Tuesday, April 3, 2012

ఏవిటా డబ్బా ప్రశ్న!

ఎర్రటి ఎండాకాలం,మధ్యాహ్నం ఎండ సర్రసర్రమని వీపు బద్దలుగొడుతుంది.అప్పుడే పాలు తాగి సగం నిద్రలో జోగుతున్నాను నేను.అంతకన్నా ముఖ్యమైన పనులేమి లేవు చెయ్యడానికి.ఎందుకంటే మరి నా వయస్సు ఇంకా మూడు రోజులే కదా!ఏదో నాపాటికి నేను ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా నా బంగారు భవిష్యత్తు గురించి కలలు కంటుంటే నాకోసం విజిటర్స్!ఈ టైంలో విజిటర్స్ ఏంటి? ఏ!ఓ వేళాపాళా లేదా అని నా సెగట్రీ(అదే,మా అమ్మ)మీద అరుస్తుంటే సెలబ్రిటీలన్నాక ఇలాంటివి కొన్ని తప్పవు మరి అని సర్దిచెప్పారు.ఆ వచ్చినావిడ మానాన్న తరపు బంధువు.నాకు నాయనమ్మ వరస అవుతుంది.వస్తూనే,అయ్యో పాపం!మళ్ళీ ఆడపిల్లే పుట్టిందా?ఈసారయినా మగపిల్లాడు పుడతాడనుకున్నాను!అని ఒకటే ఏడుపు మొదలుపెట్టింది.

మళ్ళీ ఆడపిల్లే పుట్టిందా?....ఏవిటా డబ్బా ప్రశ్న! అసలు ఈ ఆడపిల్ల,మగపిల్లాడు తేడా ఏంటి? నాకిప్పుడే తెలియాలి! అసలు ఈ మీటింగే నాకు నచ్చలేదు,పైగా ఈ ముసలి నన్ను చూసి ఏడుస్తుందేవిటి?

నాచిన్నప్పుడు రాజమ్మ అని ఒకామె పక్కనే ఉన్న పల్లెటూరు నుండి గంపలో పాలసీసాలు,క్యాన్లు పెట్టుకొని పాలుపొయ్యడానికి మాకాలనీకి వచ్చేది.పోసేది నీళ్ళపాలే అయినా వేరే దారిలేక అందరు ఆమె దగ్గరే పాలు తీసుకొనేవాళ్ళు.కాలనీలో అందరికి పాలు పొయ్యడం అయ్యాక తీరిగ్గా తొమ్మిదింటికి మా ఇంటికి వచ్చేది.లేటుగా వచ్చిందికాక,నీళ్ళపాలు పోసిందికాక,ఆ పాలతో టీ పెట్టించుకొని తాగి వెళ్ళేది.అప్పటికి మా అక్క బడికి వెళ్ళిపోయేది,మరి నేనేమో ఇంట్లోనే అమ్మకి తోడుగా ఉండేదాన్ని.అప్పుడప్పుడు నాతో ఆడుకోవడానికి రాజు,కృష్ణ వచ్చేవాళ్ళు.ఒకరోజు మేము ముగ్గురం ఆడుకుంటుంటే,రాజమ్మ నన్ను పిలిచి రాజు,కృష్ణలని చూపించి వీళ్ళిద్దరిలో ఎవరిని పెళ్ళి చేసుకుంటావు అని అడిగింది.

ఏవిటా డబ్బా ప్రశ్న! అసలు పెళ్ళేవిటి? ఒక్కళ్ళనే ఎందుకు చేసుకోవాలి? ఇద్దరిని పెళ్ళి చేసుకుంటా అని చెప్పాను.నేను చెప్పిందాంట్లో అంత విచిత్రమేవిటో కాని రాజమ్మ దొర్లిదొర్లి నవ్వుతుంది.వంటింట్లో ఉన్న మా అమ్మని పిలిచి"చిట్టెమ్మ వీళ్ళిద్దర్ని పెళ్ళి చేసుకుంటుందంట!" అని చెప్పి మళ్ళీ నవ్వుతుంది.అది విని మా అమ్మ కూడ నవ్వుతుంటే నాకు బోలెడంత కోపమొచ్చింది."అవును ఇద్దరిని పెళ్ళి చేసుకుంటా,ఇద్దరిని పెళ్ళి చేసుకుంటా" అని ఏడుస్తుంటే సరేలే,చేసుకుందువులేగాని ఆఏడుపు ఆపు అని అమ్మ నన్ను ఎత్తుకొని లోపలికి వెళ్ళింది. రాజమ్మ ఇంకా దొర్లుతానే ఉంది.రాజు,కృష్ణ..అమ్మో,ఇప్పుడు మేము చిట్టిని పెళ్ళి చేసుకోవాలా అని బిక్కమొహాలు వేసుకొని చూస్తున్నారు.

"నాకు ఇంజనీరింగ్ అయిపోగానే క్యాంపస్ సెలక్షన్స్ లో సత్యంలో జాబ్ వచ్చింది" అని చెప్పేవాళ్ళని చూస్తే "అబ్బ!ఛ!!"అనాలనిపిస్తుంది నాకు.ఎందుకంటే నాకు అలా రాలేదు కాబట్టి.నాలాంటోల్లని జనాలు ఎందుకు పనికి రానివాళ్ళని చూసినట్టు చూస్తుంటే ఇంకా మండిపోయేది.అబ్బో ఇంజనీరింగ్ అయిపోయాక,జాబ్ రావటానికి మధ్య ఎన్నెన్ని సాహసయాత్రలు,చిత్రవిచిత్రాలు జరిగాయో!!అవన్ని రాయాలంటే ఓఏడాది పడుతుందేమో!ఈలోపు మన జీవితం గురించి మనకన్నా,మన అమ్మానాన్నలకన్నా మన ఇంటి చుట్టుపక్కలవాళ్ళు ఎక్కువ హైరానా పడిపోతుంటారు.వాళ్ళళ్ళో కూడ ఓరవ్వంత ఎక్కువ చేసేది,అదే అతి అంటారే అది,అలా అతి చేసేది ఎవరమ్మా అంటే,ఓమివాళ్ళమమ్మి.వాడి పేరు ఓంప్రకాశ్.వాళ్ళమ్మ వాడ్ని ఓమి అని పిలుస్తుంది.వాడు నా క్లాసే!"చిట్టి,నీకు జాబ్ ఇంకా రాలేదా!?!?ఓమి పూణె వెళ్ళాడు,ఓమి ఆస్ట్రేలియా వెళ్ళాడు,ఓమి కూరలో వాము వేసుకొని తిన్నాడు"ఇలా బ్రెయిన్ దొబ్బిచ్చేది.

ఓసారి ఒక పెళ్ళిలో ఓమివాళ్ళమమ్మి కనపడింది.మళ్ళీ మొదలురా బాబు అని అనుకున్నాను.

ఓమివాళ్ళమమ్మి: ఏంటి చిట్టి జాబ్ వచ్చిందంటగా,మీ అమ్మ చెప్పింది.
నేను: అవునాంటి.

ఓమివాళ్ళమమ్మి: బెంగుళూరులో అంటగా!

నేను : అవునాంటి. అన్ని తెలుసు కదా!మళ్ళీ ఏంటి తల్లీ ఈ ఇంటర్వ్యూ!

ఓమివాళ్ళమమ్మి: జీతమెంత?

నేను: ఏవిటా డబ్బా ప్రశ్న! ఎందుకాంటీ, నాకు డబ్బులు సరిపోకపోతే నెలకి ఓ పదివేలు మీరు పంపిస్తారా?

ఆతరువాత మా అమ్మ నాకు క్లాస్ తీసుకుందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదనుకుంటా!

నాపెళ్ళి హడావిడి ముగిసింది.మా అత్తగారింట్లో ఆరోజు సత్యనారాయణస్వామివ్రతం చేస్తున్నారు.ఇంకాసేపట్లో పూజ మొదలవుతుందనగా,మావారి పిన్ని ఒకావిడ నాదగ్గరికొచ్చి"ఇదిగో కోడలా,మీసంబంధం చేసుకోవలా,వద్దా అని మీ అత్తగారు వెనకాముందు ఆలోచిస్తుంటే,నేనే చేసుకోమ్మని గట్టిగా చెప్పాను.నేను చెప్పబట్టే మీఅత్తగారు ఒప్పుకున్నారు.ఈఇంట్లో నామాటకి అంత పవర్ ఉంది.నాతో జాగ్రత్తగా ఉండు మరి"అని చెప్పింది.ఇది డబ్బాప్రశ్న కాదు.డబ్బాడైలాగ్!ప్రతి పెళ్ళిలో ఇలాంటి ఐటంగాళ్ళు కనీసం ఒక్కరైనా ఉంటారనుకుంటా!అసలు తాము లేకపోతే జనాలకి పెళ్ళిళ్ళే అవ్వవని ఓ తెగ ఫీల్ అయిపోయేవాళ్ళు.ఇప్పటికి నాకు మావారికి ఏవైనా గొడవ జరిగితే,నేను "అసలు మిమ్మల్ని కాదు,మన పెళ్ళి కుదిర్చిన మీపిన్నిని అనాలి" అని అంటుంటాను :)

2011 సవంత్సరం,ఫిబ్రవరి నెలలో ఒకానొక రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.పెద్ద ఆకాశం,నేల తలక్రిందులయ్యేంత పెద్ద విషయమేమి లేదు.జస్ట్ నేను శాఖాహారిగా మారిపోయాను.ఇంక చూడాలి సామిరంగా..

ఏం!నువ్వేమయినా PETA కి అంబాసిడర్ అవ్వాలా ఇప్పుడు నాన్ వెజ్ మానేసి?
డబ్బా ప్రశ్న!

ఎన్నిరోజులు ఉంటావు నాన్ వెజ్ తినకుండా?
డబ్బా ప్రశ్న!

క్రాంతి ఎలాగయినా నేను నీతో నాన్ వెజ్ తినిపిస్తాను!
ఏడ్చావులే! డబ్బా ఛాలెంజ్!!

ఇప్పటికి సంవత్సరమయిందిగా,ఇంక మళ్ళీ నువ్వు నాన్ వెజ్ తినడం మొదలుపెడితే మంచిది.
డబ్బా సలహా!