Tuesday, July 24, 2007

కాఫీ టేబుల్

నిన్న సాయంత్రం,టైం చూస్తే 5.40 అయింది.అబ్బా ఇంకా అరగంట యాక్షన్ చెయ్యాలి అని అనుకుంటున్నాను.ఇంతలో మా టీమ్ అంతా కలసి కాఫీహాల్ కి వెళ్ళాలని డిసైడ్ చేసారు.మనకి కావల్సింది కుడా అదే కదా! రెండు నిమిషాల్లో అందరం కాఫీ హాల్లో ప్రత్యక్షమయ్యాము.(అదే స్టేటస్ మీటింగ్ అంటే మాత్రం ఒక్కరు కూడ టైంకి రారు) రెండు టేబుల్స్ ని కలిపి ఒక సర్కిల్ లాగా కూర్చున్నాము.ఒకసారి మా గ్రూప్ మేనేజర్ వచ్చి "మీరు బాగుపడరు" అన్నట్టు ఒక చూపు చూసి వెళ్ళిపోయాడు.ఇలాంటివన్ని మనమెప్పుడు పట్టించుకున్నాము కాబట్టి.ఏదో ఇంటర్మీడియట్లో,ఇంజనీరింగులో చేరిన కొత్తలో కాస్త రోషం,పౌరుషం ఉండేవి.తరవాత తరవాత నెమ్మదిగా నేను కూడ జనజీవన స్రవంతిలో కలసిపోయా.

కాసేపు ప్రాజెక్ట్, న్యూ రిలీజ్, బగ్ ఫిక్సింగ్ ల గురించి మాట్లాడాక,"వారానికి ఆరు పనిదినాలు" గురించి చర్చ జరిగింది.విప్రో వాళ్ళకి ఇ-మెయిల్ కుడా వచ్చేసిందంట!! ఎప్పట్నుంచి అమలుచేస్తారో మాత్రం ఇంకా తెలియదు.సడన్ గా శరవనన్ కి YSR - చంద్రబాబు నాయుడు గుర్తొచ్చారు.వాళ్ళిద్దరు ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి అనుకొని టీవీల్లోకి ఎక్కి జనాల్ని హింసిస్తారుఅని అడిగాడు.మరి టీమ్ లో నేను ఒక్కదాన్నే తెలుగు కాబట్టి నేనే సమాధానం చెప్పాలన్నట్లు అందరు నన్నే చూసారు."వాళ్ళిద్దరు అందరి ముందు తన్నుకుంటారు,సింగపూర్ లో మాత్రం కలసి రెస్టారెంటు బిజినెస్ చేస్తారు." అని చెప్పాను.బిజినెస్ సంగతి నాకు మా ఫ్రెండు ఎవరో చెప్పారు.అది ఎంతవరకు నిజం అనేది మాత్రం నాకు తెలియదు.

ఇక మా కబుర్లు జోరందుకున్నాయి.ఈ మధ్యే మాటీమ్ మేట్ అర్షద్ కి పెళ్ళి సెటిల్ అయ్యింది.ఇంకేం,ఏ ప్రొఫెషన్ వాళ్ళకి ఎవరు సరిగ్గా సూట్ అవుతారో చాలా రీసెర్చి చేసాడు.ఈ మొత్తం రీసెర్చిలో నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దొరికింది.డాక్టర్లు ఎప్పుడు తమని తాము ప్రపంచానికి రెండు ఇంచుల పైన ఊహించుకుంటారంట,మరి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తమని తాము రెండు ఇంచుల కింద ఊహించుకుంటారంట.ఇక ఈ నాలుగు ఇంచుల తేడాతో వాళ్ళకి పెళ్ళి చేస్తే ఆ ఇల్లు నరకమేనంట! నాకు కూడ ఇది కొంతవరకు నిజమేననిపించింది.ఎందుకంటే నాకు కూడ ఇద్దరు ముగ్గురు డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు.వాళ్ళెవ్వరికి కూడ కళ్ళు ఉండాల్సిన స్థానంలో ఉండవు.(నా మాటలు ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలి)

తరవాత స్ట్రెస్ ని ఎలా అధిగమించాలి అనే విషయంపై లెక్చర్ ఇచ్చి మమ్మల్ని enlight చేసాడు అర్షద్.మనసు బాగోలేనప్పుడు రుచికరమయిన భోజనం తయారు చేసి,ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి ఇంటికి పిలిచి భోజనం పెట్టాలంట.భోజనాలయ్యాక నార్త్ ఇండియన్స్ అయితే గోవిందా సినిమా,తమిళియన్స్ అయితే విజయకాంత్ సినిమా,మనమయితే బాలక్రిష్ణ సినిమా చూడలంటా.సైకాలజి ప్రకారం..పెద్ద కష్టం వచ్చినప్పుడు చిన్న కష్టాల్ని తొందరగా మర్చిపోతారంట.కాబట్టి ఆయా హీరోల సినిమాలు చూసి మనం మన కష్టాల్ని మర్చిపోతామన్నమాట.కాకపోతే ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మరి.ఎట్టి పరిస్థితుల్లో కూడ ఈ హీరోల సినిమాలు ఒంటరిగా చూడకూడదు.12 సంవత్సరాలలోపు పిల్లలు ఇలాంటి సినిమాలు చూడకుండా జాగ్రత్తపడాలి.

హా..ఆరు గంటలయ్యింది.ఇంక నాన్ స్టాప్ యాక్షన్ కట్టిపెట్టి అందరం ఎవరి ఇళ్ళకి వాళ్ళం బయలుదేరాము.మొత్తానికి "A lot can happen over coffee" అనేదానికి 100% న్యాయం చేసి ఈ ఎపిసోడ్ ని ముగించాము.

Monday, July 2, 2007

కథ కంచికి,మనం ఇంటికి

గతవారం నేను నా friends కలసి కంచికి వెళ్ళాము.కంచి బెంగుళూరు నుండి 240 కి.మీ, చెన్నై నుండి 75 కి.మీ దూరంలో ఉంటుంది.కంచి ప్రయాణం అనుకున్నప్పట్నుంచి ఏదో ఒక అవాంతరం వచ్చి పడుతూనే ఉంది.ఎలాగైనా కంచికి వెళ్ళాల్సిందేనని బయలుదేరి వెళ్ళాము.బెంగుళూరు మెజెస్టిక్ బస్టాండులో మేము టిక్కెట్టు రిజర్వ్ చేయించిన బస్సు కనుక్కొని ఎక్కి కూర్చొనేసరికి పెద్దలు కనిపించారు.టిక్కెట్ లో రాసిఉన్న ప్లాట్ ఫామ్ పైన కాకుండా బస్ ఎక్కడో ఆపాడని డ్రైవర్ తో పెద్ద గొడవ పెట్టుకొని మరీ బస్ ఎక్కాము.డ్రైవర్ మమ్మల్ని గుర్రు గుర్రుమని చూసాడు.ఎంక్వైరి కౌంటర్ లో కనుక్కుంటే,రాత్రి 10 గంటలకి బెంగుళూరు నుండి బయలుదేరితే ఉదయం 5 గంటలకళ్ళా కంచికి చేరుతామని చెప్పారు.ఒక గంట కంచి బస్టాప్ లో timepass చేసి హొటల్ లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి అమ్మవారి దర్శనానికి వెళ్ళవచ్చనేది మా ప్లాన్.

బస్ బయలుదేరింది. బస్ లో "ఉన్నలే..ఉన్నలే"(తెలుగులోకి కూడ డబ్బింగ్ చేసారు కాని నాకు సినిమా పేరు గుర్తులేదు.) కష్టపడి తమిళ్ అర్ధం చేసుకొని సినిమా మొత్తం చూసి,మనకి తమిళ్ అర్ధం అవుతుందని జబ్బలు చరుసుకొని అలసిపోయి చిన్న కునుకు తీస్తున్నాము.అప్పుడే డ్రైవర్ "కాంజీపురం" అని అరిచాడు.టైమ్ చూస్తే రాత్రి 2.50. "ఏంటి అప్పుడే కాంజీపురం వచ్చేసిందా? ఉదయం 5 గంటలవుతుందని చెప్పారు మాకు" అని డ్రైవర్ని అడిగాను.వాడు నన్ను కోపంగా చూసి తమిళ్ ఏదో అన్నాడు.(ఇప్పుడు తమిళ్ అర్ధం కావటం లేదేంటి చెప్మా!!) బస్టాండులో దిగుతాము అంటే,బస్టాండుకి బస్ వెళ్ళదని చెప్పాడు.ఇక ఆ అర్ధరాత్రి వాడితో గొడవ పెట్టుకొనే ఓపిక లేక బస్సు దిగాము.అప్పటికే సన్నగా చినుకులు పడుతున్నయి."ఏం చేద్దాం?" అని అనుకుంటుండగానే చినుకులు కాస్తా పెద్ద వర్షం అయ్యింది.ఎదురుగా ఉన్న ICICI ATM దగ్గరికి పరిగెత్తాము.

ATM కి కన్నం వెయ్యటానికి వచ్చాము అనుకున్నాడో ఏంటోగాని అక్కడున్న సెక్యురీటి గార్డు ఎంత మాట్లాడించినా మాట్లాడలేదు మాతో.ఆ ATM ని ఆనుకొని ఏదో ఆఫీసు ఉంది.తీరా చూస్తే "కంచి కామకోఠిమఠం" అని రాసి ఉంది.ఒక రెండు గంటలు అక్కడే మఠం మెట్లమీద కూర్చున్నాము.అప్పటికి వర్షం కాస్త తగ్గింది,టైమ్ కూడ ఉదయం 5గంటలు కావొస్తుంది.లేచి హొటల్ వెతుకుదామని బయలుదేరాము.దారినపోయే ఒక దానయ్యని అడిగాము మంచి హొటల్ ఎక్కడుదంని,ఒక సందు చూపించి వెళ్ళిపోయాడు.ఆ సందులోకి వెళ్ళగానే అప్పటిదాక నిద్రపోతున్న కుక్కలన్ని(లెక్క పెట్టలేదు కాని చాలా ఉన్నాయి,ఒక 15-16 ఉండొచ్చు) అరవటం మెదలుపెట్టాయి.గతంలో ఒకసారి నా టీమ్ మేట్ అర్షద్ "కుక్కలు-వాటి మనస్తత్వం" అనే అంశం మీద నన్ను educate చేసాడు.చప్పున అర్షద్ చెప్పిన చిట్కా ఒకటి గుర్తొచ్చింది. ఎప్పుడయినా కుక్క మనల్ని చూసి మొరిగితే మనం కదలకుండా నిల్చోవాలంట.అప్పుడు వాటి ego సాట్సిఫై అవుతుందంట,అప్పుడు మనల్ని కరవకుండా,మనల్ని చూసి మొరగకుండా గమ్మున దాని దారిన అది వెళ్ళిపోతుందంట!! నేను నా ఫ్రెండ్స్ వెంటనే కదలకుండా నిల్చున్నాము.మా సమయస్పూర్తిని చూసి కుక్కలు ఆశ్చర్యపోయినట్టున్నాయి.ఒక్క క్షణం గ్యాప్ తీసుకోని మళ్ళీ భయంకరంగా మొరగటం మొదలుపెట్టాయి.అర్షద్ రీసెర్చి చేసి కనుక్కున్నదంతా తప్పని తేలిపోయింది.సరే అని మన పాత చిట్కా..చేతికి దొరికిన చిన్న చిన్న రాళ్ళు విసిరి బ్రతుకుజీవుడా అంటూ మళ్ళీ వచ్చి రోడ్ మీద నిల్చున్నాము .

రెండు గంటల్లో పది హొటల్స్ చూసాము,ఏ ఒక్కటీ నచ్చలేదు.చాలాసేపు తిరిగాక బస్టాండుకి దగ్గర్లో ఒక హొటల్ బాగున్నట్టనిపించి దాంట్లో దిగాము.గబగబా ఫ్రెష్ అయ్యి హైదరాబాద్ నుండి వచ్చిన మా ఫ్రెండ్ తల్లిదండ్రుల్ని రిసీవ్ చేసుకొని అందరం కలసి "కామాక్షి అంబాల్" దర్శనానికి వెళ్ళాము.దర్శనం చాలా బాగాజరిగింది.చేతిలో చిలుక,తలపై నెలవంకతో అమ్మవారు చాలా అందంగా ఉన్నారు.మార్కండేయ పురాణంలో కంచిని విశ్వానికి కేంద్రబిందువుగా పేర్కొన్నారంట!!(అమ్మవారి ఆలయంలో ఉన్న పెద్ద పూజారి చెప్పారు).కంచిలో ఎన్ని గుడులున్నాయంటే,అన్ని చూడాలంటే రెండు రోజులు పడుతుంది.ముఖ్యమయినవి మాత్రం బలి చక్రవర్తి ఆలయం,వినాయకుని ఆలయం(ఇవి రెండు అమ్మవారి ఆలయానికి సమీపంలోనే ఉన్నాయి),వరదరాజస్వామి పెరుమాల్ ఆలయం,ఇక్కడే సూర్యచంద్రులు,బంగారు బల్లి,వెండి బల్లి ఉంటాయి.ఈ ఆలయం మాత్రం కామాక్షి అమ్మవారి ఆలయం నుండి 5 కి.మీ దూరంలో ఉంటుంది.ఈ ఆలయలన్నింటిని మఠం ట్రస్టు వారే నిర్వహిస్తున్నారు.ఇక అతి ముఖ్యమయినది "కంచి కామకోఠి మఠం". మేము మఠానికి వెళ్ళేసరికి శ్రీ శ్రీ శ్రీ శంకర విజేయేంద్ర సరస్వతి స్వామీజి పూజ చేస్తున్నారు.మఠానికి సంబంధించినవి,ఆది శంకరాచార్యులవి వర్ణచిత్రాలు చూస్తుంటే అసలు టైమే తెలియదు.

ఇక ఆడవాళ్ళందరికి అత్యంత ఇష్టమయిన"షాపింగ్",అందునా పట్టుచీరలు.మేము రెండవ రోజంతా షాపింగ్ కే కేటాయించాము.ఎన్ని పట్టుచీరలో..రకరకాల రంగులు,అంచులు,కాంబినేషన్స్.అన్ని పట్టుచీరలు ఒకేసారి చూసేసరికి ఏది కొనుక్కొవాలో అర్ధం కాదు నాలాంటి వాళ్ళకి.అందుకే నేనేమి కొనుక్కోలేదు.తరవాత కాసేపు కంచి వీధులన్ని తిరిగి భోజనం చేసి బస్సెక్కి బెంగుళూరుకి బయలుదేరాము.అలా కంచి ప్రయాణం నాకు ఎప్పటికి గుర్తుండిపోయే ఎన్నో అనుభూతుల్ని మిగిలించింది.