Monday, October 20, 2008

అమెరికా పోదాం రా!

ఒకరోజు మధ్యాహ్నం పెరుగన్నం తిని ఆఫీసులో నేను సీరియస్ గా పనిచేసుకుంటున్నాను.(నేను పని చేస్తున్నాని మీరంతా నమ్మితీరాల్సిందే!). ఇంతలో 'బర్..ర్..ర్..ర్' మని శబ్దం.ఏంటో చూద్దును కదా,మా ఆయన ఫోను చేస్తున్నాడు.అబ్బ ఈ సెల్ ఫోన్లతో పెద్ద చిక్కొచ్చి పడింది.ప్రశాంతంగా నిద్ర కూడ పోనియ్యవు.అదే!ప్రశాంతంగా పనికూడ చేసుకోనియ్యవు.ఏందబ్బా అని అడిగితే "మనం ఎమ్మటే అమెరికా పోవాలి, ఇంటికి రాగానే బట్టలు సర్దు" అని చెప్పాడు.ఇదేమన్నా అమలాపురమా! ఎప్పుడనుకుంటే అప్పుడు పెట్టెలో నాలుగు జతల బట్టలు పెట్టుకొని పోవడానికి? ఏదో తమాషా చేస్తున్నాడులే అని "ఆ! సర్దుతాలే!" అని చెప్పి ఫోన్ పెట్టేసా.బహుశా మాఆయనకి కూడ పెరుగన్నం ఎక్కువయ్యిందేమో! అందుకే ఏంటేంటో మాట్లాడుతున్నాడు.

కాని సాయంత్రం ఇంటికెళ్ళాక అర్ధమయ్యింది,నిజంగానే మా ఆయన అమెరికా వెళ్ళాలని.అయ్యో రామా! మళ్ళీ నేను హాస్టల్ లో ఉండాలా? అసలీ హాస్టల్ ల గొడవ భరించలేకే కదా పెళ్ళి చేసుకుంది.మూడ్నాళ్ళ ముచ్చట లాగా మళ్ళీ హాస్టల్ లో బేర్..ర్..ర్..మనాలి కావొచ్చు."డిపెండెంట్ గా నువ్వు కూడ నాతో రావచ్చు" అని చెప్పాడు."మరి నా ఉద్యోగమో!" అంటే,"కొన్నాళ్ళు బ్రేక్ తీసుకో" అని చెప్పాడు.బ్రేక్ తీసుకొని బెంగుళూరులో ఉంటే నా డ్రీమ్ జాబ్ టీచర్ ఉద్యోగం చెయ్యొచ్చు! కాని అమెరికాలో నేనేమి చెయ్యాలి? టీచర్ ఉద్యోగం అంటే గుర్తొచ్చింది,నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు సెలవులకి ఇంటికెళ్ళినప్పుడు మాకాలనీలో ఉన్న ట్రినిటి స్కూల్ లో పదోతరగతి పిల్లలకి ఇంగ్లీషు,ఫిజిక్స్ చెప్పేదాన్ని.అబ్బో! స్కూల్ లో మనకి విపరీతమయిన ఫాలోయింగ్ ఉండేది!కాబట్టి నా టీచర్ ఉద్యోగానికి ఢోకా లేదు.కాని ఎంత ఆలోచించినా నాకేమి పెరుగుబోవటం లేదు.ఇట్లా కాదని,న్యూజెర్సీలో ఉన్న మా శశిగాడికి ఫోన్ చేసాను.

శశిగాడు ఎవరో మీకు చెప్పలేదు కదూ! శశి,నేను మూడో తరగతి నుండి ఫ్రెండ్స్.పొద్దున్నే "మళ్ళీ నీ మొహం చూడను" అనే రేంజ్ లో కొట్టుకొని,సాయంత్రం వాళ్ళమ్మ పెట్టిన పులిహోర తిని మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోవడం మాకు మామూలే.ఎంతయినా పులిహోర చెయ్యడంలో శశి వాళ్ళమ్మ తరవాతే ఎవరయినా! ఆ పులిహోరే అసలు వాడ్ని ఇన్నాళ్ళ నుండి కాపాడుతుంది.ఫోన్ చెయ్యగానే "కాంత్! శశికాంత్ హియర్" అన్నాడు."నీ మొహంలే కాని,నేను అమెరికా వద్దామనుకుంటున్నాను" అని చెప్పాను.అంతే పగలబడి నవ్వాడు."నీ దయ వల్ల అసలే అమెరికా ఆర్దిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉంది.ఇంకా ఏమి ఉద్ధరించాలని అమెరికా వస్తున్నావు?"అని అడిగాడు.అవును మరి,కాలం కలసి రాకపోతే శశిగాడి చేతిలో కూడ మాటలు పడాల్సి వస్తుంది.వాడికి విషయమంతా చెప్పి,అమెరికాలో నాకు పొద్దుబోతుందా? అని అడిగాను."ఎందుకు పొద్దుబోదు? చీరలమీద బూట్లేసుకుని వాకింగ్ చేసే ఆంటీలు,నున్నగా నూనె పెట్టుకొని తలలో తులిప్స్ పెట్టుకొనే తమిళ తంగచ్చిలు బోలెడు మందే ఉంటారు.ఎవరో ఒకరు తగులుతారులే నీకు కూడా!" అని చెప్పాడు."నీకు ఇంకో విషయం చెప్పనా! ఇక్కడి ఇండియన్ రెస్టారెంట్లో జిలేబి ఆర్డరిస్తే వేడి వేడిగా ప్లేట్లో ప్రత్యక్షమవుతాయి.ఇంక నువ్వేమి ఆలోచించకు,ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకో " అని చెప్పాడు.అలా జిలేబికి కక్కుర్తి పడి నేను అమెరికాకి ప్రయాణం కట్టాను.

సరే అమెరికా వెళ్ళేటప్పుడు మధ్యలో ఫ్రాంక్ ఫర్ట్ లోనో,ఆమ్ స్టర్ డామ్ లోనో విమానం ఆపుతాడు కదండీ! అని మా అయన్ని అడిగితే,మనం వెళ్ళేది ఆ రూట్ లో కాదు,ఇవతలి పక్కనుండి అంటే హాంగ్ కాంగ్ మీద నుండి అని చెప్పాడు.అయ్యో రామా! సినిమాల్లో లాగా ఆమ్ స్టర్ డామ్ చూడొచ్చు కదా! అని అనుకున్నాను,కాని కుదర్లేదు. ప్రయాణం రోజు రానే వచ్చింది.ఏంటో, రెండు సుమోలకి సరిపడా జనం వచ్చారు మమ్మల్ని ఎయిర్ పోర్టులో దించడానికి.అదృష్టం కొద్ది ఎవ్వరూ ఏడుపులు,పెడబొబ్బలు పెట్టలేదు.బయలుదేరాక నాకు ఒకటే చెవునొప్పి! మా ఆయనకి చెప్తే ఇలా ఎక్సర్సైజులు చెయ్యాలని ఏంటో విచిత్రమయిన ఎక్స్ ప్రెషన్లు చూపెట్టాడు.అలాంటి ఎక్స్ ప్రెషన్స్ పెట్టడం నాకు చేతగాక,కన్నడ సినిమా హీరోలా ఏరకమయిన ఎక్స్ ప్రెషన్ పెట్టకుండా గమ్మున కూర్చున్నాను.ఇంక ఈ ప్రయాణంలో నాకు బాగా చిరాకు తెప్పించిందేంటంటే,మంచినీళ్ళు! నేనేమో,ఎంతలేదన్నా రోజుకు కనీసం ఐదు లీటర్ల నీళ్ళు తాగుతాను.ఫ్లయిట్ అటెండెంట్ అమ్మని మంచినీళ్ళు అడిగినప్పుడల్లా చాలా పొదుపుగా చిన్న కప్పులో సగం నీళ్ళు నింపి జయలలితలాగ నవ్వి నవ్వనట్టు ఒక నవ్వు నవ్వి ఇచ్చేది.నాకేమో ఆ మంచినీళ్ళు సరిపోవాయే! ఇలా కాదని,మా అయనకి రెండు గ్లాసులు,నాకు మూడు గ్లాసుల మంచినీళ్ళు కావాలని అడిగాను.అప్పుడు ఆయమ్మ చూసిన చూపులు మళ్ళీ ఇండియా వెళ్ళేదాక మర్చిపోను నేను.అందుకే చికాగోలో దిగగానే తనివితీరా లీటర్ నీళ్ళు తాగేసాను.ఇంక అసలు తలనొప్పి చికాగో ఎయిర్ పోర్ట్ లోనే మొదలయ్యింది.ఇమిగ్రేషన్ క్లియరెన్స్ అని ఒక గంటసేపు లైన్ లో నిలబెట్టారు.తరవాత ఒక కౌంటర్ దగ్గరికెళ్తే ఒక నల్లాయన(అయ్యో,ఇక్కడ నలుపు,తెలుపు అనే పదాలు వాడొద్దని మాఆయన చెప్పాడు) ఉన్నాడు.వీసా మీద ఒక స్టాంపు గుద్ది పంపేదానికి,నా మొహం కాసేపు,మాఆయన మొహం కాసేపు,ఇండియా గురించి కాసేపు మాట్లాడి ప్రాణం తీసాడు.

బయటికొచ్చి చూద్దును కదా,అబ్బో చికాగో ఎయిర్ పోర్టు చాలా పెద్దగా ఉంది సుమీ!మా ఆయన అటూ,ఇటూ కాసేపు తిరిగొచ్చి మనం ఎక్కాల్సిన విమానం ఆరు గంటల తరవాత ఉంది అని చెప్పాడు.సరే అని ఒకచోట లాంజ్ లో కూర్చున్నాము.మా పక్కనే ఒకాయన కూర్చున్నాడు.చూస్తే ఇండియన్ లాగానే ఉన్నాడు."ఏవండీ,ఇండియన్ అనుకుంటా,మాట్లాడనా?" అంటే,"ఒద్దు,అలా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకు" అని చెప్పి నిద్రపోయాడు.నాకేమో నిద్ర రాదాయే! కాసేపటికి నా పక్కనాయనకి ఫోన్ వచ్చింది.ఫోన్ లో "అరేయ్,నా బట్టలు కవర్ లో పెట్టి గారేజిలో పెట్టాను,లాండ్రీలో ఇచ్చేసేయ్" అని చెప్తున్నాడు.అంతే,మా ఆయన జబ్బ మీద ఒక్కటి చరిచి "ఏవండీ,మన పక్కనున్నాయన తెలుగువాడేనండి,పాపం ఏదో లాండ్రీ కష్టాల్లో ఉన్నాడు" అని తలతిప్పి చూసే సరికి ఆ తెలుగాయన వెళ్ళిపోతూ కనిపించాడు.అలా తెలుగాయనతో మాట్లాడే బంగారంలాంటి అవకాశం చేజారి పోయింది.ఆ తరవాత బోలెడంతసేపు వెయిట్ చేసాక మేము ఎక్కాల్సిన విమానమొచ్చింది.ఎక్కి కూర్చున్నాక.....

23 comments:

Raj said...

బాగుంది. అమెరికా వచ్చేశారన్నమాట.

రాధిక said...

అమ్రికాలో ఎక్కడికి వచ్చారు?అయినా అప్పుడే మనవాళ్ల గురించి మొహం వాచిపోయారా?కొత్తగా వచ్చిన వాళ్ళకి తప్పించి మిగిలిన వాళ్ళకి మన ఇండియన్స్ ని చూస్తే కొద్దిగా ఇబ్బంది గానే వుంటుంది.అదే తెలుగువాళ్ళయితే మరీ ఇబ్బంది పడిపోతారు.అదన్న మాట విషయం.మరి జాగ్రత్త.

Madhu said...

Melcow :)

చైతన్య.ఎస్ said...

కూర్చున్నాక..... :)

మీనాక్షి said...

hammayya vachesaaraa..malli kotta post to..
baaundi taravaata emayyindi..tvaragaa cheppandi

Srinivas Sirigina said...

Welcome to America. మా ఆవిడ కూడా అంతే, మొదట్లో ఇండియన్స్ ఎవరన్నా కనబడితే చాలు కళ్ళు ఇంత పెద్దవి చేసుకొని, మొహమ్మీద ఒక పేద్ద చిరునవ్వుతో పలకరించేది. అప్పట్లో మేముండేది ఒక చిన్న ఊరు కావడం వల్ల వాళ్ళు కూడా అలానే పలకరించే వాళ్ళు. కానీ ఈమధ్య డేల్లస్ వచ్చిన తరువాత గమనించిందేమిటంటే, ఇక్కడి జనం ఎవరన్నా దేసీలు కనబడితే చాలు, ఎక్కడ మాట్లాడవలసి వస్తుందో అన్నట్టు చూసీ చూడనట్టుగా వుంటారు. ఎందుకో ఈ తేడా?

సుజ్జి said...

office lo modatinunchi cheyyakunda tappinchukunna panulanni, eppudu teerika ga gurthuku vastai choodandi.. hahahaaa..!! anyway, congrats. meeku mari bore kodithy cheppandi.. america lo unna naa friend no esta. inkeppudu banglore lo kooda telugu valla gurinchi aalochincharu..!?!:))

Anil Dasari said...

అర్రెర్రె.. మొన్న నే ఫోన్లో మాట్లాడేటప్పుడు ఇంతింత కళ్లేసుకుని చూస్తుంది మీరా!?!

Niranjan Pulipati said...

Welcome to America ఎంట్రీ అదిరింది.. తరువాయి భాగం కోసం వైటింగిక్కడ.. :)

సుధీర్ వూణ్ణ said...
This comment has been removed by the author.
సుధీర్ వూణ్ణ said...

మీ అమెరికా ప్రయాణ విశేషాలు బాగున్నాయండి. చీరల మీద బూట్లేసుకుని వాకింగ్ చేసే ఆంటీలు గాని నున్నగా నూనె పెట్టుకొని తలలో తులిప్స్ పెట్టుకొనే తమిళ తంగచ్చిలు గాని దొరికెవరకు మీ నుండి బోలెడు టపాలు ఆశించవచన్నమాట!

Unknown said...

meeru inthaku mundu blog lo english sariga radu annaru,mari 10th class students ki patalu ela chepparandi ...point to be noted,
correcte ...kada

Unknown said...

us lo telugu vallatho jagratha ga vundandi.....manavallaki konchem tekku ekkuva

విహారి(KBL) said...

మీ టపా అదుర్స్.ఇంత కామెడి సెన్స్ మీకు ఎలా వచ్చిందండి .మీకు దీపావళి శుభాకాంక్షలు .

విహారి(KBL) said...
This comment has been removed by the author.
Kamaraju Kusumanchi said...

Nice post!

Anonymous said...

క్రాంతి గారు ఆ అప్పుడేమయ్యింది తొందరగా చెప్పండి వెయిటింగ్ ఇక్కడ :):)

kiraN said...

ఆ కూర్చున్నాక.. తర్వాత... తర్వాతేమైంది....?????


-కిరణ్

వేణూశ్రీకాంత్ said...

Wow welcome to America క్రాంతి గారు... మీరు మా చికాగో కి వస్తూ అలా సైలెంట్ గా వచ్చి వెళ్తే ఎలా అండీ... ముందు గా చెప్పి ఉంటే మీ అభిమాన సంఘాన్ని వెంటేస్కుని పూలదండలు పులివేషాలు డప్పులు డ్యాన్సు లతో భారీ వెల్కం ప్లాన్ చేసే వాడ్ని కదా :-)
Any ways jokes apart... have pleasant stay and enjoy each moment...

సుజాత వేల్పూరి said...

వేణూ శ్రీకాంత్,
ఏమిటి, పులివేషాలు, డప్పులు కూడా ప్లాన్ చేస్తున్నారా అక్కడ!

శ్రీ said...

బాగుందండీ మీ ప్రయాణం! మిగతా సగం ఎపుడు రాస్తారు? ఇంతకీ మీరు ఉండేది ఏకా...డా?

Masthan said...

క్రాంతిగారు,
చాల బాగా బ్లాగుతున్నారు..
ఇంతింతై వటుడింతై.....అతర్వాత ఎదోవుంది.
ఇంతకి మీ ఫ్లైట్ ఇంకా లాండ్ కాలెదా?
ఐతె ఆతర్వాత ఎమి జరిగిందో?????????
"బాలలదినొత్సవశుభాకాంక్షలు"

chavera said...

america lo home-maker busy na?
teacher ga job vachchi inka chala busy na?
appudeme jarigindo teliyadam ledu