Friday, February 13, 2009

హమార బజాజ్

ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది.అమ్మ,నాన్న,ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ కలిపి కట్టాలి అని ఇందిరత్త అమ్మకి డైరెక్షన్స్ ఇస్తుంది.బయటకెళ్ళి కళ్ళు నులుముకొని చూస్తే కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ బజాజ్ కబ్ స్కూటర్ వరండాలో కనిపించింది.అమ్మని అడిగాను ఎవరిది ఈ స్కూటర్ అని?ఎవరిదో అయితే మన వరండాలో ఎందుకు ఉంటుందే పిచ్చి మొహమా! మనదే.నాన్న ఈరోజే గోదావరిఖని వెళ్ళి కొనుక్కొచ్చారు అని స్కూటర్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టడంలో బిజి అయిపోంది.ఎందుకో ఆ స్కూటర్ మాదే అంటే నమ్మబుధ్ధి కాలేదు నాకు చాలాసేపటివరకు.అప్పట్లో మా కాలనీలో చాలామందికి లూనాలు ఉండేవి.ఒకరిద్దరికి మాత్రం స్కూటర్ ఉండేది.అప్పట్లో అసలు లూనా ఉండటమే గొప్ప.ఇక స్కూటర్ ఉందంటే అబ్బో ఇహ వాళ్ళ గురించి చెప్పనే అఖ్ఖర్లేదు.

మొదటిసారి స్కూటర్ మీద బయటికెళ్ళినప్పుడు నేను ఎంత గర్వంగా ఫీల్ అయ్యానో!మా నాన్న నన్ను ఎత్తుకొని ముందుసీటుకి,హ్యాండిల్ కి మధ్య ఉన్న కాసింత స్థలంలో నిల్చోబెట్టి హ్యాండిల్ మీద రెండు చేతులు పెట్టించి గట్టిగా పట్టుకోవాలి అని చెప్పి స్కూటర్ స్టార్ట్ చేసారు.అలా వెళ్ళేటప్పుడు నాకు రోడ్డు కనిపిందలేదు,అప్పుడు నేనింకా బుడంకాయనన్నమాట.మానాన్న చేతి సందుల్లోంచి అటుఇటు రోడ్డుమీద ఉన్నవాళ్ళకి చేతులూపి తెగ సంబరపడిపోయాను.మావీధిలో ఆచివర్నుండి ఈచివరికి తిప్పి ఇంటికి తీసుకొచ్చారు.స్కూటర్ దిగింతరవాత కూడ ఎక్కడో తేలిపోతున్న అనుభూతి.ఓహ్! స్కూటర్ మీద వెళ్తే ఇంత మజాగా ఉంటుందా అని అనుకున్నాను.

ఇక అప్పట్నుంచి మా నాన్న అప్పుడప్పుడు నన్ను స్కూటర్ మీద బజార్ కి తీసుకెళ్ళేవాళ్ళు,స్కూల్ లో దింపేవాళ్ళు,వర్షం పడుతున్నప్పుడు వరండాలో ఉన్న స్కూటర్ పైన కూర్చొని వర్షం చినుకులతో ఆడుకోవడం,ఎంత ఆటలో మునిగిపోయి ఉన్నాకాని వీధి చివర్లో మానాన్న స్కూటర్ కనిపించగానే నేను పరిగెత్తుకొని ఎదురెళ్ళి అక్కడ్నుండి స్కూటర్ ఎక్కి ఇంటికి రావటం ఇవన్ని ఇంకా నిన్నమొన్న జరిగినట్టే నాకళ్ళ ముందు కదలాడుతున్నాయి.అసలు ఆ స్కూటర్ మీద నేను ఎన్ని రకాల ఆటలు ఆడానో!కొన్నాళ్ళకి మానాన్న కొలీగ్ వాళ్ళబ్బాయి,నవీన్ గాడు మా స్కూటర్ సీట్లన్ని బ్లేడుతో ఇష్టమొచ్చినట్టు కోసిపడేసాడు.మానాన్న చాలా భాదపడ్డారు.నాకయితే వాడిమీద పీకలదాక కోపమొచ్చింది.సీట్లు మార్పించాలంటే బోలెడంత ఖర్చు!అప్పట్లో అన్నింటికి పంచవర్ష ప్రణాళికలు రూపొందింపబడేవి కదా!కాని అలా వదిలేస్తే చూడటానికి బాగోలేదు.అప్పుడు మాఅమ్మ నల్ల సెల్లో టేప్ తెచ్చి ఎక్కడా చిరుగులు కనిపించకుండా అతికించింది.ఆ తరవాత చాలారోజులకి సీట్లు మార్పించారు.

నేను పదోతరగతికి వచ్చేసరికల్లా నాకు స్కూటర్ వెనక సీట్ కి ప్రమోషన్ వచ్చింది.అప్పట్లో మాకాలనీలో చాలానే స్కూటర్లు కనిపించేవి.కాకపోతే బజాజ్ కబ్ లు తక్కువే! ఎందుకంటే కబ్ చాలా బరువుంటుందంట.ఎక్కువమంది చేతక్,LML వెస్పా నడిపేవారు.ఇక ఇప్పుడంటారా, అన్ని స్ప్లెండర్లు పల్సర్లే కదా!అసలిప్పుడు రోడ్లమీద స్కూటర్ కనిపించడం చాలా అరుదు.మానాన్నతో పాటు స్కూటర్లు కొన్నవాళ్ళంతా ఎప్పుడో వాటిని అమ్మేసి మోటర్ సైకిళ్ళని కొనుక్కున్నారు.మానాన్న మాత్రం ఇంకా ఆ స్కూటర్ నే నడిపిస్తున్నారు.ట్రాన్స్ ఫర్ అయిన ప్రతిచోటికి స్కూటర్ ని కూడ తీసుకొని వెళ్తారు.ఎండయినా,వానయినా దాని మీదే ఆఫీసుకెళ్తారు.మొన్నామధ్య మాటల సందర్భంగా నాన్నని "మీతోపాటు కొన్న వాళ్ళందరి స్కూటర్లు తుక్కు తుక్కు అయిపోయి మెకానిక్ షెడ్డులు చేరాయి,మరి మీ స్కూటరేమో ఇంకా ఆరోగ్యంగా ఉంది.ఏంటి రహస్యం" అని అడిగాను.దానికి నాన్న ఒక చిరునవ్వు నవ్వి "నాకు బావమరుదులు కాని,కొడుకులు కాని లేకపోవటమే!" అని అన్నారు.ఆమాటలు గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది నాకు.

ఇప్పుడు కార్లయినా,మోటర్ సైకిళ్ళయినా లోన్లమీద కొనెయ్యటం,కొత్త మోజు పోయేవరకు లేదా బోరుకొట్టేవరకు వాడటం తరవాత మార్కెట్ లో వచ్చిన ఇంకో మోడల్ బండి కొనేసి ఉన్న బండిని అమ్మేయడం, అన్ని చకచకా జరిగిపోతున్నాయి.మహా అంటే పదేళ్ళకి మించి ఎవ్వరు వాడటం లేదు.మానాన్న లాంటి కొందరు మాత్రమే ఇలా ఒకే బండిని సంవత్సరాలు సంవత్సరాలు వాడుతుంటారు.ఇది అమ్మేసి కొత్త బండి కొనుక్కోడి నాన్న అంటే అది కేవలం స్కూటర్ అయితే అమ్మేసేవాడ్నే కాని అందులో నా ఇరవయ్యేళ్ళ జీవితం ఉంది.బుడిబుడి నడకల నా పిల్లల ఆటలు,వాళ్ళ సరదాలు ఇంకా ఆ స్కూటర్ మీద నాకు కనిపిస్తున్నాయి.నా జ్ఞాపకాల్ని నేను అమ్మలేను అని చెప్పారు.ఇప్పటికి ఇంటికెళ్తే వరండాలోనే ఎదురొచ్చి పలకరిస్తుంది మా నాన్న స్కూటర్.కాదు కాదు హమార బజాజ్!

Tuesday, December 9, 2008

వీళ్ళు ఇంక ఎప్పుడు మారుతారో?

ఈరోజు నాఫ్రెండ్ దగ్గర్నుండి నాకొక ఈ-మెయిల్ వచ్చింది.అది చదివి నేను చాలా బాధపడ్డాను.విషయమేంటంటే,ఈ-మెయిల్ పంపిన నాఫ్రెండ్ బెంగుళూరులో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్.వయస్సు రమారమి 32,అవివాహిత.ఈమధ్య ప్రాజెక్ట్ రిలీజ్ చేసే సమయం కాబట్టి ఆఫీసులో చాలా పొద్దుపోయే వరకు ఉండాల్సివస్తుందంట.రిలీజ్ టైమ్ లో ఒక్కొక్కసారి రాత్రిళ్ళు మొత్తం ఆఫీసులో ఉండాల్సి వస్తుంది,అది వేరే విషయం.ఆరోజు ఆమె రాత్రి 10.30 ప్రాంతంలో ఆఫీసు నుండి తన కైనటిక్ మీద బయలుదేరిందంట.మధ్యలో పోలిసు పెట్రోలింగ్ వారు తన బండిని ఆపారంట. ఎక్కడినుండి వస్తున్నావు,ఈటైమ్ దాక ఆఫీసులో ఏమి పని అంటూ మొదలుపెట్టారంట.తన ID కార్డు,డ్రయివర్స్ లైసెన్స్,బండికి సంబంధించిన పత్రాలు అన్నీ సరిగ్గానే ఉన్నా వదల్లేదంట.తనిఖి అంటూ తన బ్యాగు,లాప్టాపు లాక్కున్నారంట.అదే సమయంలో ఆ దార్లో వెళ్ళే ఇంక వేరే ఏ ఇతర వాహనాన్ని కూడ పోలిసులు తనిఖి కోసం ఆపలేదంట.నువ్వు ఎక్కడుంటావు,ఎవరితో కలసి ఉంటావు,ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు అంటూ అడ్డమయిన ప్రశ్నలు వేసారంట!ఏమన్నా అంటే ముంబైలో జరిగిన పేలుళ్ళ తరవాత అందరిని తనిఖి చేస్తున్నామని చెప్పారంట.వాళ్ళు నిజంగా తనిఖి చేసేవాళ్ళయితే వేరే వాహనాల్ని ఎందుకు ఆపలేదు? అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్నా కాని నాఫ్రెండ్ ని అంత రాత్రి పూట రోడ్డు పైన నిలబెట్టాల్సిన అవసరం ఏంటి? తనిఖి చెయ్యాల్సినప్పుడు లేడి కానిస్టేబుల్ తో చేయించవచ్చు కదా! కేవలం వాళ్ళకి టైమ్ పాస్ కావడానికి తనని అంతసేపు నిలబెట్టి సతాయించారు.ఇవన్ని ఏంటని అడిగిన ఆమెని పోలిసులు బెదిరించారంట.ఇక్కడ రాయలేని విధంగా భయపెట్టారంట.ఆమె చేసిన తప్పేంటి? ఎందుకు భయపడాలి పోలిసుల్ని చూసి? బాంబు పేలుళ్ళు,మతఘర్షణలు జరిగినప్పుడు ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా ప్రజల్ని కాపాడే పోలిసులకి మనం చెయ్యెత్తి జై కొడతాం.కాని అదే డిపార్ట్ మెంటులో ఉన్న ఇలాంటి బి-గ్రేడు రౌడీల్ని ఎవరు ఏమి చెయ్యలేరా?

పోలిసుల్లో కేవలం బి-గ్రేడ్ రౌడీలు మాత్రమేనా అంటే,కాదు పరమ బద్దకస్తులు,దద్దమ్మలు కూడా ఉన్నారు.రెండేళ్ళక్రితం నేను వైజాగ్ నేవిలో ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక కంప్లయింట్ ఇవ్వడానికి నేను వైజాగ్ టూ టవున్ పోలిస్ స్టేషన్ కి వెళ్ళాల్సి వచ్చింది.కంప్లయింట్ ఇచ్చే ప్రహసనం మొత్తం నా సహనానికే పరిక్ష పెట్టింది. ఇంతకీ విషయమేంటంటే ఆఫీసు ప్రెమిసెస్ లో అడుగుపెట్టడానికి నేవివాళ్ళు నాకొక ID కార్డు ఇష్యూ చేసారు.నా ఖర్మకాలి ఒకరోజు అదికాస్తా ఎక్కడో పోయింది.నేను ఆఫీసు నుండి ఇంటికి ఒక బస్సు,ఒక ఆటోలో ప్రయాణం చేసేదాన్ని.బ్యాగులో పెట్టిన పర్సు,డబ్బులు అన్ని ఉన్నాయి.కేవలం ID కార్డు మాత్రమే పోయింది.ఎవరన్నా కావలని చేసారో,లేక ఆటోలో కాని బస్సులో కాని ఎక్కడన్నా పడిపోయిందో మరి నాకయితే తెలియదు.ఆఫీసులో చెప్తే మాబాసు నేవి కమాండర్ నామీద చిందులు తొక్కాడు.పోలిస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చి,కంప్లయింట్ నంబర్ తెచ్చి నేవి సెక్యూరిటి ఆఫీసర్ కి ఇచ్చి,ఆయనతో అక్షింతలు వేయించుకొని,బుద్ధితక్కువయి ID కార్డు పోగొట్టాను లెంపలేసుకుంటున్నాను అని ఒక లెటర్ రాసి సంతకం పెట్టి ఇస్తే,వాళ్ళు ఒక కమిటి ఏర్పాటు చేసి కార్డు పోగొట్టుకున్న పరిస్థితులు తెలుసుకొని కన్విన్స్ అయితే వాళ్ళు నాకు ఇంకొక కార్డు ఇష్యూ చేస్తారు.లేదా నేవి వాళ్ళు నామీద పోలిసులకి కంప్లయింటు ఇస్తారు నేను ID కార్డుని దుర్వినియోగం చేసినట్టు,లేదా ఎవరన్నా సంఘవిద్రోహ శక్తులకి కార్డు ఇచ్చినట్టు!!

ఇప్పటివరకు నాజీవితంలో నాకొచ్చిన పెద్ద కష్టం ఇది.తెల్లరి పొద్దున్నే పోలిస్ స్టేషన్ కి వెళ్ళాను.స్టేషన్ బయటే ఒక చిన్న బల్ల వేసి ఉంది.కంప్లయింట్లు అక్కడే రాసి ఇవ్వాలంట.అక్కడ కూర్చున్న లేడి కానిస్టేబుల్ దగ్గరికెళ్ళి విషయం చెప్పడానికి ప్రయత్నించాను.ముందు నువ్వెళ్ళి ఆ బెంచీమీద కూర్చోపో అని కసిరింది.నాపక్కన కూర్చున్న చాలామంది కట్నం వేధింపులని,భర్త కొడుతున్నాడని కంప్లయింటు ఇవ్వడానికి వచ్చినవాళ్ళే.కంప్లయింట్లు తీసుకోవాల్సిన ఆ లేడి కానిస్టేబుల్ ఒక్క కంప్లయింట్ రాయించుకొని వెళ్ళిపోయింది.ఎంతకీ తిరిగి రాదే!ఆమె కోసం చూసి చూసి నాకు విసుగొచ్చి,ఆకలేసి సాయంత్రం 5.30 ప్రాంతంలో ఇంటికొచ్చేసాను.తరవాత మూడురోజులు ఇదే పరిస్థితి.నాలుగోరోజు నావంతు వచ్చింది.కంప్లయింట్ రాసిస్తే అసలు ఆమెకి విషయమే అర్ధం కాలేదు.కంప్లయింట్ తీసుకోనని పేపర్ నామొహాన కొట్టింది.ఆక్షణాన నాకు ఎంత కోపమొచ్చిందో,కాని ఏమి చెయ్యలేను.అక్కడే బెంచీమీద కాసేపు కూర్చున్నాను.ఏంటో నను జైలుకెళ్ళినట్టు,నాకు ఉరిశిక్ష పడ్డట్టు పిచ్చి పిచ్చి ఆలోచనలొచ్చాయి.ఇక తప్పదని ఇంకో కానిస్టేబుల్ తో మాట్లాడాను.ఆయన రైటరంట,ఆ స్టేషన్ కి.కంప్లయింట్ రాసివ్వమన్నాడు,కాని దాని మీద SI సంతకం చేస్తేనే కంప్లయింట్ నంబర్ ఇస్తానన్నాడు.ఇంక ఆ SI మహానుభావుడు అసలు స్టేషన్ కి ఎప్పుడు వస్తాడో ఆ భగవంతుడికి కూడ తెలియదేమో.ఆయన్ని పట్టుకొనేసరికి ఇంకో నాలుగురోజులయ్యింది.కేవలం ID కార్డు పోయిందంటే ఎవ్వరు నమ్మటం లేదు.అందుకే దొంగ కంప్లయింట్ రాసిచ్చాను.పర్సు పోయిందని అందులో డబ్బులతోపాటు కార్డు కూడ ఉందని చెప్పాను.మొత్తానికి కంప్లయింట్ నంబర్ చేతికొచ్చే సరికి ఎనిమిది రోజులు పట్టింది.ఈ ఎనిమిది రోజులు బాస్ తో ఫోన్ లో షంటిగ్స్,కొలిగ్స్ ఓదార్పులు,నిజంగా నరకం కనిపించింది.అంతా చేస్తే ఆ కంప్లయింట్ నంబర్ అనేది చిన్న స్లిప్,హోటల్లో భోజనం చేసాక ఇచ్చే బిల్లంత ఉంది.పోలిసు ఇంకొంచెం భాధ్యతగా వ్యవహరించి ఉంటే నా పని ఒక్క రోజులో అయిపోయేది.తీసుకున్న జీతాలకి సరిపడా పనిచేస్తే బాగుంటుంది కదా! ఇలాంటి పోలిసులంతా ఎప్పటికన్నా బాగుపడతారని,బాగుపడాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.

Tuesday, October 21, 2008

అమెరికా పోదాం రా!

ఒకరోజు మధ్యాహ్నం పెరుగన్నం తిని ఆఫీసులో నేను సీరియస్ గా పనిచేసుకుంటున్నాను.(నేను పని చేస్తున్నాని మీరంతా నమ్మితీరాల్సిందే!). ఇంతలో 'బర్..ర్..ర్..ర్' మని శబ్దం.ఏంటో చూద్దును కదా,మా ఆయన ఫోను చేస్తున్నాడు.అబ్బ ఈ సెల్ ఫోన్లతో పెద్ద చిక్కొచ్చి పడింది.ప్రశాంతంగా నిద్ర కూడ పోనియ్యవు.అదే!ప్రశాంతంగా పనికూడ చేసుకోనియ్యవు.ఏందబ్బా అని అడిగితే "మనం ఎమ్మటే అమెరికా పోవాలి, ఇంటికి రాగానే బట్టలు సర్దు" అని చెప్పాడు.ఇదేమన్నా అమలాపురమా! ఎప్పుడనుకుంటే అప్పుడు పెట్టెలో నాలుగు జతల బట్టలు పెట్టుకొని పోవడానికి? ఏదో తమాషా చేస్తున్నాడులే అని "ఆ! సర్దుతాలే!" అని చెప్పి ఫోన్ పెట్టేసా.బహుశా మాఆయనకి కూడ పెరుగన్నం ఎక్కువయ్యిందేమో! అందుకే ఏంటేంటో మాట్లాడుతున్నాడు.

కాని సాయంత్రం ఇంటికెళ్ళాక అర్ధమయ్యింది,నిజంగానే మా ఆయన అమెరికా వెళ్ళాలని.అయ్యో రామా! మళ్ళీ నేను హాస్టల్ లో ఉండాలా? అసలీ హాస్టల్ ల గొడవ భరించలేకే కదా పెళ్ళి చేసుకుంది.మూడ్నాళ్ళ ముచ్చట లాగా మళ్ళీ హాస్టల్ లో బేర్..ర్..ర్..మనాలి కావొచ్చు."డిపెండెంట్ గా నువ్వు కూడ నాతో రావచ్చు" అని చెప్పాడు."మరి నా ఉద్యోగమో!" అంటే,"కొన్నాళ్ళు బ్రేక్ తీసుకో" అని చెప్పాడు.బ్రేక్ తీసుకొని బెంగుళూరులో ఉంటే నా డ్రీమ్ జాబ్ టీచర్ ఉద్యోగం చెయ్యొచ్చు! కాని అమెరికాలో నేనేమి చెయ్యాలి? టీచర్ ఉద్యోగం అంటే గుర్తొచ్చింది,నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు సెలవులకి ఇంటికెళ్ళినప్పుడు మాకాలనీలో ఉన్న ట్రినిటి స్కూల్ లో పదోతరగతి పిల్లలకి ఇంగ్లీషు,ఫిజిక్స్ చెప్పేదాన్ని.అబ్బో! స్కూల్ లో మనకి విపరీతమయిన ఫాలోయింగ్ ఉండేది!కాబట్టి నా టీచర్ ఉద్యోగానికి ఢోకా లేదు.కాని ఎంత ఆలోచించినా నాకేమి పెరుగుబోవటం లేదు.ఇట్లా కాదని,న్యూజెర్సీలో ఉన్న మా శశిగాడికి ఫోన్ చేసాను.

శశిగాడు ఎవరో మీకు చెప్పలేదు కదూ! శశి,నేను మూడో తరగతి నుండి ఫ్రెండ్స్.పొద్దున్నే "మళ్ళీ నీ మొహం చూడను" అనే రేంజ్ లో కొట్టుకొని,సాయంత్రం వాళ్ళమ్మ పెట్టిన పులిహోర తిని మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోవడం మాకు మామూలే.ఎంతయినా పులిహోర చెయ్యడంలో శశి వాళ్ళమ్మ తరవాతే ఎవరయినా! ఆ పులిహోరే అసలు వాడ్ని ఇన్నాళ్ళ నుండి కాపాడుతుంది.ఫోన్ చెయ్యగానే "కాంత్! శశికాంత్ హియర్" అన్నాడు."నీ మొహంలే కాని,నేను అమెరికా వద్దామనుకుంటున్నాను" అని చెప్పాను.అంతే పగలబడి నవ్వాడు."నీ దయ వల్ల అసలే అమెరికా ఆర్దిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉంది.ఇంకా ఏమి ఉద్ధరించాలని అమెరికా వస్తున్నావు?"అని అడిగాడు.అవును మరి,కాలం కలసి రాకపోతే శశిగాడి చేతిలో కూడ మాటలు పడాల్సి వస్తుంది.వాడికి విషయమంతా చెప్పి,అమెరికాలో నాకు పొద్దుబోతుందా? అని అడిగాను."ఎందుకు పొద్దుబోదు? చీరలమీద బూట్లేసుకుని వాకింగ్ చేసే ఆంటీలు,నున్నగా నూనె పెట్టుకొని తలలో తులిప్స్ పెట్టుకొనే తమిళ తంగచ్చిలు బోలెడు మందే ఉంటారు.ఎవరో ఒకరు తగులుతారులే నీకు కూడా!" అని చెప్పాడు."నీకు ఇంకో విషయం చెప్పనా! ఇక్కడి ఇండియన్ రెస్టారెంట్లో జిలేబి ఆర్డరిస్తే వేడి వేడిగా ప్లేట్లో ప్రత్యక్షమవుతాయి.ఇంక నువ్వేమి ఆలోచించకు,ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకో " అని చెప్పాడు.అలా జిలేబికి కక్కుర్తి పడి నేను అమెరికాకి ప్రయాణం కట్టాను.

సరే అమెరికా వెళ్ళేటప్పుడు మధ్యలో ఫ్రాంక్ ఫర్ట్ లోనో,ఆమ్ స్టర్ డామ్ లోనో విమానం ఆపుతాడు కదండీ! అని మా అయన్ని అడిగితే,మనం వెళ్ళేది ఆ రూట్ లో కాదు,ఇవతలి పక్కనుండి అంటే హాంగ్ కాంగ్ మీద నుండి అని చెప్పాడు.అయ్యో రామా! సినిమాల్లో లాగా ఆమ్ స్టర్ డామ్ చూడొచ్చు కదా! అని అనుకున్నాను,కాని కుదర్లేదు. ప్రయాణం రోజు రానే వచ్చింది.ఏంటో, రెండు సుమోలకి సరిపడా జనం వచ్చారు మమ్మల్ని ఎయిర్ పోర్టులో దించడానికి.అదృష్టం కొద్ది ఎవ్వరూ ఏడుపులు,పెడబొబ్బలు పెట్టలేదు.బయలుదేరాక నాకు ఒకటే చెవునొప్పి! మా ఆయనకి చెప్తే ఇలా ఎక్సర్సైజులు చెయ్యాలని ఏంటో విచిత్రమయిన ఎక్స్ ప్రెషన్లు చూపెట్టాడు.అలాంటి ఎక్స్ ప్రెషన్స్ పెట్టడం నాకు చేతగాక,కన్నడ సినిమా హీరోలా ఏరకమయిన ఎక్స్ ప్రెషన్ పెట్టకుండా గమ్మున కూర్చున్నాను.ఇంక ఈ ప్రయాణంలో నాకు బాగా చిరాకు తెప్పించిందేంటంటే,మంచినీళ్ళు! నేనేమో,ఎంతలేదన్నా రోజుకు కనీసం ఐదు లీటర్ల నీళ్ళు తాగుతాను.ఫ్లయిట్ అటెండెంట్ అమ్మని మంచినీళ్ళు అడిగినప్పుడల్లా చాలా పొదుపుగా చిన్న కప్పులో సగం నీళ్ళు నింపి జయలలితలాగ నవ్వి నవ్వనట్టు ఒక నవ్వు నవ్వి ఇచ్చేది.నాకేమో ఆ మంచినీళ్ళు సరిపోవాయే! ఇలా కాదని,మా అయనకి రెండు గ్లాసులు,నాకు మూడు గ్లాసుల మంచినీళ్ళు కావాలని అడిగాను.అప్పుడు ఆయమ్మ చూసిన చూపులు మళ్ళీ ఇండియా వెళ్ళేదాక మర్చిపోను నేను.అందుకే చికాగోలో దిగగానే తనివితీరా లీటర్ నీళ్ళు తాగేసాను.ఇంక అసలు తలనొప్పి చికాగో ఎయిర్ పోర్ట్ లోనే మొదలయ్యింది.ఇమిగ్రేషన్ క్లియరెన్స్ అని ఒక గంటసేపు లైన్ లో నిలబెట్టారు.తరవాత ఒక కౌంటర్ దగ్గరికెళ్తే ఒక నల్లాయన(అయ్యో,ఇక్కడ నలుపు,తెలుపు అనే పదాలు వాడొద్దని మాఆయన చెప్పాడు) ఉన్నాడు.వీసా మీద ఒక స్టాంపు గుద్ది పంపేదానికి,నా మొహం కాసేపు,మాఆయన మొహం కాసేపు,ఇండియా గురించి కాసేపు మాట్లాడి ప్రాణం తీసాడు.

బయటికొచ్చి చూద్దును కదా,అబ్బో చికాగో ఎయిర్ పోర్టు చాలా పెద్దగా ఉంది సుమీ!మా ఆయన అటూ,ఇటూ కాసేపు తిరిగొచ్చి మనం ఎక్కాల్సిన విమానం ఆరు గంటల తరవాత ఉంది అని చెప్పాడు.సరే అని ఒకచోట లాంజ్ లో కూర్చున్నాము.మా పక్కనే ఒకాయన కూర్చున్నాడు.చూస్తే ఇండియన్ లాగానే ఉన్నాడు."ఏవండీ,ఇండియన్ అనుకుంటా,మాట్లాడనా?" అంటే,"ఒద్దు,అలా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకు" అని చెప్పి నిద్రపోయాడు.నాకేమో నిద్ర రాదాయే! కాసేపటికి నా పక్కనాయనకి ఫోన్ వచ్చింది.ఫోన్ లో "అరేయ్,నా బట్టలు కవర్ లో పెట్టి గారేజిలో పెట్టాను,లాండ్రీలో ఇచ్చేసేయ్" అని చెప్తున్నాడు.అంతే,మా ఆయన జబ్బ మీద ఒక్కటి చరిచి "ఏవండీ,మన పక్కనున్నాయన తెలుగువాడేనండి,పాపం ఏదో లాండ్రీ కష్టాల్లో ఉన్నాడు" అని తలతిప్పి చూసే సరికి ఆ తెలుగాయన వెళ్ళిపోతూ కనిపించాడు.అలా తెలుగాయనతో మాట్లాడే బంగారంలాంటి అవకాశం చేజారి పోయింది.ఆ తరవాత బోలెడంతసేపు వెయిట్ చేసాక మేము ఎక్కాల్సిన విమానమొచ్చింది.ఎక్కి కూర్చున్నాక.....

Thursday, October 16, 2008

బ్లాగు ప్రయాణంలో నేను - క్రాంతి



ఒకరోజు గూగుల్ లో దేనికోసమో వెతుకుతూ ఉంటే అనుకోకుండా శోధన్ సుధాకర్ గారి బ్లాగు చూసాను.ఒక రెండు గంటలు ఆయన బ్లాగులోని టపాలన్ని చదివాను."చాలా బాగా రాసారే!" అని అనుకున్నాను.(కాని ఎందుకో ఆయన ఈమధ్య రాయటం లేదు).తరవాత ఆయన బ్లాగులో కామెంట్లు రాసిన రాధిక గారి బ్లాగు,ప్రవీణ్ గార్లపాటి గారి బ్లాగు చూడటం జరిగింది.ఇంతకు మునుపు నాకు కవితలన్నా,కవులన్నా చాలా చిరాకొచ్చేది.నాకు ఎదురయిన సంఘటనలు అలాంటివి మరి!కాని రాధిక గారి బ్లాగు చూసాక నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను.చిన్న చిన్న పదాలతో మనసుకు హత్తుకునే అర్ధవంతమయిన కవితలెన్నో చదివాను నేను ఈబ్లాగులో.ఇక ప్రవీణ్ రాసే టెక్నికల్ టపాలు కూడ క్రమం తప్పకుండా చదివేదాన్ని.
కొన్నాళ్ళకి నేను ఎలా తయారయ్యానంటే శని,ఆదివారాల్లో కూడా నేను ఈమూడు బ్లాగులతోనే గడిపేసేదాన్ని(అప్పటికింకా నాకు కూడలి గురించి తెలియదు నాకు).అప్పుడే నాకు నేను కూడ తెలుగులో రాయాలనే దుర్భుద్ధి పుట్టింది.అలా నేను బ్లాగు ప్రారంభించడానికి వీరు ముగ్గురు నాకు inspiration.మెదట్లో రాయడానికి చాలా కష్టపడ్డాను.అప్పుడు నాబ్లాగుకి సోలో రీడర్ మా అక్కే! పాపం నా టపాల మీద తన అభిప్రాయాన్ని నొప్పింపక తానొవ్వక అన్న రీతిలో చెప్పేది.ఒకరోజు ప్రవీణ్ బ్లాగులో అన్ని బొత్తాముల మీద నొక్కుతుంటే నాకు కూడలి గురించి తెలిసి నా బ్లాగుని కూడ జత చెయ్యడం జరిగింది.అలా నా బ్లాగు ప్రయాణం మెదలయ్యింది.అప్పట్నుంచి బుర్రలోని ఙ్ఞాపకాలని బ్లాగులో భద్రపరచుకొంటున్నాను.

Monday, September 15, 2008

సినిమా కష్టాలు

చల్లగా సాగిపోతున్న నాజీవితంలోకి ఒకసారి ఎండాకాలం వచ్చింది.ఎండాకాలం అంటే రోజంతా ఇంట్లోనే ఉండాలి.కనీసం రెండు గంటలయినా లెక్కలు చేసుకోవాలి లేదా ఎక్కాలు చదవాలి.ఇంతకన్నా పెద్ద శిక్ష ఉంటుందని నేను అనుకోను.నేనయితే నాపిల్లల్ని ఎండాకాలంలో చదివించను.ఊరిమీద పడి ఊరేగండ్రా! అని బయటకి పంపిస్తా.అయినా క్యాలిక్యులేటర్లు,కంప్యూటర్లు కనుక్కున్నాక కూడ ఎక్కాలు చదవడం ఏంటో చాదస్తం కాకపోతే!

అందుకే ఒకరోజు ధైర్యం చేసి నాన్నని అడిగా సినిమాకి తీసుకెళ్ళమని.ఒక చూపు చూసారు నన్ను."సినిమాలో ఏముంది?మూడుగంటలు టైమ్ వేస్టు.అదే ఒక మంచి పుస్తకం చదివితే తెలియని విషయాలు తెలుస్తాయి,నిద్రపోతే రెస్టుగా ఉంటుంది,లేకపోతే ఇంటిపనిలో అమ్మకి హెల్ప్ చెయ్యొచ్చు కదా!" అని నాకే క్లాస్ పడింది.అదేంటి నాన్న అలా అంటారు? "అమ్మాయి-అబ్బాయి-ప్రేమ" అనే ఒకేఒక్క కాన్సెప్ట్ మీద ఎన్ని వందల సినిమాలు తీయ్యొచ్చో తెలుగు సినిమాలు చూసి తెలుసుకోవచ్చుకదా అని అందామనుకొని ఎందుకో నాకుడి కన్ను అదురుతుంటే ఎందుకొచ్చిన గోలలే అని నోరుమూసుకున్నాను.సినిమాల విషయంలో మాఅమ్మ కూడ మాకే సపోర్టు.ఎప్పుడు సినిమాకి తీసుకెళ్ళరని నాన్నతో నిష్ఠూరమాడుతుంది.

కాని మానాన్న సినిమాకి తీసుకెళ్ళక పోవటానికి ఒక కారణముంది.మాకాలనీలో థియేటర్లు లేవు కాబట్టి సినిమా అంటే గోదావరిఖనికి వెళ్ళాలి.అంటే రాను నలభై నిమిషాలు,పోను నలభై నిమిషాలు ప్రయాణం.ఆ! నలభై నిమిషాలే కదా అని అనుకోవచ్చు మీరు కాని మధ్యలో అంతా చిట్టడవిలాగా ఉంటుంది.ఏచెట్టు చాటు నుండి ఏఅన్నో,అక్కో ప్రత్యక్షమవుతారో తెలియదు.సినిమాకెళ్ళి వస్తున్న ఒకరిద్దరిని పోలిసులనుకుని లేపేసిన దాఖలాలు కూడ ఉన్నాయి.కాబట్టి మానాన్న థియరీ ప్రకారం ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ 'అమ్మాయి-అబ్బాయి-ప్రేమ' టైపు సినిమాలు చూడటం అస్సలు అవసరం లేదు.అలా మా ఎండాకాలం సెలవులన్ని దాదాపు ఒకేలాగా జరిగిపోతుండేవి.ఉదయాన్నే మానాన్న ఆఫీసుకెళ్ళడం,పదింటికళ్ళా మాఅమ్మ మాకు తలకి నూనె పెట్టి అటొక పిలక,ఇటొక పిలక జడలు కట్టి పుస్తకాల ముందు కూర్చోబెట్టడం(ఎంత బతిమాలినాకాని మాఅమ్మ ఒక్క జడ మాత్రం అస్సలు వేసేది కాదు),సాయంత్రం నాలుగింటికి కొబ్బరిబొండాలు తాగడం,మానాన్న రాత్రి పదకొండింటి వరకు దలాల్ స్ట్రీట్ పుస్తకం చదవడం...ఇలా అన్నమాట.

అలాంటిది ఎప్పుడు లేని విధంగా ఒకరోజు మానాన్న సాయంత్రం నాలుగింటికే ప్రత్యక్షమయ్యారు.ఇంటిముందు లావణ్యవాళ్ళతో ఆడుకుంటున్న నన్ను పిలిచి "తొందరగా తయారవ్వండి,సినిమాకెళ్దాం" అని చెప్పారు."నాన్న, నిజంగా నిజమేనా?" అని అడిగాను.మానాన్న ఒక చిరునవ్వు నవ్వి నిజంగానే వెళ్దాము,తొందరగా వెళ్ళకపోతే టిక్కెట్లు దొరకవు మరి అని చెప్పారు.వీరస్పీడులో నేను ఇంటివెనక కూరగాయలు కోస్తున్న మాఅమ్మ దగ్గరికెళ్ళి,"అమ్మోయ్,నాన్న సినిమాకి తీసుకెళ్తానన్నారు,నన్ను తొందరగా తయారు చేయించు" అని చెప్పాను."ఎండకి నీకు మతిగాని తప్పిందటే!సినిమా,గినిమా అన్నావంటే వీపు చింతపండవుతుంది.ఇంకా నువ్వు పదమూడో ఎక్కం అప్పజెప్పనేలేదు" అని కోస్తున్న దొండకాయని నామీదకి విసిరింది."ఎప్పుడు పదమూడో ఎక్కమేకాదమ్మా ప్రపంచం అంటే,ఒకసారి బయటకొచ్చి చూడు ఎన్ని తెలుగుసినిమాలున్నాయో.అయినా సినిమా విషయం నువ్వు నాన్ననే అడుగు" అని చెప్పాను.ఈలోపే మానాన్న టైమ్ వేస్ట్ చెయ్యకుండా,ముందురోజు చదివేసిన దలాల్ స్టీట్ పుస్తకాన్ని మళ్ళీ చదువుతున్నారు.

అమ్మ: ఏంటండీ,తొందరగా వచ్చారీరోజు?
(నేను:అబ్బ!! ఈఆడవాళ్ళు ఏవిషయమైనా తిన్నగా అడగరు కదా!)
నాన్న: అవునోయ్! తొందరగా తయారవ్వండి,సినిమాకెళ్దాం.
అమ్మ: ఏవండీ..! ! ! ! ! (హాశ్చర్యానందాలు కలగలిపిన కేక)

అంతే దెబ్బకి మానాన్న చదువుతున్న పుస్తకాన్ని విసిరిగొట్టారు ఆకేకకి.ఆతరవాత గంటలో మేము గోదావరిఖని,కవిత థియేటర్లో ప్రత్యక్షం.ఆవిధంగా మేము కుటుంబ సమేతంగా చూసిన తొలి తెలుగు సినిమా 'సీతారామయ్య గారి మనవరాలు'.ఆసినిమా మా అమ్మకి,నాన్నకి విపరీతంగా నచ్చేసింది.ఇప్పటికి కూడ "సినిమా బాగుంది కదరా!" అని అంటారు మానాన్న."ఏ సినిమా నాన్న?" అంటే,"అదే అప్పుడే మర్చిపోయావా,మనందరం కలిసి చూసాము కదా,సీతారామయ్యగారి మనవరాలు" అంటారు.అలా మానాన్న దృష్టిలో సినిమా అంటే సీతారామయ్యగారి మనవరాలే!వేరేవన్ని పిచ్చి గంతులే.

Saturday, August 30, 2008

ముంబై మేరి జాన్

మాములుగా నేను ఏదయినా సినిమాకెళ్ళాలంటే ఒక పది రివ్యూలు చదివి, ఆఫీస్ లో పదిమందిని వాళ్ళ అభిప్రాయాల్ని కనుక్కొని మరి చూస్తాను.అలాంటి నేను ఈ సినిమాకి ఎలాంటి రివ్యూస్ చదవకుండా,ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను.అందుకే కాబోలు నేను మొదటిసారిగా ఒక సినిమాకి రివ్యూ రాస్తున్నాను.2006 జూలై 11వ తారిఖున ముంబైలోని ఒక లోకల్ ట్రైన్ లో జరిగిన పేలుళ్ళు ఇతివృత్తంగా సాగుతుంది ఈ సినిమా.అయిదుగురు సాధారణ వ్యక్తుల జీవితాల్లో ఈపేలుళ్ళు ఎలాంటి మార్పుల్ని తెచ్చాయి అన్నది కథాంశం.ప్రతి సంఘటనని కమర్షియలైజ్ చేసి రేటింగ్స్ పెంచుకోవాలని తాపత్రయపడే న్యూస్ ఛానల్స్ ని,అమెరికాలోనో,UK లోనో సెటిల్ అయితే ఇక భవిష్యత్తుకి ఢోకా ఉండదన్న భావనలో ఉన్న నేటి యువతరాన్ని చక్కగా ఆవిష్కరించారు ఈ సినిమాలో.

స్వతహగా పరేష్ రావల్ అభిమానినయిన నేను ఈ సినిమాలో ఆయన నటనకి మరొక్కసారి జై కొడుతున్నాను.ఒకరకంగా ఈ సినిమాకి ఆయన హీరో అని చెప్పవచ్చు.రిటైర్ మెంటుకి చేరువలో ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ తన ముప్పయ్ అయిదు సంవత్సరాల సర్వీసులో డిపార్ట్ మెంటులోని అధికారుల అలసత్వాన్ని,లంచగొండితనాన్ని ప్రశ్నించలేక తనకు తానుగా అసమర్ధునిగా,లంచగొండిగా మారి మధనపడే పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు.ఆవేశపరుడైన కానిస్టేబుల్ పాత్రలో విజయ్ మౌర్య కూడా బాగ నటించారు.మరొక ముఖ్యమయిన పాత్రని ఇర్ఫాన్ ఖాన్ పోషించారు.సైకిల్ మీద టీ అమ్ముకునే చిరువ్యాపారి పాత్రలో ఆయన కనిపిస్తారు.తమిళ క్రిస్టియన్ అయిన ఈ పాత్ర(ఈపాత్రని తమిళయన్ గా ఎందుకు చూపించారో నాకయితే అర్ధం కాలేదు.పైగా ఇర్ఫాన్ ఖాన్ తమిళియన్ గా అస్సలు సూట్ అవ్వలేదు :)) ఒక సందర్భంలో షాపింగ్ మాల్ లో తనకి జరిగిన అవమానం వల్ల మొత్తం డబ్బున్న వాళ్ళంటేనే ద్వేషం పెంచుకుంటాడు.తనకి జరిగిన అవమానానికి ప్రతీకారంగా కాయిన్ బాక్స్ ఫోన్ ద్వార పోలిసులకి షాపింగ్ మాల్ లో బాంబు ఉందంటు తప్పుడు సమాచారాన్ని అందించి,తరవాత జరిగే గలాటాని చూసి సాడిస్టిక్ ఆనందాన్ని పొందుతాడు.క్రమంగా అది అతనికొక అలవాటుగా మారి రోజుకొక మాల్ లో బాంబు ఉందని పోలిసులకి ఫోన్ చెయ్యటం తరవాత జరిగే తమాషాని ఎంజాయ్ చెయ్యడం మాములైపోతుంది.తరవాత ఈ పాత్రలో మార్పు తెచ్చిన తీరు చాలా బాగుంది.

ప్రతి ముస్లిమ్ తీవ్రవాదే అని వితండవాదం చేసే హిందు నిరుద్యోగి పాత్రలో K.K.మీనన్ ఎప్పటిలాగానే బాగా నటించారు.మాధవన్ ఒక యువ ఉద్యోగిగా,సోహా అలీఖాన్ న్యూస్ రిపోర్టర్ గా కనిపించారు.మెదటిసారి సోహా ఈ సినిమాలో నటించడానికి ప్రయత్నించింది :)!!!! మొదటిసినిమా అయినప్పటికి ఎక్కడా సాగదీయకుండా,బోర్ కొట్టించకుండా చక్కగా తీసారు దర్శకుడు నిశికాంత్ కామత్.

ఏ దిల్ హై ముషికిల్ జీనా యహా
జర హట్ కె జర బచ్ కె,
యేహే ముంబై మేరి జాన్!!!!...
అంటు ముగుస్తుంది ఈ సినిమా.

Tuesday, July 8, 2008

ఉప్మా పురాణం

తెలుగు భాషలో నాకు నచ్చని పదం ఏదయినా ఉంది అంటే అది "ఉప్మా".ఉప్మా నిజంగా తెలుగు పదమేనా,కాదా అంటే నాకు తెలియదు.ఉప్మా పుట్టుపూర్వోత్తారాలు తెలుసుకోవాలనే ఆసక్తి కూడ లేవు నాకు.ఉప్మా అంటే ఎందుకు నాకు అంత చిరాకంటే రెండు,మూడు,నాలుగు కారణాలున్నాయి.మొదటిది నాకు జ్వరమొచ్చినప్పుడల్లా అమ్మ ఉప్మానే చేస్తుంది.ఎందుకంటే అంటే తొందరగా జీర్ణం అవుతుందని చెప్పేది.ఇప్పుడంత తొందరగా జీర్ణం అవ్వకపోతే ఏమి కొంపలు మునిగిపోతాయో నాకు అర్ధం కాదు.రెండవది,నేను రకరకాల హాస్టల్స్ లో రకరకాల ఉప్మాలు తిన్నాను(ఏమని చెప్పను నా ఉప్మా కష్టాలు!).మూడవది,పై రెండు కారణాల్లో ఏదో ఒకటి.నాలుగవది,పై మూడు కారణాలు.

చిన్నప్పట్నుంచి కూడ మా ఇంట్లో ఉప్మా టిఫిన్ అయినరోజు నేను ప్రళయం సృష్టించేదాన్ని.భాదాకరమయిన విషయమేంటంటే మానాన్న కూడ ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు."బాగానే ఉంది కదరా,తినొచ్చు కదా!" అని చెప్పేవాళ్ళు.మీకు తెలియదు నాన్న ఉప్మా తినడం ఎంత నరకమో అని అనుకునేదాన్ని నేను.అయినా ఉప్మా తినడమే ఎక్కువంటే అందులో మా అమ్మ వేసే చెత్త చెదారం అంతా ఇంతా కాదు.కరివేపాకు(ఉప్మా తరవాత నాకు అత్యంత చిరాకు తెప్పించే పదార్ధం ఇది),కొత్తిమీర,అల్లం ముక్కలు,బీన్స్,క్యారెట్,నా మొహం..etc అన్నమాట.మా అమ్మకంతా నా పోలికే,నాకన్నా పంతం కాస్త ఎక్కువే.ఉప్మా చేసిన రోజు కావాలని నన్ను మానాన్న ముందు కూర్చోబెట్టి తినిపించేది.కళ్ళనీళ్ళు పెట్టుకున్నా కాని కనికరించేది కాదు మా కనకదుర్గ! నాకు ఉప్మా తినిపించాక అమ్మ మొహంలో విజయ గర్వం కనిపించేది.ఉప్మారవ్వతో చేసే ఉప్మా కాకుండ మాఅమ్మ ఇంక రకరకాల ఉప్మా ప్రయోగాలు చేసేది.ఇడ్లీ ఉప్మా,బ్రెడ్ ఉప్మా,సేమ్యా ఉప్మా..ఇంకా రకరకాలవి.నేనొకసారి అమ్మకి చెప్పాను,"అమ్మా! నువ్వు ఎన్ని రకాలుగా చేసినాకాని,ఉప్మాపట్ల నా మనసు మార్చుకోను.ఉప్మా,నేను బద్దశత్రువులం.మా ఇద్దరి మధ్య ఎప్పటికి ప్రేమ పుట్టదు..పుట్టదు".మాఅమ్మ కోపం నటిస్తూ "ఈ తెలివితేటలకేం తక్కువలేదు" అంటూ నవ్వేసింది.అయినా నాకు అర్ధంకాక అడుగుతాను ఇడ్లీని ఇడ్లీగా,బ్రెడ్ ని బ్రెడ్ లా తినొచ్చుకదా,మళ్ళీ అన్ని efforts పెట్టి ఉప్మాలా మార్చడం అవసరమా? ఒకసారి మీరే ఆలోచించండి.ఇంకా విచిత్రం ఏంటంటే పెసరట్టు-ఉప్మా!నేను పెసరట్టు తిని ఉప్మా మాఅక్కతో తినిపించేదాన్ని.

ఉప్మా నాకు శత్రువులని కూడ తెచ్చిపెట్టిందంటే మీరు నమ్ముతారా! కాని ఇది నిజం.చిన్నప్పుడు నేను Rose buds convent school లో LKG చదివేదాన్ని.మానాన్న నన్ను బళ్ళో చేర్చేటప్పుడు టీచర్ కి "మాఅమ్మాయికి చదువు రాకపోయినా పర్వాలేదు కాని కొట్టొద్దు" అని చెప్పారు.కాబట్టి టీచర్ నన్నేమి అనేది కాదు.రోజు మాటీచర్ నాకు అటుకులు,పంచదార కలిపిస్తే తినేసి అరుగు మీద పడుకునేదాన్ని.స్కూల్ అయిపోయే టైమ్ కి కృష్ణ నన్ను నిద్ర లేపేవాడు.వాడితో కలసి ఇంటికొచ్చేదాన్ని.కృష్ణ మా పక్కింట్లో ఉండేవాడు.వాడు కూడ నాక్లాసే! ఒకరోజు కృష్ణ నన్ను ఫాస్ట్ గా లాక్కెళ్తున్నాడు స్కూల్ కి.నేను ఆ పేస్ కి మ్యాచ్ అవ్వలేకపోయా.అంత ఫాస్ట్ గా నడవలేక నేను నీతో రాను అని ఒక చెట్టుకింద కూర్చున్నాను.కృష్ణకి చాలా కోపమొచ్చింది."తొందరగా నడుస్తావా,లేదా?ఉప్మా మొహమా!" అని అన్నాడు.నన్ను ఉప్మా మొహం అంటావా అని పక్కనే ఉన్న రాయితో వాడి తలమీద ఒక్కటిచ్చా! అంతే క్షణాల్లో వాడి మొహమంతా రక్తం.తెల్లటి వాడి షర్ట్ కూడ ఎర్రగా అయిపోయింది.మా ఇద్దరికి రక్తం చూసేసరికి కంగారు పుట్టింది.ఇద్దరం రోడ్డుమీదే నిల్చోని ఏడుస్తుంటే ఎవరో ఒకాయన మమ్మల్ని సైకిల్ మీద ఇంటికి తీసుకొచ్చాడు.హాస్పిటల్ కి తీసుకెళ్ళాక వాడి గుండుకి కుట్లు పడ్డాయి.నేను కొట్టిన ఉప్మా దెబ్బతో వాడి డిప్ప షేపు మారిపోయింది.ఆ తరవాత కృష్ణ మళ్ళీ ఎప్పుడు నన్ను స్కూల్ కి తీసుకెళ్ళలేదు.ఆడుకోవడానికి కూడ మా ఇంటికి వచ్చేవాడు కాదు.అసలు నన్ను చూస్తేనే చాలు భయపడేవాడు.వాడు మాట్లాడకపోతే వాడి ఉప్మా ఖర్మ అనుకొని నేను కూడ వదిలేసాను.అయినా ఫ్రెండ్షిప్ లో ఆ మాత్రం చిన్న చిన్న గొడవలు రావా ఏంటి? ఆమాత్రానికే మాట్లాడటం మానేస్తే ఎలా?

ఇంక పెళ్ళిళ్ళప్పుడు,వ్రతాలప్పుడు చూడాలి,సామిరంగా! ఒక్కొక్కడు మానెడు ఉప్మాలో సోలెడు చట్నీ పోసుకొని లాగిస్తుంటాడు.మళ్ళీ గడికొకసారి ఎవరోఒకరు వచ్చి "పలహారాలు తిన్నారా?" అని అడుగుతారు.ఆ పెద్ద పెట్టావులేవోయ్ గొప్ప పలహారం అని అనుకుంటాను నేను.ఇంతకీ ఉప్మా పురాణంలో నేను చెప్పొచ్చేది ఏంటంటే,ఉప్మాది మైనపు నమూనా చేసి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టాలి.అంతటి ఐటమ్ ఛీజ్ ఉప్మా.