Tuesday, July 8, 2008

ఉప్మా పురాణం

తెలుగు భాషలో నాకు నచ్చని పదం ఏదయినా ఉంది అంటే అది "ఉప్మా".ఉప్మా నిజంగా తెలుగు పదమేనా,కాదా అంటే నాకు తెలియదు.ఉప్మా పుట్టుపూర్వోత్తారాలు తెలుసుకోవాలనే ఆసక్తి కూడ లేవు నాకు.ఉప్మా అంటే ఎందుకు నాకు అంత చిరాకంటే రెండు,మూడు,నాలుగు కారణాలున్నాయి.మొదటిది నాకు జ్వరమొచ్చినప్పుడల్లా అమ్మ ఉప్మానే చేస్తుంది.ఎందుకంటే అంటే తొందరగా జీర్ణం అవుతుందని చెప్పేది.ఇప్పుడంత తొందరగా జీర్ణం అవ్వకపోతే ఏమి కొంపలు మునిగిపోతాయో నాకు అర్ధం కాదు.రెండవది,నేను రకరకాల హాస్టల్స్ లో రకరకాల ఉప్మాలు తిన్నాను(ఏమని చెప్పను నా ఉప్మా కష్టాలు!).మూడవది,పై రెండు కారణాల్లో ఏదో ఒకటి.నాలుగవది,పై మూడు కారణాలు.

చిన్నప్పట్నుంచి కూడ మా ఇంట్లో ఉప్మా టిఫిన్ అయినరోజు నేను ప్రళయం సృష్టించేదాన్ని.భాదాకరమయిన విషయమేంటంటే మానాన్న కూడ ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు."బాగానే ఉంది కదరా,తినొచ్చు కదా!" అని చెప్పేవాళ్ళు.మీకు తెలియదు నాన్న ఉప్మా తినడం ఎంత నరకమో అని అనుకునేదాన్ని నేను.అయినా ఉప్మా తినడమే ఎక్కువంటే అందులో మా అమ్మ వేసే చెత్త చెదారం అంతా ఇంతా కాదు.కరివేపాకు(ఉప్మా తరవాత నాకు అత్యంత చిరాకు తెప్పించే పదార్ధం ఇది),కొత్తిమీర,అల్లం ముక్కలు,బీన్స్,క్యారెట్,నా మొహం..etc అన్నమాట.మా అమ్మకంతా నా పోలికే,నాకన్నా పంతం కాస్త ఎక్కువే.ఉప్మా చేసిన రోజు కావాలని నన్ను మానాన్న ముందు కూర్చోబెట్టి తినిపించేది.కళ్ళనీళ్ళు పెట్టుకున్నా కాని కనికరించేది కాదు మా కనకదుర్గ! నాకు ఉప్మా తినిపించాక అమ్మ మొహంలో విజయ గర్వం కనిపించేది.ఉప్మారవ్వతో చేసే ఉప్మా కాకుండ మాఅమ్మ ఇంక రకరకాల ఉప్మా ప్రయోగాలు చేసేది.ఇడ్లీ ఉప్మా,బ్రెడ్ ఉప్మా,సేమ్యా ఉప్మా..ఇంకా రకరకాలవి.నేనొకసారి అమ్మకి చెప్పాను,"అమ్మా! నువ్వు ఎన్ని రకాలుగా చేసినాకాని,ఉప్మాపట్ల నా మనసు మార్చుకోను.ఉప్మా,నేను బద్దశత్రువులం.మా ఇద్దరి మధ్య ఎప్పటికి ప్రేమ పుట్టదు..పుట్టదు".మాఅమ్మ కోపం నటిస్తూ "ఈ తెలివితేటలకేం తక్కువలేదు" అంటూ నవ్వేసింది.అయినా నాకు అర్ధంకాక అడుగుతాను ఇడ్లీని ఇడ్లీగా,బ్రెడ్ ని బ్రెడ్ లా తినొచ్చుకదా,మళ్ళీ అన్ని efforts పెట్టి ఉప్మాలా మార్చడం అవసరమా? ఒకసారి మీరే ఆలోచించండి.ఇంకా విచిత్రం ఏంటంటే పెసరట్టు-ఉప్మా!నేను పెసరట్టు తిని ఉప్మా మాఅక్కతో తినిపించేదాన్ని.

ఉప్మా నాకు శత్రువులని కూడ తెచ్చిపెట్టిందంటే మీరు నమ్ముతారా! కాని ఇది నిజం.చిన్నప్పుడు నేను Rose buds convent school లో LKG చదివేదాన్ని.మానాన్న నన్ను బళ్ళో చేర్చేటప్పుడు టీచర్ కి "మాఅమ్మాయికి చదువు రాకపోయినా పర్వాలేదు కాని కొట్టొద్దు" అని చెప్పారు.కాబట్టి టీచర్ నన్నేమి అనేది కాదు.రోజు మాటీచర్ నాకు అటుకులు,పంచదార కలిపిస్తే తినేసి అరుగు మీద పడుకునేదాన్ని.స్కూల్ అయిపోయే టైమ్ కి కృష్ణ నన్ను నిద్ర లేపేవాడు.వాడితో కలసి ఇంటికొచ్చేదాన్ని.కృష్ణ మా పక్కింట్లో ఉండేవాడు.వాడు కూడ నాక్లాసే! ఒకరోజు కృష్ణ నన్ను ఫాస్ట్ గా లాక్కెళ్తున్నాడు స్కూల్ కి.నేను ఆ పేస్ కి మ్యాచ్ అవ్వలేకపోయా.అంత ఫాస్ట్ గా నడవలేక నేను నీతో రాను అని ఒక చెట్టుకింద కూర్చున్నాను.కృష్ణకి చాలా కోపమొచ్చింది."తొందరగా నడుస్తావా,లేదా?ఉప్మా మొహమా!" అని అన్నాడు.నన్ను ఉప్మా మొహం అంటావా అని పక్కనే ఉన్న రాయితో వాడి తలమీద ఒక్కటిచ్చా! అంతే క్షణాల్లో వాడి మొహమంతా రక్తం.తెల్లటి వాడి షర్ట్ కూడ ఎర్రగా అయిపోయింది.మా ఇద్దరికి రక్తం చూసేసరికి కంగారు పుట్టింది.ఇద్దరం రోడ్డుమీదే నిల్చోని ఏడుస్తుంటే ఎవరో ఒకాయన మమ్మల్ని సైకిల్ మీద ఇంటికి తీసుకొచ్చాడు.హాస్పిటల్ కి తీసుకెళ్ళాక వాడి గుండుకి కుట్లు పడ్డాయి.నేను కొట్టిన ఉప్మా దెబ్బతో వాడి డిప్ప షేపు మారిపోయింది.ఆ తరవాత కృష్ణ మళ్ళీ ఎప్పుడు నన్ను స్కూల్ కి తీసుకెళ్ళలేదు.ఆడుకోవడానికి కూడ మా ఇంటికి వచ్చేవాడు కాదు.అసలు నన్ను చూస్తేనే చాలు భయపడేవాడు.వాడు మాట్లాడకపోతే వాడి ఉప్మా ఖర్మ అనుకొని నేను కూడ వదిలేసాను.అయినా ఫ్రెండ్షిప్ లో ఆ మాత్రం చిన్న చిన్న గొడవలు రావా ఏంటి? ఆమాత్రానికే మాట్లాడటం మానేస్తే ఎలా?

ఇంక పెళ్ళిళ్ళప్పుడు,వ్రతాలప్పుడు చూడాలి,సామిరంగా! ఒక్కొక్కడు మానెడు ఉప్మాలో సోలెడు చట్నీ పోసుకొని లాగిస్తుంటాడు.మళ్ళీ గడికొకసారి ఎవరోఒకరు వచ్చి "పలహారాలు తిన్నారా?" అని అడుగుతారు.ఆ పెద్ద పెట్టావులేవోయ్ గొప్ప పలహారం అని అనుకుంటాను నేను.ఇంతకీ ఉప్మా పురాణంలో నేను చెప్పొచ్చేది ఏంటంటే,ఉప్మాది మైనపు నమూనా చేసి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టాలి.అంతటి ఐటమ్ ఛీజ్ ఉప్మా.