Thursday, May 15, 2008

బ్లాగుతా తీయగా చల్లగా

అని ఎప్పటికప్పుడు కొత్త కొత్త బ్లాగులు బర బర,చిర బర బ్లాగేయాలని ఉంటుంది నాకు.కాని ఎలా? నేను ఏమో బోలెడన్ని కష్టాల్లో ఉన్నాను.అదేంటో అన్ని కష్టాలు నాకే,అదీ ఒకేసారి వచ్చిపడతాయి.

నాకు వచ్చిన అతి పెద్ద కష్టమేంటంటే,నాకు ఈ మధ్యే పెళ్ళయ్యింది.పెళ్ళి తరవాత మా అమ్మ,అత్తయ్య విడి విడిగా,జాయింట్ గా కలిపి మొక్కిన మొక్కుబడులన్ని తీర్చడానికి మేము దాదాపు మన రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్ని తిరిగాము.ఇంకా పక్క రాష్ట్రాల్లోవి కొన్ని మిగిలి ఉన్నాయి.నాకు పెళ్ళయ్యాక ఒక పెద్ద నిజం తెలిసింది.పెళ్ళంటే సినిమాల్లో చూపించినంత కలర్ ఫుల్ గా ఏమి ఉండదు.ముఖ్యంగా అమ్మాయిలకి అయితే మరీ!నన్నే చూడండి,పెళ్ళికి ముందు మహారాణి లాగ ఉండేదాన్ని.మరి ఇప్పుడో,ఇల్లు నేనే సర్దాలి,వంట నేనే సర్దాలి.నచ్చినా,నచ్చకపోయినా అందరు వేసే సొల్లు జోకులకి నవ్వాలి.అబ్బ సోది లైఫ్!!పైగా నాకు,మా ఆయనకి ఒక్క విషయంలో ఏకాభిప్రాయం కుదరదు.కాబట్టి సమాన హక్కుల కోసం జరిగే పోరాటలతోనే సరిపోతుంది.

ఇది చాలదన్నట్టు సిటీ మధ్యలో ఉన్నమా ఆఫీస్ ని ఊరు అవతల ఉన్న వైట్ ఫీల్డ్ కి మార్చారు.మా సెంటర్ డైరెక్టర్ హాయిగా మెర్సిడెస్ లో వస్తాడు.మమ్మల్ని మాత్రం డొక్కు బస్సుల్లో చంపుతున్నాడు.ఉదయాన్నే,అంటే చాలా ఉదయాన్నే అన్నమాట..నా జన్మలో ఎప్పుడు నేను అంత తొందరగా నిద్రలేచి ఉండను.రోజు ఉదయాన్నే అయిదు గంటలై లేచి ఆరు గంటలకల్లా బస్టాపులో ఉండాలి.అడ్డామీద కూలీల్లా బస్సు కోసం వెయిట్ చెయ్యాలి.మాయదారి బస్సు ఒకరోజు వచ్చిన టైమ్ కి ఇంకొక రోజు రాదు.మెడలో బిళ్ళ,చేతిలో లాప్ టాప్,పార,పలుగు,తలమీద తట్టతో రెడీగా ఉండాలన్నమాట.బస్ ఎక్కగానే నేను నా సరంజామ అంతా పక్కనోల్ల మీద పడేసి నిద్రపోతా.మరి రోజులో పదహారు గంటలు నిద్రపోయే నన్ను ఉదయాన్నే అయిదు గంటలకి లేవమంటే ఇలానే ఉంటుంది.ఇక వారాంతపు సెలవుల్లో పగలు,రాత్రి తేడా తెలియకుండా నిద్రపోతున్నాను నేను.

వీటికి తోడు నాకు ఇంకొక కొత్త అలవాటు కూడ పుట్టుకొచ్చింది.అదే టీవి.హాస్టల్ లో ఉన్నప్పుడు కూడ టీవి ఉండేది కాని నేను ఎక్కువ చూసేదాన్ని కాదు.రిమోట్ ఎవరో చేతిలో ఉన్నప్పుడు టీవి చూడాలంటే నాకు పరమ చిరాకు.అదే ఇప్పుడయితే ఎంచక్కా రిమోట్ నా చేతిలోనే ఉంటుంది కాబట్టి తెగ టీవి చూస్తున్నాను.చూడటమే కాదు,ఒక తెలుగు సీరియల్ ని నేను విపరీతంగా,రెగ్యులర్ గా ఫాలో అయిపోతున్నాను.చూడగా,చూడగా జీడిపాకం సీరియల్స్ నచ్చేస్తున్నాయి నాకు.ఇంక మా పనమ్మాయి తో కన్నడలో,మా ఇంటి ఓనర్ వాళ్ళమ్మాయితో ఇంగ్లీషులో మాట్లాడేసరికి ఆయాసం వస్తుంది.మా ఓనర్ వాళ్ళమ్మాయి నన్ను "ఆంటీ" అని పిలిచినప్పుడల్లా నాకు ఏడుపు తన్నుకొస్తుంటుంది కాని ఏదో అలా నెట్టుకొస్తున్నాను.అదేంటో పెళ్ళయితే చాలు వద్దన్నా కాని ఆంటీగా ప్రమోషన్ ఇచ్చేస్తారు.ఖర్మ!

కొత్తపాళీ గారు అప్పుడెప్పుడో ఇచ్చిన "తెల్లకాగితం" అనే కథాంశానికి ఇన్ని రోజులకి బుర్ర వెలిగింది కాని ఇప్పుడు ఆ కథని బ్లాగులో రాస్తే అందరు తిడతారని నా కథని టపా కట్టించేసా.ఇంక రెండో కథాంశం "షేర్ ఆటో" కి ఇంకొక ఆరునెలలకి కాని అవుడియా రాదనుకుంట!అన్నట్టు ఈ సందట్లో పడి అసలు విషయం మర్చిపోయాను.నా బ్లాగు ఈ మధ్యే మొదటి పుట్టినరోజు జరుపుకుంది.27 comments:

tumbu said...

hmmm

రాధిక said...

:)

Srinivas Sirigina said...

క్రాంతి గారు,
Congratulations. Wish you a happy married life.
పెళ్ళవ్వగానే రిటైర్ అయిపోయే హీరోయిన్ లా కాకుండా, మీరు మాత్రం ఈ బ్లాగుని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఈమధ్యనే పెళ్ళయ్యింది, పైగా ఆఫీసు మారింది, కాబట్టి రాయడానికి టాపిక్కులు చాలా ఉంటాయి. ప్రతీ రోజూ మీరు బస్సులో కూర్చొని బ్లాగితే, ఆఫీసు కెళ్ళగానే పోస్ట్ చేసెయ్యొచ్చు :-) ఏమంటారు?

- శ్రీనివాస్ శిరిగిన

Anonymous said...

మీ కలల శోభన్‌ బాబు దొరికాడన్నమాట. శుభాకాంక్షలు.

ఈ సారి టపా లో కోత్త పుంతలు తొక్కుతున్నారు. పలుగు-పార, ల్యాప్ట్యాప్-బ్యాడ్జి అదిరిపోయాయి.

బాగా నిద్ర పోతేనే ఇలాంటి టపాలు రాయగలరు. రాయటం మానకండి.

-- విహారి

వికటకవి said...

"నాకు,మా ఆయనకి ఒక్క విషయంలో ఏకాభిప్రాయం కుదరదు"... బాగా సెటిలయ్యే సంసారానికి అదే శుభసూచకం :-)

ఇకపోతే, ఈ బ్లాగుస్పాటు బ్లాగర్ల బ్లాగుభక్తితో చస్తున్నాం,కాస్త వేరే బ్లాగర్లని కూడా దృష్టిలో పెట్టుకోండి మీ కామెంట్స్ సెట్టింగ్స్ లో.

teresa said...

వారాంతంలో పగలూ,రాత్రీ పక్కలోనే పడుకోడం వరకూ బానే ఉంది గానీ పెళ్ళయ్యాక remote మీ చేతిలో ఉందా??

రానారె said...

నాకు ఇరవై యేళ్లయినా లేనప్పుడే ఏడోతరగతి పిలకాయొకడు "అంకుల్ అంకుల్ మంచినీళ్లొస్తున్నాయి" అని కేకలుపెడుతూ పరిగెత్తుకుంటూ మా ఇంట్లోకివచ్చాడు. నేను ఎదురవగానే మళ్ళీ అదేమాటన్నాడు. అప్పుడు తెలిసింది నాకా బాధ ఎలావుంటుందో. వాణ్ణి నిలబెట్టి, "అంకుల్ కాదమ్మా, తాతా అని పిలవాలి" అని చెప్పి పంపేశాను.

ఆ సంగతి పక్కనబెడితే, ఈ టపా చదివాక భయంగా వుంది. :)

మేధ said...

క్రాంతి గారు, ముందుగా పెళ్ళి అయినందుకు శుభాకాంక్షలు... సో అయితే ఇక సంసార సాగరం ఈదడం మొదలు పెట్టారనమాట.. "అందరూ వేసే సొల్లు జోకులకి నవ్వాలి!" - ఇది నేను చాలామంది దగ్గర విన్నాను.. నిజంగా నిజమేనంటారా.. ఏమో స్వానుభవంలోకి వస్తే కానీ అర్ధం కాదు! ఇక ఆంటీ సంగతి కి వస్తే, ఈ మధ్య పెళ్ళి కూడా కాకముందే ఆంటీ అనేస్తున్నారండీ.. బస్ లో వెళ్ళేటప్పుడు, స్కూలుపిల్లలు ఆంటీ నా బ్యాగ్ పట్టుకోరా అంటుంటే, నా మనసు పిండేస్తున్నట్లుంటుంది...

సుజాత వేల్పూరి said...

మీ నిజ జీవిత శోభన్ బాబు గారికి, వారి నిజ జీవిత వాణిశ్రీ గారికి అంటే మీకు శుభాకాంక్షలు. అయినా పెళ్ళైయితే బోలెడన్ని సబ్జెక్టులు దొరుకుతాయి బ్లాగడానికి!అందుకు సంతోషించాలి మీరు!

పెళ్లైన కొత్తలో 'అందరూ వేసే సొల్లు జోకులకు నవ్వాలి ' ఇది జీవిత సత్యం!

"ఆంటీ" అని 20+ లను కూడా అంటున్నారా! అమ్మ..! నా కడుపు కొంచెం చల్లబడింది.

రాఘవ said...

శుభం, "క్రొత్తపెళ్లికూతురా రా రా... నీ కుడికాలు ముందు పెట్టి బ్లాగగా రా" అని పాడాలనిపించినా బలవంతంగా ఆపేసుకున్నాను.
@రానారె:
మిమ్మల్ని 20 ఏళ్లకి పిలిచాడు ఆ పిలకాయ్. నన్నైతే పదోక్లాస్ చదూతున్నప్పుడే ఓ గడుగ్గాయ్ (నా కన్నా బహుశా ఆరేడేళ్లు చిన్న అనుకుంటా) "అంకుల్ ఆ బాల్ ఇవ్వరూ" అన్నాడు. నాకు కోపం, బాధ... ఇదీ అని చెప్పలేని బోల్డన్ని ఫీలింగ్స్ కలిగాయి. మనసు బాధగా మూల్గింది. కానీ ఆ షాక్ తర్వాత అలవాటుపడిపోయా ఈ అంకులూ - పెంకులూ పిలుపులకి.

Saradhi Motamarri said...

Kranti garu,
An interesting, rather lively post.

Continue to write, there aren't many who can write in a humourous way.

:) Saradhi.

Dileep.M said...

మీరు శైలి "స్వాతి" లో హాస్య కధ లా ఆహ్లాదంగా ఉంటుంది.

BHARAT said...

పెళ్ళి ఐతె ఇన్ని కష్టాలా ?

రీమోట్ కంట్రోల్ హక్కులు కూడా కొల్పో వాలా ?

ఈ సమాజం లో ఇక ఎప్పుటికైనా మగ వాళ్లా కి సమన హక్కులు వస్తాయా ?

రీమోట్ మా జన్మ హక్కు !!

కొత్త పాళీ said...
This comment has been removed by the author.
కొత్త పాళీ said...

ఇంకా శోభన్ బాబు, వాణిశ్రీ ఏంటీ, ముప్ఫై ఏళ్ళనాటి కబుర్లు చెప్తారు? మాడ్రన్ గా మహేష్ బాబు, ఇలియానా అనండి.
ఐనా సమానహక్కుల కోసం ఇలియానా పోరాటం .. ఐడియా ఏదో వెరైటీగా ఉందే!

జ్యోతి said...

CONGRATULATIONS..

ఐతే ఇప్పుడూ నీకు డబల్ డ్యూటి అన్నమాట. కాని మీ ఇద్దరికి ఏ విషయంలోనూ అస్సలు కలవదు అన్నావు కదా అది మంచిదే మరి సుఖసంసారానికి. Opposite Poles attract.. కనీసం మీఆయన శోభన‍బాబు లా ఉంటాడా లేదా? ఆల్ ది బెస్ట్..

గీతాచార్య said...

Congrats first.

Continue the blog. It's wonderful to read your blogs.

Remote mee janma hakku. Evarikee ivvakandi.

2 other bloggers: Help me to blog in telugu. Plz send me your guide lines.

రాధిక said...

ఏమిటండీ అందరూ తెగ ఫీలయిపోతున్నారు.మిమ్మల్ని ఆంటీ,అంకుల్ అని పిలిచింది మీకన్నా చిన్నవారేగా.మరి నా బాధ ఎవరికి చెప్పుకోను?డిగ్రీ అయిపోగానే పెళ్ళయి హైదరాబాదుకి వచ్చాను.మా పక్కింట్లో ఉండే పీజీ మొదటి సంవత్సరం చదివే అమ్మాయి ఆంటీ ఆంటీ అంటే , మావారి మీద,అమ్మ మీద....లోకం మీదా..... చాలా కోపం వచ్చేసింది.అయినా తింగరి నవ్వొకటి నవ్వి విషయం చెపితే అవునా అక్కా అంటూ సాగదీసింది.
పెళ్ళయ్యాకా కుళ్ళు జోకులకు నవ్వడమన్నది చెప్పిచ్చుకొట్టుకున్నంత నిజం.అత్తగారి పోరు లేనోళ్ళన్న ఉండొచ్చుగానీ ఈ బాధ లేనోళ్ళు ఉండరేమో?

రాఘవ said...

ఐతే మీకింకా బాగా అర్థమవ్వాలి కదా ఆ బాధ రాధికక్కయ్యా :) :P

Kottapali said...

చెప్పడం మర్చిపోయా .. తెల్లకాయితం కథ .. ఇంకేవన్నా కథ రాస్తే అది కూడా నాకు పంపడం మర్చిపోవద్దు. తప్పకుండా పంపండి. ఇక్కడీకి పంపొచ్చు.

kottapali at yahoo dot com

విహారి(KBL) said...

Happy Married Life kranti garu

Anil Dasari said...

పెద్దగా మేటరేమీ లేకుండా చిన్న విషయాన్ని పట్టుకుని పేజీలకు పేజీలు రాసేసినా ఏకబిగిన చదివించగలిగే చాతుర్యముంది మీలో. అభినందనలు. పెళ్లితో మీ జీవితంలోకి, తద్వారా మీ బ్లాగుల్లోకి మరింత నిండుదనం రావాలని ఆకాంక్షిస్తూ ....

Ramani Rao said...

శుభాకాంక్షలు క్రాంతి గారు.

Bolloju Baba said...

happy married life kraamti gaaru
bollOju baba

Ajay :) said...
This comment has been removed by the author.
akka said...

avunu mari pg lo battalu pettukodaniki almari ledani pellichesukoni kori kastalu chechukunnavu mari. eppude bavatho remote kosam poradi odipoyi manasu thelikapadatam kosam nee blogs chaduvuthunna.baaga rasavu

Appu. said...

avunandi miiru cheppindi chala nijam. kottaga pelli ayyindi ani andaroo anadapadatam tappa ammayilaki anta anandam migalakapovachu. naku i madye pelli ayyindi. paiga andarini oppinchi chesukunna love mrg,kani naa kharma ventane australia vachesamu.vanta gadilo nunchi peratloki vellali kabaytti velle daanni kani lekapote kitchenki manaki chala dooram. ippudu nenu hw(house wife)ne, weekends bayat tiriginanta sepu bane untundi kani,intlo unnantasepu ekkadaleni niirasam vachestayi naku.ee madhye blogs chaduvutunnanu. miiru baga rastunnaru..chaduvutunte naku oka durbudhi pudutondi, nenu blogs raste ela untundani..kani time ekkadidi?rojulo nidraki 16hrs nidraki poga paniki migilindi 8hrse kada.. choodam eppudo viilu choosukuni ekkado oka chota nunchi copy chesestanu.