Thursday, February 12, 2009

హమార బజాజ్

ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది.అమ్మ,నాన్న,ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ కలిపి కట్టాలి అని ఇందిరత్త అమ్మకి డైరెక్షన్స్ ఇస్తుంది.బయటకెళ్ళి కళ్ళు నులుముకొని చూస్తే కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ బజాజ్ కబ్ స్కూటర్ వరండాలో కనిపించింది.అమ్మని అడిగాను ఎవరిది ఈ స్కూటర్ అని?ఎవరిదో అయితే మన వరండాలో ఎందుకు ఉంటుందే పిచ్చి మొహమా! మనదే.నాన్న ఈరోజే గోదావరిఖని వెళ్ళి కొనుక్కొచ్చారు అని స్కూటర్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టడంలో బిజి అయిపోంది.ఎందుకో ఆ స్కూటర్ మాదే అంటే నమ్మబుధ్ధి కాలేదు నాకు చాలాసేపటివరకు.అప్పట్లో మా కాలనీలో చాలామందికి లూనాలు ఉండేవి.ఒకరిద్దరికి మాత్రం స్కూటర్ ఉండేది.అప్పట్లో అసలు లూనా ఉండటమే గొప్ప.ఇక స్కూటర్ ఉందంటే అబ్బో ఇహ వాళ్ళ గురించి చెప్పనే అఖ్ఖర్లేదు.

మొదటిసారి స్కూటర్ మీద బయటికెళ్ళినప్పుడు నేను ఎంత గర్వంగా ఫీల్ అయ్యానో!మా నాన్న నన్ను ఎత్తుకొని ముందుసీటుకి,హ్యాండిల్ కి మధ్య ఉన్న కాసింత స్థలంలో నిల్చోబెట్టి హ్యాండిల్ మీద రెండు చేతులు పెట్టించి గట్టిగా పట్టుకోవాలి అని చెప్పి స్కూటర్ స్టార్ట్ చేసారు.అలా వెళ్ళేటప్పుడు నాకు రోడ్డు కనిపిందలేదు,అప్పుడు నేనింకా బుడంకాయనన్నమాట.మానాన్న చేతి సందుల్లోంచి అటుఇటు రోడ్డుమీద ఉన్నవాళ్ళకి చేతులూపి తెగ సంబరపడిపోయాను.మావీధిలో ఆచివర్నుండి ఈచివరికి తిప్పి ఇంటికి తీసుకొచ్చారు.స్కూటర్ దిగింతరవాత కూడ ఎక్కడో తేలిపోతున్న అనుభూతి.ఓహ్! స్కూటర్ మీద వెళ్తే ఇంత మజాగా ఉంటుందా అని అనుకున్నాను.

ఇక అప్పట్నుంచి మా నాన్న అప్పుడప్పుడు నన్ను స్కూటర్ మీద బజార్ కి తీసుకెళ్ళేవాళ్ళు,స్కూల్ లో దింపేవాళ్ళు,వర్షం పడుతున్నప్పుడు వరండాలో ఉన్న స్కూటర్ పైన కూర్చొని వర్షం చినుకులతో ఆడుకోవడం,ఎంత ఆటలో మునిగిపోయి ఉన్నాకాని వీధి చివర్లో మానాన్న స్కూటర్ కనిపించగానే నేను పరిగెత్తుకొని ఎదురెళ్ళి అక్కడ్నుండి స్కూటర్ ఎక్కి ఇంటికి రావటం ఇవన్ని ఇంకా నిన్నమొన్న జరిగినట్టే నాకళ్ళ ముందు కదలాడుతున్నాయి.అసలు ఆ స్కూటర్ మీద నేను ఎన్ని రకాల ఆటలు ఆడానో!కొన్నాళ్ళకి మానాన్న కొలీగ్ వాళ్ళబ్బాయి,నవీన్ గాడు మా స్కూటర్ సీట్లన్ని బ్లేడుతో ఇష్టమొచ్చినట్టు కోసిపడేసాడు.మానాన్న చాలా భాదపడ్డారు.నాకయితే వాడిమీద పీకలదాక కోపమొచ్చింది.సీట్లు మార్పించాలంటే బోలెడంత ఖర్చు!అప్పట్లో అన్నింటికి పంచవర్ష ప్రణాళికలు రూపొందింపబడేవి కదా!కాని అలా వదిలేస్తే చూడటానికి బాగోలేదు.అప్పుడు మాఅమ్మ నల్ల సెల్లో టేప్ తెచ్చి ఎక్కడా చిరుగులు కనిపించకుండా అతికించింది.ఆ తరవాత చాలారోజులకి సీట్లు మార్పించారు.

నేను పదోతరగతికి వచ్చేసరికల్లా నాకు స్కూటర్ వెనక సీట్ కి ప్రమోషన్ వచ్చింది.అప్పట్లో మాకాలనీలో చాలానే స్కూటర్లు కనిపించేవి.కాకపోతే బజాజ్ కబ్ లు తక్కువే! ఎందుకంటే కబ్ చాలా బరువుంటుందంట.ఎక్కువమంది చేతక్,LML వెస్పా నడిపేవారు.ఇక ఇప్పుడంటారా, అన్ని స్ప్లెండర్లు పల్సర్లే కదా!అసలిప్పుడు రోడ్లమీద స్కూటర్ కనిపించడం చాలా అరుదు.మానాన్నతో పాటు స్కూటర్లు కొన్నవాళ్ళంతా ఎప్పుడో వాటిని అమ్మేసి మోటర్ సైకిళ్ళని కొనుక్కున్నారు.మానాన్న మాత్రం ఇంకా ఆ స్కూటర్ నే నడిపిస్తున్నారు.ట్రాన్స్ ఫర్ అయిన ప్రతిచోటికి స్కూటర్ ని కూడ తీసుకొని వెళ్తారు.ఎండయినా,వానయినా దాని మీదే ఆఫీసుకెళ్తారు.మొన్నామధ్య మాటల సందర్భంగా నాన్నని "మీతోపాటు కొన్న వాళ్ళందరి స్కూటర్లు తుక్కు తుక్కు అయిపోయి మెకానిక్ షెడ్డులు చేరాయి,మరి మీ స్కూటరేమో ఇంకా ఆరోగ్యంగా ఉంది.ఏంటి రహస్యం" అని అడిగాను.దానికి నాన్న ఒక చిరునవ్వు నవ్వి "నాకు బావమరుదులు కాని,కొడుకులు కాని లేకపోవటమే!" అని అన్నారు.ఆమాటలు గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది నాకు.

ఇప్పుడు కార్లయినా,మోటర్ సైకిళ్ళయినా లోన్లమీద కొనెయ్యటం,కొత్త మోజు పోయేవరకు లేదా బోరుకొట్టేవరకు వాడటం తరవాత మార్కెట్ లో వచ్చిన ఇంకో మోడల్ బండి కొనేసి ఉన్న బండిని అమ్మేయడం, అన్ని చకచకా జరిగిపోతున్నాయి.మహా అంటే పదేళ్ళకి మించి ఎవ్వరు వాడటం లేదు.మానాన్న లాంటి కొందరు మాత్రమే ఇలా ఒకే బండిని సంవత్సరాలు సంవత్సరాలు వాడుతుంటారు.ఇది అమ్మేసి కొత్త బండి కొనుక్కోడి నాన్న అంటే అది కేవలం స్కూటర్ అయితే అమ్మేసేవాడ్నే కాని అందులో నా ఇరవయ్యేళ్ళ జీవితం ఉంది.బుడిబుడి నడకల నా పిల్లల ఆటలు,వాళ్ళ సరదాలు ఇంకా ఆ స్కూటర్ మీద నాకు కనిపిస్తున్నాయి.నా జ్ఞాపకాల్ని నేను అమ్మలేను అని చెప్పారు.ఇప్పటికి ఇంటికెళ్తే వరండాలోనే ఎదురొచ్చి పలకరిస్తుంది మా నాన్న స్కూటర్.కాదు కాదు హమార బజాజ్!