Tuesday, June 19, 2007

గోవిందా...గోవిందా!!

మా ఆఫీసంతా నున్నగా,నిగనిగ మెరుస్తుంది.ఇంతకీ విషయమేటంటే,ఈరోజు ఉదయం ఆఫీసులో అడుగు పెట్టగానే వెంకటేశ్వర్ రావు ఎదురొచ్చాడు.ఒక్క క్షణం గుర్తుపట్టలేదు నేను.గుండు కొట్టించుకొని రామ్ గోపాల్ వర్మ సిన్మాలో సైడు విలన్ వేషాలు వేసేవాడిలా ఉన్నాడు."ఏంటీ,తిరుపతా?" అని అడిగాను.అవునన్నట్టుగా ఒక నవ్వు నవ్వాడు.

ఒక రెండు గంటలుపోయాక చూద్దును కదా,ఫైనాన్స్ డిపార్ట్ మెంటు లో ఇద్దరు,వేరే టీమ్ లో నా ఫ్రెండ్సు ఒక ఇద్దరు,cafeteria లోదగ్గర దగ్గర ఒక అయిదుగురు నార్త్,సౌత్ తేడా లేకుండా అందరు బోడిగుండు,బోసినవ్వులతో కనిపించారు.ఇంక నేను సస్పెన్స్ తట్టుకోలేక నా ఫ్రెండు ఆనంద్ ని "ఏంటి? గుండు కొట్టించుకుంటే మీ మేనేజర్ hike ఇస్తానన్నాడా?" అని అడిగాను.కిందపడి దొర్లి దొర్లి నవ్వాడు కాని సమాధానం చెప్పలేదు.ఏంటో ఇది గుండు సీజన్ కాబోలు అని అనుకున్నాను.

Thursday, June 14, 2007

పేరులో ఏముంది?

ఎలాగోలా ఒకటవ తరగతి పరిక్షలు రాసేసాను.ఎండాకాలం సెలవులు.ఒకరోజు నేను నాన్న దగ్గరికి వెళ్ళి "నాన్న,నాకు ఈ పేరు నచ్చలేదు,వేరే పేరు పెట్టండి" అని అడిగాను.అసలు పేరు మార్చుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చందో మాత్రం నాకు గుర్తులేదు.అప్పుడు మానాన్న సికిందర్ అంకుల్ తో చెస్ ఆడుతున్నారు.(చెస్ ఆడేటప్పుడు నాన్న ప్రపంచాన్నే మర్చిపోతారు,అప్పుడు ఏమడిగినా కాదనరు) "సరేలే,ఇప్పుడు నువ్వెళ్ళి ఆడుకో" అని చెప్పి అప్పటికి నన్ను వదిలించుకున్నారు.

ఎండాకాలం సెలవులు అయిపోయాయి.స్కూల్ తెరిచారు.కొత్తపేరు సంగతి నాన్నకి మళ్ళీ గుర్తు చేసాను.నాన్న పేరు మార్చటం కుదరదని ఖరాఖండిగా చెప్పేసారు.నేను పేరు మార్చాల్సిందేనంటూ మంకుపట్టుపట్టాను.మానాన్న స్కూటర్ ఎక్కి స్పీడోమీటర్ మీద ఒక కాలు, ముందు సీట్ మీద ఒక కాలు పెట్టి సాగరసంగమంలో కమల్ హాసన్ లా తకిటతధిమి చేసా. ఇక లాభం లేదని మా నాన్న పేరు మార్చటనికి ఒక కండిషన్ పెట్టారు.ఇప్పుడున్న పేరు మొత్తం మార్చటానికి కుదరదు,కావలంటే దానికి ముందు వేరే పేరు తగిలించుకోమన్నారు.నేను "క్రాంతి" పెట్టుకుంటానని చెప్పాను.ఇంట్లో అందరూ "కీర్తి" అయితే ఇంకా బాగుంటుందని తీర్మానించారు.నేను ససేమీర అన్నాను.చేసేది లేక స్కూల్ రిజిష్టర్ లో నా పేరు "క్రాంతి కళ్యాణి" అని రాయించారు.అప్పట్లో మా కాలనీలో ఇదొక సంచలన వార్త.

ఇప్పుడిక అందరు నన్ను "క్రాంతి" అనో "కళ్యాణి" అనో పిలిస్తే ట్విస్ట్ ఏమి ఉంటుంది?స్కూల్ లో అయితే పేరు మార్పించారు కాని,ఇంట్లో పిలిచే పేరు మాత్రం మార్చరు కదా!ఇంట్లో నన్ను "చిట్టి","చిట్టి తల్లి" ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు.ఇన్నాళ్ళబట్టి పోరాడుతున్నాకాని ఆ పిలుపు మాత్రం మార్చలేదు నా అభిమానులు.నేను ఎప్పుడు అమ్మతో పోట్లాడుతాను,ఏ పింకి అనో,స్వీటీ అనో ఎందుకు పెట్టలేదని.అయినా ఇదేదో పెద్ద ఇంటర్నేషనల్ పేరు అయినట్టు నా కజిన్ ని కుడా చిట్టి అనే పిలుస్తారు.మేము ఇద్దరం ఒకేచోట ఉంటే పెద్దచిట్టి,చిన్నచిట్టి అని పిలుస్తారు.(పెద్ద పిచ్చయ్య,చిన్న పిచ్చయ్య లాగా)

ఇక ఇళ్ళ చుట్టుపక్కల ఉండే పిల్లలయితే మరీ దారుణంగా ఏడిపించేవాళ్ళు.అప్పట్లో దూరదర్శన్ లో ఒక నాటిక వచ్చేది."పైడితల్లి పిల్లకి టీకాలు లేవు,BCG సూదిమందులివ్వనే లేదు" అని.అది చూసి inspire అయిన పిల్లరాక్షసులందరు నన్ను మధ్యలో నిలబెట్టి చుట్టూ తిరుగుతా,చప్పట్లు కొడుతూ ఈ పాట పాడే వాళ్ళు.లేదంటే,"అంబేద్కర్ శతజయంతి అదేనోయి పర్వం,ఆనందపు బాటలోన నడిచే జాతి సర్వం", ఇలాంటి పాటలు పాడి నా చిన్న మనసును భాద పెట్టి రాక్షసానందం పొందేవాళ్ళు.వీళ్ళకి దడచి బయటకెళ్ళి ఆడుకోవటం కూడ మానేసాను నేను.

కరిష్మా కపూర్,కరీనా కపూర్ లని చూడండి,"లోలో","బేబో" అని ఎవ్వరికి అర్ధంకాని pet names పెట్టుకున్నారు.ఇది చూసి నాకొక బ్రహ్మాండమైన అవుడియా వచ్చింది.నేను కూడ నాకు future లో పుట్టబోయే పిల్లలకి "జోజో","బజ్జో" అని పెట్టాలని గట్టిగా నిర్ణయించేసుకున్నాను.

Wednesday, June 6, 2007

పదిరూపాయల నోటు

ఈ మధ్య నా ఫోటో ఆల్బమ్ చుస్తుంటే నా ఒకటవ తరగతి స్కూల్ ఫోటో కనిపించింది.అది చూడగానే ఆ ఫోటోతో ముడిపడి ఉన్న ఒక గమ్మతైన సంఘటన గుర్తొచ్చింది.అదే ఇక్కడ బ్లాగుతున్నాను,చదవండి మరి...

మా నాన్నగారు సింగరేణి బొగ్గు గనుల్లో ఇంజనీరుగా పనిచేస్తారు.నా చిన్నతనంలో మేము కరీంనగర్ జిల్లా,గోదావరిఖని ఇండస్ట్రియల్ ఏరియా,8వ ఇంక్లైన్ కాలనిలో ఉండేవాళ్ళం.ఇంట్లో చిన్నదాన్ని అవ్వటం వల్ల మా నాన్న నన్ను అతి గారాబం చేసేవారు.అప్పట్లో నేను "శాంతినికేతన్" బళ్ళో ఒకటవ తరగతి వెలగపెడుతున్నాను.అదే బళ్ళో మా అక్క ముడవ తరగతి చదువుతుండేది.మా ఏరియాలో వున్న పిల్లలందరికి కలిపి ఒక ఆటో ఏర్పాటు చేసారు స్కూల్ వాళ్ళు.నాకు ఆటోలో సీట్ పైన కూర్చోవాలని చాలా ఆశగా ఉండేది కాని,రాజేంద్ర ఉరఫ్ రాజుగాడు (వీడు నా క్లాసే కాని ఆటోలో వీడి వెధవ పెత్తనం ఏంటో నాకిప్పటికి అర్ధం కాదు.) ఏనాడు నన్ను ఆటోలో సీట్ పైన కూర్చోనిచ్చేవాడు కాదు.ఎప్పుడు సీట్ కి వెనకవైపు ఉన్న చెక్క మీద అవతలి వైపుకి తిరిగి కూర్చొని వెళ్ళేదాన్ని.ఇక బళ్ళో మనం చూపించే ప్రతిభ అంతా ఇంతా కాదు.ఒక్కరోజు కుడా నా స్కూల్ బ్యాగు,వాటర్ బాటిల్ నేను పట్టుకోలేదు.నా బ్యాగు,వాటర్ బాటిల్ కూడా మా అక్కే మోసుకొచ్చేది.నన్ను క్లాస్ లో కూర్చోబెట్టి,అంతకుముందు రోజు క్లాస్ లో నేను చేసిన వెధవ పనులు పరిష్కరించి తన క్లాస్ కి వెళ్ళిపోయేది.మా క్లాస్ లో నాది స్టాండర్డ్ ర్యాంక్.ఏ పరిక్ష పెట్టినాకాని నా ర్యాంకు నాకే ఉండేది.30వ ర్యాంకు.(మరి మా క్లాస్ లో ముప్పైయ్ మందే ఉండేవాళ్ళం) మా అక్కకేమో క్లాస్ లో ఎప్పుడూ మొదటి ర్యాంకు వచ్చేది.మా నాన్నతో ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టించుకునేటప్పుడు "నాన్నా! ఒకటి పెద్దదా,ముప్పైయి పెద్దదా? అంటే అక్క కన్నా నాకే మంచి ర్యాంకు వచ్చినట్టు కదా" అని అడిగేదాన్ని.నా తెలివికి మురిసిపోయి మా నాన్న సంతకం పెట్టేవాళ్ళు.మా అమ్మ ఏమో "మీరు అలాగే గారాబం చెయ్యండి, అది ఎందుకూ పనికి రాకుండా పోతుంది" అని మా నాన్న మీదా,నా మీదా కేకలేసేవారు.అప్పుడు నా ప్రతిభని గుర్తించని అమ్మ నాకు సూర్యకాంతం లాగా నాన్న శోభన్ బాబు లాగా కనిపించేవాళ్ళు.మా నాన్న మాత్రం నన్ను బాగా వెనకేసుకొచ్చేవారు.

ఒకరోజు మా టీచర్ గారు "రేపు మీ అందరిని ఫోటో దించుతారు,అందరు చక్కగా రెడీ అయ్యి రావాలి" అని చెప్పారు.అంతే తరవాత రోజు మా అమ్మని, ఆటోవాలా ని,రాజుగాడ్ని,మా అక్కని నేను పెట్టిన కంగారు అంతా ఇంతా కాదు.మా అమ్మతో స్కూల్ యూనిఫామ్ ఇస్త్రీ చేయించుకున్నాను.వేసిన జడలు నచ్చలేదని మళ్ళీ వేయించుకున్నాను.ఆ రోజు ఆటోవాలాతో,రాజుగాడితో పోట్లాడి మరీ ఆటోలో సీట్ మీద కూర్చున్నాను.స్కూల్ కి వెళ్ళాను,ప్రార్ధన అయిపోయింది.క్లాసులకి టీచర్లు వచ్చేసారు.ఎక్కడా ఫోటోల సందడే కనిపించలేదు.ఏంటో మనసంతా దిగాలుగా అయిపోయింది.ఈలోపు ఇంటర్వెల్ బెల్ కొట్టారు.క్లాస్ లో నుండి పరిగెత్తుకొచ్చి బయట చూస్తే ఫోటోగ్రాఫర్ కెమారాతో కనిపించాడు.మా బళ్ళో ఉన్న స్టేజికి ఉన్న మెట్ల దగ్గర బెంచీలు వేసి ఫోటోల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.మళ్ళీ నాలో ఉత్సాహం మొదలయ్యింది.మొదట L.K.G, U.K.G పిల్లల్ని ఫోటోలు తీసారు.తరువాత మా వంతు వచ్చింది.నేను గబగబా మా అక్క క్లాస్ దగ్గరికి వెళ్ళాను.తనని క్లాస్ లోనుండి బయటకి పిలిపించి "ఇప్పుడు మమ్మల్ని ఫోటో దించుతున్నారు,నేనెలా ఉన్నాను? ఫోటోలో బాగా వస్తానా అని అడిగాను?" నా యూనిఫాం,బెల్టు కాసేపు సర్ది పంపించింది.మా క్లాస్ పిల్లల్ని వరసగా బెంచీల మీద నిలబెట్టారు.మా మధ్యలో మా క్లాస్ టీచర్ అశ్వని టీచర్ కూర్చున్నారు.స్కూల్ అటెండర్ మా క్లాస్ ముందు ఉండే "1వ తరగతి" అనే చిన్న బోర్డు పట్టుకోని వచ్చి,"క్లాస్ లీడర్ ఎవరు?"అని అడిగాడు.గీతావాణి "నేనే లీడర్ ని"అని చెప్పింది.అతను ఆ బోర్డు గీతకి ఇచ్చి పట్టుకొమ్మన్నాడు.నాకెందుకో ఆ బోర్డు పట్టుకోని ఫోటో దిగాలనే దుర్బుద్ధి పుట్టింది.కాని గీత క్లాస్ లో ఫస్టు,పైపెచ్చు క్లాస్ లీడర్ కాబట్టి మనకి అంత సీన్ లేదనుకోని నోరుమూసుకున్నాను.తరువాత ఫోటో దించేసారు."ఫోటో ఎప్పుడు ఇస్తారు?" అని టీచర్ ని అడుగుదామని అనుకున్నాను.కాని ధైర్యం సరిపోక క్లాస్ కి వచ్చేసా.అది మొదలు ఫోటో ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఆలోచనలో తిండి కూడ సరిగ్గా తినలేదు.నిద్రలో కూడా ఫోటోని గురించిన కలవరింతలే.నా వాలకం చూసి అమ్మ చాలా కంగారు పడిపోయింది.తరువాత ఒక నాలుగైదు రోజులకి క్లాస్ లో మా టీచర్ "రేపు అందరు అయిదు రూపాయలు తీసుకోని రండి,ఫోటోలు ఇస్తారు" అని చెప్పారు.ఆ రోజు ఇంటికి వెళ్ళగానే అమ్మకి విషయం చెప్పాను.మా అక్క వాళ్ళ టీచర్ కూడ అయిదు రూపాయలు తీసుకొని రమ్మన్నారంట!(మరి వాళ్ళు కుడా ఫోటో దిగారు కదా!!) అమ్మ సరే రేపు ఉదయం బడికి వెళ్ళేటప్పుడు ఇస్తాను అని చెప్పింది.మరుసటి రోజు బడికి వెళ్ళేటప్పుడు అమ్మ మా అక్కకి పది రూపాయల నోటు ఇచ్చి"నీకు,చెల్లికి అని చెప్పి టీచర్ కి ఇచ్చి రెండు ఫోటోలు జాగ్రత్తగా పట్టుకొనిరా" అని చెప్పింది.నాకు విపరీతమయిన కోపం వచ్చింది అమ్మ మీద."నా ఫోటో నేనే తెస్తా,నా అయిదు రూపాయలు నాకే ఇవ్వు" అని ఏడవడం మొదలు పెట్టా."నా దగ్గర చిల్లర లేవురా,నీ ఫోటో కూడ అక్క తెస్తుందిలే"అని అమ్మ నన్ను సముదాయించాలని చూసింది."చిల్లర లేకపొతే ఆ పది రూపాయల్ని రెండు ముక్కలు చేసి నా అయిదు రూపాయలు నాకు ఇవ్వు" అని ఏడుపు అందుకున్నాను నేను.నా తెలివికి అమ్మ అవాక్కయ్యింది.నేను ఇచ్చిన షాక్ నుండి తేరుకోవడానికి అమ్మకి ఒక అయిదు నిమిషాలు పట్టింది.నా గోల భరించలేక అమ్మ పక్కింటి వాళ్ళదగ్గర చిల్లర తీసుకోని మా ఇద్దరికి చెరో అయిదు రూపాయలు ఇచ్చి పంపించింది.ఇప్పటికి నా ఒకటవ తరగతి ఫోటో చూస్తే ఆ రోజు నేను చేసిన హంగామా గుర్తొచ్చి నవ్వొస్తుంది.