Monday, December 8, 2008

వీళ్ళు ఇంక ఎప్పుడు మారుతారో?

ఈరోజు నాఫ్రెండ్ దగ్గర్నుండి నాకొక ఈ-మెయిల్ వచ్చింది.అది చదివి నేను చాలా బాధపడ్డాను.విషయమేంటంటే,ఈ-మెయిల్ పంపిన నాఫ్రెండ్ బెంగుళూరులో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్.వయస్సు రమారమి 32,అవివాహిత.ఈమధ్య ప్రాజెక్ట్ రిలీజ్ చేసే సమయం కాబట్టి ఆఫీసులో చాలా పొద్దుపోయే వరకు ఉండాల్సివస్తుందంట.రిలీజ్ టైమ్ లో ఒక్కొక్కసారి రాత్రిళ్ళు మొత్తం ఆఫీసులో ఉండాల్సి వస్తుంది,అది వేరే విషయం.ఆరోజు ఆమె రాత్రి 10.30 ప్రాంతంలో ఆఫీసు నుండి తన కైనటిక్ మీద బయలుదేరిందంట.మధ్యలో పోలిసు పెట్రోలింగ్ వారు తన బండిని ఆపారంట. ఎక్కడినుండి వస్తున్నావు,ఈటైమ్ దాక ఆఫీసులో ఏమి పని అంటూ మొదలుపెట్టారంట.తన ID కార్డు,డ్రయివర్స్ లైసెన్స్,బండికి సంబంధించిన పత్రాలు అన్నీ సరిగ్గానే ఉన్నా వదల్లేదంట.తనిఖి అంటూ తన బ్యాగు,లాప్టాపు లాక్కున్నారంట.అదే సమయంలో ఆ దార్లో వెళ్ళే ఇంక వేరే ఏ ఇతర వాహనాన్ని కూడ పోలిసులు తనిఖి కోసం ఆపలేదంట.నువ్వు ఎక్కడుంటావు,ఎవరితో కలసి ఉంటావు,ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు అంటూ అడ్డమయిన ప్రశ్నలు వేసారంట!ఏమన్నా అంటే ముంబైలో జరిగిన పేలుళ్ళ తరవాత అందరిని తనిఖి చేస్తున్నామని చెప్పారంట.వాళ్ళు నిజంగా తనిఖి చేసేవాళ్ళయితే వేరే వాహనాల్ని ఎందుకు ఆపలేదు? అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్నా కాని నాఫ్రెండ్ ని అంత రాత్రి పూట రోడ్డు పైన నిలబెట్టాల్సిన అవసరం ఏంటి? తనిఖి చెయ్యాల్సినప్పుడు లేడి కానిస్టేబుల్ తో చేయించవచ్చు కదా! కేవలం వాళ్ళకి టైమ్ పాస్ కావడానికి తనని అంతసేపు నిలబెట్టి సతాయించారు.ఇవన్ని ఏంటని అడిగిన ఆమెని పోలిసులు బెదిరించారంట.ఇక్కడ రాయలేని విధంగా భయపెట్టారంట.ఆమె చేసిన తప్పేంటి? ఎందుకు భయపడాలి పోలిసుల్ని చూసి? బాంబు పేలుళ్ళు,మతఘర్షణలు జరిగినప్పుడు ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా ప్రజల్ని కాపాడే పోలిసులకి మనం చెయ్యెత్తి జై కొడతాం.కాని అదే డిపార్ట్ మెంటులో ఉన్న ఇలాంటి బి-గ్రేడు రౌడీల్ని ఎవరు ఏమి చెయ్యలేరా?

పోలిసుల్లో కేవలం బి-గ్రేడ్ రౌడీలు మాత్రమేనా అంటే,కాదు పరమ బద్దకస్తులు,దద్దమ్మలు కూడా ఉన్నారు.రెండేళ్ళక్రితం నేను వైజాగ్ నేవిలో ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక కంప్లయింట్ ఇవ్వడానికి నేను వైజాగ్ టూ టవున్ పోలిస్ స్టేషన్ కి వెళ్ళాల్సి వచ్చింది.కంప్లయింట్ ఇచ్చే ప్రహసనం మొత్తం నా సహనానికే పరిక్ష పెట్టింది. ఇంతకీ విషయమేంటంటే ఆఫీసు ప్రెమిసెస్ లో అడుగుపెట్టడానికి నేవివాళ్ళు నాకొక ID కార్డు ఇష్యూ చేసారు.నా ఖర్మకాలి ఒకరోజు అదికాస్తా ఎక్కడో పోయింది.నేను ఆఫీసు నుండి ఇంటికి ఒక బస్సు,ఒక ఆటోలో ప్రయాణం చేసేదాన్ని.బ్యాగులో పెట్టిన పర్సు,డబ్బులు అన్ని ఉన్నాయి.కేవలం ID కార్డు మాత్రమే పోయింది.ఎవరన్నా కావలని చేసారో,లేక ఆటోలో కాని బస్సులో కాని ఎక్కడన్నా పడిపోయిందో మరి నాకయితే తెలియదు.ఆఫీసులో చెప్తే మాబాసు నేవి కమాండర్ నామీద చిందులు తొక్కాడు.పోలిస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చి,కంప్లయింట్ నంబర్ తెచ్చి నేవి సెక్యూరిటి ఆఫీసర్ కి ఇచ్చి,ఆయనతో అక్షింతలు వేయించుకొని,బుద్ధితక్కువయి ID కార్డు పోగొట్టాను లెంపలేసుకుంటున్నాను అని ఒక లెటర్ రాసి సంతకం పెట్టి ఇస్తే,వాళ్ళు ఒక కమిటి ఏర్పాటు చేసి కార్డు పోగొట్టుకున్న పరిస్థితులు తెలుసుకొని కన్విన్స్ అయితే వాళ్ళు నాకు ఇంకొక కార్డు ఇష్యూ చేస్తారు.లేదా నేవి వాళ్ళు నామీద పోలిసులకి కంప్లయింటు ఇస్తారు నేను ID కార్డుని దుర్వినియోగం చేసినట్టు,లేదా ఎవరన్నా సంఘవిద్రోహ శక్తులకి కార్డు ఇచ్చినట్టు!!

ఇప్పటివరకు నాజీవితంలో నాకొచ్చిన పెద్ద కష్టం ఇది.తెల్లరి పొద్దున్నే పోలిస్ స్టేషన్ కి వెళ్ళాను.స్టేషన్ బయటే ఒక చిన్న బల్ల వేసి ఉంది.కంప్లయింట్లు అక్కడే రాసి ఇవ్వాలంట.అక్కడ కూర్చున్న లేడి కానిస్టేబుల్ దగ్గరికెళ్ళి విషయం చెప్పడానికి ప్రయత్నించాను.ముందు నువ్వెళ్ళి ఆ బెంచీమీద కూర్చోపో అని కసిరింది.నాపక్కన కూర్చున్న చాలామంది కట్నం వేధింపులని,భర్త కొడుతున్నాడని కంప్లయింటు ఇవ్వడానికి వచ్చినవాళ్ళే.కంప్లయింట్లు తీసుకోవాల్సిన ఆ లేడి కానిస్టేబుల్ ఒక్క కంప్లయింట్ రాయించుకొని వెళ్ళిపోయింది.ఎంతకీ తిరిగి రాదే!ఆమె కోసం చూసి చూసి నాకు విసుగొచ్చి,ఆకలేసి సాయంత్రం 5.30 ప్రాంతంలో ఇంటికొచ్చేసాను.తరవాత మూడురోజులు ఇదే పరిస్థితి.నాలుగోరోజు నావంతు వచ్చింది.కంప్లయింట్ రాసిస్తే అసలు ఆమెకి విషయమే అర్ధం కాలేదు.కంప్లయింట్ తీసుకోనని పేపర్ నామొహాన కొట్టింది.ఆక్షణాన నాకు ఎంత కోపమొచ్చిందో,కాని ఏమి చెయ్యలేను.అక్కడే బెంచీమీద కాసేపు కూర్చున్నాను.ఏంటో నను జైలుకెళ్ళినట్టు,నాకు ఉరిశిక్ష పడ్డట్టు పిచ్చి పిచ్చి ఆలోచనలొచ్చాయి.ఇక తప్పదని ఇంకో కానిస్టేబుల్ తో మాట్లాడాను.ఆయన రైటరంట,ఆ స్టేషన్ కి.కంప్లయింట్ రాసివ్వమన్నాడు,కాని దాని మీద SI సంతకం చేస్తేనే కంప్లయింట్ నంబర్ ఇస్తానన్నాడు.ఇంక ఆ SI మహానుభావుడు అసలు స్టేషన్ కి ఎప్పుడు వస్తాడో ఆ భగవంతుడికి కూడ తెలియదేమో.ఆయన్ని పట్టుకొనేసరికి ఇంకో నాలుగురోజులయ్యింది.కేవలం ID కార్డు పోయిందంటే ఎవ్వరు నమ్మటం లేదు.అందుకే దొంగ కంప్లయింట్ రాసిచ్చాను.పర్సు పోయిందని అందులో డబ్బులతోపాటు కార్డు కూడ ఉందని చెప్పాను.మొత్తానికి కంప్లయింట్ నంబర్ చేతికొచ్చే సరికి ఎనిమిది రోజులు పట్టింది.ఈ ఎనిమిది రోజులు బాస్ తో ఫోన్ లో షంటిగ్స్,కొలిగ్స్ ఓదార్పులు,నిజంగా నరకం కనిపించింది.అంతా చేస్తే ఆ కంప్లయింట్ నంబర్ అనేది చిన్న స్లిప్,హోటల్లో భోజనం చేసాక ఇచ్చే బిల్లంత ఉంది.పోలిసు ఇంకొంచెం భాధ్యతగా వ్యవహరించి ఉంటే నా పని ఒక్క రోజులో అయిపోయేది.తీసుకున్న జీతాలకి సరిపడా పనిచేస్తే బాగుంటుంది కదా! ఇలాంటి పోలిసులంతా ఎప్పటికన్నా బాగుపడతారని,బాగుపడాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.