Tuesday, November 20, 2007

నవ్వుతూ బ్రతకాలిరా!

మా ఆఫీస్ లో ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు.ఆయన నవ్వుతుండగా ఇప్పటివరకు ఒక్కసారి కూడ చూడలేదు నేను.ఆయనకి వేరే ఎక్స్ ప్రెషన్ పెట్టడం వచ్చోలేదో నాకయితే డౌటే! అసలు మనుషులు నవ్వకుండా ఎలా ఉండగలుగుతారు?ఆయన్నే అడగాలనిపిస్తుంది కాని ఆయనకి నాకు ఎక్కువ పరిచయం లేదు :-) మన న్యూస్ రీడర్లే నయం,"ముఖ్యాంశాలు మరోసారి" అని చేటంత మొహం చేసుకొని నవ్వుతారు.మరీ మాటీవిలో వార్తలు చదవడానికి ఒకయన వస్తాడు.ఆయన పేరేంటో గుర్తురావటం లేదు కాని,"ఇప్పుడు కాసేపు బ్రేక్" అంటాడు."బ్రేక్" అనే పదాన్ని చిత్రవధ చేసి ముప్పుతిప్పలు పెడతాడు.అబ్బో ఎంత ఫీల్ అయిపోతాడో,బర్కా దత్ కూడ ఈయనగారంత ఫీల్ అవ్వదు.హాస్టల్ లో మేమంతా కలసి న్యూస్ చూసేటప్పుడు ఈయన "బ్రేక్" అనకముందే మేమే పెద్దగా అనేసి నవ్వుతాం.అప్పుడప్పుడు నేను ఎప్పుడో జరిగినవి కూడ గుర్తుచేసుకొని నవ్వుకుంటాను.వాటిల్లో కొన్ని ఇక్కడ రాస్తున్నాను.

తిరుపతి సర్

మా హిందీ సర్.ఈయన మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఆ బ్రహ్మ దేవుడు కూడ గెస్ చెయ్యలేడు.సడన్ గా క్లాస్ లో ఎవరో ఒక అబ్బాయిని నిలబెట్టి వీపు మీద దబదబా బాదేసేవాడు.లేకపోతే "నీ నల్లమొకం పాడుగాను" అని తిట్టేవాడు.ఎందుకు కొడతాడో,ఎందుకు తిడతాడో ఎవ్వరికి అర్ధమయ్యేది కాదు.Thank god! అమ్మాయిల్ని మాత్రం ఏమనేవాడు కాదు.అప్పుడు ఆయన క్లాస్ అంటే అందరం భయపడి చచ్చేవాళ్ళం కాని,ఇప్పుడు నేను,మా అక్క ఆయన్ని గుర్తు చేసుకొని నవ్వుకుంటాము.

గోపి సర్,పరమ్

మాకు ఇంజనీరింగ్ ఫస్టియర్ లో "ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్" అని ఒక థియరీ పేపర్,ల్యాబ్ క్లాస్ ఉండేది.ఈ రెండు క్లాసులు గోపిసారే తీసుకునేవారు.ఈయన చాలాబాగ టీచ్ చేసేవారు కాని అదేంటో క్లాసంతా అమ్మాయిల్ని చూస్తునే చెప్పేవారు.అబ్బా! ఎంత ఇబ్బందిగా ఉండేదో! క్లాస్ లో అబ్బాయిలేమో "సార్,మాకు అర్దం కావటం లేదు,మమ్మల్ని చూసుకుంటు చెప్పండి" అని లేకపోతే "మేము ఫీజులు కడుతున్నాం,మమ్మల్ని చూసుకుంటు చెప్పండి" అని గొడవ చేసేవాళ్ళు.మళ్ళీ ఏమో,సమయం సందర్భం లేకుండా "electronic devices are very sensitive like girls,handle them with lot of care" అని అనేవాడు.ఒకరోజు మేము ల్యాబ్ లో PNP,NPN transistor configurations ఎక్స్ పెరిమెంటు చేస్తున్నాం.సర్క్యూట్ కనెక్షన్ సరిగ్గానే చేసినా కాని మాకు ఆమ్మీటర్ లో కరెంటు రీడింగ్ సరిగ్గా రావటం లేదు.మా బ్యాచ్ మేట్ పరమ్ కి చాలా విసుగొచ్చింది."దీన్ తల్లి,రీడింగ్ వస్తలేదేంది" అని ఆమ్మీటర్ మీద గట్టిగా ఒక్కటిచ్చాడు.అదికాస్తా గోపి సర్ చూసాడు."పరమ్,electronic devices are very sensitive like girls,handle them with lot of care" అని అన్నాడు.అందరం నవ్వాం.అక్కడితో ఆగితే ఆయన 'గోపి సర్' ఎలా అవుతారు? "Silence,I repeat,electronic devices are very sensitive like girls,handle them with lot of care" అని అన్నారు.అంతే ల్యాబ్ లో ఉన్న మేమంతా పగలబడి నవ్వాం.తరవాత నుండి ఆయన ఎప్పుడు కారిడార్స్ లో వెళ్తున్నా,అబ్బాయిలంతా కోరస్ పాడేవాళ్ళు.."electronic devices are..."

ప్రవీణ్

నేను ఇదివరకు హైదరాబాద్ ఆఫీస్ లో ఉన్నప్పుడు,మా బాస్ మా టీమ్ అందర్ని ఒకసారి డిన్నర్ కి బయటకి తీసుకెళ్ళారు.బాస్ తో బయటికెళ్ళినప్పుడు అందరం ఎలా ఉంటామో తెలుసు కదా,అందరం కామ్ గా తిన్నాం.భోజనం తరవాత మా బాస్ అందరికి ఐస్ క్రీం ఆర్డర్ చేసారు."అందరికి వెనిలా తెప్పించనా" అని అడిగారు.మేమంతా "ok sir" అన్నాం.ప్రవీణ్ మాత్రం మెనూ కార్డ్ తెరిచి లిస్ట్ చూసి "నాకు బట్టర్ స్కాట్చ్" కావాలి అన్నాడు.కాసేపటి తరవాత అందరం ఐస్ క్రీం తింటున్నాం.ప్రవీణ్ నా పక్కనే కూర్చున్నాడు ఐస్ క్రీం తినకుండా.ఏంటి తినట్లేదు,ప్రత్యేకంగా తెప్పించుకున్నావు కదా అని అడిగితే,బిక్కమొహం వేసుకొని చెప్పాడు,"క్రాంతి,ఘోరం జరిగింది.నా ఐస్ క్రీంలో ఎవరో బండలేసారు చూడు" అని ఐస్ క్రీం లో ఉన్న క్రిస్టల్స్ ని చూపించాడు.అందరం గొల్లుమని నవ్వాం.అప్పటిదాక కామ్ గా,సీరియస్ గా ఉన్న పార్టీ మొత్తం నవ్వుల్తో నిండిపోయింది.అప్పట్నుంచి ఎప్పుడు బట్టర్ స్కాట్చ్ ఐస్ క్రీం తింటున్నాకాని ప్రవీణే గుర్తొస్తాడు.

(అమ్మో,ఈ మధ్య టపాలకి శీర్షికలు పెట్టడం చాలా కష్టమనిపిస్తుంది.ఈ టపాకి టైటిల్ పెట్టడానికి చాలాసేపు ఆలోచించాను.కాసేపు "ప్రేమించుకుందాం..రా!" సినిమా చూసాక నాకు అద్భుతమైన అవుడియా వచ్చి ఈ టైటిల్ పెట్టేసాను.ఇది ఎంతవరకు సూట్ అయ్యిందో మరి.)

Thursday, November 15, 2007

పెళ్ళి

ఏంటో కాని ఈ మధ్య నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళంతా నాకు పెళ్ళి సంబంధాలు చూస్తామని తెగ ఉత్సాహపడుతున్నారు.వాళ్ళ ఆనందాన్ని ఎందుకు కాదనాలని "సరే,చూసుకోండి" అని చెప్పాను.హేమ అయితే మరీను,ఆఫీస్ అవర్స్ లో ఫోన్ చేసి మా ఆయన ఫ్రెండు ఒకతను ఉన్నాడు,బాగ సెటిల్ అయ్యాడు,"ఆండాళ్ సాఫ్ట్ వేర్ సొల్యుషన్స్" లో ఆవకాయ ప్రాజెక్ట్ కి ప్రాజెక్ట్ మేనేజర్,"చేసుకుంటావా?" అని అడిగింది.నాకు భలే నవ్వొచ్చింది.చేసుకుంటావా అని అడిగితే నా మొహం అప్పటికప్పుడు నేనేమి సమాధానం చెప్తాను.అసలు జనాలకి నాకు పెళ్ళి చెయ్యాలనే ఆలోచన ఇప్పుడొచ్చింది కాని నేను మాత్రం ఒకటో తరగతిలో ఉన్నప్పుడే పెళ్ళి చేసుకుందామనుకున్నాను.

నేను ఒకటో తరగతిలో ఉన్నప్పుడు మా చిన్నపిన్ని పెళ్ళయ్యింది.అప్పుడు తను డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుండేది.పెళ్ళయిన తరవాత చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసింది.'ఓహొ,పెళ్ళి చేసుకుంటే చదువుకోనవసరం లేదు' అని అర్ధమయ్యింది నాకు.వెంటనే అమ్మదగ్గరికెళ్ళి "అమ్మా,నేను పెళ్ళి చేసుకుంటాను" అని చెప్పాను.అంతే అందరు పగలబడి నవ్వారు.ఇందులో నవ్వడానికి ఏముంది అని అనుకున్నాను.ఏంటో నేను ఇంత సీరియస్ గా చెప్తున్నాకాని ఎవ్వరు పట్టించుకోరేం? తరవాత కొన్నాళ్ళకి నేను టీవిలో "సోగ్గాడు" సినిమా చూసాను.సినిమాలో శోభన్ బాబుని చూసి ఉక్కిరిబిక్కిరైపోయి మనసు పారేసుకున్నాను."అమ్మా నేను శోభన్ బాబుని పెళ్ళిచేసుకుంటాను" అని చెప్పాను.ఇదివరకు పెళ్ళి చేసుకుంటానని చెప్పాను,ఇప్పుడు ఎవర్ని చేసుకుంటానో కూడ చెప్పాను.అబ్బ! ఎంత డెవలప్ మెంటు!!కాని నన్నెవ్వరు సీరియస్ గా తీసుకోలేదు.నేను మాత్రం డిసైడైపోయాను.పెళ్ళంటు చేసుకుంటే శోభన్ బాబునే చేసుకోవాలని.ఎప్పుడు టీవిలో శోభన్ బాబు సినిమా వచ్చినా కాని నోరు వెళ్ళబెట్టుకోని చూసేదాన్ని.అసలు ఇప్పటివరకు శోభన్ బాబు అంత handsome గా ఉన్నవాళ్ళని నేను చూడలేదు.ఇంక గాగుల్స్ పెట్టుకోని పాటల్లో డాన్స్ వేస్తుంటే..ఆహా! చూడాల్సిందేకాని చెప్పడానికి మాటలు సరిపోవు.నేను హీరోయిన్ మొహం ప్లేస్ లో నా మొహం అతికించుకొని చుసేదాన్ని సినిమాలన్ని.

ఒకసారి మా అమ్మ "శోభన్ బాబుకి పెళ్ళయిపోయింది" అని చెప్పింది.ఆ భయంకరమైన నిజాన్ని విని నేను తట్టుకోలేకపోయాను.చాలా బాధపడ్డాను.నా ప్రోగ్రెస్ కార్డ్ చూసుకొని కూడ నేను ఎప్పుడు అంత బాధపడలేదు.తరవాత నేను మా అమ్మ మీద చాలా పోట్లాడాను నన్ను ఇంకా ముందే ఎందుకు పుట్టించుకోలేదని.అసలు ఈ విషయంలో నాకు చాలా అన్యాయం జరిగింది.దేవుడా,వచ్చే జన్మలోనైనా నన్ను,శోభన్ బాబుని ఒకే జనరేషన్ లో పుట్టించి మా ఇద్దరికి పెళ్ళి జరిపించు.

Tuesday, November 6, 2007

నేను భయపడ్డాను

అసలు నేనేంటి,భయపడటేమేమిటని నాకు ఇప్పటికి అనిపిస్తుంది.కాని నిజంగా నిజం చెప్పాలంటే నేను అప్పుడప్పుడు చాలా భయపడతాను.ఈ మాయరోగం నాకు ఎనిమిదో తరగతిలో అంటుకుంది.నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు లెక్కల ట్యూషన్ కి వెళ్ళేదాన్ని.సాయంత్రం 6గంటల నుండి 9గంటల వరకు.అసలు నాకు ట్యూషన్ కి వెళ్ళటమే ఇష్టం లేదు.దానికి తోడు ఆ లెక్కలు చెప్పే మాష్టారంటే నాకు అసలే ఇష్టం లేదు.అక్కడ నేను ఇరగదీసేదేమి లేకపోయినా చచ్చినట్టు 6నుండి 9గంటల వరకు కూర్చోవాలి.6గంటలకి ట్యూషన్ కి వెళ్ళేటప్పుడు సైకిల్ మీద వెళ్ళేదాన్ని.రాత్రి తొమ్మిది గంటలకి మా నాన్న స్కూటర్ వేసుకొని ట్యూషన్ కి వచ్చేవారు.నేను సైకిల్ మీద వస్తుంటే నాన్న మెల్లగా నన్ను స్కూటర్ మీద ఫాలో చేసేవారు.కాని ఒక రోజు ఏదో పని ఉంటే నాన్న వేరే ఊరికెళ్ళారు.ఆరోజు రాత్రి నన్ను తీసుకెళ్ళటానికి ఎవ్వరూ రాలేదు.రాత్రి ట్యూషన్ వదిలే టైమ్ కి చిన్నగా వర్షం పడుతుంది.ఏంటో నా మనసంతా అదో లాగ అయిపోయింది.పుస్తకాలు తడుస్తాయని ట్యూషన్ లోనే పెట్టేసాను.సైకిల్ తాళం తీసి రోడ్డు మీదకొచ్చి గబగబా తొక్కుకుంటూ ఇంటిదారి పట్టాను.

వర్షం కదా,రోడ్డుమీద ఎవ్వరు లేరు.నేను సైకిల్ చాలా స్పీడుగా తొక్కుతున్నాను.వెంకటేశ్వరస్వామి గుడి వచ్చేసింది.హమ్మయ్యా! ఇంకొక రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటాను అని అనుకున్నాను.అంతే సడన్ గా ఎక్కడ్నుంచి వచ్చాడో కాని నా పక్కన సైకిల్ మీద ఒకడు ప్రత్యక్షమయ్యాడు."ఏంటి,ఈ రోజు మీ డాడీ రాలేదా?" అంటూ నా సైకిల్ దగ్గరదగ్గరికి వచ్చాడు.నాకు కాళ్ళు చేతులు ఆడలేదు.సైకిల్ ఎలా తొక్కానో కాని ముందు చక్రానికి చిన్నపాటి బండ తగిలి పక్కనే ఉన్న బురదగుంటలో పడ్డాను.అంతే నేను హిస్టీరియా వచ్చిన దానిలాగ పెద్దపెద్దగా అరిచాను.అసలు నాకు అంత పెద్ద గొంతు ఉందని నాకు ఆ రోజే తెలిసింది.నా అరుపులు విని గుడిలో ఉండే వాచ్ మెన్,ఇంకొకతను ఎవరో పరిగెత్తుకొస్తుంటే సైకిల్ వాడు వెళ్ళిపోయాడు.ఆ సైకిల్ వెధవ వాడు దొంగసచ్చినోడు,వాడికి కుష్టురోగమొచ్చి దిక్కుమాలిన చావు చావాలి.ఆ తరవాత నేను ఇంటికి ఎలా చేరానో నాకే తెలియదు.ఆ దెబ్బకి నాకు వారం రోజులు విపరీతంగా జ్వరం వచ్చింది.లైఫ్ లో నేను మొదటిసారి భయపడ్డాను.అప్పట్నుంచి నాకు చీకటన్నా,గడ్డం ఉన్న మగవాళ్ళన్నాచాలా భయం.(ఆ సైకిల్ వెధవకి గడ్డముంది.) ఇంత జరిగినా మా నాన్న ట్యూషన్ మాత్రం మాన్పించలేదు.ఎప్పుడన్నా మా నాన్నకి నన్ను తీసుకెళ్ళడానికి రావటం కుదరకపోతే మా సుబ్బులు,శశిగాడు,రాము,రామక్రిష్ణ,పక్క సెక్షన్ శ్రీనివాస్ వచ్చి నన్ను ఇంటిదగ్గర దింపి వెళ్ళేవాళ్ళు.నేను అద్రుష్టవంతురాల్ని,నాకు మంచి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు.

తరవాత అలా అలా చూస్తుండగానే నేను ఇంజనీరింగ్ కి వచ్చేసాను.నేను సెకండియర్ లో ఉన్నప్పుడు నాన్నకి ట్రాన్స్ ఫర్ అయ్యింది.కొత్త కాలనీకి మారినాక కూడ నేను రెండు,మూడుసార్లు ఇంటికి వచ్చివెళ్ళాను,కాని ఒకరోజు ఎందుకో సాయంత్రం బయలుదేరాల్సి వచ్చింది ఇంటికి.అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు కదా,ఇంటికి ఫోన్ చేసి ఏడు గంటలకల్లా వచ్చేస్తానని చెప్పాను.నాన్న బస్టాప్ లో వెయిట్ చేస్తానని చెప్పారు.నా ఖర్మకాలి నేను ఎక్కిన బస్సు మధ్యలోనే ఏదో ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది.దాదాపు రెండు గంటల తరవాత ఆ రూట్ లో నేను వెళ్ళాల్సిన కాలనీ బస్సు వస్తే ఎక్కాను.అసలే కొత్త రూట్,చీకటయ్యింది.నాకు మళ్ళీ టెన్షన్ మొదలయ్యింది.కండక్టర్ కి,డ్రయివర్ కి పదిసార్లు చెప్పాను స్టాప్ వచ్చినప్పుడు చెప్పండని.కండక్టర్ కి గడ్డముంది.వాడ్ని చూస్తేనే ఎందుకో నాకు చిర్రెత్తింది.ఒక అరగంట గడిచాక "నువ్వు ఎక్కడ దిగాలి?" అని అడిగాడు.నేను చెప్పాను.ఆ కాలనీ ఎప్పుడో వెళ్ళిపోయిందని చెప్పాడు.అంతే నాకు గుండె ఆగినంత పనయ్యింది.కోపం,ఏడుపు అన్ని ఒకేసారి తన్నుకొచ్చాయి."అదేంటి,స్టాప్ వచ్చినప్పుడు చెప్పమన్నాను కదా" అని అడిగితే,కండక్టర్ ఆ మధ్య దారిలో బస్సు ఆపించి దిగమన్నాడు.కనీసం తరవాత స్టాప్ లో దిగుతానంటే కూడ ఒప్పుకోలేదు.చేసేది లేక నా బ్యాగు తీసుకొని దిగాను.బస్సు దిగి రోడ్డు పక్కన నిల్చున్నాను.అడపాదడపా బైక్ ల మీద వెళ్ళేవాళ్ళు నన్ను అదోరకంగా చూస్తున్నారు.అసలు ఎటువైపు వెళ్తే మా ఇల్లు వస్తుందో కూడ తెలియదు నాకు.ఇంక లాభం లేదనుకొని ఒక స్కూటర్ వస్తుంటే ధైర్యం చేసి ఆపాను.మానాన్న పేరు,కాలనీ పేరు,మానాన్న ఎక్కడ పని చేస్తారో చెప్పి నన్ను ఇంటి దగ్గర దింపమని రిక్వెస్ట్ చేసాను.ఆ స్కూటర్ మీద వచ్చినాయన నేను చెప్పింది విని బోలెడంత ఆశ్చర్యపోయి నేను కూడ మీ నాన్న పనిచేస్తున్న చోటే పనిచేస్తున్నాను అని చెప్పి స్కూటర్ ఎక్కమన్నారు.కాని ఎక్కిన తరవాత నాకు టెన్షన్ మొదలయ్యింది.ఈయన నిజంగా నన్ను ఇంటికే తీసుకెళ్తున్నాడా లేక ఇంక ఎక్కడికయినా తీసుకెళ్తున్నాడా అని భయమేసింది.కాని పాపం చాలా మంచాయన.మా కాలనీకే తీసుకెళ్ళారు.నాన్న ఇంకా బస్టాపులోనే వెయిట్ చేస్తున్నారు.నన్ను మా నాన్నకి అప్పచెప్పి వాళ్ళమ్మయి కూడ హాస్టల్ నుండి వస్తుందంట,రీసీవ్ చేసుకోవటానికి వెళ్ళాలని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయారు.తరవాత రోజు నేను,మా నాన్న వాళ్ళింటికెళ్ళి పర్సనల్ గా థాంక్స్ చెప్పాము.ఆయన చాల సంతోషపడ్డారు.కాని నేను ఆ బస్సు డ్రైయివర్ ని,కండక్టర్ని జన్మలో క్షమించను.గడ్డం పెంచుకున్న వాళ్ళు మంచివాళ్ళు కాదని మళ్ళీ ఒకసారి నిరూపించారు.

మొన్నటికి మొన్న నేను ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుండి గుడికెళ్ళి కాసేపు కూర్చొని హాస్టల్ కి బయలుదేరాను.తిప్పితిప్పి కొడితే టైమ్ ఏడు కూడ కాలేదు.నేను ఏదో సీరియస్ గా ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే,ఒకడు బైక్ మీద వచ్చి నా పక్కన బండి ఆపి,"మేడమ్,నాకు మీ హాస్టల్ తెలుసు,నన్ను డ్రాప్ చెయ్యమంటారా?" అని అడిగాడు(ఇంగ్లీషులో).ఈసారి నేను భయపడలేదు."పనిచూస్కో,ఎక్కువతక్కువ చేసావంటే పోలిసుల్ని పిలుస్తానని చెప్పాను".వాడు helmet పెట్టుకొని ఉన్నాడు కాబట్టి నేను సరిగ్గా చూడలేదు కాని,ఈ వెధవకి కూడ గడ్డం ఉండే ఉంటుంది.

ఇలాంటివన్ని జరిగినప్పుడు నాకు చాలా భాదేస్తుంది.నేను ఎప్పుడు దేవుడికి దణ్ణం పెట్టుకున్నప్పుడు ఒకటే కోరుకుంటాను."దేవుడా,నన్ను మళ్ళీ ఆడపిల్లగా పుట్టించకు,రేపు నాకు పెళ్ళయ్యాక కూడ నాకు ఆడపిల్లనివ్వకు" అని.జీవితాంతం నన్ను,నా కూతుర్ని కాపాడుకుంటు బ్రతికే బ్రతుకు నాకొద్దు.