Thursday, June 23, 2011

Espresso 2.0

ఏంటి ఈ మధ్య మరీ నల్లపూసవయిపోయావు అని అడుగుతున్నారు అందరు నన్ను! అబ్బే,పెద్దగా ఏమి నల్లపడలేదండి,మాములుగానే ఉన్నాను.నల్లపూస అంటే నల్లపడటం,తెల్లపడటం కాదని,సోదిలోకి లేకుండా మాయం అవ్వడం అని అర్ధమవ్వటానికి కాస్త టైం పట్టింది.ఏమి చేస్తున్నారు ప్రస్తుతం అని అడగగానే, అదేదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్టుగా 'కలంస్నేహం' అని చెప్పాలనిపిస్తుంది కాని,మరీ వెకిలిగా ఉంటుందేమో అని ఊరుకుంటాను.ఎలాగు వెకిలి సమాధానాల గురించి సందర్భం వచ్చింది కాబట్టి నేను విన్న అత్యంత వెకిలి సమాధానం ఒకటి చెప్తా వినండి.ఆ మధ్య మా టీం లో స్మిత అని కొత్తగా ఒకావిడ జాయిన్ అయ్యింది.ఇంకేం,మధ్యాహ్నం భోజనాల దగ్గర అమ్మలక్కల కబుర్ల మధ్యలో మీవారు ఏమి చేస్తుంటారు అని అడిగా..'నన్ను ప్రేమిస్తుంటారు ' అని చెప్పింది.ఓ!! అయితే మీది ఆదర్శవివాహమన్నమాట! అని అన్నాను.అబ్బే అదేమి కాదు,మావారు బెంగాలీ అందుకే!! అని సిగ్గుపడింది. నిజం చెప్పొద్దూ, ఆ తరవాత ఆమెతో ఏమి మాట్లాడాలో అర్ధం కాక నా వంట నేనే కళ్ళనీళ్ళు పెట్టుకుంటు తిన్నాను.అదేంటో పెద్దయ్యాక వయసుతో పాటు వెటకారం,వెకిలితనం పెరుగుతాయేమో! అదే చిన్నప్పుడయితే 'పెద్దయ్యాక ఏమి చేస్తావు?' అని ఎవరన్నా అడిగితే ఎన్ని సమాధానాలు చెప్పేవాళ్ళం! చిన్నప్పుడొకసారి నేను కవయిత్రినయిపోవాలనుకున్నాను.అనుకోవడమేంటి,అయిపోయాను కూడా!మా నాన్న దగ్గరికెళ్ళి,"నాన్నోయ్,నేనో కవిత రాసాను" అని చెప్పా.వెంటనే మానాన్న మా కాలని వాళ్ళందరిని పిలిపించి సత్యనారాయణస్వామి వ్రతం చేయించి భోజనాలు పెట్టించి నాకు సన్మానం ఏర్పాటు చేసారు.సన్మానం అయ్యాక,ఓ పెద్దాయన,"చిట్టితల్లి! నీ కవిత ఒకటి వినాలని ఉంది" అని అన్నాడు.అందరు మొహాలన్ని ఒకింత ఆందోళనగా పెట్టినా కాని లెఖ్ఖ చెయ్యకుండా నా కవిత వినిపించాను.

ఓ దానవుడైన మానవుడా!
హృదయం లేని కిరాతకుడా!
నువు చేసిన పాపం పండాలంటే
ఆయువు చాలదురా! నీ ఆయువు చాలదురా
!

ఇంకా వినిపించబోతుంటే మానాన్న అడ్డుతగిలి "తల్లి! మిగతాది నాకు వినిపిద్దువులే,ఇప్పటికి ఇది చాల్లే!" అని మధ్యలో ఆపేసారు.ఆదేంటి,వాళ్ళందరికి రసస్పందన కలిగి పులి డాన్స్ లు చేస్తుంటే నాలోని కవితాసముద్రానికి ఆనకట్ట వేయాలనుకోవడం ఏమిటో!మరే! కొన్నాళ్ళకి ఆ కవితని సినిమావాళ్ళెవరో వాడుకున్నారు.ఆ తరవాత నాకవిత్వం పట్ల జనాల పెల్లుబికిన ఉత్సాహం భరించలేక సుప్తావస్థలోకి వెళ్ళిపోయాను.ఈలోపు పెద్దపరిక్షలు రానే వచ్చాయి. జీవితంలో కష్టాలెలాగో,పెద్ద పరిక్షలలాగన్నమాట.వద్దన్నా వస్తాయి.వాటికి భయపడి పారిపోయామా ఇక అంతే.పోరాటంలో ఉంది జయం అని రజినికాంత్ చెప్పినట్టు మనం పోరాడాలి,మన పేపర్లు దిద్దడానికి టీచర్లు పోరాడాలి.లేదా ఇంకో ప్లాన్ ఉంది.పరిక్ష పేపర్ లో కింది విధంగా ఉదాహరించినట్టు ఏదేను ఒకటి గుండెలు పిండేసే కారణం రాయాలి.

* పరిక్ష తప్పితే నాన్నగారు అమ్మమ్మ వాళ్ళింటికి పంపించనన్నారు,కావున నాయందు దయుంచి పరిక్ష పాస్ చేయించగలరని ప్రార్ఢన.

* నేను కూడ మీలాగే బాలకృష్ణ అభిమానిని.ఇక నన్ను పరిక్ష పాస్ చెయ్యకపోతే బాలయ్య మీదొట్టు!!

* నన్ను పరిక్ష పాస్ చేయించినచో మాదొడ్లో పూసిన మల్లెపూలు,కాచిన మామిడికాయలు మీ ఇంట్లో కనుగొనవచ్చు.

* పరిక్ష పాస్ చేయించినచో నా దగ్గరున్న 37 రూపాయలు మీకు ఇవ్వబడును.అన్నట్టు మీ పెద్దబ్బాయి మొన్న సిగరెట్ తాగుతుంటే చూసాను.

* పరిక్ష తప్పినచో నాన్నగారు నన్ను 'చోటా హనుమాన్ ' చూడనివ్వరు.కావున నన్ను పరిక్ష పాస్ చేయించినచో ఆ పవనపుత్రుడి ఆశీస్సులు ఎల్లప్పుడు మీ కుటుంబం యందుండును.

ఇంత చెప్పాక కూడ మీ పరిక్ష రిజల్ట్ లో తేడా వచ్చిందంటే పైన రాసిన నా కవితని మీరు వాడుకోవచ్చు.

సరే పెద్ద పరిక్షలయిపోయిన తెల్లారే మేము అమ్మమ్మ వాళ్ళింట్లో ప్రత్యక్షమయ్యాము.ఇక సందడే సందడి.మా అమ్మ,పిన్నివాళ్ళు అందరు చుక్కల ముగ్గులు,మెలికల ముగ్గులు నేర్చుకోవడంలో బిజీ.పిల్లలందరు రాత్రవ్వగానే మిద్దెమీదెక్కి దెయ్యాల కథలు చెప్పుకోవడంలో బిజీ.పిల్లలందరిలో నేను,మా పిన్ని కొడుకు సూరిగాడే చిన్న(సూరిగాడు నేను పుట్టిన గంటకి పుట్టాడు).మా ఇద్దరి చిన్నపిల్లల గ్యాంగ్ కి నేను గ్యాంగ్ లీడర్ ని.ఇక మాఇద్దరిని ఎందులోనూ వేలు పెట్టనిచ్చేవాళ్ళు కాదు.ఓరోజు ఆవకాయ పెడుతున్నారు.మామిడికాయలు బస్తాలో తెచ్చారు.బస్తా దగ్గరికి వెళ్ళగానే మా బుజ్జిపిన్ని గుండు మీద ఒక్కట్టిచ్చింది.అవి పచ్చడికాయలు ముట్టుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చింది.పచ్చడి పెట్టినంతసేపు మమ్మల్ని దగ్గరికే రానివ్వలేదు.చాలా కోపం వచ్చింది నాకు,సూరిగాడికి.సాయంత్రం వీధి అరుగు మీద కూర్చొని తీరిగ్గా బాధపడుతుంటే బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది నాకు."ఒరేయ్ సూరిగా,సాయంత్రం అందరు అన్నాలు తినేటప్పుడు మనం మెల్లిగా వెళ్ళి పచ్చడి జాడిలో కుంకుడు రసం పోద్దాం రా!" అని అన్నానో లేదో మా భద్రకాళి నా వీపు విమానం మోత మోగిచ్చింది.భద్రకాళి అంటే మా అమ్మ అన్నమాట.పనిలో పనిగా మధ్యాహ్నం అప్పజెప్పాల్సిన పదమూడో ఎక్కం ఇంకా అప్పచెప్పలేదని ఇంకో నాలుగు తగిలించింది.సూరిగాడు ఈ విషయంలో చాలా అదృష్టవంతుడు.వాడికి ఎక్కాలన్నా,లెక్కలన్నా ఇష్టం.దెబ్బలు తింటే తిన్నాను కాని,ఆ దెబ్బల మోతలో నాకో ఐడియా వచ్చింది.నా జీవితానికి అర్ధం,పరమార్ధం ఆ క్షణంలోనే భోధపడింది నాకు.అదే,పిల్లలకి మాత్రమే అర్ధమయ్యేట్టు ఒక భాష ఉండాలి.పిల్లలు ఏదైనా అతి ముఖ్యమైన విషయం మాట్లాడుకునేటప్పుడు పెద్దవాళ్ళు ముందే వినేసి రావుగోపాల్రావు లాగా ఒకటే అడ్డుపడిపోతుంటారు.అందుకే జావా లాగ ఎవరికి అర్ధంకాని భాష ఒకటి మనం కుడా తయారు చెయ్యాల్రా సూరిగా అని చెప్పాను నేను.ఇంక brain stroming మొదలు.

సూరిగాడు : మన భాష పేరేంటి?

నేను : మన భాష కాదు,నేను కనిపెడుతున్నాను కాబట్టి నా భాష. జావా నుండి inspire అయ్యాము కాబట్టి espresso అని పెడదాం.

సూరిగాడు : మరి పిల్లలు పెద్దగయిపోయాక వాళ్ళకి ఈ భాష మొత్తం వచ్చేస్తుంది కదా?

నేను : జావా లాగే మనమూ ప్రతి సంవత్సరం ఒక కొత్త వెర్షన్ తయారు చేద్ధాం.అమీర్ పేటలో కోచింగ్ సెంటర్లు పెడదాం.ఇక మనకి ఎన్ని డబ్బులంటే,జీవితం మొత్తం బెంగుళూరు ఆటోల్లో మీటర్ కి భయపడకుండా తిరగొచ్చు.

సరే,తరవాత రెండు రోజుల్లో Espresso 1.0 విడుదల చేసాము.పదే పదే espresso లో మాట్లాడి అందరిని భలే ఏడిపించాం.మా అమ్మమ్మ మాత్రం మా ఇద్దరికి దిష్టి తగిలిందని,అందుకే గంభోర వచ్చిన కోడిపిల్లల్లా పిచ్చి కూతలు కూస్తున్నామని తాయత్తులు తెచ్చి మెళ్ళో కట్టింది.మొత్తానికి ఆ ఎండాకాలం మొత్తం espresso బాగానే వంట పట్టించుకున్నాం.కాని ఏంటో మళ్ళీ జూన్ వచ్చేసి ఒక్క వర్షం పడగానే espresso అంతా కరిగిపోయింది.ఇప్పుడిప్పుడే మళ్ళీ Espresso 2.0 తయారుచెయ్యడానికి కొత్త టీం కోసం వెతుకుతున్నానన్నమాట.