Sunday, September 16, 2007

అమ్మో..సిద్ధుగాడు

సిద్ధుగాడు ఉరఫ్ సిద్ధార్ధ.మా అక్క ముద్దుల కొడుకు.వాడి వయస్సు రెండున్నర సంవత్సరాలు.మా ఇంట్లో నేనే చిన్నదాన్ని.నా తరవాత దాదాపు ఇరవై సంవత్సరాల తరవాత మళ్ళీ మా ఇంట్లో ఒక చిన్నపిల్లాడు వచ్చాడు.చాలా రోజుల తరవాత చిన్నపిల్లల్ని పెంచడం రావల్సినందునో లేక మా అమ్మావాళ్ళకి మగపిల్లల్ని పెంచిన అలవాటు లేకపోవటం వల్లనో కాని వాడు ఏది చేసినా అందరికి అదో పెద్ద విచిత్రంగా కనపడుతుంది.అసలు సిద్ధుగాడికి ఆరునెలలు వచ్చేదాక ఇంట్లో ఒక్కరోజు కూడ ఏడుపు వినిపించలేదు.ఎప్పుడో టీకాలంటు ఇంజక్షన్ వేసిన రోజు తప్ప ఎప్పుడు ఏడ్చేవాడు కాదు.అప్పట్లో మావాళ్ళకి అదో పెద్ద గొప్ప.అందరు కలసి వాడికి బుద్దిమంతుడు,మంచి బాలుడు వగైరా బిరుదులు ఇచ్చేసారు.కాని తరవాత తరవాత వాడు చేసే పనులు చూసి అందరు ముక్కున వేలు వేసుకున్నారు.తొందరపడి బిరుదులు ఇచ్చేసామా అని భాదపడ్డారు.

సిద్ధుగాడు కామ్ గా ఉన్నాడంటే దేనికో మూడిందన్నట్లే.మా ఇంట్లో ఫ్రిజ్ ఎప్పుడో నేను మూడవ తరగతిలో ఉన్నప్పుడు కొన్నారు.ఇప్పుడంటే ఎయిర్ కంప్రెసర్ ఫ్రిజ్ అడుగు భాగాన ఇచ్చి అవుటర్ ఫ్రేమ్ అంతా నీట్ గా కవర్ చేస్తున్నాడు కాని,మా ఫ్రిజ్ కి కంప్రెసర్ వెనకవైపు ఓపెన్ గానే ఉంటుంది.వీడెకేదో పనున్నట్లు ఎప్పుడు ఆ కంప్రెసర్ లో వేలు పెట్టి గెలుకుతూ ఉంటాడు.వాడు మా ఇంట్లో ఉన్నన్ని రోజులు మేము ఫ్రిజ్ వాడము.అది ఎండాకాలమైనా ఇంకా ఏకాలమైనా వాడొస్తే ఫ్రిజ్ మూల పడాల్సిందే.టమోటాల్ని పిసికి మంచినీళ్ళ బిందెలో వేస్తాడు.చెప్పులు బయట పడేస్తాడు.పట్టుచీరల మీద కొబ్బరినూనె ఒలకపోస్తాడు.టీవి రిమోట్ ని నేలకేసి బాదుతాడు.పెన్సిల్ తో గోడలమీద మోడ్రన్ ఆర్ట్ చెక్కుతాడు.ఒకటా రెండా వాడు చేసే పనులు.వాడొస్తున్నాడంటే "అమ్మో,సిద్ధుగాడు వస్తున్నాడు" అని అనాల్సిందే ఎవ్వరైనా.వాడు ఇంత అల్లరి చేసినా మా అమ్మ మాత్రం వాడ్ని ఒక్క మాట అనదు.పైపెచ్చు "కన్నయ్యా" అని పిలుచుకుంటుంది.అసలు మా అమ్మ సపోర్టు చూసుకొనే వాడు ఇంకాస్త ఎక్కువ అల్లరి చేస్తాడు.సిద్ధుగాడికి,నాకు ఒక్క క్షణం పడదు.మా అమ్మ ఏమో "పసిపిల్లాడితో నీకేంటే ఎప్పుడు గొడవ,వాడ్ని గిల్లుకోపోతే నీకు ప్రశాంతంగా ఉండదా?" అని అంటుంది.అమ్మో వాడు పసిపిల్లడా? కాదు పిల్ల రౌడి.అయినా వాడ్ని నేను గిల్లుకోను,వాడే నన్ను గిల్లుకుంటాడు.

సిద్ధుగాడు ప్రస్తుతం గోవాలో ఉంటున్నాడు.మా బావగారికి(సిద్ధువాళ్ళ నాన్న) చదువుకోవటం అంటే చాల ఇష్టం.ఎప్పుడు ఏవో పరీక్షలు రాసి డిగ్రీల మీద డిగ్రీలు చదివేస్తుంటారు.ఆయన దేన్నయినా సహిస్తారు కాని ఆయన పుస్తకాల్ని ఎవరయినా ముట్టుకుంటే మాత్రం అస్సలు ఊరుకోరు.ఒకరోజు రాత్రి ఆయన చదువుకొంటుంటే సిద్ధుగాడు వెళ్ళి,"నాన్న,సిద్ధు సదుతా" అని అనేసరికి వాళ్ళ నాన్న "అమ్మో,నా కొడుక్కి చదువుకోవాలనే మూడొచ్చింది" అని రెచ్చిపోయి మరీ వన్,టూ,త్రీ..నేర్పించారంట.తరవాత ఆయన చదివే పుస్తకంలో పేజి అడుగున పేజి నంబర్ 39 అని రాసి ఉంటే మా బావగారు అది చూపించి "థర్టీ నయిన్" అని మూడు నాలుగుసార్లు పలికించారంట.చివరికి కష్టపడి "తత్తి నై" అనటం నేర్చుకున్నాడు సిద్ధుగాడు.అంతవరకు బాగానే ఉంది.మరుసటి రోజు ఉదయం మా బావగారు ఇంట్లో లేరంట,మా అక్క వంటింట్లో ఏదో పనిలో బిజీగా ఉందంట.వీడు అంతకు ముందురోజు చదివిన పుస్తకం దొరికించుకొని చక్కగా గది మధ్యలో కూర్చొని "తత్తి నై" అని అనటం ఒక పేజి చింపటం,మళ్ళీ "తత్తి నై" అనటం ఇంకో చింపటం.ఇలా ఒక పది,పదకొండు పేజీలు చింపేసాడంట.మా అక్క తేరుకొని వచ్చేలోపల జరగాల్సిన డామేజి జరిగిపోయింది.మా బావగారికి ఇంటికొచ్చి పుస్తకం చూసుకొన్నాక చాలా కోపమొచ్చిందంట.మా అక్కపైన,సిద్ధుగాడిపైన అలిగి రెండు రోజులు మాట్లడటం మానేసారంట.తరవాత మళ్ళీ మాములే.నాకు మా అక్కని ఎప్పుడన్నా ఏడిపించాలనిపిస్తే,ఫోన్ చేసి "మీ తత్తి నై గాడు ఏమి చేస్తున్నాడు" అని అడుగుతాను.మా అక్క భలే ఉడుక్కుంటుంది.

గత వారంరోజుల బట్టి సిద్ధుగాడు ప్లే-స్కూల్ కి వెళ్తున్నాడు.వాడ్ని ప్లే-స్కూల్ లో చేర్పించడానికి కూడ ఇంటర్వ్యూ ఉందంట.మా అక్క,బావగారు రాత్రి పగలు కష్టపడి ఎలాగో వాడ్ని ఇంటర్వ్యూలో పాస్ చేయించారు.స్కూల్ కి వెళ్ళిన రెండో రోజే క్లాస్ లో వేరే పిల్లడి చొక్కా చింపేసాడంట.సిద్ధుగాడి టీచర్ మా అక్కని పిలిపించి అరగంటసేపు క్లాస్ పీకి,ఆ చొక్కా చినిగిన వాళ్ళ అమ్మ కొంచెం డేంజర్ మనిషి అని చెప్పిందంట.ఆ భయంతో మా అక్క,సిద్ధుగాడు ప్రస్తుతం అఙ్ఞాతంలో ఉన్నారు.
(ఫోటోలో సిద్ధుగాడు,వాడి అత్త కూతురు నీతు)



Sunday, September 2, 2007

మా కాలని

సింగరేణిలో పనిచేసే ఉద్యోగులందరికి సంస్థ వారే క్వార్టర్లు ఇస్తారు.చిన్న చిన్న కాలనీలు ఏర్పాటు చేసి వారి వారి ఉద్యోగస్థాయిని బట్టి క్వార్టర్లు ఇస్తారు.అలా మేము ఇరవయి సంవత్సరాలు 8వ ఇంక్లైన్ కాలనిలో ఉన్నాము.చుట్టూ బోలెడన్ని క్వార్టర్లు,ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్,బస్టాప్,బస్టాప్ దగ్గర బజ్జీల బండి,వెంకటేశ్వరస్వామి గుడి,సరస్వతి శిశు మందిరం స్కూల్,సింగరేణి హైస్కూల్,రిక్రియేషన్ క్లబ్,చిల్డ్రన్స్ పార్క్...(ఇంకా అటు ఒక పక్కకి నడచి వెళ్తే వైన్ షాప్ కూడా ఉంటుంది కాని నేను ఎప్పుడు వెళ్ళలేదు.) ఇలా అన్ని ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది కాలని.చుట్టుపక్కల చిన్న చిన్న పల్లెటూర్లు ఉండేవి.పాలు,కూరగాయలు చిన్నచిన్న బుట్టల్లో,తోపుడు బండ్ల మీద పెట్టుకొని తెచ్చి అమ్మేవారు.కొంత పల్లెటూరి వాతావరణం,కొంత టవున్ వాతవరణం కలిపి, కలగాపులగంగా చాలా బాగుండేది మాకాలని.మరి అంతా ప్రశాంతంగా ఉంటే ఎలా? ఏదో ఒకటి ఉండాలి కదా.అప్పట్లో కరీంనగర్,వరంగల్,ఆదిలాబాద్ జిల్లాల్లో అన్నల ప్రభావం చాల ఎక్కువగా ఉండేది.ఇప్పుడంటే మావోయిస్టులని పేరు మార్చుకున్నారు కాని గతంలో రాడికల్స్ అని,నక్సలైట్లు అని పిలిచేవాళ్ళు.మరీ ముద్దొస్తే "అన్నలు" అని పిలిచేవాళ్ళు.

వీళ్ళ ప్రభావం ఎంతగా ఉండేదంటే భార్యాభర్తల గొడవల దగ్గర్నుండి బొగ్గుగనుల్లో ప్రొడక్షన్ కి సంబంధించిన విషయాల వరకు అన్నింట్లో తల దూర్చేవాళ్ళు.అసలు గనుల్లో పనిచేసే కార్మికుల్లో ఈ అన్నల తమ్ముళ్ళు చాలా మందే ఉండేవాళ్ళు.ఈ అన్నలకి అప్పుడప్పుడు ఎందుకు కోపమొచ్చేదో కాని, కోపమొచ్చినప్పుడు ఎవరో ఒక ఆఫీసర్ని కిడ్నాప్ చేసి వాళ్ళ డిమాండ్లు ఒక కాగితం మీద రాసి ఆ ఆఫీసర్ ఇంటి గోడ మీద అతికించటం కాని, లేకపొతే ఆ ఇంటావిడ చేతిలొనో పెట్టి వెళ్ళేవారు.ఇక ఆ కిడ్నాప్ అయిన ఉద్యోగి ఇల్లు చేరే వరకు ఆఫీసర్ల భార్యల ర్యాలీలు,ఈనాడు జిల్లా మధ్య పేపర్లో వీళ్ళ ఫోటోలు,పోలిసుల హడావిడి అంతా టెన్షన్ టెన్షన్.నేను ఏడవ తరగతి చదివేటప్పుడు సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు,జనరల్ ఎలక్షన్స్ రెండు నెలల తేడాతో ఒకేసారి జరిగాయి.అన్నలేమో ఎన్నికలు జరగటానికి వీల్లేదంటూ అల్టిమేటం ఇచ్చేసారు.పోలింగ్ బూత్ లు పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.ఎన్నికలు ఎలాగయినా జరిపిస్తామని పోలిసులు కూడా శపథం చేసారు."ఎలా జరిపిస్తారబ్బా?" అని అనుకుంటూ ఉండగానే "ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలిసులు" అంటూ సింగరేణి కమ్యూనిటి హాల్లో దిగబడ్డారు.వీళ్ళు కూడా వచ్చాక కాలనీవాళ్ళ పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడిన చందాన తయారయ్యింది.

ఈ ర్యాపిడ్ యాక్షన్ వాళ్ళని చూస్తేనే చాలు ఎంత భయమేసేదంటే,ఒక్కొక్కడు ఆరు అడుగుల పైనే ఉండేవాళ్ళు.నల్ల డ్రస్సులు వేసుకొని,తలకి ఎర్రరంగు గుడ్డ కట్టుకోనే వాళ్ళు.ఎక్కువగా పంజాబీలే ఉండేవాళ్ళు.మూడేళ్ళ పాప దగ్గర్నునుండి, అరవై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు ఆడవాళ్ళు కనిపిస్తేచాలు ఎంత వెకిలి వేషాలు వేసేవారో.వీళ్ళ పుణ్యమా అని ఆడపిల్లల్ని ఉదయాన్నే ట్యూషన్లకి,యోగా,డ్యాన్స్ క్లాస్ లకి పంపించటం మానేసారు.ఈ నల్ల పోలిసులు బస చేసిన కమ్యూనిటి హాల్ మా ఇంటికి నాలుగు అడుగుల దూరంలోనే ఉండేది.వీళ్ళ భయానికి మరీ మమ్మల్ని ఇంటిముందు కూడా ఆడుకోనిచ్చేవారు కాదు అమ్మా వాళ్ళు.

అందరు భయపడి చచ్చే ఈ పోలిసులకి మా KP గాడు మంచి ఫ్రెండు అయ్యాడు.వీడికి సంవత్సరంలో 365 రోజుల్లో 360 రోజులు కడుపు నొప్పి వచ్చేది.ఎప్పుడు స్కూల్ కి సరిగ్గా వచ్చేవాడు కాదు.ఏంటని అడిగితే అపెండిసైటిస్ నొప్పి అని చెప్పేవాడు.రోజు మాత్రం సైకిల్ తొక్కుకుంటూ పోలిసులున్న కమ్యూనిటి హాల్ కి వెళ్ళేవాడు.పోలిసులు ఒకసారి KPకి చేపల కూర కూడ చేసి పెట్టారంట.ఒకరోజు కమ్యూనిటి హాల్ బయటి గోడలకి అన్నలు తెలుగులో రాసి ఉన్న కాగితాల్ని అంటించి వెళ్ళారు.నల్ల పోలిసులు KPవాళ్ళింటికొచ్చి KPని తీసుకొని వెళ్ళి అవి చదివించి హిందీలో చెప్పించుకున్నారు.

పార్టీల వాళ్ళు నక్సలైట్లకి భయపడి ప్రచారం కూడా పెద్దగా చెయ్యలేదు.అప్పట్లో కాంగ్రెస్ కి మా దగ్గర మంచి సపోర్ట్ ఉండేది.ప్రచారం చేసినా చెయ్యకపోయినా కాంగ్రెస్సే గెలిచేది.మొత్తానికి ఒకటి,రెండు మందుపాతర పేలుళ్ళ మధ్య ఎలక్షన్స్ జరిగాయి.కాంగ్రెస్ సిట్టింగ్ MLA శ్రీపాదరావు గారు గెలిచారు.ఆ తరవాత కొన్నాళ్ళకు నల్ల పోలిసులు వెళ్ళిపోయారు.కొన్నాళ్ళకి అంతా సద్దుమణిగింది అని అనుకొంటుండగా అన్నలు శ్రీపాదరావు గారి కారు పేల్చేసి ఆయన్ని చంపేసారు.మళ్ళీ ఎన్నికలు జరిపించాల్సి వచ్చింది.తరవాత శ్రీపాదరావు గారి అబ్బాయి శ్రీధర్ MLA అయ్యారు.మేము ఆ కాలనీ నుండి వచ్చేసి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది.మొన్నామధ్య స్కూల్ లో నాతోపాటు చదువుకున్న నా ఫ్రెండు కలసినప్పుడు ఇవన్ని మాట్లడుకున్నాము.ఇప్పుడు కాలనీ కూడ చాలా మారిపోయిందంట.మాతో కలసి చదివిన వాళ్ళు కాని,మాకు పాఠాలు చెప్పిన టీచర్లు కాని ఎవ్వరు ఇప్పుడు ఆ కాలనీలో ఉండటంలేదంట.ఇప్పుడు కాలనీ ఎలా ఉందో చూడాలనిపిస్తుంది.ఎప్పుడయినా టైమ్ చూసుకొని ఒక్కసారి మా కాలనీ కి వెళ్ళాలి.మాటల మధ్యలో తెలిసిందేమిటంటే KP ఇప్పుడు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంట.