Sunday, July 10, 2011

బ్రహ్మపదార్థం = ఇడ్లి,ఇడ్లి = బ్రహ్మపదార్థం,Hence proved!

కొంతకాలం క్రితం నేను ఉప్మా గురించి ఒక టపా రాసాను.అప్పుడు కొంతమంది"అయ్యో,మీకు ఉప్మా నచ్చదా?" అని జాలిపడ్డారు.ఇంకొంతమంది "మాకు ఉప్మా నచ్చదు!" అని సంఘీభావం తెలిపారు.మరికొంతమంది "ఉప్మా వండటం,తినటం రెండు ఒక కళ.మీకు ఉప్మా నచ్చకపోతే ఊరుకొండి కాని ఇలా బ్లాగులకెక్కి టపాలు రాస్తే మాత్రం ఊరుకొనేది లేదు" అని వార్నింగులిచ్చారు. పుర్రెకో బుద్ది,జిహ్వకో రుచి అన్నట్టు ఎంతగా ప్రయత్నించినా కాని ఉప్మాని నేను ఆరాధించలేకపోయాను.ఉప్మా కూడ నన్నెప్పుడు ప్రేమించలేదు.కొన్ని ప్రేమకథలకంతే మొదలవ్వకముందే శుభం కార్డు పడిపోతుంది.సరే పనిగట్టుకొని మరీ నాకు ఊప్మా అంటే ఇష్టం లేదని చెప్పాక,ఇష్టమయినదాని గురించి కూడ ఓ ముక్క రాయాలనిపించింది. ఒక్క ముక్క రాసి వదిలేస్తే నేను క్రాంతిని ఎలా అవుతాను.కాబట్టి చదవండి!

కాసేపు అందరు అలా గింగిరాలు తిరుగుతూ సత్యలోకంలోకి వెళ్తే,అక్కడ బ్రహ్మదేవుడు చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాడు.అదే, తెలుగువారిని సృష్టిస్తున్నాడు.కాని అప్పటికే సృష్టింపబడి ఉన్న అరవం వాడు అరవం అరవం అంటూనే తెగ అరుస్తూ బ్రహ్మదేవుడి బుర్ర తోడేస్తున్నాడు.ఎలాగైనా ఆ అరవం వాడి నోరు మూయించాలనే తొందర్లో తెలుగువారి కోసం అని తయారు చేసిన ఓ బ్రహ్మండమైన పదార్థాన్ని వాడి నోట్లో కుక్కేసాడు దేవుడు.తరవాత తీరిగ్గా రియలైజయిన బ్రహ్మదేవుడు "కటకట,హెంత పని జరిగిపోయింది!?" అని బాధపడ్డాడు.కాసేపటికి తేరుకున్నాక,ఎలాగు తెలుగువాడికి తనదగ్గరున్న వాటిని ఆరాధించడం చేతకాదు, ఎప్పుడు పక్కవాడి దగ్గరున్నవాటి గురించే ఆలోచిస్తాడు కాబట్టి వీడికి డైరెక్ట్ గా ఇవ్వటం కన్నా పక్కనున్న వాడికి ఇవ్వడమే కరెక్ట్ అనుకున్నాడు.ఇక అరవంవాడికి వాడి దగ్గరున్న బ్రహ్మపదార్ఠం యొక్క గొప్పదనం తెలియకుండా ఉండటానికి క్రిందివాటిని/వారిని సృష్టించాల్సివచ్చింది.
ఇంతకీ ఏంటయ్యా ఆ బ్రహ్మపదార్థం అంటే..ఇడ్లి..ఇడ్లి...ఇడ్లి.ఎఫెక్ట్ కోసం మూడుసార్లు అన్నాను అంతే.ఇంకెప్పుడన్నా ఏ అరవం వాడైనా ఇడ్లి మాదే అంటే పైనున్న ఫోటోల్ని మరొక్కసారి చూపించండి

ఇడ్లి అనగానే మీరంతా ఎక్కడో హాస్టలల్లో తిన్న పిండిముద్దల్ని,హోటల్లో సద్ది సాంబార్ పోసుకొని ముక్కుమూసుకొని తిన్న ఇడ్లీల్ని గుర్తుచేసుకొని మొహాలు చిన్నబుచ్చుకోకండి.అసలవి ఇడ్లీలే కాదు. వాటిని గిడ్లీలంటారు.అసలు ఇడ్లీలంటే ఎలా ఉండాలి! మల్లెపూవులాగ తెల్లగా,దూదిపింజెల్లా మెత్తగా ఉండాలి.ఇడ్లీల్లో నెయ్యి వేసుకొని, వేరుశెనగపప్పుల్తో చేసిన చట్నీలో అద్దుకొని తింటే ఎలాంటి వారైనా లేచి బంతి చేమంతి ముద్దాడుకున్నాయిలే అని ఆడిపాడాల్సిందే! (హెచ్చరిక: అందుకే ఆఫీసుల్లో ఇడ్లీలు తినటం అంత శ్రేయస్కరం కాదు)
అసలు ఇడ్లీలు ఎంత గొప్పవి కాకపోతే కామత్ హోటల్స్ అధినేత తన ఆత్మకథకి Idli,Orchid and Willpower అని పేరు పెడతారు! అన్నట్టు యండమూరి వారు ఈ పుస్తకాన్ని తెలుగీకరించారని ఈమధ్యే తెలిసింది నాకు.ఆ పుస్తకం పేరు "ఇడ్లీ,వడ,ఆకాశం".కాబట్టి రేపు ఎప్పుడన్నా నేను కూడ ఆత్మకథ రాయాలనుకుంటే,నా పుస్తకానికి కూడ ఇడ్లి కలసి వచ్చేట్టుగా పేరు పెట్టుకోవాలి.


ఇక ఈమధ్య టీవీల్లో చూసాను కొన్ని ప్రోగ్రాంస్..మన వంట,మన పక్కింటి వాళ్ళ వంట,సఖి,చెలి...ఇలాంటివన్నమాట.ఈ కార్యక్రమాలకి మహిళామణులు తళుకుబెళుకు చీరలు కట్టుకొని,చేతికి గోరింటాకు...అరెర్రె,ఇప్పుడు గోరింటాకు అనకూడదేమో!మెహందీ అనాలి కదూ! ఆ,అదే మెహందీ ...అదీ కూడ అరబిక్ డిజైన్లు పెట్టుకొని వచ్చేస్తుంటారు.వచ్చినవాళ్ళు తిన్నగా ఉండరు కదా,కిలకిలా నవ్వేస్తూ క్యారెట్ ఇడ్లీ,మిక్స్ వెజిటబుల్ ఇడ్లీ,ఇడ్లీ ఫ్రై ఇలాంటివి చేసేసి R.S Brothers ఇచ్చే చీరలు మొహమాటపడుతూ తీసుకుంటారు.ఇలాంటి బంగారు తల్లులందరికి ఒక చిన్న సూచన!(వీరికి సూచనలు మాత్రమే ఇవ్వగలం మనం,కాస్త గట్టిగా నొక్కి వక్కాణిస్తే వీపు ఇడ్లీ ఫ్రై అవుతుంది)మీ క్రియేటివిటి ఇంకా ఎక్కడన్నా చూపించండి కాని ఇడ్లీల్ని ప్రశాంతంగా వదిలేద్దురూ..ప్లీజ్!!

అన్నట్టు నేను ఒక రెండు సంవత్సరాలు ఇడ్లి వ్రతం చేసాను బెంగుళూరులో ఉన్నప్పుడు.రోజు ఉదయం అల్పాహారంలో రెండు ఇడ్లీలు మాత్రమే తినేదాన్ని.ఆఫీసులో క్యాంటీన్ కి వెళ్ళగానే వాడు నా మొహం చూడగానే ప్లేట్ ఇడ్లీ ఇచ్చేవాడు. ఒకరోజు క్యాంటీన్ వాడు అడిగాడు రోజు ఇడ్లీనే తింటారు ఎందుకు అని,చల్లని ACలో బాగ నిద్ర పట్టాలంటే ఇడ్లీ అయితే బెటర్ కదా అని చెప్పాను! తరవాత నా వెనకే ఉన్న మా డామేజర్ ని చూసి ఒక వెర్రి నవ్వు నవ్వాల్సి వచ్చింది.