Thursday, June 14, 2007

పేరులో ఏముంది?

ఎలాగోలా ఒకటవ తరగతి పరిక్షలు రాసేసాను.ఎండాకాలం సెలవులు.ఒకరోజు నేను నాన్న దగ్గరికి వెళ్ళి "నాన్న,నాకు ఈ పేరు నచ్చలేదు,వేరే పేరు పెట్టండి" అని అడిగాను.అసలు పేరు మార్చుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చందో మాత్రం నాకు గుర్తులేదు.అప్పుడు మానాన్న సికిందర్ అంకుల్ తో చెస్ ఆడుతున్నారు.(చెస్ ఆడేటప్పుడు నాన్న ప్రపంచాన్నే మర్చిపోతారు,అప్పుడు ఏమడిగినా కాదనరు) "సరేలే,ఇప్పుడు నువ్వెళ్ళి ఆడుకో" అని చెప్పి అప్పటికి నన్ను వదిలించుకున్నారు.

ఎండాకాలం సెలవులు అయిపోయాయి.స్కూల్ తెరిచారు.కొత్తపేరు సంగతి నాన్నకి మళ్ళీ గుర్తు చేసాను.నాన్న పేరు మార్చటం కుదరదని ఖరాఖండిగా చెప్పేసారు.నేను పేరు మార్చాల్సిందేనంటూ మంకుపట్టుపట్టాను.మానాన్న స్కూటర్ ఎక్కి స్పీడోమీటర్ మీద ఒక కాలు, ముందు సీట్ మీద ఒక కాలు పెట్టి సాగరసంగమంలో కమల్ హాసన్ లా తకిటతధిమి చేసా. ఇక లాభం లేదని మా నాన్న పేరు మార్చటనికి ఒక కండిషన్ పెట్టారు.ఇప్పుడున్న పేరు మొత్తం మార్చటానికి కుదరదు,కావలంటే దానికి ముందు వేరే పేరు తగిలించుకోమన్నారు.నేను "క్రాంతి" పెట్టుకుంటానని చెప్పాను.ఇంట్లో అందరూ "కీర్తి" అయితే ఇంకా బాగుంటుందని తీర్మానించారు.నేను ససేమీర అన్నాను.చేసేది లేక స్కూల్ రిజిష్టర్ లో నా పేరు "క్రాంతి కళ్యాణి" అని రాయించారు.అప్పట్లో మా కాలనీలో ఇదొక సంచలన వార్త.

ఇప్పుడిక అందరు నన్ను "క్రాంతి" అనో "కళ్యాణి" అనో పిలిస్తే ట్విస్ట్ ఏమి ఉంటుంది?స్కూల్ లో అయితే పేరు మార్పించారు కాని,ఇంట్లో పిలిచే పేరు మాత్రం మార్చరు కదా!ఇంట్లో నన్ను "చిట్టి","చిట్టి తల్లి" ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు.ఇన్నాళ్ళబట్టి పోరాడుతున్నాకాని ఆ పిలుపు మాత్రం మార్చలేదు నా అభిమానులు.నేను ఎప్పుడు అమ్మతో పోట్లాడుతాను,ఏ పింకి అనో,స్వీటీ అనో ఎందుకు పెట్టలేదని.అయినా ఇదేదో పెద్ద ఇంటర్నేషనల్ పేరు అయినట్టు నా కజిన్ ని కుడా చిట్టి అనే పిలుస్తారు.మేము ఇద్దరం ఒకేచోట ఉంటే పెద్దచిట్టి,చిన్నచిట్టి అని పిలుస్తారు.(పెద్ద పిచ్చయ్య,చిన్న పిచ్చయ్య లాగా)

ఇక ఇళ్ళ చుట్టుపక్కల ఉండే పిల్లలయితే మరీ దారుణంగా ఏడిపించేవాళ్ళు.అప్పట్లో దూరదర్శన్ లో ఒక నాటిక వచ్చేది."పైడితల్లి పిల్లకి టీకాలు లేవు,BCG సూదిమందులివ్వనే లేదు" అని.అది చూసి inspire అయిన పిల్లరాక్షసులందరు నన్ను మధ్యలో నిలబెట్టి చుట్టూ తిరుగుతా,చప్పట్లు కొడుతూ ఈ పాట పాడే వాళ్ళు.లేదంటే,"అంబేద్కర్ శతజయంతి అదేనోయి పర్వం,ఆనందపు బాటలోన నడిచే జాతి సర్వం", ఇలాంటి పాటలు పాడి నా చిన్న మనసును భాద పెట్టి రాక్షసానందం పొందేవాళ్ళు.వీళ్ళకి దడచి బయటకెళ్ళి ఆడుకోవటం కూడ మానేసాను నేను.

కరిష్మా కపూర్,కరీనా కపూర్ లని చూడండి,"లోలో","బేబో" అని ఎవ్వరికి అర్ధంకాని pet names పెట్టుకున్నారు.ఇది చూసి నాకొక బ్రహ్మాండమైన అవుడియా వచ్చింది.నేను కూడ నాకు future లో పుట్టబోయే పిల్లలకి "జోజో","బజ్జో" అని పెట్టాలని గట్టిగా నిర్ణయించేసుకున్నాను.

15 comments:

spandana said...

పోనీ ఇక్కడైనా మీ పేరు కల్యాణి అని చెప్పకుండా వుండాల్సింది క్రాంతి గారూ.

-- ప్రసాద్
http://blog.charasala.com

Unknown said...

అయ్యో పేరంటే అంతిష్టమా...
పేరులో ఏముందో అనుకునేవాణ్ణి. పర్లేదు మిమ్మల్ని ఏమని పిలవాలో చెప్పండి. అదే పిలుస్తాము.

oremuna said...

నే పాటిబండ వాళ్ల దగ్గర కాలయంత్రం అద్దెకు తీసుకోని భవిష్యత్తులోకి వెళ్ళి ఓ బ్లాగు చూసినాను

== పేరులో ఏముంది ==

అసలు మా అమ్మకి వాళ్ళ అమ్మ వాళ్ళు చిట్టి అని పేరు ఎలా పెట్టనేల!

పెట్టితిరిపో , అది ఆమెకు నచ్చకపోవడమెలా!

నచ్చకపొయినదిపో, దానిని తోటి తొట్టి గ్యాంగు ఏడిపించుటకు ఏల ఉపయోగించవలె!

ఉపయోగించితిరిపో, మా అమ్మ నాకు బబ్జి అని ఈ ముద్దు పేరు పెట్టనేల!

ఇప్పుడీ తొట్టి బ్లాగర్ల సంఘం నా పేరుని ఎలా చేసి ఏడిపించవలే!

అయ్యో
అయ్యో
అయ్యో
పగవాడికి కూడా వచ్చు ఈ ముద్దు పేరు

నేను అయితే నాకు ఓ పాప పుడితే ఏ "లే" అనో "సో" అనో ముద్దు పేరు పెట్టుకుంటాను పోషుగా :)

kalpana said...

chitti,

You warned me that I shud not reveal ur petname in the blogs..right?But u told it by urself..

Indulo na tappemi leduga..ippati nundi chitti ani continue ayipovachu kada..malli godava cheyyoddu.

By the way..pedda pichayya..chinna pichayya bavundi..chinna chitti ki chepta ni blog chudamani.

సత్యసాయి కొవ్వలి Satyasai said...

చిట్టి వయసులోనే అంత క్లారిటీనా? వావ్. టపా బాగుంది. నేను ఇదే పేరుతో ఒక టపా ప్లాను చేసా - ఈలోపు మీరు వ్రాసేసారు -వాఁ.
మీకు గోవిందా ముద్దు పేరు తెలుసా- చీచీ.
:))

Hari Mallepally said...
This comment has been removed by the author.
రవి వైజాసత్య said...

బాగుంది మీరు పేరు వెనుక కథ. ఇది చదివినప్పుడు నాకంటే నాలుగు సంవత్సరాలు ముందు పుట్టిన మా కజిన్ నా పేరు కాపీకొట్టడం గుర్తుకు వచ్చింది.

చేతన_Chetana said...

నాకు తెలిసిన ఒక అమ్మాయి పేరు కూడా క్రాంతి, ముద్దు పేరు చిట్టి. !!

క్రాంతి said...

చేతన గారు!! కొంపదీసి మీరు నాకు తెలుసా? సర్లేండి ఇప్పుడు తెలిసారు కదా,ఇక చూడండి పిచ్చెక్కిచ్చేస్తా! మీ ఫోటోలు కొన్ని చుసాను.బాగున్నాయి.Good work!!

చేతన_Chetana said...

Thank you.

I don't think we know each other. :-)

కొత్త పాళీ said...

super funny.

మీ ఇష్టైల్ బాగుంది. అంతప్పుణ్ణించే మీరు రివొల్యూషనరీ టైపన్నమాట :-)

సోమరాజు సుశీల అనే ఆమె "ఇల్లేరమ్మ కతలు" అని చిన్నప్పటి తన అనుభవాలు కథలుగా రాశారు - అందులో ఆమె తన చెల్లెల్ని బళ్ళో చేర్పించే ప్రహసనం ఇలాగే ఉంటుంది. ఇంట్లో "చిన్నారి" అని పిలువబడే ఆ గడుగ్గాయి నీపేరేంటమ్మా అని టీచరు అడిగితే "జవహర్లాల్ నెహ్రూ" అంటుంది తడుముకోకుండా.

చేతన_Chetana said...
This comment has been removed by the author.
చేతన_Chetana said...

భలే గుర్తు చేసారు. మళ్ళీ చదవాలనిపిస్తుంది. ఏదో పండుగరోజు సీతాదేవి/సరస్వతీ విగ్రహానికి ముసుగేసి మేరిమాతలా తయారుచేసి చర్చి పాటలు పాడటం హైలైట్. పిల్లలకి ఎలా వస్తాయో ఐడియాలు. మా ఇంటెదురుగుండా ఉండే రెండున్నరేళ్ళ అమ్మాయితో మా తమ్ముడు numbers, abcdలు చెప్పిస్తూ, దాన్ని ఏడిపిద్దామని abcdలు వెనుకనుంచి చెప్పు అన్నాడు. టక్కుమని వెనక్కు తిరిగి వీపు చూపిస్తూ abcdలు చెప్పటం మొదలు పెట్టీంది. తర్వాత మొన్నెప్పుడో ఆ జోకు ఏదో సినిమాలో చూసానుగానీ, అప్పటికి ఆ సినిమా రాలేదూ, ఆ అమ్మాయికి సినిమాలు చూసి ఇమిటేట్ చూసేంత ఙాననమూ లేదు (అప్పటికి).

రానారె said...

ఈమధ్య కూడలిలో టపాలెక్కువైపోయి ఇలాంటి మంచిమంచివన్నీ త్వరగా అడుగునపడిపోతున్నాయి. చదివి నవ్వుకోవడానికి ఇన్నాళ్లు పట్టింది.

Dr. Ram$ said...

"మానాన్న స్కూటర్ ఎక్కి స్పీడోమీటర్ మీద ఒక కాలు, ముందు సీట్ మీద ఒక కాలు పెట్టి సాగరసంగమంలో కమల్ హాసన్ లా తకిటతధిమి చేసా"--- ఈ వాక్యానికి ఏమని చెప్పమంటారు?? మనసారా తల వంచి ఓ వందనము చెప్పడము తప్పించి..నేను ఈ వాక్యము చదువుతున్నపుడు ఒకసారి ఆ సీన్ వూహించుకున్నాను..నిజంగా మీ రచనా శైలి..అద్భుతము.. హ్హహ్హహ్హ..

ఇంక పేరు లో ఏముంది అంటే--నా పేరు రాంబాబు..ఇంక నేను నా కష్టాలు గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు అనుకుంటాను.. అదేమిటో ఆ మొహన్ బాబు గాడికి , రాజేంద్ర ప్రసాదు కి ఈ రాంబాబు పేరు మీద పేటెంట్ వున్నట్లు వాళ్ళు వేసే చెత్త క్యారెక్టర్ ల కి నా పేరే వాడతారు..అది చాలదన్నట్లు , ఈ మద్య కొత్తగా "ఆనందం రాంబాబు గాడు" తయారయ్యాడు.. ఈ బాధ భరించలేకే.. నేనే నా పేరు ని జనాలకి Rams లా పరిచయ కార్యక్రమాన్ని నా నెత్తికి యెత్తుకున్నాను.. మా అమ్మ ని , అమ్మా ఎందుకు నాకు ఈ రాంబాబు అని పేరు పెట్టావ్, ఇంక నీకు వేరే పేరులే దొరక లేదా అంటే.. నీ పేరుకేమి రా అబ్బాయి..షార్ట్ కట్ లు లేకుండా పూర్తి పేరు తో పిలవాలి..అదే మన వూరులో నీ తరం మిగతా వాల్ల పేర్లు చూడు అని , ఓ తన తెలివి చూపిస్తది.. కాకపోతే మా అమ్మ చెప్పేది కూడా నిజమే.. నా బాల్యమిత్రుల పేర్లు కొన్ని మచ్హుకి--- శీనయ్య ( మా పెద్దన్న), రాఘ్హయ్య ( చిన్నన్న), వెంకయ్య, గిరిగాడు, బుల్లోడు, కోటి , కోటయ్య,బ్రహ్మయ్య, వీరయ్య.. యివి ..ఇంతకి మేమందరము కలిసి చదువుకున్న మా బడి పేరు చెప్పలేదు.. " అచ్హమ్మ పంతులు బడి ".. కొంత మంది నా girl friends పేర్లు కూడా చెపుతా వినండి.. పద్దమ్మ (పద్మ ని), చిత్తు, బుల్లి మాలక్ష్మి, పెద్ద మాలక్ష్మి...మేమందరము కలిసి చింత పిక్కలు ఆడుకునే వాళ్ళమి..గిన్న్నాల్ల ఆట కూడా.. గేదెలు తోలుకొని పొలానికి పోతే అక్కడ గిన్నాల్ల ఆట లో ఇంకో రకము ఆడే వాళ్ళము.. ఏదొ కట్టులు అని, ఒక 16(8+8) గుంతలు తీసి ఆడే వాళ్ళము..కుందుల్లు ఆట కూడా ఆడాను..మీ బ్లాగు మహత్యమో యేమో కాని, మా గత మధుర స్మృతులు లు కూడా మాకు తన్నుకు వస్తున్నాయి... చాలా సంతోషము గా వుంది.. మీ రచనా శైలి కి మరొక్క మారు "జిందాబాద్" చెప్పుకుంటూ శెలవు తిసుకుంటున్నాను..