Tuesday, March 18, 2008

బెంగుళూరు

ఉదయం తొమ్మిది గంటలవుతుంది.బస్టాపు అంతా జనాలతో నిండిపోయి ఉంది.జోదా అక్బర్ సినిమాలో యుద్ధం సీన్ లో ఉన్న సైనికుల మొహాల్లో కనిపించిన expression ఇప్పుడు బస్టాపులో ఉన్న జనాల మొహాల్లో కనిపిస్తుంది.అందరు బ్యాగులు,లంచ్ బాక్స్ లు తగిలించుకొని బస్ కనపడితే చాలు దాడి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు.తల పైకెత్తి చూసాను.ఎండ నా మొహం మీద ఈడ్చికొట్టింది.అమ్మో ఇదేమి ఎండ!అదే మన హైదరాబాదులో అయితేనా...అనుకొని ,వెంటనే మెహదీపట్నం బస్టాపులో బస్సుకోసం వెయిట్ చేసిన రోజులు గుర్తొచ్చాయి.ఈ బారు నుండి ఆ బారు దాక బస్సులు,జనాలు,ఎండ...నేను ఎక్కాల్సిన 19 నంబర్ బస్సు తప్ప అన్ని బస్సులు వచ్చేవి.ఒకవేళ నేను ఎక్కాల్సిన బస్సు వచ్చినా కాని నిండా జనాలతో వచ్చేది.అదేంటి ఇదే మొదటి స్టాపు కదా,అప్పుడే బస్సు ఎలా నిండిపోయింది? వాళ్ళంతా బస్సు స్టాపులోకి రాక ముందే బస్సుని ఎక్కడ హైజాక్ చేసి ఎక్కేవారో నాకు ఇప్పటికి అర్ధం కాదు.అవన్ని గుర్తొచ్చినప్పుడు బెంగళూరే కాస్త నయమనిపిస్తంది.కనీసం ఎండ తీవ్రతన్నా తక్కువగా ఉంటుంది.బయట ఎండ వాచిపోతుంటే టీవీలో ఆంటీ మాత్రం పగటి వాతావరణం పొడిగాను,ఉష్ణోగ్రత సామాన్య స్థాయిలోనూ ఉంటాయి అని చెప్తుంది.అసలు ఆవిడని ఒకసారి మెహదీపట్నం నుంచి కూకట్ పల్లికి బస్సులో తీసుకెళ్ళాలి,అప్పుడు కాని సామాన్య స్థాయి ఉష్ణోగ్రత అంటే ఏంటో తెలుస్తుంది.

బస్సుల కోసం దేబిరిస్తూ నిల్చున్నప్పుడు ఠీవిగా కారులో వెళ్తున్న వాళ్ళని చూస్తే నామీద నాకే జాలేస్తుంది.అసలు బెంగుళూరులో ఉదయం తొమ్మిది గంటలకి,సాయంత్రం ఆరు గంటలకి రోడ్లపైన కార్లు,ఫుట్ పాత్ ల పైన బైకులు తప్ప ఏమి కనిపించవు.ఫుట్ పాత్ పైన బైకు నడిపేవాడి కాలర్ పట్టుకొని బైక్ ఆపి నువ్వు ఫుట్ పాత్ పైన బండి నడిపితే బస్సుల కోసం నిలబడే మేము ఎక్కడ దేబిరించాలి అని అడగాలనిపిస్తుంది.మరీ ఇంత కష్టపడి బస్సులు ఎక్కే బదులు ఆటోలో వెళ్ళొచ్చు కదా అని అనిపిస్తుంది కాని ఇదేమన్నా హైదరాబాదా!హైదరాబాదులో అయితే రోడ్డుమీద కాలు పెట్టగానే రయ్యిమని మన మీదకి కనీసం నాలుగు ఆటోలు దూసుకొస్తాయి.పైగా మీటర్ పదిరూపాయలనుండి మొదలవుతుంది."ఆటో కావాలా మేడం" అని అడిగితే చాలు నేను ఆటో ఎక్కేస్తాను.నన్ను ఎవరన్నా మేడం అంటే చాలు నేను వాళ్ళకోసం ఏ పనైయినా చేసేస్తాను.

అదే బెంగుళూరులో అయితే ఆటోవాడ్ని బ్రతిమాలాలి.ఆటోదగ్గరికి వెళ్ళి మెజెస్టిక్ బస్టాండు అని అడిగితే చీదరింపుగా ఒక చూపు చూసి మొహం తిప్పుకుంటాడు."రాను" అని నోటితో ఒక్క మాట చెప్పొచ్చు కదా! ఆమాత్రం అదృష్టానికి కూడా నోచుకోలేదా నేను? ఒకవేళ మన పంట పండి వాడు వస్తాను అన్నా కాని వెంటనే "సౌ రుపయా" అంటాడు.మెజెస్టిక్ కి సౌ ఎందుకురా అంట్ల వెధవా అని తిట్టుకొని ఎక్కిన ఆటో దిగేసిన సందర్భాలు ఎన్నో!పోని మీటర్ వేసినా కాని,అది పద్నాలుగు రూపాయలతో మొదలవుతుంది.క్షణక్షణానికి అర్ధరూపయి పెరుగుతుంది.మీటర్ తో పాటు మన బిపి కూడ పెరుగుతుంది.తిప్పిన రోడ్డులోనే నాలుగుసార్లు ఆటోని అటూ ఇటూ పరిగెత్తించి మీటర్ తొంభై తొమ్మిది రూపాయల యాభై పైసలు అయినప్పుడు మెజెస్టిక్ బస్టాండు ముందు దించి వంద లాక్కొని వెళ్ళిపోతాడు.

ఈమధ్య నాజీతమంతా ఆటోలకి,షాపింగ్ మాల్స్ లో దిక్కుమాలిన సినిమాలు చూడడానికే సరిపోతుంది.అందుకే నేను ఒట్టుపెట్టుకున్నాను.మళ్ళీ ఆటో ఎక్కితే సునీల్ మీద ఒట్టు అని.సునీల్ అంటే మా మేనేజర్.చాలా గట్టోడు.ఒట్టు పెట్టిన తరవాత కూడ నాలుగైదుసార్లు ఆటో ఎక్కాను నేను.ఇంక సినిమాల విషయానికొస్తే హాల్లో సినిమాలు చూడటం మానేసాను నేను.ఫోరం షాపింగ్ మాల్ ముందు ఫుట్ పాత్ మీద మనకి దొరకని సీడీ అంటూ ఉండదు. ఇంగ్లీషు,హిందీ,తెలుగు,తమిళం...ఆఖరికి స్వాహిలి భాష సినిమా సీడీలు కూడ దొరుకుతాయి వెతకాలే కాని! కాని అప్పుడెప్పుడో మహేష్ బాబు టీవీలో కనిపించి "కిల్ పైరసీ" అని చెప్పాడు.అందుకే నేను దొంగ సీడీలు కొనను.మరి ఈ సమస్యకి పరిష్కారం లేదా అంటే ఉంది.మా టీమ్ లో ఎవరు ఏ సీడీలు కొన్నా కాని,సర్వర్ లో కాపీ చేస్తారు.ప్రతి శుక్రవారం మధ్యాహ్నం నేను సినిమాలన్ని లాప్ టాప్ లో కాపీ చేసుకొని బస్సు ఎక్కి హాస్టల్ కి వెళ్ళి సినిమాలు చూస్తాను.మహేష్ బాబు సీడీలు కొనద్దని చెప్పాడు కాని చూడొద్దని చెప్పలేదు కదా! :-)