Monday, December 8, 2008

వీళ్ళు ఇంక ఎప్పుడు మారుతారో?

ఈరోజు నాఫ్రెండ్ దగ్గర్నుండి నాకొక ఈ-మెయిల్ వచ్చింది.అది చదివి నేను చాలా బాధపడ్డాను.విషయమేంటంటే,ఈ-మెయిల్ పంపిన నాఫ్రెండ్ బెంగుళూరులో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్.వయస్సు రమారమి 32,అవివాహిత.ఈమధ్య ప్రాజెక్ట్ రిలీజ్ చేసే సమయం కాబట్టి ఆఫీసులో చాలా పొద్దుపోయే వరకు ఉండాల్సివస్తుందంట.రిలీజ్ టైమ్ లో ఒక్కొక్కసారి రాత్రిళ్ళు మొత్తం ఆఫీసులో ఉండాల్సి వస్తుంది,అది వేరే విషయం.ఆరోజు ఆమె రాత్రి 10.30 ప్రాంతంలో ఆఫీసు నుండి తన కైనటిక్ మీద బయలుదేరిందంట.మధ్యలో పోలిసు పెట్రోలింగ్ వారు తన బండిని ఆపారంట. ఎక్కడినుండి వస్తున్నావు,ఈటైమ్ దాక ఆఫీసులో ఏమి పని అంటూ మొదలుపెట్టారంట.తన ID కార్డు,డ్రయివర్స్ లైసెన్స్,బండికి సంబంధించిన పత్రాలు అన్నీ సరిగ్గానే ఉన్నా వదల్లేదంట.తనిఖి అంటూ తన బ్యాగు,లాప్టాపు లాక్కున్నారంట.అదే సమయంలో ఆ దార్లో వెళ్ళే ఇంక వేరే ఏ ఇతర వాహనాన్ని కూడ పోలిసులు తనిఖి కోసం ఆపలేదంట.నువ్వు ఎక్కడుంటావు,ఎవరితో కలసి ఉంటావు,ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు అంటూ అడ్డమయిన ప్రశ్నలు వేసారంట!ఏమన్నా అంటే ముంబైలో జరిగిన పేలుళ్ళ తరవాత అందరిని తనిఖి చేస్తున్నామని చెప్పారంట.వాళ్ళు నిజంగా తనిఖి చేసేవాళ్ళయితే వేరే వాహనాల్ని ఎందుకు ఆపలేదు? అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్నా కాని నాఫ్రెండ్ ని అంత రాత్రి పూట రోడ్డు పైన నిలబెట్టాల్సిన అవసరం ఏంటి? తనిఖి చెయ్యాల్సినప్పుడు లేడి కానిస్టేబుల్ తో చేయించవచ్చు కదా! కేవలం వాళ్ళకి టైమ్ పాస్ కావడానికి తనని అంతసేపు నిలబెట్టి సతాయించారు.ఇవన్ని ఏంటని అడిగిన ఆమెని పోలిసులు బెదిరించారంట.ఇక్కడ రాయలేని విధంగా భయపెట్టారంట.ఆమె చేసిన తప్పేంటి? ఎందుకు భయపడాలి పోలిసుల్ని చూసి? బాంబు పేలుళ్ళు,మతఘర్షణలు జరిగినప్పుడు ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా ప్రజల్ని కాపాడే పోలిసులకి మనం చెయ్యెత్తి జై కొడతాం.కాని అదే డిపార్ట్ మెంటులో ఉన్న ఇలాంటి బి-గ్రేడు రౌడీల్ని ఎవరు ఏమి చెయ్యలేరా?

పోలిసుల్లో కేవలం బి-గ్రేడ్ రౌడీలు మాత్రమేనా అంటే,కాదు పరమ బద్దకస్తులు,దద్దమ్మలు కూడా ఉన్నారు.రెండేళ్ళక్రితం నేను వైజాగ్ నేవిలో ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక కంప్లయింట్ ఇవ్వడానికి నేను వైజాగ్ టూ టవున్ పోలిస్ స్టేషన్ కి వెళ్ళాల్సి వచ్చింది.కంప్లయింట్ ఇచ్చే ప్రహసనం మొత్తం నా సహనానికే పరిక్ష పెట్టింది. ఇంతకీ విషయమేంటంటే ఆఫీసు ప్రెమిసెస్ లో అడుగుపెట్టడానికి నేవివాళ్ళు నాకొక ID కార్డు ఇష్యూ చేసారు.నా ఖర్మకాలి ఒకరోజు అదికాస్తా ఎక్కడో పోయింది.నేను ఆఫీసు నుండి ఇంటికి ఒక బస్సు,ఒక ఆటోలో ప్రయాణం చేసేదాన్ని.బ్యాగులో పెట్టిన పర్సు,డబ్బులు అన్ని ఉన్నాయి.కేవలం ID కార్డు మాత్రమే పోయింది.ఎవరన్నా కావలని చేసారో,లేక ఆటోలో కాని బస్సులో కాని ఎక్కడన్నా పడిపోయిందో మరి నాకయితే తెలియదు.ఆఫీసులో చెప్తే మాబాసు నేవి కమాండర్ నామీద చిందులు తొక్కాడు.పోలిస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చి,కంప్లయింట్ నంబర్ తెచ్చి నేవి సెక్యూరిటి ఆఫీసర్ కి ఇచ్చి,ఆయనతో అక్షింతలు వేయించుకొని,బుద్ధితక్కువయి ID కార్డు పోగొట్టాను లెంపలేసుకుంటున్నాను అని ఒక లెటర్ రాసి సంతకం పెట్టి ఇస్తే,వాళ్ళు ఒక కమిటి ఏర్పాటు చేసి కార్డు పోగొట్టుకున్న పరిస్థితులు తెలుసుకొని కన్విన్స్ అయితే వాళ్ళు నాకు ఇంకొక కార్డు ఇష్యూ చేస్తారు.లేదా నేవి వాళ్ళు నామీద పోలిసులకి కంప్లయింటు ఇస్తారు నేను ID కార్డుని దుర్వినియోగం చేసినట్టు,లేదా ఎవరన్నా సంఘవిద్రోహ శక్తులకి కార్డు ఇచ్చినట్టు!!

ఇప్పటివరకు నాజీవితంలో నాకొచ్చిన పెద్ద కష్టం ఇది.తెల్లరి పొద్దున్నే పోలిస్ స్టేషన్ కి వెళ్ళాను.స్టేషన్ బయటే ఒక చిన్న బల్ల వేసి ఉంది.కంప్లయింట్లు అక్కడే రాసి ఇవ్వాలంట.అక్కడ కూర్చున్న లేడి కానిస్టేబుల్ దగ్గరికెళ్ళి విషయం చెప్పడానికి ప్రయత్నించాను.ముందు నువ్వెళ్ళి ఆ బెంచీమీద కూర్చోపో అని కసిరింది.నాపక్కన కూర్చున్న చాలామంది కట్నం వేధింపులని,భర్త కొడుతున్నాడని కంప్లయింటు ఇవ్వడానికి వచ్చినవాళ్ళే.కంప్లయింట్లు తీసుకోవాల్సిన ఆ లేడి కానిస్టేబుల్ ఒక్క కంప్లయింట్ రాయించుకొని వెళ్ళిపోయింది.ఎంతకీ తిరిగి రాదే!ఆమె కోసం చూసి చూసి నాకు విసుగొచ్చి,ఆకలేసి సాయంత్రం 5.30 ప్రాంతంలో ఇంటికొచ్చేసాను.తరవాత మూడురోజులు ఇదే పరిస్థితి.నాలుగోరోజు నావంతు వచ్చింది.కంప్లయింట్ రాసిస్తే అసలు ఆమెకి విషయమే అర్ధం కాలేదు.కంప్లయింట్ తీసుకోనని పేపర్ నామొహాన కొట్టింది.ఆక్షణాన నాకు ఎంత కోపమొచ్చిందో,కాని ఏమి చెయ్యలేను.అక్కడే బెంచీమీద కాసేపు కూర్చున్నాను.ఏంటో నను జైలుకెళ్ళినట్టు,నాకు ఉరిశిక్ష పడ్డట్టు పిచ్చి పిచ్చి ఆలోచనలొచ్చాయి.ఇక తప్పదని ఇంకో కానిస్టేబుల్ తో మాట్లాడాను.ఆయన రైటరంట,ఆ స్టేషన్ కి.కంప్లయింట్ రాసివ్వమన్నాడు,కాని దాని మీద SI సంతకం చేస్తేనే కంప్లయింట్ నంబర్ ఇస్తానన్నాడు.ఇంక ఆ SI మహానుభావుడు అసలు స్టేషన్ కి ఎప్పుడు వస్తాడో ఆ భగవంతుడికి కూడ తెలియదేమో.ఆయన్ని పట్టుకొనేసరికి ఇంకో నాలుగురోజులయ్యింది.కేవలం ID కార్డు పోయిందంటే ఎవ్వరు నమ్మటం లేదు.అందుకే దొంగ కంప్లయింట్ రాసిచ్చాను.పర్సు పోయిందని అందులో డబ్బులతోపాటు కార్డు కూడ ఉందని చెప్పాను.మొత్తానికి కంప్లయింట్ నంబర్ చేతికొచ్చే సరికి ఎనిమిది రోజులు పట్టింది.ఈ ఎనిమిది రోజులు బాస్ తో ఫోన్ లో షంటిగ్స్,కొలిగ్స్ ఓదార్పులు,నిజంగా నరకం కనిపించింది.అంతా చేస్తే ఆ కంప్లయింట్ నంబర్ అనేది చిన్న స్లిప్,హోటల్లో భోజనం చేసాక ఇచ్చే బిల్లంత ఉంది.పోలిసు ఇంకొంచెం భాధ్యతగా వ్యవహరించి ఉంటే నా పని ఒక్క రోజులో అయిపోయేది.తీసుకున్న జీతాలకి సరిపడా పనిచేస్తే బాగుంటుంది కదా! ఇలాంటి పోలిసులంతా ఎప్పటికన్నా బాగుపడతారని,బాగుపడాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.

Monday, October 20, 2008

అమెరికా పోదాం రా!

ఒకరోజు మధ్యాహ్నం పెరుగన్నం తిని ఆఫీసులో నేను సీరియస్ గా పనిచేసుకుంటున్నాను.(నేను పని చేస్తున్నాని మీరంతా నమ్మితీరాల్సిందే!). ఇంతలో 'బర్..ర్..ర్..ర్' మని శబ్దం.ఏంటో చూద్దును కదా,మా ఆయన ఫోను చేస్తున్నాడు.అబ్బ ఈ సెల్ ఫోన్లతో పెద్ద చిక్కొచ్చి పడింది.ప్రశాంతంగా నిద్ర కూడ పోనియ్యవు.అదే!ప్రశాంతంగా పనికూడ చేసుకోనియ్యవు.ఏందబ్బా అని అడిగితే "మనం ఎమ్మటే అమెరికా పోవాలి, ఇంటికి రాగానే బట్టలు సర్దు" అని చెప్పాడు.ఇదేమన్నా అమలాపురమా! ఎప్పుడనుకుంటే అప్పుడు పెట్టెలో నాలుగు జతల బట్టలు పెట్టుకొని పోవడానికి? ఏదో తమాషా చేస్తున్నాడులే అని "ఆ! సర్దుతాలే!" అని చెప్పి ఫోన్ పెట్టేసా.బహుశా మాఆయనకి కూడ పెరుగన్నం ఎక్కువయ్యిందేమో! అందుకే ఏంటేంటో మాట్లాడుతున్నాడు.

కాని సాయంత్రం ఇంటికెళ్ళాక అర్ధమయ్యింది,నిజంగానే మా ఆయన అమెరికా వెళ్ళాలని.అయ్యో రామా! మళ్ళీ నేను హాస్టల్ లో ఉండాలా? అసలీ హాస్టల్ ల గొడవ భరించలేకే కదా పెళ్ళి చేసుకుంది.మూడ్నాళ్ళ ముచ్చట లాగా మళ్ళీ హాస్టల్ లో బేర్..ర్..ర్..మనాలి కావొచ్చు."డిపెండెంట్ గా నువ్వు కూడ నాతో రావచ్చు" అని చెప్పాడు."మరి నా ఉద్యోగమో!" అంటే,"కొన్నాళ్ళు బ్రేక్ తీసుకో" అని చెప్పాడు.బ్రేక్ తీసుకొని బెంగుళూరులో ఉంటే నా డ్రీమ్ జాబ్ టీచర్ ఉద్యోగం చెయ్యొచ్చు! కాని అమెరికాలో నేనేమి చెయ్యాలి? టీచర్ ఉద్యోగం అంటే గుర్తొచ్చింది,నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు సెలవులకి ఇంటికెళ్ళినప్పుడు మాకాలనీలో ఉన్న ట్రినిటి స్కూల్ లో పదోతరగతి పిల్లలకి ఇంగ్లీషు,ఫిజిక్స్ చెప్పేదాన్ని.అబ్బో! స్కూల్ లో మనకి విపరీతమయిన ఫాలోయింగ్ ఉండేది!కాబట్టి నా టీచర్ ఉద్యోగానికి ఢోకా లేదు.కాని ఎంత ఆలోచించినా నాకేమి పెరుగుబోవటం లేదు.ఇట్లా కాదని,న్యూజెర్సీలో ఉన్న మా శశిగాడికి ఫోన్ చేసాను.

శశిగాడు ఎవరో మీకు చెప్పలేదు కదూ! శశి,నేను మూడో తరగతి నుండి ఫ్రెండ్స్.పొద్దున్నే "మళ్ళీ నీ మొహం చూడను" అనే రేంజ్ లో కొట్టుకొని,సాయంత్రం వాళ్ళమ్మ పెట్టిన పులిహోర తిని మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోవడం మాకు మామూలే.ఎంతయినా పులిహోర చెయ్యడంలో శశి వాళ్ళమ్మ తరవాతే ఎవరయినా! ఆ పులిహోరే అసలు వాడ్ని ఇన్నాళ్ళ నుండి కాపాడుతుంది.ఫోన్ చెయ్యగానే "కాంత్! శశికాంత్ హియర్" అన్నాడు."నీ మొహంలే కాని,నేను అమెరికా వద్దామనుకుంటున్నాను" అని చెప్పాను.అంతే పగలబడి నవ్వాడు."నీ దయ వల్ల అసలే అమెరికా ఆర్దిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉంది.ఇంకా ఏమి ఉద్ధరించాలని అమెరికా వస్తున్నావు?"అని అడిగాడు.అవును మరి,కాలం కలసి రాకపోతే శశిగాడి చేతిలో కూడ మాటలు పడాల్సి వస్తుంది.వాడికి విషయమంతా చెప్పి,అమెరికాలో నాకు పొద్దుబోతుందా? అని అడిగాను."ఎందుకు పొద్దుబోదు? చీరలమీద బూట్లేసుకుని వాకింగ్ చేసే ఆంటీలు,నున్నగా నూనె పెట్టుకొని తలలో తులిప్స్ పెట్టుకొనే తమిళ తంగచ్చిలు బోలెడు మందే ఉంటారు.ఎవరో ఒకరు తగులుతారులే నీకు కూడా!" అని చెప్పాడు."నీకు ఇంకో విషయం చెప్పనా! ఇక్కడి ఇండియన్ రెస్టారెంట్లో జిలేబి ఆర్డరిస్తే వేడి వేడిగా ప్లేట్లో ప్రత్యక్షమవుతాయి.ఇంక నువ్వేమి ఆలోచించకు,ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకో " అని చెప్పాడు.అలా జిలేబికి కక్కుర్తి పడి నేను అమెరికాకి ప్రయాణం కట్టాను.

సరే అమెరికా వెళ్ళేటప్పుడు మధ్యలో ఫ్రాంక్ ఫర్ట్ లోనో,ఆమ్ స్టర్ డామ్ లోనో విమానం ఆపుతాడు కదండీ! అని మా అయన్ని అడిగితే,మనం వెళ్ళేది ఆ రూట్ లో కాదు,ఇవతలి పక్కనుండి అంటే హాంగ్ కాంగ్ మీద నుండి అని చెప్పాడు.అయ్యో రామా! సినిమాల్లో లాగా ఆమ్ స్టర్ డామ్ చూడొచ్చు కదా! అని అనుకున్నాను,కాని కుదర్లేదు. ప్రయాణం రోజు రానే వచ్చింది.ఏంటో, రెండు సుమోలకి సరిపడా జనం వచ్చారు మమ్మల్ని ఎయిర్ పోర్టులో దించడానికి.అదృష్టం కొద్ది ఎవ్వరూ ఏడుపులు,పెడబొబ్బలు పెట్టలేదు.బయలుదేరాక నాకు ఒకటే చెవునొప్పి! మా ఆయనకి చెప్తే ఇలా ఎక్సర్సైజులు చెయ్యాలని ఏంటో విచిత్రమయిన ఎక్స్ ప్రెషన్లు చూపెట్టాడు.అలాంటి ఎక్స్ ప్రెషన్స్ పెట్టడం నాకు చేతగాక,కన్నడ సినిమా హీరోలా ఏరకమయిన ఎక్స్ ప్రెషన్ పెట్టకుండా గమ్మున కూర్చున్నాను.ఇంక ఈ ప్రయాణంలో నాకు బాగా చిరాకు తెప్పించిందేంటంటే,మంచినీళ్ళు! నేనేమో,ఎంతలేదన్నా రోజుకు కనీసం ఐదు లీటర్ల నీళ్ళు తాగుతాను.ఫ్లయిట్ అటెండెంట్ అమ్మని మంచినీళ్ళు అడిగినప్పుడల్లా చాలా పొదుపుగా చిన్న కప్పులో సగం నీళ్ళు నింపి జయలలితలాగ నవ్వి నవ్వనట్టు ఒక నవ్వు నవ్వి ఇచ్చేది.నాకేమో ఆ మంచినీళ్ళు సరిపోవాయే! ఇలా కాదని,మా అయనకి రెండు గ్లాసులు,నాకు మూడు గ్లాసుల మంచినీళ్ళు కావాలని అడిగాను.అప్పుడు ఆయమ్మ చూసిన చూపులు మళ్ళీ ఇండియా వెళ్ళేదాక మర్చిపోను నేను.అందుకే చికాగోలో దిగగానే తనివితీరా లీటర్ నీళ్ళు తాగేసాను.ఇంక అసలు తలనొప్పి చికాగో ఎయిర్ పోర్ట్ లోనే మొదలయ్యింది.ఇమిగ్రేషన్ క్లియరెన్స్ అని ఒక గంటసేపు లైన్ లో నిలబెట్టారు.తరవాత ఒక కౌంటర్ దగ్గరికెళ్తే ఒక నల్లాయన(అయ్యో,ఇక్కడ నలుపు,తెలుపు అనే పదాలు వాడొద్దని మాఆయన చెప్పాడు) ఉన్నాడు.వీసా మీద ఒక స్టాంపు గుద్ది పంపేదానికి,నా మొహం కాసేపు,మాఆయన మొహం కాసేపు,ఇండియా గురించి కాసేపు మాట్లాడి ప్రాణం తీసాడు.

బయటికొచ్చి చూద్దును కదా,అబ్బో చికాగో ఎయిర్ పోర్టు చాలా పెద్దగా ఉంది సుమీ!మా ఆయన అటూ,ఇటూ కాసేపు తిరిగొచ్చి మనం ఎక్కాల్సిన విమానం ఆరు గంటల తరవాత ఉంది అని చెప్పాడు.సరే అని ఒకచోట లాంజ్ లో కూర్చున్నాము.మా పక్కనే ఒకాయన కూర్చున్నాడు.చూస్తే ఇండియన్ లాగానే ఉన్నాడు."ఏవండీ,ఇండియన్ అనుకుంటా,మాట్లాడనా?" అంటే,"ఒద్దు,అలా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకు" అని చెప్పి నిద్రపోయాడు.నాకేమో నిద్ర రాదాయే! కాసేపటికి నా పక్కనాయనకి ఫోన్ వచ్చింది.ఫోన్ లో "అరేయ్,నా బట్టలు కవర్ లో పెట్టి గారేజిలో పెట్టాను,లాండ్రీలో ఇచ్చేసేయ్" అని చెప్తున్నాడు.అంతే,మా ఆయన జబ్బ మీద ఒక్కటి చరిచి "ఏవండీ,మన పక్కనున్నాయన తెలుగువాడేనండి,పాపం ఏదో లాండ్రీ కష్టాల్లో ఉన్నాడు" అని తలతిప్పి చూసే సరికి ఆ తెలుగాయన వెళ్ళిపోతూ కనిపించాడు.అలా తెలుగాయనతో మాట్లాడే బంగారంలాంటి అవకాశం చేజారి పోయింది.ఆ తరవాత బోలెడంతసేపు వెయిట్ చేసాక మేము ఎక్కాల్సిన విమానమొచ్చింది.ఎక్కి కూర్చున్నాక.....

Thursday, October 16, 2008

బ్లాగు ప్రయాణంలో నేను - క్రాంతిఒకరోజు గూగుల్ లో దేనికోసమో వెతుకుతూ ఉంటే అనుకోకుండా శోధన్ సుధాకర్ గారి బ్లాగు చూసాను.ఒక రెండు గంటలు ఆయన బ్లాగులోని టపాలన్ని చదివాను."చాలా బాగా రాసారే!" అని అనుకున్నాను.(కాని ఎందుకో ఆయన ఈమధ్య రాయటం లేదు).తరవాత ఆయన బ్లాగులో కామెంట్లు రాసిన రాధిక గారి బ్లాగు,ప్రవీణ్ గార్లపాటి గారి బ్లాగు చూడటం జరిగింది.ఇంతకు మునుపు నాకు కవితలన్నా,కవులన్నా చాలా చిరాకొచ్చేది.నాకు ఎదురయిన సంఘటనలు అలాంటివి మరి!కాని రాధిక గారి బ్లాగు చూసాక నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను.చిన్న చిన్న పదాలతో మనసుకు హత్తుకునే అర్ధవంతమయిన కవితలెన్నో చదివాను నేను ఈబ్లాగులో.ఇక ప్రవీణ్ రాసే టెక్నికల్ టపాలు కూడ క్రమం తప్పకుండా చదివేదాన్ని.
కొన్నాళ్ళకి నేను ఎలా తయారయ్యానంటే శని,ఆదివారాల్లో కూడా నేను ఈమూడు బ్లాగులతోనే గడిపేసేదాన్ని(అప్పటికింకా నాకు కూడలి గురించి తెలియదు నాకు).అప్పుడే నాకు నేను కూడ తెలుగులో రాయాలనే దుర్భుద్ధి పుట్టింది.అలా నేను బ్లాగు ప్రారంభించడానికి వీరు ముగ్గురు నాకు inspiration.మెదట్లో రాయడానికి చాలా కష్టపడ్డాను.అప్పుడు నాబ్లాగుకి సోలో రీడర్ మా అక్కే! పాపం నా టపాల మీద తన అభిప్రాయాన్ని నొప్పింపక తానొవ్వక అన్న రీతిలో చెప్పేది.ఒకరోజు ప్రవీణ్ బ్లాగులో అన్ని బొత్తాముల మీద నొక్కుతుంటే నాకు కూడలి గురించి తెలిసి నా బ్లాగుని కూడ జత చెయ్యడం జరిగింది.అలా నా బ్లాగు ప్రయాణం మెదలయ్యింది.అప్పట్నుంచి బుర్రలోని ఙ్ఞాపకాలని బ్లాగులో భద్రపరచుకొంటున్నాను.

Sunday, September 14, 2008

సినిమా కష్టాలు

చల్లగా సాగిపోతున్న నాజీవితంలోకి ఒకసారి ఎండాకాలం వచ్చింది.ఎండాకాలం అంటే రోజంతా ఇంట్లోనే ఉండాలి.కనీసం రెండు గంటలయినా లెక్కలు చేసుకోవాలి లేదా ఎక్కాలు చదవాలి.ఇంతకన్నా పెద్ద శిక్ష ఉంటుందని నేను అనుకోను.నేనయితే నాపిల్లల్ని ఎండాకాలంలో చదివించను.ఊరిమీద పడి ఊరేగండ్రా! అని బయటకి పంపిస్తా.అయినా క్యాలిక్యులేటర్లు,కంప్యూటర్లు కనుక్కున్నాక కూడ ఎక్కాలు చదవడం ఏంటో చాదస్తం కాకపోతే!

అందుకే ఒకరోజు ధైర్యం చేసి నాన్నని అడిగా సినిమాకి తీసుకెళ్ళమని.ఒక చూపు చూసారు నన్ను."సినిమాలో ఏముంది?మూడుగంటలు టైమ్ వేస్టు.అదే ఒక మంచి పుస్తకం చదివితే తెలియని విషయాలు తెలుస్తాయి,నిద్రపోతే రెస్టుగా ఉంటుంది,లేకపోతే ఇంటిపనిలో అమ్మకి హెల్ప్ చెయ్యొచ్చు కదా!" అని నాకే క్లాస్ పడింది.అదేంటి నాన్న అలా అంటారు? "అమ్మాయి-అబ్బాయి-ప్రేమ" అనే ఒకేఒక్క కాన్సెప్ట్ మీద ఎన్ని వందల సినిమాలు తీయ్యొచ్చో తెలుగు సినిమాలు చూసి తెలుసుకోవచ్చుకదా అని అందామనుకొని ఎందుకో నాకుడి కన్ను అదురుతుంటే ఎందుకొచ్చిన గోలలే అని నోరుమూసుకున్నాను.సినిమాల విషయంలో మాఅమ్మ కూడ మాకే సపోర్టు.ఎప్పుడు సినిమాకి తీసుకెళ్ళరని నాన్నతో నిష్ఠూరమాడుతుంది.

కాని మానాన్న సినిమాకి తీసుకెళ్ళక పోవటానికి ఒక కారణముంది.మాకాలనీలో థియేటర్లు లేవు కాబట్టి సినిమా అంటే గోదావరిఖనికి వెళ్ళాలి.అంటే రాను నలభై నిమిషాలు,పోను నలభై నిమిషాలు ప్రయాణం.ఆ! నలభై నిమిషాలే కదా అని అనుకోవచ్చు మీరు కాని మధ్యలో అంతా చిట్టడవిలాగా ఉంటుంది.ఏచెట్టు చాటు నుండి ఏఅన్నో,అక్కో ప్రత్యక్షమవుతారో తెలియదు.సినిమాకెళ్ళి వస్తున్న ఒకరిద్దరిని పోలిసులనుకుని లేపేసిన దాఖలాలు కూడ ఉన్నాయి.కాబట్టి మానాన్న థియరీ ప్రకారం ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ 'అమ్మాయి-అబ్బాయి-ప్రేమ' టైపు సినిమాలు చూడటం అస్సలు అవసరం లేదు.అలా మా ఎండాకాలం సెలవులన్ని దాదాపు ఒకేలాగా జరిగిపోతుండేవి.ఉదయాన్నే మానాన్న ఆఫీసుకెళ్ళడం,పదింటికళ్ళా మాఅమ్మ మాకు తలకి నూనె పెట్టి అటొక పిలక,ఇటొక పిలక జడలు కట్టి పుస్తకాల ముందు కూర్చోబెట్టడం(ఎంత బతిమాలినాకాని మాఅమ్మ ఒక్క జడ మాత్రం అస్సలు వేసేది కాదు),సాయంత్రం నాలుగింటికి కొబ్బరిబొండాలు తాగడం,మానాన్న రాత్రి పదకొండింటి వరకు దలాల్ స్ట్రీట్ పుస్తకం చదవడం...ఇలా అన్నమాట.

అలాంటిది ఎప్పుడు లేని విధంగా ఒకరోజు మానాన్న సాయంత్రం నాలుగింటికే ప్రత్యక్షమయ్యారు.ఇంటిముందు లావణ్యవాళ్ళతో ఆడుకుంటున్న నన్ను పిలిచి "తొందరగా తయారవ్వండి,సినిమాకెళ్దాం" అని చెప్పారు."నాన్న, నిజంగా నిజమేనా?" అని అడిగాను.మానాన్న ఒక చిరునవ్వు నవ్వి నిజంగానే వెళ్దాము,తొందరగా వెళ్ళకపోతే టిక్కెట్లు దొరకవు మరి అని చెప్పారు.వీరస్పీడులో నేను ఇంటివెనక కూరగాయలు కోస్తున్న మాఅమ్మ దగ్గరికెళ్ళి,"అమ్మోయ్,నాన్న సినిమాకి తీసుకెళ్తానన్నారు,నన్ను తొందరగా తయారు చేయించు" అని చెప్పాను."ఎండకి నీకు మతిగాని తప్పిందటే!సినిమా,గినిమా అన్నావంటే వీపు చింతపండవుతుంది.ఇంకా నువ్వు పదమూడో ఎక్కం అప్పజెప్పనేలేదు" అని కోస్తున్న దొండకాయని నామీదకి విసిరింది."ఎప్పుడు పదమూడో ఎక్కమేకాదమ్మా ప్రపంచం అంటే,ఒకసారి బయటకొచ్చి చూడు ఎన్ని తెలుగుసినిమాలున్నాయో.అయినా సినిమా విషయం నువ్వు నాన్ననే అడుగు" అని చెప్పాను.ఈలోపే మానాన్న టైమ్ వేస్ట్ చెయ్యకుండా,ముందురోజు చదివేసిన దలాల్ స్టీట్ పుస్తకాన్ని మళ్ళీ చదువుతున్నారు.

అమ్మ: ఏంటండీ,తొందరగా వచ్చారీరోజు?
(నేను:అబ్బ!! ఈఆడవాళ్ళు ఏవిషయమైనా తిన్నగా అడగరు కదా!)
నాన్న: అవునోయ్! తొందరగా తయారవ్వండి,సినిమాకెళ్దాం.
అమ్మ: ఏవండీ..! ! ! ! ! (హాశ్చర్యానందాలు కలగలిపిన కేక)

అంతే దెబ్బకి మానాన్న చదువుతున్న పుస్తకాన్ని విసిరిగొట్టారు ఆకేకకి.ఆతరవాత గంటలో మేము గోదావరిఖని,కవిత థియేటర్లో ప్రత్యక్షం.ఆవిధంగా మేము కుటుంబ సమేతంగా చూసిన తొలి తెలుగు సినిమా 'సీతారామయ్య గారి మనవరాలు'.ఆసినిమా మా అమ్మకి,నాన్నకి విపరీతంగా నచ్చేసింది.ఇప్పటికి కూడ "సినిమా బాగుంది కదరా!" అని అంటారు మానాన్న."ఏ సినిమా నాన్న?" అంటే,"అదే అప్పుడే మర్చిపోయావా,మనందరం కలిసి చూసాము కదా,సీతారామయ్యగారి మనవరాలు" అంటారు.అలా మానాన్న దృష్టిలో సినిమా అంటే సీతారామయ్యగారి మనవరాలే!వేరేవన్ని పిచ్చి గంతులే.

Saturday, August 30, 2008

ముంబై మేరి జాన్

మాములుగా నేను ఏదయినా సినిమాకెళ్ళాలంటే ఒక పది రివ్యూలు చదివి, ఆఫీస్ లో పదిమందిని వాళ్ళ అభిప్రాయాల్ని కనుక్కొని మరి చూస్తాను.అలాంటి నేను ఈ సినిమాకి ఎలాంటి రివ్యూస్ చదవకుండా,ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను.అందుకే కాబోలు నేను మొదటిసారిగా ఒక సినిమాకి రివ్యూ రాస్తున్నాను.2006 జూలై 11వ తారిఖున ముంబైలోని ఒక లోకల్ ట్రైన్ లో జరిగిన పేలుళ్ళు ఇతివృత్తంగా సాగుతుంది ఈ సినిమా.అయిదుగురు సాధారణ వ్యక్తుల జీవితాల్లో ఈపేలుళ్ళు ఎలాంటి మార్పుల్ని తెచ్చాయి అన్నది కథాంశం.ప్రతి సంఘటనని కమర్షియలైజ్ చేసి రేటింగ్స్ పెంచుకోవాలని తాపత్రయపడే న్యూస్ ఛానల్స్ ని,అమెరికాలోనో,UK లోనో సెటిల్ అయితే ఇక భవిష్యత్తుకి ఢోకా ఉండదన్న భావనలో ఉన్న నేటి యువతరాన్ని చక్కగా ఆవిష్కరించారు ఈ సినిమాలో.

స్వతహగా పరేష్ రావల్ అభిమానినయిన నేను ఈ సినిమాలో ఆయన నటనకి మరొక్కసారి జై కొడుతున్నాను.ఒకరకంగా ఈ సినిమాకి ఆయన హీరో అని చెప్పవచ్చు.రిటైర్ మెంటుకి చేరువలో ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ తన ముప్పయ్ అయిదు సంవత్సరాల సర్వీసులో డిపార్ట్ మెంటులోని అధికారుల అలసత్వాన్ని,లంచగొండితనాన్ని ప్రశ్నించలేక తనకు తానుగా అసమర్ధునిగా,లంచగొండిగా మారి మధనపడే పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు.ఆవేశపరుడైన కానిస్టేబుల్ పాత్రలో విజయ్ మౌర్య కూడా బాగ నటించారు.మరొక ముఖ్యమయిన పాత్రని ఇర్ఫాన్ ఖాన్ పోషించారు.సైకిల్ మీద టీ అమ్ముకునే చిరువ్యాపారి పాత్రలో ఆయన కనిపిస్తారు.తమిళ క్రిస్టియన్ అయిన ఈ పాత్ర(ఈపాత్రని తమిళయన్ గా ఎందుకు చూపించారో నాకయితే అర్ధం కాలేదు.పైగా ఇర్ఫాన్ ఖాన్ తమిళియన్ గా అస్సలు సూట్ అవ్వలేదు :)) ఒక సందర్భంలో షాపింగ్ మాల్ లో తనకి జరిగిన అవమానం వల్ల మొత్తం డబ్బున్న వాళ్ళంటేనే ద్వేషం పెంచుకుంటాడు.తనకి జరిగిన అవమానానికి ప్రతీకారంగా కాయిన్ బాక్స్ ఫోన్ ద్వార పోలిసులకి షాపింగ్ మాల్ లో బాంబు ఉందంటు తప్పుడు సమాచారాన్ని అందించి,తరవాత జరిగే గలాటాని చూసి సాడిస్టిక్ ఆనందాన్ని పొందుతాడు.క్రమంగా అది అతనికొక అలవాటుగా మారి రోజుకొక మాల్ లో బాంబు ఉందని పోలిసులకి ఫోన్ చెయ్యటం తరవాత జరిగే తమాషాని ఎంజాయ్ చెయ్యడం మాములైపోతుంది.తరవాత ఈ పాత్రలో మార్పు తెచ్చిన తీరు చాలా బాగుంది.

ప్రతి ముస్లిమ్ తీవ్రవాదే అని వితండవాదం చేసే హిందు నిరుద్యోగి పాత్రలో K.K.మీనన్ ఎప్పటిలాగానే బాగా నటించారు.మాధవన్ ఒక యువ ఉద్యోగిగా,సోహా అలీఖాన్ న్యూస్ రిపోర్టర్ గా కనిపించారు.మెదటిసారి సోహా ఈ సినిమాలో నటించడానికి ప్రయత్నించింది :)!!!! మొదటిసినిమా అయినప్పటికి ఎక్కడా సాగదీయకుండా,బోర్ కొట్టించకుండా చక్కగా తీసారు దర్శకుడు నిశికాంత్ కామత్.

ఏ దిల్ హై ముషికిల్ జీనా యహా
జర హట్ కె జర బచ్ కె,
యేహే ముంబై మేరి జాన్!!!!...
అంటు ముగుస్తుంది ఈ సినిమా.

Tuesday, July 8, 2008

ఉప్మా పురాణం

తెలుగు భాషలో నాకు నచ్చని పదం ఏదయినా ఉంది అంటే అది "ఉప్మా".ఉప్మా నిజంగా తెలుగు పదమేనా,కాదా అంటే నాకు తెలియదు.ఉప్మా పుట్టుపూర్వోత్తారాలు తెలుసుకోవాలనే ఆసక్తి కూడ లేవు నాకు.ఉప్మా అంటే ఎందుకు నాకు అంత చిరాకంటే రెండు,మూడు,నాలుగు కారణాలున్నాయి.మొదటిది నాకు జ్వరమొచ్చినప్పుడల్లా అమ్మ ఉప్మానే చేస్తుంది.ఎందుకంటే అంటే తొందరగా జీర్ణం అవుతుందని చెప్పేది.ఇప్పుడంత తొందరగా జీర్ణం అవ్వకపోతే ఏమి కొంపలు మునిగిపోతాయో నాకు అర్ధం కాదు.రెండవది,నేను రకరకాల హాస్టల్స్ లో రకరకాల ఉప్మాలు తిన్నాను(ఏమని చెప్పను నా ఉప్మా కష్టాలు!).మూడవది,పై రెండు కారణాల్లో ఏదో ఒకటి.నాలుగవది,పై మూడు కారణాలు.

చిన్నప్పట్నుంచి కూడ మా ఇంట్లో ఉప్మా టిఫిన్ అయినరోజు నేను ప్రళయం సృష్టించేదాన్ని.భాదాకరమయిన విషయమేంటంటే మానాన్న కూడ ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు."బాగానే ఉంది కదరా,తినొచ్చు కదా!" అని చెప్పేవాళ్ళు.మీకు తెలియదు నాన్న ఉప్మా తినడం ఎంత నరకమో అని అనుకునేదాన్ని నేను.అయినా ఉప్మా తినడమే ఎక్కువంటే అందులో మా అమ్మ వేసే చెత్త చెదారం అంతా ఇంతా కాదు.కరివేపాకు(ఉప్మా తరవాత నాకు అత్యంత చిరాకు తెప్పించే పదార్ధం ఇది),కొత్తిమీర,అల్లం ముక్కలు,బీన్స్,క్యారెట్,నా మొహం..etc అన్నమాట.మా అమ్మకంతా నా పోలికే,నాకన్నా పంతం కాస్త ఎక్కువే.ఉప్మా చేసిన రోజు కావాలని నన్ను మానాన్న ముందు కూర్చోబెట్టి తినిపించేది.కళ్ళనీళ్ళు పెట్టుకున్నా కాని కనికరించేది కాదు మా కనకదుర్గ! నాకు ఉప్మా తినిపించాక అమ్మ మొహంలో విజయ గర్వం కనిపించేది.ఉప్మారవ్వతో చేసే ఉప్మా కాకుండ మాఅమ్మ ఇంక రకరకాల ఉప్మా ప్రయోగాలు చేసేది.ఇడ్లీ ఉప్మా,బ్రెడ్ ఉప్మా,సేమ్యా ఉప్మా..ఇంకా రకరకాలవి.నేనొకసారి అమ్మకి చెప్పాను,"అమ్మా! నువ్వు ఎన్ని రకాలుగా చేసినాకాని,ఉప్మాపట్ల నా మనసు మార్చుకోను.ఉప్మా,నేను బద్దశత్రువులం.మా ఇద్దరి మధ్య ఎప్పటికి ప్రేమ పుట్టదు..పుట్టదు".మాఅమ్మ కోపం నటిస్తూ "ఈ తెలివితేటలకేం తక్కువలేదు" అంటూ నవ్వేసింది.అయినా నాకు అర్ధంకాక అడుగుతాను ఇడ్లీని ఇడ్లీగా,బ్రెడ్ ని బ్రెడ్ లా తినొచ్చుకదా,మళ్ళీ అన్ని efforts పెట్టి ఉప్మాలా మార్చడం అవసరమా? ఒకసారి మీరే ఆలోచించండి.ఇంకా విచిత్రం ఏంటంటే పెసరట్టు-ఉప్మా!నేను పెసరట్టు తిని ఉప్మా మాఅక్కతో తినిపించేదాన్ని.

ఉప్మా నాకు శత్రువులని కూడ తెచ్చిపెట్టిందంటే మీరు నమ్ముతారా! కాని ఇది నిజం.చిన్నప్పుడు నేను Rose buds convent school లో LKG చదివేదాన్ని.మానాన్న నన్ను బళ్ళో చేర్చేటప్పుడు టీచర్ కి "మాఅమ్మాయికి చదువు రాకపోయినా పర్వాలేదు కాని కొట్టొద్దు" అని చెప్పారు.కాబట్టి టీచర్ నన్నేమి అనేది కాదు.రోజు మాటీచర్ నాకు అటుకులు,పంచదార కలిపిస్తే తినేసి అరుగు మీద పడుకునేదాన్ని.స్కూల్ అయిపోయే టైమ్ కి కృష్ణ నన్ను నిద్ర లేపేవాడు.వాడితో కలసి ఇంటికొచ్చేదాన్ని.కృష్ణ మా పక్కింట్లో ఉండేవాడు.వాడు కూడ నాక్లాసే! ఒకరోజు కృష్ణ నన్ను ఫాస్ట్ గా లాక్కెళ్తున్నాడు స్కూల్ కి.నేను ఆ పేస్ కి మ్యాచ్ అవ్వలేకపోయా.అంత ఫాస్ట్ గా నడవలేక నేను నీతో రాను అని ఒక చెట్టుకింద కూర్చున్నాను.కృష్ణకి చాలా కోపమొచ్చింది."తొందరగా నడుస్తావా,లేదా?ఉప్మా మొహమా!" అని అన్నాడు.నన్ను ఉప్మా మొహం అంటావా అని పక్కనే ఉన్న రాయితో వాడి తలమీద ఒక్కటిచ్చా! అంతే క్షణాల్లో వాడి మొహమంతా రక్తం.తెల్లటి వాడి షర్ట్ కూడ ఎర్రగా అయిపోయింది.మా ఇద్దరికి రక్తం చూసేసరికి కంగారు పుట్టింది.ఇద్దరం రోడ్డుమీదే నిల్చోని ఏడుస్తుంటే ఎవరో ఒకాయన మమ్మల్ని సైకిల్ మీద ఇంటికి తీసుకొచ్చాడు.హాస్పిటల్ కి తీసుకెళ్ళాక వాడి గుండుకి కుట్లు పడ్డాయి.నేను కొట్టిన ఉప్మా దెబ్బతో వాడి డిప్ప షేపు మారిపోయింది.ఆ తరవాత కృష్ణ మళ్ళీ ఎప్పుడు నన్ను స్కూల్ కి తీసుకెళ్ళలేదు.ఆడుకోవడానికి కూడ మా ఇంటికి వచ్చేవాడు కాదు.అసలు నన్ను చూస్తేనే చాలు భయపడేవాడు.వాడు మాట్లాడకపోతే వాడి ఉప్మా ఖర్మ అనుకొని నేను కూడ వదిలేసాను.అయినా ఫ్రెండ్షిప్ లో ఆ మాత్రం చిన్న చిన్న గొడవలు రావా ఏంటి? ఆమాత్రానికే మాట్లాడటం మానేస్తే ఎలా?

ఇంక పెళ్ళిళ్ళప్పుడు,వ్రతాలప్పుడు చూడాలి,సామిరంగా! ఒక్కొక్కడు మానెడు ఉప్మాలో సోలెడు చట్నీ పోసుకొని లాగిస్తుంటాడు.మళ్ళీ గడికొకసారి ఎవరోఒకరు వచ్చి "పలహారాలు తిన్నారా?" అని అడుగుతారు.ఆ పెద్ద పెట్టావులేవోయ్ గొప్ప పలహారం అని అనుకుంటాను నేను.ఇంతకీ ఉప్మా పురాణంలో నేను చెప్పొచ్చేది ఏంటంటే,ఉప్మాది మైనపు నమూనా చేసి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టాలి.అంతటి ఐటమ్ ఛీజ్ ఉప్మా.

Tuesday, June 10, 2008

వర్షం...మొదలయ్యింది

నిన్న నేను ఆఫీస్ నుండి ఇంటికెళ్ళేసరికి మా వీధీలో పిల్లల్లందరు క్రికెట్ ఆడుతున్నారు.ఇప్పుడా ఇంకాసేపటికా అన్నట్టు వర్షం పడటానికి ఆకాశమంతా మేఘాలతో సిద్ధంగా ఉంది.జూన్ నెలతో వచ్చే కళే వేరు.అసలు జూన్ అంటేనే వర్షాలు,జూన్ అంటేనే స్కూల్,జూన్ అంటేనే కొత్త పుస్తకాలు,దాదాపు రెండు నెలల వేసవి సెలవుల తరువాత కలుసుకోబోయే స్నేహితులు,ఇంకా ఎన్నో!

చిన్నప్పుడు నాకు వర్షం ఎలా,ఎందుకు పడుతుందో అస్సలు అర్ధమయ్యేది కాదు.మా అమ్మని అడిగితే,"ఎండ తగ్గడానికి వినాయకుడు తొండంతో నీళ్ళు చల్లుతున్నాడు" అని చెప్పేది.తరువాత ఎప్పుడో ఏదో తరగతి సామాన్య శాస్త్రంలో వర్షం ఎలా పడుతుందో తెలుసుకొని బోలెడంత హాశ్చర్యపోయాననుకోండి.అది వేరే విషయం.అదిరిపొయే మా రామగుండం ఎండల్లో తొలిసారి వర్షం పడగానే ఒక్కసారిగా మా కాలని రూపురేఖలు మారిపోయేవి.వర్షంలో తడుస్తూ నేల బండ ఆడుకునేవాళ్ళం.దొరికిన కాగితానల్లా పడవలు చేసి వాటి పైన పేర్లు రాసుకొని వర్షపు నీళ్ళల్లో వదిలేవాళ్ళం.ఇంకా అప్పటిదాక లేని హాబి "గార్డెనింగ్" వర్షం పడగానే పుట్టుకొచ్చేది.ఫ్రెండ్స్ ఇంటికెళ్ళి గులాబి,మందారం కొమ్మలు తెచ్చి మా పెరట్లో నాటి రోజు పొద్దున్నే నిద్రకళ్ళతో వెళ్ళి వాటిని చూసుకోవడం,దాదాపు మా కాలనీలో అందరి ఇళ్ళలో ఇదే జరిగేది.

కాని వర్షాకాలంలో నాకు ఒకటే నచ్చేది కాదు.అదేంటంటే,నాకు మా అక్కకి కలిపి ఒకటే గొడుగు ఉండేది.వర్షంలో స్కూల్ కి వెళ్ళేటప్పుడు గొడుగులో వెళ్ళినంతసేపు దానిదే పెత్తనం.ఒక్కసారి కూడ నన్ను గొడుగు పట్టుకోనిచ్చెది కాదు.పోని స్కూల్ కి వెళ్ళాకయినా గొడుగు నాతో క్లాస్ కి తీసుకెళ్తానంటే ఇచ్చేది కాదు."నువ్వు పడేస్తావు,నేను జాగ్రత్తగా దాచిపెడతా" అని ఎప్పుడు తనతోనే తీసుకెళ్ళేది.ఇంతవరకు దాదాపు ఎప్పుడు నేను గొడుగులో ఒక్కదాన్ని వెళ్ళలేదు.ఎప్పుడు నా గొడుగులో వేరే వాళ్ళని తీసుకెళ్ళడమో,లేకపొతే నేనే వేరే వాళ్ళ గొడుగులో వెళ్ళడమో జరుగుతుంటుంది.

ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు మాత్రం వర్షం పడితే,అది కూడ మంగళవారం వర్షం పడితే నేను literally ఎగిరి గంతేసేదాన్ని(ప్రతి మంగళవారం మాకు లాబ్ వర్క్ ఉండేది).ఎందుకంటే వర్షం పడితే మా ఎలక్ట్రికల్ మెషిన్స్ లాబ్ లోకి నీళ్ళు వచ్చేసేవి.అప్పుడు మెషిన్స్ అన్ని shutdown చేసేవాళ్ళు.సో ఆరోజు లాబ్ కి వెళ్ళనవసరం లేదు.ఒక మూడు గంటలు క్యాంటీన్లో పడి దొరికింది దొరికినట్టు తినేసేవాళ్ళం. ఒకరి మీద ఒకరు జోకులేసుకుంటూ సరదగా గడిచిపోయేది.

రెండు సంవత్సరాల క్రితం నేను వైజాగ్ లో ఉన్నప్పుడయితే దాదాపు నెల రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది.ఇల్లు,బట్టలు అన్ని తడిచిపోయేవి.transportation చాల ఇబ్బంది అయ్యింది.వర్షాలకి కూరగాయలన్ని పాడయిపోయి ధరలు ఎంత పెరిగిపోయాయంటే,ఒక చిన్న సొరకాయ అరవయి రూపాయలు పెట్టి కొన్న రోజులు కూడ ఉన్నాయి.ఇంకా ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే,వైజాగ్ లో వర్షం పడితే అదొక రకమయిన వాసనొస్తుంది.భరించలేము.కాని వర్షం పడుతున్నప్పుడు R.K బీచ్ లో ఆడుకోవడం మాత్రం బాగుంటుంది.బెంగళూరుకి వచ్చాక నాకు వర్షానికి కొత్త అర్ధం తెలిసింది.సాయంత్రం సరిగ్గా ఆఫీస్ నుండి బయటకి రాగానే,అప్పటిదాక మనకోసమే ఎదురుచూస్తున్న వర్షం మెల్లగా మొదలవుతుంది.దడ దడ ఒక పది నిమిషాలు పడి తగ్గిపోతుందా అంటే,అలా తగ్గదు.డ్రెస్స్ మీద బురద పడి వేసుకున్న డ్రెస్స్ అత్యంత వికారంగా తయారయ్యాక,ఇంక మనం ఇంటికి చేరుకున్నామని వర్షానికి confirm అయ్యాక అప్పుడు తగ్గుతుంది.మళ్ళీ రోజు పది పదిహేను నిమిషాల తేడాతో ఆఫీస్ అయిపోయే టైమ్ కే వర్షం పడుతుంది.అబ్బ! ఒకటే నస ఈ బెంగళూరు వర్షాలతో.

Friday, May 16, 2008

ఇంగ్లీష్ నేర్చుకుందాం

ఇంగ్లీష్ అంటేనే ఒక విచిత్రమయిన భాష.నాకు,ఇంగ్లీష్ కి చాలా దూరం.నేను వీలయినంతవరకు ఇంగ్లీష్ లో మాట్లాడను,ఎందుకంటే నాకు రాదు కాబట్టి. మా టీమ్ లో అందరు అరవము,కన్నడ వాళ్ళే! అందరికి మన తెలుగు కొద్దో గొప్పో నేర్పించేసాను కాబట్టి నా పని తేలికయిపోయింది.కాని ఈమధ్యే రీహాబిలిటేషన్ సెంటర్ నుండి తప్పించుకొచ్చిన మా సునీల్ ఇంగ్లీష్ తో ఠారెత్తించేస్తున్నాడు.ఇంగ్లీష్ మాట్లాడటం,వినడము అలవాటు తప్పి అసలు ఆయనేమి మాట్లడుతున్నాడో ఆయనకి,మాకు ఎవ్వరికి అర్ధం కాకుండా పోతుంది.అందుకే మా టీమ్ లో అందరము మా అంతట మేము సొంతంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాము.మేము కూడ సునీల్ లాగ సెంటర్ లో చేరదామనుకున్నాము కాని వాళ్ళు కేవలం ప్రాజెక్ట్ మేనేజర్లనే చేర్చుకుంటారంట!

నాకు పదో తరగతి దాక ఇంగ్లీష్ లో మంచి మార్కులే వచ్చినట్టు గుర్తు,మరి ఇప్పుడెందుకు ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడ గుర్తు రావటం లేదా అని బాగ ఆలోచించాను.అప్పుడు గుర్తొచింది నాకు మా ఇంగ్లీష్ సిలబస్.active voice,passive voice.

Rama killed Ravana అంటే active voice.

Ravana was killed by Rama అంటే passive voice.

అంతే పదో తరగతి పెద్ద పరీక్షల దాక అదే active voice,passive voice.అయినా ఇంగ్లీష్ నేర్చుకోవటనికి అన్నట్టు ఎవరు చదివారు కనుక,ఎంతసేపు మార్కుల గొడవే.పదో తరగతిలో 500 పైన మార్కులు రాకపోతే ఇంక అంతే.వాడ్ని పురుగుని చూసినట్టు చూస్తారు.ఇది చాలదన్నట్టు,పదో తరగతి సంక్రాంతి సెలవల దగ్గర్నుండే ఇంటర్ కాలేజీల వాళ్ళు తయారయ్యే వాళ్ళు.500 దాటితే ఎంత ఫీజు తగ్గిస్తారో 510 దాటితే ఎంత తగ్గిస్తారో.. చెప్పి చిన్న మెదడులో బోలెడంత టెన్షన్ పెట్టించేవాళ్ళు.ఇప్పుడయితే పరిస్థితి చెయ్యి దాటిపోయింది.పదో తరగతిలో 600కి 650 మార్కులొస్తేనే శ్రీచైతన్యలో కాని,నారాయణలో కాని ఇంటర్ చదవగలరు పిల్లలు.పదో తరగతి దాకే ఇంగ్లీషు చదివేది.ఇంటర్ లో ఇంగ్లీష్ ఉన్నాకాని చదవనిచ్చేవాళ్ళు కాదు.ఇంక "స్కోరింగ్ సబ్జెక్ట్" అయిన సంస్కృతం సంగతి అయితే చెప్పనవసరం లేదు.ఎంతసేపు లెక్కలు,ఫిజిక్స్,కెమిస్ట్రీ అంతే.ఒకసారి మా చైతన్య కాలేజీలో రాత్రి 10.30కి స్టడీ అవర్ లో నేను మా వార్డెన్ కి ఇంగ్లీష్ చదువుతూ ఎర్రచేతులతో పట్టుపడ్డాను.అంతే తెల్లారి మా పెద్దసార్ దగ్గర నాకు అరగంట క్లాస్.జీవితంలో ఏద్దన్నా సాధించాలంటే integration,trignometry,బెంజీన్ రింగు ఎంత ముఖ్యమో నాకు కళ్ళు తెరిపించి,మళ్ళీ ఇంగ్లీష్ పుస్తకం ముట్టుకోనని నాతో రాతపూర్వకంగా రాపించుకొని అప్పుడు లెక్కల క్లాస్ కి పంపించాడు.కాబట్టి నా ఇంగ్లీష్ active voice,passive voice దగ్గరే ఆగిపోయింది.ఇంక ఇంజనీరింగులో మనము ఏది చదివాము కనుక ఇంగ్లీష్ చదవడానికి.నాలాంటి వాళ్ళందరికి GRE,TOEFLరాసేటప్పుడు అర్ధమవుతుంది ఇంగ్లీష్ అంటే active voice,passive voice మాత్రమే కాదు,ఇంకా బోలెడు ఉన్నాయని.కాబట్టి అద్యక్షా! నేను చెప్పేదెంటంటే తెలుగు,సంస్కృతం,లెక్కలు,ఫిజిక్స్,కెమిస్ట్రీ,ఇంకా నాకు అర్ధం కాని జంతు శాస్త్రం...అన్ని చదువుకోవాలి,కాని వాటితోపాటు ఇంగ్లీష్ కూడ చదువుకోవాలి/నేర్చుకోవాలి.

Thursday, May 15, 2008

బ్లాగుతా తీయగా చల్లగా

అని ఎప్పటికప్పుడు కొత్త కొత్త బ్లాగులు బర బర,చిర బర బ్లాగేయాలని ఉంటుంది నాకు.కాని ఎలా? నేను ఏమో బోలెడన్ని కష్టాల్లో ఉన్నాను.అదేంటో అన్ని కష్టాలు నాకే,అదీ ఒకేసారి వచ్చిపడతాయి.

నాకు వచ్చిన అతి పెద్ద కష్టమేంటంటే,నాకు ఈ మధ్యే పెళ్ళయ్యింది.పెళ్ళి తరవాత మా అమ్మ,అత్తయ్య విడి విడిగా,జాయింట్ గా కలిపి మొక్కిన మొక్కుబడులన్ని తీర్చడానికి మేము దాదాపు మన రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్ని తిరిగాము.ఇంకా పక్క రాష్ట్రాల్లోవి కొన్ని మిగిలి ఉన్నాయి.నాకు పెళ్ళయ్యాక ఒక పెద్ద నిజం తెలిసింది.పెళ్ళంటే సినిమాల్లో చూపించినంత కలర్ ఫుల్ గా ఏమి ఉండదు.ముఖ్యంగా అమ్మాయిలకి అయితే మరీ!నన్నే చూడండి,పెళ్ళికి ముందు మహారాణి లాగ ఉండేదాన్ని.మరి ఇప్పుడో,ఇల్లు నేనే సర్దాలి,వంట నేనే సర్దాలి.నచ్చినా,నచ్చకపోయినా అందరు వేసే సొల్లు జోకులకి నవ్వాలి.అబ్బ సోది లైఫ్!!పైగా నాకు,మా ఆయనకి ఒక్క విషయంలో ఏకాభిప్రాయం కుదరదు.కాబట్టి సమాన హక్కుల కోసం జరిగే పోరాటలతోనే సరిపోతుంది.

ఇది చాలదన్నట్టు సిటీ మధ్యలో ఉన్నమా ఆఫీస్ ని ఊరు అవతల ఉన్న వైట్ ఫీల్డ్ కి మార్చారు.మా సెంటర్ డైరెక్టర్ హాయిగా మెర్సిడెస్ లో వస్తాడు.మమ్మల్ని మాత్రం డొక్కు బస్సుల్లో చంపుతున్నాడు.ఉదయాన్నే,అంటే చాలా ఉదయాన్నే అన్నమాట..నా జన్మలో ఎప్పుడు నేను అంత తొందరగా నిద్రలేచి ఉండను.రోజు ఉదయాన్నే అయిదు గంటలై లేచి ఆరు గంటలకల్లా బస్టాపులో ఉండాలి.అడ్డామీద కూలీల్లా బస్సు కోసం వెయిట్ చెయ్యాలి.మాయదారి బస్సు ఒకరోజు వచ్చిన టైమ్ కి ఇంకొక రోజు రాదు.మెడలో బిళ్ళ,చేతిలో లాప్ టాప్,పార,పలుగు,తలమీద తట్టతో రెడీగా ఉండాలన్నమాట.బస్ ఎక్కగానే నేను నా సరంజామ అంతా పక్కనోల్ల మీద పడేసి నిద్రపోతా.మరి రోజులో పదహారు గంటలు నిద్రపోయే నన్ను ఉదయాన్నే అయిదు గంటలకి లేవమంటే ఇలానే ఉంటుంది.ఇక వారాంతపు సెలవుల్లో పగలు,రాత్రి తేడా తెలియకుండా నిద్రపోతున్నాను నేను.

వీటికి తోడు నాకు ఇంకొక కొత్త అలవాటు కూడ పుట్టుకొచ్చింది.అదే టీవి.హాస్టల్ లో ఉన్నప్పుడు కూడ టీవి ఉండేది కాని నేను ఎక్కువ చూసేదాన్ని కాదు.రిమోట్ ఎవరో చేతిలో ఉన్నప్పుడు టీవి చూడాలంటే నాకు పరమ చిరాకు.అదే ఇప్పుడయితే ఎంచక్కా రిమోట్ నా చేతిలోనే ఉంటుంది కాబట్టి తెగ టీవి చూస్తున్నాను.చూడటమే కాదు,ఒక తెలుగు సీరియల్ ని నేను విపరీతంగా,రెగ్యులర్ గా ఫాలో అయిపోతున్నాను.చూడగా,చూడగా జీడిపాకం సీరియల్స్ నచ్చేస్తున్నాయి నాకు.ఇంక మా పనమ్మాయి తో కన్నడలో,మా ఇంటి ఓనర్ వాళ్ళమ్మాయితో ఇంగ్లీషులో మాట్లాడేసరికి ఆయాసం వస్తుంది.మా ఓనర్ వాళ్ళమ్మాయి నన్ను "ఆంటీ" అని పిలిచినప్పుడల్లా నాకు ఏడుపు తన్నుకొస్తుంటుంది కాని ఏదో అలా నెట్టుకొస్తున్నాను.అదేంటో పెళ్ళయితే చాలు వద్దన్నా కాని ఆంటీగా ప్రమోషన్ ఇచ్చేస్తారు.ఖర్మ!

కొత్తపాళీ గారు అప్పుడెప్పుడో ఇచ్చిన "తెల్లకాగితం" అనే కథాంశానికి ఇన్ని రోజులకి బుర్ర వెలిగింది కాని ఇప్పుడు ఆ కథని బ్లాగులో రాస్తే అందరు తిడతారని నా కథని టపా కట్టించేసా.ఇంక రెండో కథాంశం "షేర్ ఆటో" కి ఇంకొక ఆరునెలలకి కాని అవుడియా రాదనుకుంట!అన్నట్టు ఈ సందట్లో పడి అసలు విషయం మర్చిపోయాను.నా బ్లాగు ఈ మధ్యే మొదటి పుట్టినరోజు జరుపుకుంది.Tuesday, March 18, 2008

బెంగుళూరు

ఉదయం తొమ్మిది గంటలవుతుంది.బస్టాపు అంతా జనాలతో నిండిపోయి ఉంది.జోదా అక్బర్ సినిమాలో యుద్ధం సీన్ లో ఉన్న సైనికుల మొహాల్లో కనిపించిన expression ఇప్పుడు బస్టాపులో ఉన్న జనాల మొహాల్లో కనిపిస్తుంది.అందరు బ్యాగులు,లంచ్ బాక్స్ లు తగిలించుకొని బస్ కనపడితే చాలు దాడి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు.తల పైకెత్తి చూసాను.ఎండ నా మొహం మీద ఈడ్చికొట్టింది.అమ్మో ఇదేమి ఎండ!అదే మన హైదరాబాదులో అయితేనా...అనుకొని ,వెంటనే మెహదీపట్నం బస్టాపులో బస్సుకోసం వెయిట్ చేసిన రోజులు గుర్తొచ్చాయి.ఈ బారు నుండి ఆ బారు దాక బస్సులు,జనాలు,ఎండ...నేను ఎక్కాల్సిన 19 నంబర్ బస్సు తప్ప అన్ని బస్సులు వచ్చేవి.ఒకవేళ నేను ఎక్కాల్సిన బస్సు వచ్చినా కాని నిండా జనాలతో వచ్చేది.అదేంటి ఇదే మొదటి స్టాపు కదా,అప్పుడే బస్సు ఎలా నిండిపోయింది? వాళ్ళంతా బస్సు స్టాపులోకి రాక ముందే బస్సుని ఎక్కడ హైజాక్ చేసి ఎక్కేవారో నాకు ఇప్పటికి అర్ధం కాదు.అవన్ని గుర్తొచ్చినప్పుడు బెంగళూరే కాస్త నయమనిపిస్తంది.కనీసం ఎండ తీవ్రతన్నా తక్కువగా ఉంటుంది.బయట ఎండ వాచిపోతుంటే టీవీలో ఆంటీ మాత్రం పగటి వాతావరణం పొడిగాను,ఉష్ణోగ్రత సామాన్య స్థాయిలోనూ ఉంటాయి అని చెప్తుంది.అసలు ఆవిడని ఒకసారి మెహదీపట్నం నుంచి కూకట్ పల్లికి బస్సులో తీసుకెళ్ళాలి,అప్పుడు కాని సామాన్య స్థాయి ఉష్ణోగ్రత అంటే ఏంటో తెలుస్తుంది.

బస్సుల కోసం దేబిరిస్తూ నిల్చున్నప్పుడు ఠీవిగా కారులో వెళ్తున్న వాళ్ళని చూస్తే నామీద నాకే జాలేస్తుంది.అసలు బెంగుళూరులో ఉదయం తొమ్మిది గంటలకి,సాయంత్రం ఆరు గంటలకి రోడ్లపైన కార్లు,ఫుట్ పాత్ ల పైన బైకులు తప్ప ఏమి కనిపించవు.ఫుట్ పాత్ పైన బైకు నడిపేవాడి కాలర్ పట్టుకొని బైక్ ఆపి నువ్వు ఫుట్ పాత్ పైన బండి నడిపితే బస్సుల కోసం నిలబడే మేము ఎక్కడ దేబిరించాలి అని అడగాలనిపిస్తుంది.మరీ ఇంత కష్టపడి బస్సులు ఎక్కే బదులు ఆటోలో వెళ్ళొచ్చు కదా అని అనిపిస్తుంది కాని ఇదేమన్నా హైదరాబాదా!హైదరాబాదులో అయితే రోడ్డుమీద కాలు పెట్టగానే రయ్యిమని మన మీదకి కనీసం నాలుగు ఆటోలు దూసుకొస్తాయి.పైగా మీటర్ పదిరూపాయలనుండి మొదలవుతుంది."ఆటో కావాలా మేడం" అని అడిగితే చాలు నేను ఆటో ఎక్కేస్తాను.నన్ను ఎవరన్నా మేడం అంటే చాలు నేను వాళ్ళకోసం ఏ పనైయినా చేసేస్తాను.

అదే బెంగుళూరులో అయితే ఆటోవాడ్ని బ్రతిమాలాలి.ఆటోదగ్గరికి వెళ్ళి మెజెస్టిక్ బస్టాండు అని అడిగితే చీదరింపుగా ఒక చూపు చూసి మొహం తిప్పుకుంటాడు."రాను" అని నోటితో ఒక్క మాట చెప్పొచ్చు కదా! ఆమాత్రం అదృష్టానికి కూడా నోచుకోలేదా నేను? ఒకవేళ మన పంట పండి వాడు వస్తాను అన్నా కాని వెంటనే "సౌ రుపయా" అంటాడు.మెజెస్టిక్ కి సౌ ఎందుకురా అంట్ల వెధవా అని తిట్టుకొని ఎక్కిన ఆటో దిగేసిన సందర్భాలు ఎన్నో!పోని మీటర్ వేసినా కాని,అది పద్నాలుగు రూపాయలతో మొదలవుతుంది.క్షణక్షణానికి అర్ధరూపయి పెరుగుతుంది.మీటర్ తో పాటు మన బిపి కూడ పెరుగుతుంది.తిప్పిన రోడ్డులోనే నాలుగుసార్లు ఆటోని అటూ ఇటూ పరిగెత్తించి మీటర్ తొంభై తొమ్మిది రూపాయల యాభై పైసలు అయినప్పుడు మెజెస్టిక్ బస్టాండు ముందు దించి వంద లాక్కొని వెళ్ళిపోతాడు.

ఈమధ్య నాజీతమంతా ఆటోలకి,షాపింగ్ మాల్స్ లో దిక్కుమాలిన సినిమాలు చూడడానికే సరిపోతుంది.అందుకే నేను ఒట్టుపెట్టుకున్నాను.మళ్ళీ ఆటో ఎక్కితే సునీల్ మీద ఒట్టు అని.సునీల్ అంటే మా మేనేజర్.చాలా గట్టోడు.ఒట్టు పెట్టిన తరవాత కూడ నాలుగైదుసార్లు ఆటో ఎక్కాను నేను.ఇంక సినిమాల విషయానికొస్తే హాల్లో సినిమాలు చూడటం మానేసాను నేను.ఫోరం షాపింగ్ మాల్ ముందు ఫుట్ పాత్ మీద మనకి దొరకని సీడీ అంటూ ఉండదు. ఇంగ్లీషు,హిందీ,తెలుగు,తమిళం...ఆఖరికి స్వాహిలి భాష సినిమా సీడీలు కూడ దొరుకుతాయి వెతకాలే కాని! కాని అప్పుడెప్పుడో మహేష్ బాబు టీవీలో కనిపించి "కిల్ పైరసీ" అని చెప్పాడు.అందుకే నేను దొంగ సీడీలు కొనను.మరి ఈ సమస్యకి పరిష్కారం లేదా అంటే ఉంది.మా టీమ్ లో ఎవరు ఏ సీడీలు కొన్నా కాని,సర్వర్ లో కాపీ చేస్తారు.ప్రతి శుక్రవారం మధ్యాహ్నం నేను సినిమాలన్ని లాప్ టాప్ లో కాపీ చేసుకొని బస్సు ఎక్కి హాస్టల్ కి వెళ్ళి సినిమాలు చూస్తాను.మహేష్ బాబు సీడీలు కొనద్దని చెప్పాడు కాని చూడొద్దని చెప్పలేదు కదా! :-)

Sunday, January 27, 2008

తలనొప్పా!

..అయితే జండు బామ్ రాసుకోండి అనే యాడ్ టీవిలో చూసినప్పుడల్లా నా కడుపు రగిలిపోతుంది.అసలు వీళ్ళు చెప్పేవన్ని అబద్దాలే.తలనొప్పి చిటికెలో తగ్గిపోతుంది అని చెప్పాడు టీవిలో.ఏది?నేను పదిసార్లు చిటికె వేసినా తగ్గలేదు సరికదా,చిటికెలు వేసి వేసి నాకు చెయ్యి నొప్పి కూడ వచ్చింది.

అదొక కాళసాయంత్రం.(కాళరాత్రి టైపులో అన్నమాట)ఆఫీసు నుండి హాస్టల్ కి వచ్చేసరికి రూమ్ లో ఎవ్వరు లేరు.ద్రాక్షయణి అంతకు పదిరోజుల ముందే కెనడా వెళ్ళింది.దీప్తి సేలం వెళ్ళింది.నాకేంటో విపరీతంగా తలనొప్పి.చిన్నప్పట్నుంచి కూడ నాకెప్పుడు నిజంగా తలనొప్పి రాలేదు.ఉత్తుత్తినే అబద్దంగా మాత్రం చాలాసార్లు వచ్చింది.హాస్టల్ కి రాగానే మంచం మీద వాలిపోయాను.వెంటనే నిద్ర పట్టేసింది.రాత్రి ఎనిమిది గంటలప్పుడు నాన్న ఫోన్ చేసారు.ఏమి మాట్లాడానో కూడ గుర్తులేదు నాకు.ఆకలేస్తుంది.అన్నం తిందామని మంచం మీద నుండి లేచాను.అంతే,తల మీద ఎవరో క్రికెట్ బ్యాట్ తీసుకొని కొట్టినట్టు నొప్పి.అంతే కదలకుండా కూర్చున్నాను.అమ్మో ఇప్పుడు ఎలా?కొంచెం తల తిప్పినా కాని విపరీతంగా నొప్పి వస్తుంది.ఛీ! నాయాల్ది రూమ్ లో కూడ ఎవ్వరు లేరు.అవసరమైనప్పుడే అందరు మయమవుతారు.అప్పుడు నాకు టక్కున మా నాయనమ్మ గుర్తొచ్చింది.

నా చిన్నప్పుడు మా నాయనమ్మ దగ్గర ఎప్పుడు అమృతాంజనం ఉండేది.ఇప్పుడు మా నాయనమ్మ రేంజ్ పెరిగిపోయింది.ఇప్పుడు జండుబామ్ వాడుతుంది.అసలు అదేమన్నా మాయిశ్చరైజరో,సన్ స్క్రీన్ లోషన్ అనుకుంటుందో నాకు అర్ధం కాదు కాని డబ్బాలు డబ్బాలు రాసుకుంటుంది.ఒకసారి నేను సైకిల్ నేర్చుకుంటు కిందపడ్డాను.మోకాలికి దెబ్బ తగిలి రక్తమొస్తుంటే మా నాయనమ్మ గబగబా వచ్చి మంచినీళ్ళతో దెబ్బని కడిగి దాని మీద అమృతాంజనం రాసింది.అంతే,ఆ దెబ్బకి నాకు మా నాయనమ్మ వాళ్ళ నాయనమ్మ కూడ కనిపించింది.మా అమ్మ ఏదో అనబోతే,నాయనమ్మ అమ్మని కసురుకుంది."నాకు తెలియదా పిల్లల్ని ఎలా పెంచాలో,ఏమి తెలియకుండానే వాడ్ని ఇంతవాడ్ని చేసానా" అని అమ్మని,నాన్నని కలిపి తిట్టింది.నాయనమ్మకి ఛాన్స్ ఇవ్వాలి కాని అమృతాంజనంతో మాములు నొప్పులేంటి క్యాన్సర్,ఎయిడ్స్ లాంటి రోగాల్ని కూడ తగ్గిస్తుంది.(నాయనమ్మకి క్యాన్సర్ గురించి తెలుసు కాని,ఎయిడ్స్ గురించి తెలుసో లేదో మరి) నాయనమ్మ దృష్టిలో అమృతాంజనం అంటే సర్వరోగనివారిణి అన్నమాట!

సరే,నాయనమ్మ చెప్పింది,ఇంకా టీవిలో కూడ చూపించాడు కదా అని జండుబామ్ రాసుకున్నాను నుదిటి మీద.అబ్బ ఒకటే మంట.లేని భాద తెచ్చిపెట్టుకున్నట్టు అయ్యింది అని మొత్తం తుడిచేసాను.రాత్రి అంతా అలాగే కదలకుండా పడుకున్నాను.కాని నాకెందుకో అదే నాకు ఆఖరిరోజు అనిపించింది.అమ్మో,ఎలా నేను ఇంకా LIC పాలసి కూడ తీసుకోలేదు.అసలు పోయిన శనివారం tax exemption కోసమని LIC పాలసి తీసుకుందామని భవానికి తెలిసిన ఏంజెట్ దగ్గరికి వెళ్ళాము.నేను నాకు ఒక లక్ష రూపాయాలకి జీవన్ ఆనంద్ పాలసీ కావాలని చెప్తే వినిపించుకోకుండా ముప్పై ఏడేళ్ళ రిటైర్ మెంట్ ప్లాన్ వినిపించాడు.ఇప్పట్నుంచి నాకు 58ఏళ్ళు వచ్చేదాక సంవత్సరానికి ముప్పైరెండు వేలు కడితే తరవాత ఎప్పుడో నాకు రెండు కోట్లు ఇస్తాడంట.ఎందుకు నాకు రెండు కోట్లు?ఏం చేసుకోవడానికి?అదికూడ డెబ్బయి ఏళ్ళ తరవాత!డెబ్బయి ఏళ్ళ తరవాత నేను ఏరకంగా చనిపోతే ఎంత డబ్బు వస్తుందో చెప్పి నామీద నాకే విరక్తి తెప్పించాడు.ఈ పాలసి స్పెషల్ ఏంటంటే suicide చేసుకున్నా కూడ డబ్బులిస్తారంట!అసలు డెబ్బయి ఏళ్ళప్పుడు నేను suicide ఎందుకు చేసుకుంటాను? ఏమో నాకు ఇప్పటికి అర్ధం కాలేదు.ఆ ఏజెంట్ ఇచ్చిన షాక్ కి నేను అసలు పాలసీయే తీసుకోలేదు.ఛీఛీ!ఇప్పుడు నాకేమన్నా అయినా కాని ఎవ్వరికి ఉపయోగం లేదు.

ఇంక లాభం లేదు.నాకు ఆఖరి గడియలు వచ్చేసాయి.అయినా కాని మానవ ప్రయత్నంగా BTMలో ఉన్న మా అక్కకి ఫోన్ చేసాను.తెల్లవారు జామున 4గంటలవుతుంది.వాళ్ళు వచ్చి నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళే సరికి 5.30 అయ్యింది.నేను అస్సలు నడవలేకపోతుంటే వీల్ ఛైర్ లో కూర్చోబెట్టి తీసుకెళ్ళారు.నైట్ షిప్ట్ లో జూనియర్ డాక్టర్ ఉంది నేను వెళ్ళేసరికి.డాక్టర్ కూడ నా అంతే ఉంది.ఈ అమ్మాయా నాకు తలనొప్పి తగ్గించేది అని అనుకున్నాను.బెడ్ మీద పడుకోబెట్టి కడుపులో నొక్కుతుంది.ఆహా!ఈమె కూడ నాలాగే requirements ఒకలాగ ఉంటే implementation ఇంకోలాగ చేస్తుంది అనుకొని,నాకు కడుపునొప్పి కాదు,తలనొప్పి అని చెప్పాను.ఒక నవ్వు నవ్వింది నన్ను చూసి.తరవాత అర్ధం అయ్యింది ఎందుకు నవ్విందో.పది నిమిషాల తేడాతో మూడు ఇంజెక్షన్లు ఇచ్చింది.ఒక గంట తరవాత నాకు చాలావరకు తలనొప్పి తగ్గిపోయింది.అసలు నాకు తలనొప్పి ఎందుకు వచ్చింది అని అడిగాను.బిపి ఎక్కువ ఉంది,అందుకే తలనొప్పి వచ్చింది అని చెప్పింది.అదేంటి? నేను కదా,వేరే వాళ్ళకి బిపి తెప్పించేది,నాకు బిపి వచ్చిందేంటా అని అనుకున్నాను.కాని ఈ తలనొప్పి ఎపిసోడ్ వల్ల నాకొక గొప్ప నిజం తెలిసింది.అన్ని తలనొప్పులు జండుబామ్ రాసుకొని,చిటికె వెయ్యగానే తగ్గవు.మాడు ఇంజెక్షన్లు వేసుకుంటేనే తలనొప్పి తగ్గుతుంది.