Sunday, September 16, 2007

అమ్మో..సిద్ధుగాడు

సిద్ధుగాడు ఉరఫ్ సిద్ధార్ధ.మా అక్క ముద్దుల కొడుకు.వాడి వయస్సు రెండున్నర సంవత్సరాలు.మా ఇంట్లో నేనే చిన్నదాన్ని.నా తరవాత దాదాపు ఇరవై సంవత్సరాల తరవాత మళ్ళీ మా ఇంట్లో ఒక చిన్నపిల్లాడు వచ్చాడు.చాలా రోజుల తరవాత చిన్నపిల్లల్ని పెంచడం రావల్సినందునో లేక మా అమ్మావాళ్ళకి మగపిల్లల్ని పెంచిన అలవాటు లేకపోవటం వల్లనో కాని వాడు ఏది చేసినా అందరికి అదో పెద్ద విచిత్రంగా కనపడుతుంది.అసలు సిద్ధుగాడికి ఆరునెలలు వచ్చేదాక ఇంట్లో ఒక్కరోజు కూడ ఏడుపు వినిపించలేదు.ఎప్పుడో టీకాలంటు ఇంజక్షన్ వేసిన రోజు తప్ప ఎప్పుడు ఏడ్చేవాడు కాదు.అప్పట్లో మావాళ్ళకి అదో పెద్ద గొప్ప.అందరు కలసి వాడికి బుద్దిమంతుడు,మంచి బాలుడు వగైరా బిరుదులు ఇచ్చేసారు.కాని తరవాత తరవాత వాడు చేసే పనులు చూసి అందరు ముక్కున వేలు వేసుకున్నారు.తొందరపడి బిరుదులు ఇచ్చేసామా అని భాదపడ్డారు.

సిద్ధుగాడు కామ్ గా ఉన్నాడంటే దేనికో మూడిందన్నట్లే.మా ఇంట్లో ఫ్రిజ్ ఎప్పుడో నేను మూడవ తరగతిలో ఉన్నప్పుడు కొన్నారు.ఇప్పుడంటే ఎయిర్ కంప్రెసర్ ఫ్రిజ్ అడుగు భాగాన ఇచ్చి అవుటర్ ఫ్రేమ్ అంతా నీట్ గా కవర్ చేస్తున్నాడు కాని,మా ఫ్రిజ్ కి కంప్రెసర్ వెనకవైపు ఓపెన్ గానే ఉంటుంది.వీడెకేదో పనున్నట్లు ఎప్పుడు ఆ కంప్రెసర్ లో వేలు పెట్టి గెలుకుతూ ఉంటాడు.వాడు మా ఇంట్లో ఉన్నన్ని రోజులు మేము ఫ్రిజ్ వాడము.అది ఎండాకాలమైనా ఇంకా ఏకాలమైనా వాడొస్తే ఫ్రిజ్ మూల పడాల్సిందే.టమోటాల్ని పిసికి మంచినీళ్ళ బిందెలో వేస్తాడు.చెప్పులు బయట పడేస్తాడు.పట్టుచీరల మీద కొబ్బరినూనె ఒలకపోస్తాడు.టీవి రిమోట్ ని నేలకేసి బాదుతాడు.పెన్సిల్ తో గోడలమీద మోడ్రన్ ఆర్ట్ చెక్కుతాడు.ఒకటా రెండా వాడు చేసే పనులు.వాడొస్తున్నాడంటే "అమ్మో,సిద్ధుగాడు వస్తున్నాడు" అని అనాల్సిందే ఎవ్వరైనా.వాడు ఇంత అల్లరి చేసినా మా అమ్మ మాత్రం వాడ్ని ఒక్క మాట అనదు.పైపెచ్చు "కన్నయ్యా" అని పిలుచుకుంటుంది.అసలు మా అమ్మ సపోర్టు చూసుకొనే వాడు ఇంకాస్త ఎక్కువ అల్లరి చేస్తాడు.సిద్ధుగాడికి,నాకు ఒక్క క్షణం పడదు.మా అమ్మ ఏమో "పసిపిల్లాడితో నీకేంటే ఎప్పుడు గొడవ,వాడ్ని గిల్లుకోపోతే నీకు ప్రశాంతంగా ఉండదా?" అని అంటుంది.అమ్మో వాడు పసిపిల్లడా? కాదు పిల్ల రౌడి.అయినా వాడ్ని నేను గిల్లుకోను,వాడే నన్ను గిల్లుకుంటాడు.

సిద్ధుగాడు ప్రస్తుతం గోవాలో ఉంటున్నాడు.మా బావగారికి(సిద్ధువాళ్ళ నాన్న) చదువుకోవటం అంటే చాల ఇష్టం.ఎప్పుడు ఏవో పరీక్షలు రాసి డిగ్రీల మీద డిగ్రీలు చదివేస్తుంటారు.ఆయన దేన్నయినా సహిస్తారు కాని ఆయన పుస్తకాల్ని ఎవరయినా ముట్టుకుంటే మాత్రం అస్సలు ఊరుకోరు.ఒకరోజు రాత్రి ఆయన చదువుకొంటుంటే సిద్ధుగాడు వెళ్ళి,"నాన్న,సిద్ధు సదుతా" అని అనేసరికి వాళ్ళ నాన్న "అమ్మో,నా కొడుక్కి చదువుకోవాలనే మూడొచ్చింది" అని రెచ్చిపోయి మరీ వన్,టూ,త్రీ..నేర్పించారంట.తరవాత ఆయన చదివే పుస్తకంలో పేజి అడుగున పేజి నంబర్ 39 అని రాసి ఉంటే మా బావగారు అది చూపించి "థర్టీ నయిన్" అని మూడు నాలుగుసార్లు పలికించారంట.చివరికి కష్టపడి "తత్తి నై" అనటం నేర్చుకున్నాడు సిద్ధుగాడు.అంతవరకు బాగానే ఉంది.మరుసటి రోజు ఉదయం మా బావగారు ఇంట్లో లేరంట,మా అక్క వంటింట్లో ఏదో పనిలో బిజీగా ఉందంట.వీడు అంతకు ముందురోజు చదివిన పుస్తకం దొరికించుకొని చక్కగా గది మధ్యలో కూర్చొని "తత్తి నై" అని అనటం ఒక పేజి చింపటం,మళ్ళీ "తత్తి నై" అనటం ఇంకో చింపటం.ఇలా ఒక పది,పదకొండు పేజీలు చింపేసాడంట.మా అక్క తేరుకొని వచ్చేలోపల జరగాల్సిన డామేజి జరిగిపోయింది.మా బావగారికి ఇంటికొచ్చి పుస్తకం చూసుకొన్నాక చాలా కోపమొచ్చిందంట.మా అక్కపైన,సిద్ధుగాడిపైన అలిగి రెండు రోజులు మాట్లడటం మానేసారంట.తరవాత మళ్ళీ మాములే.నాకు మా అక్కని ఎప్పుడన్నా ఏడిపించాలనిపిస్తే,ఫోన్ చేసి "మీ తత్తి నై గాడు ఏమి చేస్తున్నాడు" అని అడుగుతాను.మా అక్క భలే ఉడుక్కుంటుంది.

గత వారంరోజుల బట్టి సిద్ధుగాడు ప్లే-స్కూల్ కి వెళ్తున్నాడు.వాడ్ని ప్లే-స్కూల్ లో చేర్పించడానికి కూడ ఇంటర్వ్యూ ఉందంట.మా అక్క,బావగారు రాత్రి పగలు కష్టపడి ఎలాగో వాడ్ని ఇంటర్వ్యూలో పాస్ చేయించారు.స్కూల్ కి వెళ్ళిన రెండో రోజే క్లాస్ లో వేరే పిల్లడి చొక్కా చింపేసాడంట.సిద్ధుగాడి టీచర్ మా అక్కని పిలిపించి అరగంటసేపు క్లాస్ పీకి,ఆ చొక్కా చినిగిన వాళ్ళ అమ్మ కొంచెం డేంజర్ మనిషి అని చెప్పిందంట.ఆ భయంతో మా అక్క,సిద్ధుగాడు ప్రస్తుతం అఙ్ఞాతంలో ఉన్నారు.
(ఫోటోలో సిద్ధుగాడు,వాడి అత్త కూతురు నీతు)6 comments:

Raja Rao Tadimeti (రాజారావు తాడిమేటి) said...

బాగున్నాయి మీ సిద్ధుగాడి అల్లరి బుద్ధులు. ఒకసారి చదువులో పడితే మరల అల్లరికి అవకాశమే ఉండదు. ఈ రొజుల్లో పిల్లలు వారి బాల్యాన్ని ఆస్వాదించేది మొదటి మూడు-నాలుగు సంవత్సరాలలోనే కదా..

విహారి(KBL) said...

భలే సరదాగా వుంది మీ తత్తినై అల్లరి

kalpana said...

baavundi..siddu gadi jeevitha charithralo konni maatrame cover chesav..photo bavundi.

lalithag said...

ఇదేనా అజ్ఞాతం?:-)
మీ వాడి అల్లరి ఎక్కువ వినోదమా, మీరు రాసిన తీరు ఎక్కువ వినోదమా తేల్చుకోవడానికి కష్టంగా ఉంది. బాగా రాస్తారు మీరు.

playSchool కి ఇంటర్వ్యూనా?
మరి అలాంటి ప్రత్యేకమైన బడిలో పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా మసలుకోవడం తెలిసిన (trained) టీచర్లు ఉండి ఉంటారనుకుంటాను?
montessori బడి ఉంటే ప్రయత్నించండి. బావుంటుంది. ముఖ్యంగా ఎక్కువ ఉత్సాహం ఉన్న వారికి.

క్రాంతి said...

@ రావుగారు
@ విహారి గారు
@ కల్పన అక్క

థాంక్స్ అండి.

@ లలిత గారు
మీరు నన్ను మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు.
మా అక్కకి మాంటిస్సోరి స్కూల్ గురించి చెప్తాను.
Thank you once again.

andhrajyothi said...

ammo siddugadu - 5.8.12 aadivaaram andhrajyothi sanchikalo prachuristhunnam
- editr