Tuesday, February 14, 2012

లిండా-రెండవభాగం

మొదటిభాగం చదివారా?

"నేను రిసెర్చని.రకరకాల క్యాన్సర్ చికిత్సలు మన వ్యాధినిరోధకవ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే అంశం మీద నేను రిసెర్చ్ చేసేదాన్ని.దాన్నే Immunology అని కూడ అంటారు" అని చెప్పింది.తరవాత నేను ఇంటికి వచ్చాక గూగులమ్మని అడిగి Immunology గురించి తెలుసుకున్నాక చాలా ఆశ్చర్యమేసింది.ఏదో బళ్ళో ఉన్నప్పుడుimmunity system,immunity power అని సైన్స్ పాఠాల్లో చదువుకున్నాము,అంతటితో అయిపోయింది అని అనుకున్నాను.Immunology వెనక ఇంత కథ ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు కూడ! కాని లిండా not a big deal అన్నట్టు ఎంత సింపుల్ గా చెప్పింది.Don't judge a book by its cover అని ఎన్నిసార్లు చదివినా,ఒక మనిషిని కలిసిన మొదటి పదిహేను నిమిషాల్లోనే మనం వాళ్ళ గురించి ఒక అభిప్రాయానికి వచ్చేస్తామంట!దాన్నే first impression అంటాం.చాలాసార్లు first impression అనేది మనం వేసుకునే బట్టలు,మాట్లాడేవిధానం వీటిని బట్టే కదా బేరీజు వేసేది.చిందరవందర జుట్టు,ఎప్పుడు నలిగిపోయిన బట్టలు,ఇంట్లోనుంచి బయటకి రావాలంటేనే భయపడిపోయే లిండా మీద నాకు పెద్ద expectations ఏమి ఉండేవి కాదు.కాని మేము కలిసిన ప్రతిసారి లిండా నన్ను ఏదో రకంగా ఆశ్చర్యపరచేది.పసిపాప నవ్వులా కల్మషం లేకుండా నవ్వేది.నాతో మాట్లాడుతున్నంతసేపు కూడ చుట్టుపక్కల చూస్తూ గాభరా పడేది.ఎప్పుడైనా రెండురోజులు కనిపించకపోతే తలుపుతట్టి పలకరించేది.క్రమంగా లిండాతో ఒక రెండు నిమిషాలు మాట్లడటం అనేది నా దినచర్యలో భాగమైపోయింది.తనని స్నేహితురాలు అనేంత స్నేహం లేదు మా మధ్య.పోని పరిచయస్తురాలు అందామ అంటే ప్రతిరోజు ,ఒక్కొక్కసారి రోజుకి మూడుసార్లు మాట్లాడుకునే మేము ఒట్టి పరిచయస్తులం ఎలా అవుతాము?

ఒకరోజు మధ్యాహ్నంవేళ తలుపుతట్టి ఈరోజు date ఎంత అని అడిగింది.date చెప్పాను."ఇంకా రెండురోజుల్లో మిషిగన్ లో ఉంటున్న మా అమ్మాయి పుట్టినరోజు.స్టీవ్ ని గ్రీటింగ్ కార్డ్ పంపమని చెప్పాను.పంపాడో,లేదో" అని తనలో తనే గొణ్ణుక్కొంది."పోని,నేను తెచ్చిపెట్టనా గ్రీటింగ్ కార్డ్?" అని అడిగాను.ఒద్దని చెప్పి వెళ్ళిపోయింది.ఆ తరవాత ఆవిషయం నేను కూడ మర్చిపోయాను.తరవాత ఒకరోజు రాత్రి మేము భోజనాలు చేస్తుంటే తలుపు చప్పుడయ్యింది.లిండా తలుపుతట్టే విధానం కూడా గమ్మత్తుగా ఉంటుంది.ఆ శబ్దం వింటూనే అర్ధమవుతుంది.తలుపుకి అవతలివైపు లిండా ఉందని.తలుపు తెరిచి ఏంటని అడిగాను."ఏంటి?అప్పుడే మరిచిపోయావా"అని నిలదీసింది నన్ను.నేను కాసేపు తికమకపడి,నాకు ఙ్ఞాపకశక్తి కాస్త తక్కువలే ఇంతకి విషయమేంటో చెప్పు అంటే "ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు" అని చెప్పింది.చాలా సంతోషంగా ఉంది,తన మొహం చూస్తేనే తెలుస్తుంది."ఒకసారి మాఇంటికి వస్తావా?" అని పిలిచింది.మొదటిసారి నన్ను వాళ్ళింటికి పిలిచింది."కాసేపయ్యాక వస్తాను.నేను ఇప్పుడు భోజనం చేస్తున్నాను"అని చెప్తే,ఇప్పుడే వచ్చేద్దువుకానిలే,ఒక్కసారి వచ్చి వెళ్ళు అని గుమ్మం దగ్గరే నిల్చుంది.ఇంక లాభం లేదు.నేను వచ్చేదాక కదలదని అర్ధమయ్యింది.అయినా చిన్నపిల్లల్లా ఈ మంకుపట్టు ఏమిటో అనుకుంటూ చెప్పులేసుకొని బయలుదేరాను.వన్ బెడ్రూం అపార్ట్మెంట్.ఒకే ఒక్క లైట్ వేసి ఉండటం మూలాన ఇల్లంతా కాస్త చీకటి చీకటిగా ఉంది.కాఫీ టేబుల్ మీద చిన్న చిన్న పజిల్ పుస్తకాలు,బైబిల్ ఉంది.గమ్మత్తయిన విషయమేమిటంటే,తను సోఫాలో ఎప్పుడు ఒకే చోట కూర్చుంటుంది.తను కూర్చునేచోట మాత్రం బరువు వల్ల కుంగినట్టు అయిపోయి,మిగతా సోఫా మొత్తం కొత్తగా ఉంది.హాల్లో ఒక మూలన చిన్న క్రిస్మస్ చెట్టు,చిన్న చిన్న లైట్లతో అలంకరించబడి,కింద టెడ్డిబేర్ బొమ్మలు పొందికగా అమర్చి ఉన్నాయి.ఆగస్ట్ నెలలో క్రిస్మస్ వాతావరణం కాస్త కొత్తగా అనిపించింది."మీ ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయే" అన్నాను నవ్వుతూ. గత ఏడాది తన మనవరాలు ఆ క్రిస్మస్ ట్రీ ని అలంకరించిందంట,అప్పట్నుండి ఆ అలంకరణలేవి కదిలించకుండా అలానే ఉంచిందంట!వీళ్ళకి దీపావళి పండగ లేనిదే మంచిదయ్యింది అని అనుకున్నాను. "ఏమిటి రమ్మన్నావు,కేక్ ఏమన్నా పెడతావా?,అలా అయితే చెప్పు మా ఆయన్ని కూడ రమ్మంటాను" అని అంటే,ఒక నవ్వు నవ్వి "నువ్వు చాలా ఫన్ని" అని అన్నది.ఫన్ని కాదు యమ సీరియస్సు అని అంటే పగలబడి నవ్వింది.ఆహా!మొదటిసారి లిండా ఎలాంటి భయం,ఆదుర్దా లేకుండా హాయిగా నవ్వింది."ఎప్పుడు ఇలా నవ్వుతూ,సంతోషంగా ఉండు.చిన్న చిన్న విషయాలకే కంగారుపడకు" అని చెప్పాను.అప్పుడు చెప్పింది,తనకి నెమ్మది నెమ్మదిగా ఙ్ఞాపకశక్తి తగ్గిపోతుందంట,దానివల్ల anxiety attacks వస్తుంటాయంట. అప్పుడు చూపించింది,డైనింగ్ టేబుల్ మీద ఉన్న గులాబి పువ్వుల్ని.వాళ్ళమ్మయి పంపించిందంట."సాయంత్రం ఫోన్ లో కూడ మాట్లాడాను,నీకు పువ్వులు చూపించాలని పిలిచాను"అని చెప్పింది."గులాబీలు బాగున్నాయి" అని చెప్పాను. తరవాత హాల్లో గోడల మీద ఉన్న ఫోటోల్లో ఉన్న తన పిల్లలు,వాళ్ళ పిల్లల్లు అందరిని చూపించింది.

నాలుగునెలల తరువాత ఒకరోజు లిండా మాఇంటి తలుపు తట్టినప్పుడు మాటల్లో మాటగా చెప్పాను,ఇంకొన్ని రోజుల్లో మేము ఇల్లు ఖాళీ చేసివెళ్ళిపోతున్నాము అని.చాలా బాధపడింది.మన ఇండియాలో మాదిరి ఇళ్ళు మారుతుంటే సహాయానికి మనుషులు దొరకరు,దొరికినా గూబగుయ్యిమనిపించేన్ని డబ్బులు వసూలు చేస్తారు కాబట్టి అన్ని మనమే సర్దుకోవాలి.పరమ బిజీగా సామాన్లు ప్యాక్ చేస్తుంటే లిండా తలుపు తట్టేది.బయటేమో ఒకటే చలి,ఇంట్లోకి వచ్చి కూర్చొని నువ్వు కబుర్లు చెప్పు నేను ఇళ్ళు సర్దుకుంటాను అంటే వచ్చేదికాదు.అలానే బయట నిల్చునేది.ఒకరోజు తలుపుతట్టి "నేను మీఇంటికి రావడం మీఆయనకి ఇష్టం లేదు కదా!" అంటు ఒకటే ఏడుపు.నాకు ఒక్కసారి దిమ్మతిరిగిపోయింది."అసలు ఎక్కడ్నుండి వస్తున్నాయి నీకు ఈ ఐడియాలు?నేను కాని,మా ఆయన కాని చెప్పామా నీకు మా ఇంటికి రావద్దని" అని అడిగితే "సారి,నిన్ను బాధపెట్టాను.రెండురోజుల్నుండి సరిగ్గా మెడిసిన్స్ వేసుకోవట్లేదు,అందుకే పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి.మీరు వెళ్ళిపోతున్నారని నాకు చాలా బాధగా ఉంది"అని ఏడ్చింది.చాలా బాధేసింది.ప్యాకింగ్ హడావిడిలో నేను కూడ లిండాతో ఈమధ్య సరిగ్గా మాట్లడలేదు.కాసేపు నవ్విద్దామని ఏదో జోక్ చెప్పినా తను నవ్వలేదు.తరవాత మళ్ళీ తను మాఇంటికి రాలేదు.ఇంక చివరిరోజు నేను తన తలుపు తట్టాను.చాలసేపటి వరకు తలుపు తియ్యలేదు. నిద్రపోతుందేమో,డిస్ట్రబ్ చెయ్యడమెందుకులే అని బయలుదేరుతుండగా మెల్లిగా తలుపు తెరిచింది.మొహమంతా చిన్నబోయి ఉంది.ఏంటని అడిగితే జ్వరమని చెప్పింది.మీరు వెళ్ళిపోతే నేను ఎవరితో మాట్లాడాలి అని చాలాసేపు ఏడ్చింది. నేను ఓదార్పుల్లో పరమ వీకు.లిండా అలా ఏడుస్తుంటే నాకు ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు.మాఆయనే కల్పించుకొని నిన్ను చూడటానికి మళ్ళి వస్తాము.నువ్వు మాత్రం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బయలుదేరాము.కాని ఇంతవరకు మేము మళ్ళి లిండాని చూడటానికి వెళ్ళలేదు.ఒక్కోసారి అనిపిస్తుంటుంది,అసలు ఇంకా గుర్తున్నామో,లేదో లిండాకి,వెళ్ళి అనవసరంగా డిస్ట్రబ్ చెయ్యడం ఎందుకులే అని.కాని లిండాని మాత్రం నేను ఎప్పటికి మర్చిపోలేను.I call her my mystic friend.ఒక్కోసారి గలగలా మాట్లాడుతుంది,ఒక్కోసారి ఏమి మాట్లాడకుండా అలా చూస్తుండిపోతుంది.ఒక్కోసారి నేను ఎవరో తెలియనట్టే చూసి వెళ్ళిపోయేది.ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో నాకయితే అర్ధమయ్యేది కాదు.ఏది ఏమయినా లిండా ఆరోగ్యంగా ఉండాలని,ఉంటుందని కోరుకుంటు ముగిస్తున్నాను.


13 comments:

Sujata M said...

Thats very warm..!

వేణూశ్రీకాంత్ said...

hmmm బాగుందండీ.. లిండా ఆరోగ్యంగా ఉండాలని నేనుకూడా కోరుకుంటున్నాను.

Unknown said...

Kranti gaaru, you should explore urself for writing Telugu Short Stories.

Mee narrate ceese vidhanam naaku chala bagaa nachindi..

telisno, teliya kundano ... nenu Isarael lo vunnapu mee blog open ayyindi..I was totally impressed with ur Idli story...Ipatiki naku vijaykant pic gurthuki vastundi..

Keeping going..Mee Blog chaduvuta vunte... Telugu Blogs kudaa baguntaayi ani telisindi.. Israel vacakaa telugu vallu yevaru lere ani feel kavatledu :)

Keep doing your good job !!!!

క్రాంతి said...

సుజాత గారు:
థాంక్స్ అండి.

వేణు శ్రీకాంత్ గారు:
థాంక్స్ అండి.

క్రాంతి said...

రాజ్ గోపాల్ శర్మ గారు:
నా బ్లాగు మీకు నచ్చినందుకు చాలా సంతోషం.నేను కూడ చాలా రోజుల విరామం తరువాత మళ్ళి రాస్తున్నాను.ఇంకా షార్ట్ స్టోరిస్ రాసేంత పెద్ద రచయిత్రి కాలేదండి.
ఇక మా ఊరంటారా..ఆంధ్రమాతకి పుట్టిన తెలంగాణ బిడ్డని నేను.I hope that answers your question :)

kalpana said...

చాలా బావుంది.narration సూపర్.

Unknown said...

Kranthi Gaaru...
Waiting for your next blogssss...

Ur fans re gtting bored.. We need to read something..

Ur blog is something like a serial.. We are waiting for Monday to watch serial again, as sat & Sun serials won't come :(

Make some time in ur daily life and wite ur blogss..

many Blogs may come & go daily in the internet, but not all can write effectively & effectinatly towards their blogss..

You are the one among who can write good enough. This is my only adive. Take it positively & continue with ur blogging :)

One of ur fan

Unknown said...

kranti gaaru,

mee blog oka serial laagaa addict ayyindi aaku ( mee fans ) :)


we should find some time in ur daily life to kep ur blogging spirt on..

we can find many blogs daily coming & going in the internet. ut your blog is not like that.

Your way of narrating is something different that I observed from those blogs what i have visited so far.. trust me ...!

fans ani cheppalenu kaani kaneesam mee visine karaa ani anukondi... try to continue ur blogging for us :)

I literally enjoyed ur blogss.. Like waiting for Monday to come for watching Serials ;(

Anonymous said...

వీళ్ళకి దీపావళి పండగ లేనిదే మంచిదయ్యింది అని అనుకున్నాను. "ఏమిటి రమ్మన్నావు,కేక్ ఏమన్నా పెడతావా?,అలా అయితే చెప్పు మా ఆయన్ని కూడ రమ్మంటాను" అని అంటే,ఒక నవ్వు నవ్వి "నువ్వు చాలా ఫన్ని" అని అన్నది.ఫన్ని కాదు యమ సీరియస్సు అని అంటే పగలబడి నవ్వింది.

panchlu baga 'pelaayi' :)

ravi

chavera said...

చాలా రోజుల తరువాత "అప్పుడు ఏమి జరిగిందంటే" లోకి ఆత్రుతతో వచ్చాను.
లిండా గురించిన రెండు టపాలు నన్ను కదిలించాయి .
అల్జైమర్స్ తో ప్రత్యక్షంగా రోజూ అనుభవైక్యమైన వారికి ,
ఇలా నవ్వించగల వాళ్ళు దొరికితే ఎంత బాగుణ్ణు.
'వివాహాయ బ్లాగు నాశాయ' అన్న నా మాట వెనక్కి తీసుకోని ,
క్రాంతి బ్లాగు కలకాలం అందరిని అలరించాలని కోరుకుంటూ
మీ అందరికి శుభాకాంక్షలు

chavera said...

చాలా రోజుల తరువాత "అప్పుడు ఏమి జరిగిందంటే" లోకి ఆత్రుతతో వచ్చాను.
లిండా గురించిన రెండు టపాలు నన్ను కదిలించాయి .
అల్జైమర్స్ తో ప్రత్యక్షంగా రోజూ అనుభవైక్యమైన వారికి ,
ఇలా నవ్వించగల వాళ్ళు దొరికితే ఎంత బాగుణ్ణు.
'వివాహాయ బ్లాగు నాశాయ' అన్న నా మాట వెనక్కి తీసుకోని ,
క్రాంతి బ్లాగు కలకాలం అందరిని అలరించాలని కోరుకుంటూ
మీ అందరికి శుభాకాంక్షలు

chavera said...

నా వ్యాఖ్యలు లోహ పాదాలేమో ?

chavera said...

నా వ్యాఖ్యలు లోహ పాదాలేమో ?