానివ్వలేదు.చాలా కోపం వచ్చింది నాకు,సూరిగాడికి.సాయంత్రం వీధి అరుగు మీద కూర్చొని తీరిగ్గా బాధపడుతుంటే బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది నాకు."ఒరేయ్ సూరిగా,సాయంత్రం అందరు అన్నాలు తినేటప్పుడు మనం మెల్లిగా వెళ్ళి పచ్చడి జాడిలో కుంకుడు రసం పోద్దాం రా!" అని అన్నానో లేదో మా భద్రకాళి నా వీపు విమానం మోత మోగిచ్చింది.భద్రకాళి అంటే మా అమ్మ అన్నమాట.పనిలో పనిగా మధ్యాహ్నం అప్పజెప్పాల్సిన పదమూడో ఎక్కం ఇంకా అప్పచెప్పలేదని ఇంకో నాలుగు తగిలించింది.సూరిగాడు ఈ విషయంలో చాలా అదృష్టవంతుడు.వాడికి ఎక్కాలన్నా,లెక్కలన్నా ఇష్టం.దెబ్బలు తింటే తిన్నాను కాని,ఆ దెబ్బల మోతలో నాకో ఐడియా వచ్చింది.నా జీవితానికి అర్ధం,పరమార్ధం ఆ క్షణంలోనే భోధపడింది నాకు.అదే,పిల్లలకి మాత్రమే అర్ధమయ్యేట్టు ఒక భాష ఉండాలి.పిల్లలు ఏదైనా అతి ముఖ్యమైన విషయం మాట్లాడుకునేటప్పుడు పెద్దవాళ్ళు ముందే వినేసి రావుగోపాల్రావు లాగా ఒకటే అడ్డుపడిపోతుంటారు.అందుకే జావా లాగ ఎవరికి అర్ధంకాని భాష ఒకటి మనం కుడా తయారు చెయ్యాల్రా సూరిగా అని చెప్పాను నేను.ఇంక brain stroming మొదలు.

సూరిగాడు : మన భాష పేరేంటి?

నేను : మన భాష కాదు,నేను కనిపెడుతున్నాను కాబట్టి నా భాష. జావా నుండి inspire అయ్యాము కాబట్టి espresso అని పెడదాం.

సూరిగాడు : మరి పిల్లలు పెద్దగయిపోయాక వాళ్ళకి ఈ భాష మొత్తం వచ్చేస్తుంది కదా?

నేను : జావా లాగే మనమూ ప్రతి సంవత్సరం ఒక కొత్త వెర్షన్ తయారు చేద్ధాం.అమీర్ పేటలో కోచింగ్ సెంటర్లు పెడదాం.ఇక మనకి ఎన్ని డబ్బులంటే,జీవితం మొత్తం బెంగుళూరు ఆటోల్లో మీటర్ కి భయపడకుండా తిరగొచ్చు.

సరే,తరవాత రెండు రోజుల్లో Espresso 1.0 విడుదల చేసాము.పదే పదే espresso లో మాట్లాడి అందరిని భలే ఏడిపించాం.మా అమ్మమ్మ మాత్రం మా ఇద్దరికి దిష్టి తగిలిందని,అందుకే గంభోర వచ్చిన కోడిపిల్లల్లా పిచ్చి కూతలు కూస్తున్నామని తాయత్తులు తెచ్చి మెళ్ళో కట్టింది.మొత్తానికి ఆ ఎండాకాలం మొత్తం espresso బాగానే వంట పట్టించుకున్నాం.కాని ఏంటో మళ్ళీ జూన్ వచ్చేసి ఒక్క వర్షం పడగానే espresso అంతా కరిగిపోయింది.ఇప్పుడిప్పుడే మళ్ళీ Espresso 2.0 తయారుచెయ్యడానికి కొత్త టీం కోసం వెతుకుతున్నానన్నమాట.

20 comments:

తులసిరామ్ said...

after a long long time.
nice post. u have some talent u should utilize that.
can u please remove word verification?

Think about it said...
This comment has been removed by the author.
Think about it said...

Kathi.... keka..... kranthi

గిరీష్ said...

సూపర్ టపా.. :) ఎస్‌ప్రెస్సో.. :)
Welcome back క్రాంతి గారు..please keep blogging regularly.

Praveen Kumar B said...

Superb post... i got time to remember my childhood with this posst.

వేణూశ్రీకాంత్ said...

పునరాహ్వానం క్రాంతి గారు :-) ఇంకా మీ టపా చదవలేదు.. అసలు మీ బ్లాగ్ లో కొత్తటపా చూడగానే ఎంత ఆనందంగా ఉందో చెప్పేయాలని కామెంట్ రాసేస్తున్నా..

karthik said...

welcome back kranthi garu,
as usual super post in your own style.. :D

thanks for coming back

జ్యోతి said...

వెల్కమ్ బ్యాక్ క్రాంతి.. రెగ్యులర్ గా రాయాలి మరి..

Anonymous said...

ఋతుపవనాలు వెనక్కి వెళ్ళిపోయాయి అని పేపర్లో తప్పు వార్తలు రాస్తున్నారు. బ్లాగుల్లో తొలకరి జల్లు కురుస్తుంటేనూ .......భలే వుంది క్రాంతి

మనసు పలికే said...

హహ్హహ్హా.. క్రాంతి గారు, సూపర్ టపా నిజంగా.. మీ పంచులు వద్దన్నా గుర్తొచ్చి నవ్విస్తున్నాయి:) చాలా బాగా రాసారండీ:)

ఆ.సౌమ్య said...

హహహ్హ ఆవకాయలో కుంకుడు రాసం కాన్సెప్టు..సూపరు.

పరీక్షా పత్రం పై రాసిన నోటులు ఇంకా అదుర్స్.

welcome back :)

వేణూశ్రీకాంత్ said...

ఎప్పటిలానే హాయిగా బాగుందండీ మీ టపా.. నాసాయమేమైనా కావాలంటే చెప్పండి మీ espresso టీంకి :-)

kalpana said...

I laughed like mad in office, so I closed it after reading half of it.You made me to look funny and weird on my first day in the new project.But you saved me from reading the boring KT docs for some time.As always you rock again!

శరత్ కాలమ్ said...

:))

నా చిన్నప్పుడు మా అమ్మకి అర్ధం కాకుండా నాన్న గారూ, వారి యొక్క క్లోజ్ ఫ్రెండూ ఉర్దూలో మాట్లాడుకున్న రోజులు గుర్తుకు తెచ్చారు. వాళ్ళ మాటలు అర్ధం కాక కోపంతో మా అమ్మ వంటిట్లోని వస్తువులు కిందపడేస్తుండేది.

రాజ్ కుమార్ said...

welcome back క్రాంతిగారూ..
చాలా కాలం తర్వాత మీ బ్లాగ్ లో పోస్ట్ కదా చాలా సంతోషమేసిందండీ..
పోస్ట్ ఎప్పటిలాగానే మీ పోస్ట్ మీ స్టైల్ పంచ్ లతో అదిరిపోయిందీ.. మీ నెక్స్ట్ పోస్ట్ కోసం ఎదురుచూస్తున్నా.
(అన్నట్టూ మీ బ్లాగ్ కి నేను అజ్ఞాత అభిమానినండీ ;))

కొత్తావకాయ said...

ఇదే మొదటి సారి మీ బ్లాగ్ చూడడం. పంచ్ లు అద్దిరిపోయాయ్. సూపర్. :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

చాలా బాగా వ్రాసారండి టపా.తరచుగా వ్రాస్తూండండి.

మీ బ్లాగు కి నేను రావడం ఇదే మొదటి సారి. మీ బ్లాగును పరిచయం చేసిన వేణూ శ్రీకాంత్ గార్కి థాంక్స్.

వేణూశ్రీకాంత్ said...

వేణూశ్రీకాంత్ పరిచయం ఏంటా అనుకుంటున్నారా...
మీ కొత్త టపా చూసిన ఆనందంలో మీ అనుమతి లేకుండానే మీ టపా గురించి నా బజ్ లో రాసానండీ.. ఇదీ లింక్.. https://profiles.google.com/venusrikanth/posts/LJpLH47keoC

క్రాంతి said...

@ తులసి రాం గారు

థాంక్స్ అండి.అవును దాదాపు సంవత్సరం తరవాత రాసాను.టపా నచ్చినందుకు సంతోషం.

@Think about it:

:) Thank u ji.

@గిరీష్ గారు:
frequent గా రాయటాని ప్రయత్నిస్తాను.
Thanks for the comment.

@Praveen Kumar B:
I am happy that i reminded you of your childhood,and thanks for the comment.

@వేణూ శ్రీకాంత్ గారు:
థాంక్స్ అండీ, ఇప్పుడే మీరు ఇచ్చిన బజ్ లింక్ చూసాను :)
నేను కూడ ఇప్పుడే త్రివిక్రం గారిది,తోటరాముడి గారి బ్లాగులు చూసొచ్చా.

@Karthik:
Thank you ji,glad that you liked my post.

@జ్యోతి గారు:
థాంక్స్ అండీ

@లలిత గారు:
థాంక్స్ అండీ,మీ కామెంట్ చదివాక నేను చాలాసేపు గాల్లో తేలిపోయాను.

క్రాంతి said...

@ మనసు పలికే:
థాంక్స్ అండి.

@ఆ.సౌమ్య గారు:
పరీక్ష పేపర్ లో రాసే నోట్స్ గురించి రాయాలంటే ఒక గ్రంధమే అవుతుందండి :)తరవాత ఎప్పుడన్నా దాని గురించి ఒక టపా రాయాలి.

@Kalpana:
Lol, and i know how boring it is to go through KT.Urrgghhh...

@శరత్ గారు:
ఇదే మొదటిసారి మీరు నాబ్లాగులో కామెంటటం.అన్నట్టు, మీ అమ్ములు గురించి రాసే టపాలని చాలా బాగుంటాయండి.

@@రాజ్ కుమార్ గారు:
థాంక్స్ అండీ.నా బ్లాగ్ కి అభిమానిని అని చెప్పి నన్ను ఎక్కడో ఎక్కించేసారు.నిన్నంతా అసలు నాకు ఆకలి నిద్ర లేవంటే నమ్మండి.

@సుబ్రమణ్యం గారు:
టపా నచ్చినందుకు సంతోషం.వేణూ శ్రీకాంత్ గారికి నేను కూడా థాంక్స్ చెప్పాలండి,ఎందుకంటే Espresso2.0 టెక్నికల్ హెల్ప్ అంతా వారే అందించబోతున్నారు కదా.